Skip to content
Opens in a new window

[1] మరోసారి యెహోవానుంచి వాక్కు నాకు వచ్చింది:

[2] “మానవపుత్రా, ఉదాహరణంగా ఒక పొడుపు కథ ఇస్రాయేల్ ప్రజలకు ఇలా చెప్పు:

[3] యెహోవా చెప్పేదేమిటంటే, ఒక గొప్ప గరుడపక్షికి పొడుగైన పెద్ద రెక్కలూ వేరువేరు రంగుల దట్టమైన ఈకెలూ ఉన్నాయి. అది లెబానోను పర్వత ప్రదేశానికి వచ్చి ఒక దేవదారు చెట్టు పై కొమ్మను పట్టుకొంది.

[4] దాని లేత రెమ్మలను త్రుంచి వర్తకుల దేశానికి తీసుకుపోయింది. వ్యాపారస్థులున్న పట్టణంలో ఆ రెమ్మలను నాటింది.

[5] ఆ పక్షి మీ దేశం విత్తనాలలో కొన్ని తీసుకుపోయి సారవంతమైన భూమిలో వేసింది. నీళ్ళు సమృద్ధిగా ఉన్న స్థలంలో నిరవంజి చెట్టును నాటినవిధంగా ఆ విత్తనాలు నాటింది.

[6] అవి అంకురించి పైకి ఎక్కువ పెరగకుండా వ్యాపిస్తూ ఉన్న ద్రాక్షచెట్టు అయ్యాయి. ఆ చెట్టు కొమ్మలు ఆ పక్షివైపుకు తిరిగి, పెరిగాయి. దాని వేళ్ళు దానిక్రింద ఉన్నాయి. ఆ విధంగా అది ద్రాక్ష చెట్టయి రెమ్మలూ కొమ్మలూ వేస్తూ వచ్చింది.

[7] “ఇంకో గొప్ప గరుడపక్షి ఉండేది. దానికి కూడా పెద్ద రెక్కలూ దట్టమైన ఈకెలూ ఉన్నాయి. ఉన్నట్టుండి ఆ ద్రాక్షచెట్టు నీళ్ళకోసం తానున్న స్థలంనుంచి తన వేళ్ళనూ కొమ్మలనూ ఆ పక్షివైపుకు త్రిప్పుకొంది.

[8] అయితే అది కొమ్మలు వేసి బాగా ఫలించే మంచి చెట్టయ్యేలా నీళ్ళు సమృద్ధిగా ఉన్న మంచి భూమిలో నాటబడింది.

[9] గనుక ఇలా చెప్పు – యెహోవాప్రభువు చెప్పేదేమిటంటే, ఆ ద్రాక్షచెట్టు వర్ధిల్లుతుందా? దాని వేళ్ళను పెరికి దాని పండ్లు కోసివేయడమూ అది ఎండిపోవడమూ జరగదా? దాని చిగుళ్ళన్నీ ఎండిపోవా? దాన్ని పెళ్ళగించడానికి చాలామంది కావాలని కాదు, బలమైన హస్తం కూడా అనవసరం.

[10] ఒకవేళ దాన్ని మళ్ళీ నాటినా అది వర్ధిల్లుతుందా? తూర్పుగాలి దానిమీద విసిరేటప్పుడు అది పూర్తిగా ఎండిపోదా? అది నాటి ఉన్న భూమిలోనే తప్పక ఎండిపోతుంది.”

[11] అప్పుడు యెహోవానుంచి వాక్కు నాకు వచ్చింది:

[12] “తిరుగుబాటు చేసే ఈ ప్రజతో నీవు చెప్పవలసినది ఏమిటంటే, ఆ సంగతుల భావమేమిటో మీకు తెలియదా? ఇదిగో వినండి, బబులోనురాజు జెరుసలంకు వెళ్ళి దాని రాజునూ అధిపతులనూ పట్టుకొని బబులోను పట్టణానికి వెంటబెట్టుకుపోయాడు.

[13] రాజవంశంలో ఒకణ్ణి ఎన్నుకొని అతడితో సంధి చేసి అతడిచేత శపథం చేయించాడు.

[14] యూదా రాజ్యం హీనదశలో ఉండి, అభివృద్ధి చెందలేక, ఆ సంధి పాటించడం మూలంగానే నిలిచి ఉండాలని దేశంలో ఉన్న గొప్పవాళ్ళను కూడా బబులోనురాజు తీసుకుపోయాడు.

