[1] మరోసారి యెహోవానుంచి వాక్కు నాకు వచ్చింది:
[2] “మీరు ఇలా అంటారు గదా, ‘తండ్రులు పుల్లని ద్రాక్షకాయలు తిన్నారు, పిల్లల పళ్ళు పులిశాయి’ అని. ఆ సామెత ఇస్రాయేల్ దేశాన్ని గురించి చెపుతున్నారేమిటి?
[3] మీరు ఇకనుంచి ఇస్రాయేల్‌లో ఆ సామెత చెప్పరని నా జీవంతోడు నేనే – యెహోవాప్రభువును – పలుకుతున్నాను.
[4] అందరూ నా స్వాధీనంలో ఉన్నారు. తండ్రులూ కొడుకులూ అందరూ నా స్వాధీనంలో ఉన్నారు. ఎవడైతే అపరాధం చేస్తాడో వాడే చస్తాడు.
[5] “న్యాయవంతుడొకడు ఉన్నాడు. అతడు నీతి న్యాయాలను అనుసరిస్తాడు.
[6] కొండలమీద భోం చేయకుండా, ఇస్రాయేల్‌ప్రజలు పెట్టుకొన్న విగ్రహాలవైపు చూడకుండా ఉంటాడు. పొరుగువాడి భార్యను పాడు చేయడు. రుతు కాలంలో ఉన్న స్త్రీతో శయనించడు.
[7] ఎవరినీ బాధించడు గాని అప్పు తీసుకున్నవాడికి తాకట్టు మళ్ళీ ఇస్తాడు. ఎవరి వస్తువులనూ దోచుకోడు. ఆకలి ఉన్నవారికి ఆహారం, బట్టలు లేనివారికి బట్టలు ఇస్తాడు.
[8] వడ్డీకి అప్పివ్వడు, అప్పివ్వడంవల్ల లాభమేమీ చేకూర్చుకోడు. అన్యాయం చేయడు, పక్షపాతం లేకుండా అందరిపట్ల న్యాయం జరిగిస్తాడు.
[9] అతడు నమ్మకంగా నా చట్టాలను పాటిస్తూ, నా న్యాయ నిర్ణయాలను అనుసరిస్తూ ఉంటాడు. అలాంటివాడు న్యాయవంతుడు. అతడు తప్పనిసరిగా బ్రతుకుతాడు. ఇది యెహోవా వాక్కు.
[10] “ఆ న్యాయవంతునికి పుట్టిన కొడుకు దౌర్జన్యం, హత్య చేసేవాడనుకోండి. చేయవలసినవాటిలో దేనిని చేయక, చేయరానివాటిలో దేనినైనా చేస్తాడనుకోండి.
[11] కొండలమీద భోం చేస్తాడు. పొరుగువాడి భార్యను అశుద్ధం చేస్తాడు.
[12] దీనావస్థలో అక్కరలో ఉన్నవారిని బాధిస్తాడు, దోచుకొంటాడు. తాకట్టు మళ్ళీ ఇవ్వకుండా ఉంటాడు. విగ్రహాల వైపు చూస్తాడు. అసహ్య కార్యాలు చేస్తాడు.
[13] వడ్డీకి అప్పిస్తాడు. అప్పివ్వడంవల్ల లాభం చేకూర్చుకొంటాడు. అలాంటివాడు బ్రతుకుతాడా? బ్రతకడు! ఆ అసహ్యకరమైన కార్యాలన్నీ చేసినందుచేత వాడు తప్పకుండా మరణశిక్షకు గురి అవుతాడు. వాడి మృతికి వాడే బాధ్యుడు.
[14] “అయితే ఆ కొడుకుకు పుట్టిన కొడుకు తన తండ్రి చేసిన పాపాలన్నీ చూచినా అలాంటివాటిని చేయకుండా ఉంటాడనుకోండి.
[15] కొండలమీద భోం చేయడు. ఇస్రాయేల్‌ప్రజలు పెట్టుకొన్న విగ్రహాలవైపు చూడడు. పొరుగువాడి భార్యను అశుద్ధం చేయడు.
[16] ఎవరినీ బాధించడు, తాకట్టు ఉంచుకోడు, దోచుకోడు. ఆకలి ఉన్నవారికి ఆహారం, బట్టలు లేని వారికి బట్టలు ఇస్తాడు.
