[1] “మానవపుత్రా, ఇప్పుడు పదును గల ఖడ్గం మంగలకత్తిగా తెచ్చి నీ తలవెంట్రుకలనూ గడ్డాన్నీ క్షౌరం చేసుకో. త్రాసు తెచ్చి వెంట్రుకలను తూచి భాగాలు చెయ్యి.
[2] నీ ముట్టడి రోజులు పూర్తి అయ్యేటప్పుడు వెంట్రుకలలో మూడో భాగం నగరం నడుమ కాల్చివేయాలి. మరో మూడో భాగం నగరం చుట్టు ఖడ్గంతో కొట్టాలి. మిగిలిన మూడో భాగం గాలికి ఎగిరిపోనియ్యాలి. ఎందుకంటే, నేను ఖడ్గం దూసి అక్కడివారిని తరుముతాను.
[3] అయితే వెంట్రుకలలో కొన్ని నీ చెంగున కట్టుకో.
[4] తరువాత వాటిలో కొన్ని తీసుకొని నిప్పులో వేసి కాల్చు. అక్కడ నుంచి నిప్పు బయలుదేరి, ఇస్రాయేల్ జనమంతటినీ తగలబెడుతుంది.
[5] “ప్రభువైన యెహోవా చెప్పేదేమిటంటే, ఇది జెరుసలం. నేను దానిని ఇతర జనాలకు కేంద్రంగా నిలిపాను. దాని చుట్టూరా దేశాలున్నాయి.
[6] కానీ, అది తమ చుట్టూ ఉన్న ఇతర జనాలకంటే దేశస్థులకంటే ఎక్కువ దుర్మార్గంగా నా న్యాయ నిర్ణయాలనూ నా చట్టాలనూ తృణీకరించింది, నా న్యాయ నిర్ణయాలను త్రోసిపుచ్చింది. నా చట్టాలను అనుసరించలేదు.
[7] అందుచేత యెహోవాప్రభువు చెప్పేదేమిటంటే, మీరు నా చట్టాలను అనుసరించక నా న్యాయ నిర్ణయాలను పాటించక మీ చుట్టు ఉన్న ఇతర జనాలకంటే అల్లరిమూకగా ఉన్నారు. మీ చుట్టూ ఉన్న ఇతర జనాల నిర్ణయాలను కూడా మీరు అనుసరించలేదు.
[8] “గనుక యెహోవాప్రభువు చెప్పేదేమిటంటే, జెరుసలం! నాకు నీమీద విరుద్ధ భావం కలిగింది. ఇతర జనాల కళ్ళెదుటే నిన్ను దండనకు గురి చేస్తాను.
[9] నీ అసహ్యమైన వాటి కారణంగా ముందెన్నడూ నేను నీలో చేయనిది, తరువాత మళ్ళీ చేయబోనిది ఇప్పుడు చేస్తాను.
[10] కాబట్టి, నీలో తండ్రులు తమ పిల్లలను తింటారు. పిల్లలు తమ తండ్రులను తింటారు. నేను నిన్ను దండనకు గురి చేస్తాను, నీలో మిగిలినవారిని నలుదిక్కులకు చెదరగొట్టివేస్తాను.
[11] నీవు నీ అసహ్యమైన విగ్రహాలచేత, నీ అసహ్యమైన క్రియలచేత నా పవిత్రాలయాన్ని అశుద్ధం చేశావు గనుక నేను నిన్ను శిక్షించకుండా ఉండను. నిర్దయగా నిన్ను వదలివేస్తాను. ఇలా చేస్తానని ప్రభువైన యెహోవా అనే నేనే నా జీవంతోడు శపథం చేస్తున్నాను.
[12] నీ నివాసాలలో మూడో భాగం నీలోనే ఘోర రోగంచేతా కరవుచేతా చస్తారు. మూడో భాగం నీ గోడల బయట ఖడ్గానికి గురి అయి కూలుతారు. మిగిలినవారిని నలుదిక్కులకు నేను చెదరగొట్టి వారివెంట ఖడ్గాన్ని పంపిస్తాను.
[13] “అప్పుడు నా ఆగ్రహం తీరిపోతుంది. వారిమీద ఉన్న నా కోపాగ్ని చల్లారిపోతుంది. నాకు ఉపశమనం కలుగుతుంది. నేను వారిమీద నా కోపం తీర్చుకొనేటప్పుడు నేను – యెహోవాను – నా ఆసక్తితో పలికానని వారు తెలుసుకొంటారు.
[14] నేను నిన్ను పాడుగా చేస్తాను. నీ చుట్టు ఉన్న ఇతర జనాలమధ్య, ఆ వైపుకు వస్తూ పోతూ ఉన్నవారందరి తిరస్కారానికి నిన్ను గురిగా చేస్తాను.
[15] నేను కోపంతో ఆగ్రహంతో తీవ్రమైన గద్దింపులతో నిన్ను శిక్షించేటప్పుడు, నీవు నీ చుట్టు ఉన్న జనాల తిరస్కారానికీ ఎగతాళికీ గురి అవుతావు. వారు నిన్ను చూచి ఆశ్చర్యపడిపోతారు, హెచ్చరిక పొందుతారు. నేను యెహోవాను. ఇలా పలికినది నేనే.
[16] నేను నీమీదికి తీవ్రమైన కరవు బాణాలను గుప్పిస్తాను. నీకు ఆహారం సరఫరా చేయబడకుండా చేసి, కరవు అంతకంతకు ఎక్కువయ్యేలా చేస్తాను. అది నీవారి నాశనానికే రప్పిస్తాను.
[17] నీమీదికి కరవునూ దుష్ట మృగాలనూ పంపిస్తాను. అవి నీకు సంతానం లేకుండా చేస్తాయి. ఘోర రోగం, రక్తపాతం నీకు కలుగుతాయి. నీమీదికి ఖడ్గాన్ని కూడా రప్పిస్తాను. నేను యెహోవాను. ఇలా పలికినది నేనే.”