[15] అయితే ఆ రాజు అతడిమీద తిరుగుబాటు చేశాడు. ఎలాగంటే ఈజిప్ట్ దేశంవాళ్ళు గుర్రాలనూ మహా సైన్యాన్నీ ఇచ్చి సహాయం చేయాలని అతడు అక్కడికి రాయబారం పంపాడు. ఆ ప్రయత్నం సఫలం అవుతుందా? అలాంటి చర్యలు చేసేవాడు తప్పించుకొంటాడా? అతడు సంధి భంగం చేసి, తప్పించుకోగలడా?

[16] “అతడు బబులోనులోనే – ఎవరిచేత అతడు సింహాసనం ఎక్కాడో, ఎవరి విషయం శపథాన్ని తృణీకరించాడో, ఎవరి సంధి భంగం చేశాడో ఆ రాజు దేశంలోనే చస్తాడు. అలా జరుగుతుందని నా జీవంతోడు నేను – యెహోవా ప్రభువును – చెపుతున్నాను.

[17] యుద్ధకాలంలో, బబులోనువాళ్ళు చాలామందిని చంపడానికి మట్టిదిబ్బలు వేసి బురుజులు కట్టే సమయాన, ఫరో ఎంత బలంతో, ఎంత గొప్ప సైన్యంతో వచ్చినా అతడికి ఏమీ సహాయం చేయలేకపోతాడు.

[18] శపథం తృణీకరించి సంధి భంగం చేశాడు, ప్రమాణానికి గుర్తుగా చేతులు కలిపిన తరువాత అతడు అలా ప్రవర్తించాడు గనుక తప్పించుకోడు.

[19] “ఇందుకు యెహోవాప్రభువు ఇలా అంటున్నాడు: అతడు నా ప్రమాణం తృణీకరించి నా ఒడంబడిక భంగం చేశాడు. నా జీవంతోడు నేను ఆ దోషానికి తగిన శిక్ష అతడి నెత్తిమీదికి రప్పిస్తాను.

[20] అతణ్ణి పట్టుకోవడానికి నా వల పన్ని దానిలో అతణ్ణి చిక్కించుకొని బబులోనుకు తెప్పిస్తాను. నాపట్ల అతడు చేసిన ద్రోహం కారణంగా అక్కడే అతణ్ణి శిక్షిస్తాను.

[21] అతడి సైనికులంతా పారిపోతూ ఉన్నప్పుడు కత్తిచేత కూలుతారు. మిగతావారు నలుదిక్కులకు చెదరిపోతారు. అప్పుడు నేను – యెహోవాను – ఈ మాటలు పలికానని మీరు తెలుసుకొంటారు.”

[22] యెహోవాప్రభువు ఇలా చెపుతున్నాడు, “ఎత్తయిన దేవదారు చెట్టు పైకొమ్మలలో లేత కొమ్మను తీసి దాన్ని నాటుతాను. పైగా ఉన్నదాని లేత రెమ్మలలో ఒకదాన్ని త్రుంచి ఎత్తయిన మహా పర్వతంమీద దాన్ని నాటుతాను.

[23] ఇస్రాయేల్‌దేశంలో ఉన్న ఎత్తయిన పర్వతం మీద దాన్ని నాటుతాను. అది కొమ్మలు వేసి ఫలించి శ్రేష్ఠమైన దేవదారు చెట్టవుతుంది. అన్ని రకాల పక్షులు దానిలో గూళ్ళు కట్టుకొంటాయి. దాని కొమ్మల నీడలో వాటికి ఉనికిపట్టు దొరుకుతుంది.

[24] నేను – యెహోవాను – ఎత్తయిన చెట్టును క్రిందికి కూలుస్తాననీ పొట్టి చెట్టు ఎత్తుగా పెరిగేలా చేస్తాననీ, పచ్చని చెట్టును ఎండిపోయేలా చేస్తాననీ, ఎండినచెట్టు వికసించేలా చేస్తాననీ పచ్చిక మైదానాలలో ఉన్న చెట్లన్నీ తెలుసుకొంటాయి. నేను – యెహోవాను – ఈ మాటలు పలికాను. నేనే వాటిప్రకారం జరిగిస్తాను.”

యెహెజ్కేలు — Chapters