[1] మరోసారి యెహోవానుంచి వాక్కు నాకు వచ్చింది:
[2] “మానవపుత్రా, దైవావేశపూర్వకంగా ఇలా చెప్పు: యెహోవాప్రభువు చెప్పేదేమిటంటే, ‘అయ్యయ్యో, దుర్దినం దగ్గరపడింది!’ అని పెడ బొబ్బలు పెట్టండి.
[3] నిజంగా ఆ దినం దగ్గరపడింది. యెహోవా దినం సమీపమయింది. అది దట్టమైన మేఘాల రోజు, జనాలు శిక్షకు గురి అయ్యే రోజు.
[4] అప్పుడు ఖడ్గం ఈజిప్ట్‌మీద పడుతుంది. ఈజిప్ట్‌లో జనం హతమై కూలుతూ ఉంటే, కూషుదేశస్థులు వేదనల పాలవుతారు. ఈజిప్ట్‌వాళ్ళ ధనాన్ని పట్టుకుపోవడమూ, ఆ దేశం పునాదులు నాశనం కావడమూ జరుగుతుంది.
[5] వాళ్ళతోపాటు కూషు, పూత్, లూదీయ అనే దేశాలు, అరేబియ అంతా, కూబుదేశం, ఒడంబడిక దేశప్రజలు కూడా ఖడ్గానికి గురి కావడం తప్పదు.
[6] “యెహోవా ఇలా అంటున్నాడు: ఈజిప్ట్‌కు అండగా ఉన్నవాళ్ళు కూలుతారు. గర్వంతో కూడిన దాని బలం అణగిపోతుంది. మిగ్‌దోల్ నుంచి సెవేనేవరకు జనం కత్తిపాలై కూలుతారు. ఇది యెహోవాప్రభు వాక్కు.
[7] ఆ దేశం పాడైపోయిన దేశాలలో ఒకటి అవుతుంది. నాశనమైపోయిన పట్టణాలలో దాని పట్టణాలు నశించిన స్థితిలో ఉంటాయి.
[8] నేను ఈజిప్ట్‌లో మంట రాజేసేటప్పుడు, దాని సహాయులంతా హతమయ్యేటప్పుడు నేనే యెహోవానని వాళ్ళు తెలుసు కొంటారు.
[9] ఆ రోజున నా సముఖంనుంచి వార్తాహరులు ఓడలో బయలుదేరి అశ్రద్ధగా ఉన్న కూషుదేశస్థులను భయకంపితులను చేస్తారు. ఈజిప్ట్‌కు విపత్తు వచ్చే రోజున వాళ్ళు వేదనల పాలవుతారు. ఆ రోజు త్వరలోనే వస్తుంది.
[10] “యెహోవాప్రభువు ఇలా అంటున్నాడు: బబులోను రాజైన నెబుకద్‌నెజరుచేత ఈజిప్ట్‌యొక్క అల్లరిమూకలు అంతమయ్యేలా చేయిస్తాను.
[11] దేశాన్ని నాశనం చేయడానికి అతడు, అతడి సైన్యం వస్తారు. ఆ జనం జనాలన్నిట్లో అతి భయంకరమైన జనం. వాళ్ళు ఈజిప్ట్‌కు శత్రువులై ఖడ్గాలను దూసి హతమైనవాళ్ళతో దేశాన్ని నింపుతారు.
[12] నేను స్వయంగా నైలు కాలువలను ఇంకిపోయేలా చేస్తాను, ఆ దేశాన్ని దుర్మార్గులకు అమ్మివేయిస్తాను, విదేశీయులచేత దేశాన్నీ దానిలో ఉన్నదంతా పాడు చేయిస్తాను. నేను – యెహోవాను – ఈ మాట ఇచ్చాను.
[13] “యెహోవాప్రభువు ఇలా అంటున్నాడు: నోఫ్‌కు చెందే విగ్రహాలను నిర్మూలిస్తాను, ప్రతిమలు లేకుండా చేస్తాను. అప్పటినుంచి ఈజిప్ట్‌లో రాజు ఉండడు. దేశమంతటా నేను భయం పుట్టిస్తాను.
[14] పత్రోసును పాడు చేస్తాను, సోయనులో మంట రాజేలా చేస్తాను. నో పట్ల నా తీర్పులప్రకారం జరిగిస్తాను.
[15] ఈజిప్ట్‌కు కోటగా ఉన్న సీన్‌మీద నా కోపాగ్ని కుమ్మరిస్తాను, నోలో జనసమూహాన్ని హతమారుస్తాను.
[16] ఈజిప్ట్‌ను తగులబెడతాను. సీన్‌పట్టణస్థులు వేదనతో అల్లాడిపోతారు. నో బ్రద్దలు అవుతుంది. రోజురోజు నోఫ్ బాధలకు గురి అవుతుంది.
[17] ఓను, పిబేసేతుల యువకులు కత్తిపాలవుతారు. ఆ పట్టణస్థులు బందీలుగా పోతారు.
[18] ఈజిప్ట్ మోపిన కాడిని నేను తహపనేసులో విరిచే రోజున చీకటి కమ్ముకొంటుంది. ఈజిప్ట్ బల గర్వం అక్కడ అంతమవుతుంది. దాన్ని మబ్బులు కమ్ముకొంటాయి. దాని కూతుళ్ళు బందీలుగా పోతారు.
[19] ఈ విధంగా నా తీర్పుల ప్రకారం ఈజిప్ట్‌పట్ల జరిగిస్తాను. అప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకొంటారు.”
[20] పదకొండో సంవత్సరం మొదటి నెల ఏడో రోజున యెహోవానుంచి వాక్కు నాకు వచ్చింది:
[21] “మానవపుత్రా, ఈజిప్ట్ రాజైన ఫరో హస్తాన్ని నేను విరగగొట్టాను. అది బాగుపడేలా దానికి కట్టు కట్టడం జరగలేదు. ఖడ్గం పట్టుకొనే బలం దానికి వచ్చేలా బద్దకట్టడం జరగలేదు.
[22] ఇందుకు యెహోవాప్రభువు ఇలా అంటున్నాడు: ఈజిప్ట్ రాజైన ఫరోకు నేను వ్యతిరేకిని. అతడి రెండు చేతులను – బలమైన దానినీ విరిగినదానినీ – విరగగొట్టి, అతడి చేతిలోనుంచి ఖడ్గం పడిపోయేలా చేస్తాను,
[23] ఈజిప్ట్‌వాళ్ళను ఇతర జనాలలోకి చెదరిగొట్టివేస్తాను, ఇతర దేశాలకు పారదోలుతాను.
[24] నేను బబులోను రాజు చేతులను బలపరచి నా ఖడ్గం అతడి చేతికిస్తాను, గాని ఫరో చేతులను విరిచివేస్తాను. ఫరో అతని సమక్షంలో చావుదెబ్బ తిన్నవాడిలాగా మూలుగుతాడు.
[25] నేను బబులోను రాజు చేతులను బలంగా చేస్తాను, గాని ఫరో చేతులు పడిపోతాయి. నేను నా ఖడ్గం బబులోను రాజు చేతికిచ్చేటప్పుడు, అతడు దానిని ఈజిప్ట్‌మీద ఆడించేటప్పుడు నేనే యెహోవానని వాళ్ళు తెలుసుకొంటారు.
[26] నేను ఈజిప్ట్‌వాళ్ళను ఇతర జనాలలోకి చెదరగొట్టివేస్తాను, ఇతర దేశాలకు పారదోలుతాను. అప్పుడు నేనే యెహోవానని వాళ్ళు తెలుసుకొంటారు.”