Skip to content
Opens in a new window

[1] అప్పుడు ఆత్మ నన్ను ఎత్తి యెహోవా ఆలయానికి తూర్పుగా ఉన్న ద్వారం దగ్గరికి తీసుకువెళ్ళాడు. ద్వార ప్రవేశంలో ఇరవై అయిదుమంది మనుషులు ఉన్నారు. వాళ్ళలో ప్రజల నాయకులు అజ్జూరు కొడుకైన యజన్యా, బెనాయా కొడుకైన పెలట్యా నాకు కనబడ్డారు.

[2] అప్పుడు యెహోవా నాతో ఇలా అన్నాడు: “మానవపుత్రా, దురాలోచన చేస్తూ, నగరంలో చెడ్డ సలహా ఇచ్చేది ఈ మనుషులే.

[3] వాళ్ళు ‘ఈ నగరం వంటపాత్ర, మనం మాంసం. ఇండ్లు కట్టుకోవడానికి ఇది సమయం కాదు’ అని అంటారు.

[4] కనుక వాళ్ళకు విరుద్ధంగా దైవావేశపూర్వకంగా పలుకు. మానవపుత్రా, దైవావేశపూర్వకంగా పలుకు.”

[5] వెంటనే యెహోవా ఆత్మ నామీదికి వచ్చి నాతో చెప్పినదేమిటంటే: “నీవు ఇలా చెప్పు: యెహోవా చెప్పేది ఇదే. ఇస్రాయేల్ ప్రజలారా, మీరు అలాగే చెప్పుకొంటున్నారు. మీ మనసులో ఉన్న ఆలోచనలు నాకు తెలుసు.

[6] ఈ నగరంలో మీరు చాలామందిని చంపారు. మీచేత హతమైనవారితో వీధులు నిండి ఉన్నాయి.

[7] కాబట్టి ప్రభువైన యెహోవా చెప్పేదేమిటంటే, నగరంలో మీరు చంపి పారవేసిన మృతదేహాలు మాంసం, నగరం వంటపాత్ర. అయితే నేను మిమ్ములను నగరంలోనుంచి వెళ్ళగొట్టివేస్తాను.

[8] ఖడ్గమంటే మీకు భయం గదా. నేను మీమీదికి రప్పించబోయేది ఖడ్గమే. ఇది యెహోవాప్రభు వాక్కు.

[9] మిమ్ములను నగరంలోనుంచి వెళ్ళగొట్టి విదేశీయుల వశం చేసి దండిస్తాను.

[10] మీరు ఖడ్గంచేత కూలుతారు. మిమ్ములను ఇస్రాయేల్ సరిహద్దుల దగ్గర నేను శిక్షిస్తాను. అప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకొంటారు.

[11] ఈ నగరం మీకు వంటపాత్రగా ఉండదు, ఇందులో మీరు మాంసంగా ఉండరు. ఇస్రాయేల్ సరిహద్దుల దగ్గరే మిమ్ములను శిక్షిస్తాను.

[12] అప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకొంటారు. మీరు నా చట్టాలప్రకారం ప్రవర్తించకుండా, నా న్యాయనిర్ణయాలను అనుసరించకుండా మీ చుట్టూరా ఉన్న ఇతర ప్రజల నిర్ణయాలనే అనుసరించారు గనుక నేను అలా చేస్తాను.”

[13] నేను దేవునిమూలంగా అలా పలుకుతూ ఉండగానే బెనాయా కొడుకు పెలట్యా చనిపోయాడు. నేను సాష్టాంగపడి, “అయ్యో! ప్రభూ! యెహోవా! ఇస్రాయేల్ ప్రజలలో మిగతావారిని నీవు సమూల నాశనం చేస్తావా?” అని బిగ్గరగా అరిచాను.

[14] అప్పుడు నాకు యెహోవా నుంచి వాక్కు వచ్చింది,

[15] “మానవపుత్రా, నీ సోదరుల విషయం, సమీప బంధువుల విషయం ఇస్రాయేల్ ప్రజలందరి విషయం జెరుసలం నగరవాసులు చెప్పేదేమిటంటే, ‘వాళ్ళు యెహోవాకు దూరంగా ఉన్నారు. ఈ దేశం మా స్వాధీనం చేయబడింది’.

[16] అందుచేత నీవు వాళ్ళకు ఇలా చెప్పు: యెహోవాప్రభువు చెప్పేదేమంటే దూరంగా ఉన్న ఇతర జనాలమధ్యకు నేను వారిని తొలగించి వేరువేరు దేశాలలో చెదరగొట్టినా, కొంతకాలం వారు వెళ్ళిన దేశాలలో నేను వారికి పవిత్ర ఆశ్రయంగా ఉన్నాను.

[17] అందుచేత నీవు ఇలా చెప్పు: యెహోవాప్రభువు చెప్పేదేమిటంటే, ఆ జనాల మధ్యనుంచి నేను మిమ్ములను సమకూరుస్తాను, మీరు చెదరిపోయిన ఆ దేశాలనుంచి రప్పిస్తాను. ఇస్రాయేల్ దేశాన్ని మీ స్వాధీనం చేస్తాను.

[18] “వారు అక్కడికి వెళ్ళి అసహ్యమైన ఆచారాలన్నిటినీ విగ్రహాలన్నిటినీ దేశంలో ఉండకుండా తొలగిస్తారు.

[19] నేను వారి శరీరాలలో నుంచి రాతి గుండెలు తీసివేసి వారికి మాంసం గుండెలు ఇస్తాను. వారికి ఏకీభావం గల క్రొత్త హృదయం ఇస్తాను. వారితో క్రొత్త ఆత్మను ఉంచుతాను.

[20] అప్పుడు వారు నా చట్టాలను అనుసరిస్తారు, నా న్యాయనిర్ణయాలను పాటిస్తారు. వారు నా ప్రజగా ఉంటారు, నేను వారికి దేవుడుగా ఉంటాను.

[21] కానీ వాళ్ళ అసహ్యమైన ఆచారాలనూ విగ్రహాలనూ అనుసరించేవాళ్ళ నెత్తిమీదికి వాళ్ళ ప్రవర్తన ఫలం రప్పిస్తాను. ఇది యెహోవాప్రభు వాక్కు.”

[22] అప్పుడు కెరూబులు రెక్కలు చాపారు. వారి ప్రక్కన ఆ చక్రాలు ఉన్నాయి. వారికి పైగా ఇస్రాయేల్ ప్రజల దేవుని శోభాప్రకాశం ఉంది.

[23] యెహోవా శోభాప్రకాశం నగరంలోనుంచి పైకి వెళ్ళి నగరానికి తూర్పుగా ఉన్న కొండకు పైగా నిలిచింది.

[24] ఆ తరువాత దేవుని ఆత్మ ఇచ్చిన దర్శనంలో ఆత్మ నన్ను ఎత్తి కల్దీయదేశంలో ఉన్న బందీలదగ్గరికి నన్ను తీసుకుపోయాడు. అప్పుడు నాకు కనిపించిన దర్శనం పైకి పోయి అంతర్థానమైనది.

[25] యెహోవా నాకు కనుపరచినదంతా ఆ బందీలకు చెప్పాను.

యెహెజ్కేలు — Chapters