[1] మరోసారి యెహోవానుంచి వాక్కు నాకు వచ్చింది:
[2] “మానవ పుత్రా, నీవు తిరుగబడే ప్రజలమధ్య నివాసం చేస్తున్నావు. చూడాలంటే వాళ్ళకు కండ్లున్నాయి గాని వాళ్ళు చూడరు. వినాలంటే చెవులున్నాయి గాని వినరు. ఎందుకంటే, వాళ్ళు తిరగబడే జనం.
[3] అందుచేత, మానవపుత్రా, వాళ్ళు చూస్తూ ఉండగానే నీవు దేశాంతరం పోవడానికి సామాను మూట కట్టుకొని బయలుదేరాలి. పగటివేళ, వాళ్ళ కళ్ళెదుటే నీవున్న స్థలం విడిచి వేరే స్థలానికి వెళ్ళు. అది చూచి తాము తిరగబడే జనమని వాళ్ళు గ్రహిస్తారేమో.
[4] పగటివేళ, వాళ్ళు చూస్తూ ఉండగానే, నీవు దేశాంతరం పోయేవాడివైనట్టుగా మూట కట్టి ఉన్న నీ సామాను బయటికి తీసుకురా. సాయంకాల సమయంలో, వాళ్ళు చూస్తూ ఉండగానే, దేశాంతరం పోయేవారిలాగా నీవు బయలుదేరు.
[5] వాళ్ళు చూస్తుండగానే గోడకు కన్నం వేసి, దానిగుండా నీ సామాను తీసుకుపో.
[6] వాళ్ళు చూస్తూ ఉండగానే చీకటి పడ్డ తరువాత మూట భుజం మీద పెట్టుకొని వెళ్ళిపో. నేల నీకు కనబడకుండా నీ ముఖం కప్పుకో. నీవు ఇస్రాయేల్ ప్రజకు సూచనగా ఉండాలని నేను నిర్ణయించాను.”
[7] ఆయన నాకు ఆజ్ఞాపించినట్టే చేశాను. దేశాంతరం పోయేవాణ్ణయినట్టు, పగటివేళ నా సామాను బయటికి తెచ్చాను. సాయంకాల సమయంలో చేతులతో గోడకు కన్నం చేశాను. చీకటి పడ్డాక వాళ్ళు చూస్తూ ఉండగానే నా భుజంమీద సామాను పెట్టుకొని బయలుదేరాను.
[8] ప్రొద్దున యెహోవానుంచి వాక్కు నాకు వచ్చింది:
[9] “మానవపుత్రా, తిరగబడే ఇస్రాయేల్‌వాళ్ళు ‘నీవేం చేస్తున్నావు?’ అని అడిగారు గదా.
[10] నీవు వాళ్ళతో ఇలా చెప్పు: యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే, ఈ సందేశం జెరుసలంలో ఉన్న పరిపాలకుడికీ అక్కడున్న ఇస్రాయేల్ వాళ్ళందరికీ చెందుతుంది.
[11] వాళ్ళకు ఇలా చెప్పు: నేను మీకు సూచనగా ఉన్నాను. నేను చేసి సూచించినట్టే వాళ్లకు సంభవిస్తుంది. వాళ్ళు బందీలుగా దేశాంతరం పోతారు.
[12] “వాళ్ళ పరిపాలకుడు భుజంమీద సామాను పెట్టుకొని చీకటిలో బయలుదేరుతాడు. అతడు బయటికి వెళ్ళేట్టు వాళ్ళు గోడకు కన్నం చేస్తారు. అతడు ముఖం కప్పుకొని నేల చూడకుండా వెళ్ళిపోతాడు.
[13] అయితే అతణ్ణి పట్టుకోవడానికి నేను నా వల పరచి అతణ్ణి చిక్కించుకొని కల్దీయవాళ్ళ దేశంలో ఉన్న బబులోనుకు అతణ్ణి తెప్పిస్తాను. అతడు అక్కడ చస్తాడు. గాని ఆ స్థలం చూడడు.
[14] అతడి చుట్టున్న వాళ్ళందరినీ – అతడి పరివారాన్నీ సైనికులనూ – నేను నలుదిక్కులకు చెదరగొట్టి ఖడ్గం దూసి వాళ్ళను తరుముతాను.
