[1] “నీవు ఇస్రాయేల్ ప్రజల నాయకుల విషయం ఈ విలాపమెత్తి ప్రకటించు:
[2] మీ తల్లి ఎలాంటిది? సింహాలలో ఆడ సింహంలాంటిది. అది కొదమ సింహాలమధ్య పడుకొంది, తన పిల్లలను పెంచింది.
[3] అది పెంచిన పిల్లల్లో ఒకటి బలంగల సింహం అయింది. అది వేటాడడం నేర్చుకొంది. మనుషులను దిగమ్రింగింది.
[4] దాని గురించి జనాలకు వినబడింది. దాన్ని తాము త్రవ్వించిన గోతిలో పట్టుకొన్నారు. గాలాలు తగిలించి దాన్ని ఈజిప్ట్‌కు తీసుకుపోయారు.
[5] “తల్లికి దాని గురించిన ఆశ అంతా పోయింది. అది గ్రహించి తన పిల్లల్లో మరో పిల్లను తీసుకొంది, పెంచింది, బలంగల సింహంగా చేసింది.
[6] అది బలమైన సింహం కావడంచేత సింహాల మధ్య తిరుగులాడింది. అది వేటాడడం నేర్చుకొంది. మనుషులను దిగమ్రింగింది.
[7] అది వాళ్ళ నగరులను పడగొట్టింది. వాళ్ళ పట్టణాలను పాడు చేసింది. దాని గర్జన ధ్వనికి దేశమూ అందులో ఉన్నవాళ్ళంతా భయకంపితులయ్యారు.
[8] చుట్టూరా ఉన్న జనాలన్నీ దానికి వ్యతిరేకంగా వచ్చాయి. దానిమీద తమ వల వేశాయి. తాము త్రవ్వించిన గోతిలో దాన్ని పట్టుకొన్నారు.
[9] వాళ్ళు దానికి గాలాలు తగిలించి బోనులోకి లాగారు. బబులోనురాజు దగ్గరికి తెచ్చారు. ఇస్రాయేల్ కొండలమీద దాని గర్జన ఇక వినబడకుండా దాన్ని అక్కడ భద్రంగా ఉంచారు.
[10] “ప్రాణాధారమైన ద్రాక్ష చెట్టులాంటిది మీ తల్లి. కాలువ దగ్గరే నాటబడింది. నీళ్ళ సమృద్ధిచేత తీగెలతో నిండింది. చాలా ఫలభరితమైంది.
[11] దాని కొమ్మలు గట్టివి. అవి రాజదండాలకు తగినవి. ఆ చెట్టు మేఘాలవరకు పెరిగింది. దాని ఎత్తు, అనేక కొమ్మల కారణంగా అది సుస్పష్టంగా కనిపించేది.
[12] అయితే అది ఆగ్రహానికి గురి అయింది. దానిని పెరికివేసి నేలకు పడవేయడం జరిగింది. దాని పండ్లన్నీ తూర్పుగాలికి ఎండాయి. దాని గట్టి కొమ్మలు తెగి ఎండి పోయాయి. మంటలు వాటిని కాల్చివేశాయి.
[13] ఇప్పుడది ఎడారిలో, చాలా ఎండిన నిర్జల ప్రదేశంలో నాటి ఉంది.
[14] దాని కొమ్మలలో ఒకదానినుంచి మంట వచ్చి దాని పండ్లను కాల్చింది. రాజదండానికి తగిన గట్టి కొమ్మ ఒక్కటి కూడా మిగలలేదు. “ఇది విలాపం. విలాపంగా వాడుకలో రావాలి.”