[15] నేను వాళ్ళను ఇతర జనాల మధ్యకు వెళ్ళగొట్టి వేరువేరు దేశాలలో చెదరగొట్టిన తరువాత, నేనే యెహోవానని వాళ్ళు తెలుసుకొంటారు.
[16] వాళ్ళలో కొంతమంది ఖడ్గంచేత కరవుచేత ఘోర రోగంచేత చావకుండా చేస్తాను. నేనే యెహోవానని వారు తెలుసుకోవాలనీ, తమ అసహ్యమైన ప్రవర్తన తాము వెళ్ళే దేశాలలో వివరించి చెప్పాలనీ నా ఆశయం.”
[17] మరోసారి యెహోవానుంచి వాక్కు నాకు వచ్చింది:
[18] “మానవపుత్రా, నీవు భోజనం చేస్తూ గజగజలాడు. ఆందోళనతో, కంగారుతో నీళ్ళు త్రాగు.
[19] అప్పుడు దేశప్రజలకు ఇలా చెప్పు: జెరుసలం నగరవాసుల విషయం, ఇస్రాయేల్ దేశవాసుల విషయం యెహోవాప్రభువు చెప్పేదేమిటంటే, వాళ్ళు కంగారుతో భోజనం చేస్తారు. నిర్ఘాంతపోతూ నీళ్ళు త్రాగుతారు. ఎందుకంటే, ఆ దేశంలో కాపురమున్నవాళ్ళందరూ చేసే దౌర్జన్యం కారణంగా దానిలో ఉన్నదంతా నాశనం అవుతుంది.
[20] ప్రజలు కాపురమున్న పట్టణాలు నిర్జనమవుతాయి. దేశం పాడవుతుంది. అప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకొంటారు.”
[21] మరోసారి యెహోవానుంచి వాక్కు నాకు వచ్చింది:
[22] “మానవపుత్రా, ఇస్రాయేల్ దేశంలో ‘రోజులు గడిచి పోతున్నాయి. స్వప్న దర్శనాలన్నీ శూన్యం అవుతున్నాయి’ అని సామెతగా చెప్పుకొంటున్నారేం.
[23] నీవు వాళ్ళకు ఇలా తెలియజెయ్యి: యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే, ఇకమీదట ఇస్రాయేల్ ప్రజలలో ఎవ్వడూ ఆ సామెత పలకకుండా నేను దాన్ని నిలిపివేయిస్తాను. వాళ్ళకు ఇలా చెప్పు: ప్రతి దర్శనం నెరవేరే రోజులు దగ్గరపడుతున్నాయి.
[24] అప్పటినుంచి వ్యర్థమైన దర్శనాలు గానీ సోదె చెప్పేవాళ్ళ పొగడ్త మాటలు గానీ ఇస్రాయేల్ ప్రజలలో ఉండవు.
[25] నేను యెహోవాను. నేను మాట్లాడుతాను. నా మాటలు నెరవేరుతాయి. ఆలస్యం ఉండదు. తిరగబడే జనమా, నేను చెప్పేమాటలు మీ రోజుల్లోనే నెరవేరుతాయి. ఇది ప్రభువైన యెహోవా వాక్కు.”
[26] మరోసారి యెహోవా నుంచి వాక్కు నాకు వచ్చింది:
[27] “మానవపుత్రా, ఇస్రాయేల్‌ప్రజలు నిన్ను గురించి ఇలా చెప్పుకొంటున్నారు గదా – ‘వాడికి కనిపించిన దర్శనం అనేక రోజులైన తరువాత జరిగే దానిని గురించి. వాడు చెప్పే భవిష్యత్తు చాలా కాలమైన తరువాత వస్తుంది.”
[28] అందుచేత వాళ్ళతో ఇలా చెప్పు: యెహోవాప్రభువు చెప్పేదేమిటంటే, ఇకనుంచి నేను చెప్పే మాటలన్నీ ఆలస్యం లేకుండా నెరవేరుతాయి. నేను ఏ మాట చెప్పితే ఆ మాట జరిగి తీరుతుంది. ఇది యెహోవా వాక్కు.”