[17] బీదవారిమీద అన్యాయంగా చెయ్యి వేయడు. వడ్డీకి అప్పియ్యడు. అప్పివ్వడంవల్ల లాభం చేకూర్చుకోడు. నా న్యాయనిర్ణయాలను అనుసరిస్తూ, నా చట్టాలను పాటిస్తూ ఉంటాడు. తన తండ్రి చేసిన అపరాధాల కారణంగా అలాంటివాడు చావడు. అతడు తప్పక బ్రతుకుతాడు.
[18] కాని, అతడి తండ్రి దౌర్జన్యపరుడై పొరుగువాని వస్తువులను దోచుకొంటూ, తన ప్రజలమధ్య చెడుగు చేస్తూ ఉండేవాడు గనుక తాను చేసిన అపరాధాల కారణంగా వాడే చస్తాడు.
[19] “అయితే మీరు ‘తండ్రి చేసిన అపరాధంచేత కొడుకు ఎందుకు శిక్షకు గురి కాడు?’ అని అడుగుతారు. కొడుకు నీతిన్యాయాలను అనుసరిస్తూ నా చట్టాలన్నిటినీ పాటిస్తూ అనుసరిస్తూ ఉన్నాడు గనుక అతడు తప్పనిసరిగా బ్రతుకుతాడు.
[20] అపరాధం చేస్తూ ఉండేవాడే చస్తాడు. తండ్రి అపరాధం కారణంగా కొడుకు శిక్షకు గురి కాడు. కొడుకు కారణంగా తండ్రి శిక్షకు గురి కాడు. న్యాయవంతుడి న్యాయప్రవర్తన అతడికే చెందుతుంది, దుర్మార్గుడి దుర్మార్గం అతడికే చెందుతుంది.
[21] “అయితే దుర్మార్గుడు తాను చేసిన అపరాధాలన్నిటినీ వదలిపెట్టి నా చట్టాలన్నిటినీ అనుసరించి నీతిన్యాయాల ప్రకారం ప్రవర్తిస్తే, అతడు తప్పనిసరిగా బ్రతుకుతాడు. అతడు చావడు.
[22] అతడు చేసిన అపరాధాలలో ఒకటి కూడా జ్ఞప్తికి రాదు. అతడి న్యాయ ప్రవర్తన కారణంగా బ్రతుకుతాడు.
[23] దుర్మార్గుడు చస్తే నాకేమైనా సంతోషం కలుగుతుందా? నాకు సంతోషం కలిగించేదేమిటంటే, దుర్మార్గులు తమ దుర్మార్గాలను వదలిపెట్టి బ్రతకడమే గదా. ఇది యెహోవాప్రభువు వాక్కు.
[24] న్యాయవంతుడు నీతిన్యాయాలను వదలివేసి అపరాధి అయి, దుర్మార్గులు చేసే అసహ్యకార్యాలను చేస్తూ ఉంటే అతడు బ్రతుకుతాడా? మునుపు నీతిన్యాయాలను అనుసరించి చేసిన క్రియలు నా జ్ఞప్తికి రావు. అతడు ద్రోహి అయి చేసిన అపరాధాల కారణంగా చస్తాడు.
[25] “అయినా, మీరు ‘యెహోవా విధానం న్యాయం కాదు’ అంటారు. ఇస్రాయేల్ ప్రజలారా, నేను చెప్పేది వినండి! నా విధానం న్యాయం కాదా? అన్యాయ విధానాలు మీవే గదా.
[26] న్యాయవంతుడు నీతిన్యాయాలను వదలివేసి అక్రమం చేస్తూ ఉంటే, అతడు దానికారణంగా చస్తాడు. అతడు చేసిన అక్రమాల కారణంగానే చస్తాడు.
[27] దుర్మార్గుడు తాను చేస్తూ వచ్చిన చెడుగును విసర్జించి నీతిన్యాయాల ప్రకారం ప్రవర్తిస్తూ ఉంటే, అతడు ప్రాణం దక్కించుకొంటాడు.
[28] తాను చేస్తూ వచ్చిన అతిక్రమాలన్నిటి విషయం ఆలోచించి వాటిని విసర్జించడం కారణంగా అతడు తప్పనిసరిగా బ్రతుకుతాడు. అతడు చావడు.
[29] అయినా, ఇస్రాయేల్‌ప్రజలు ‘యెహోవా విధానం న్యాయం కాదు’ అంటారు. ఇస్రాయేల్‌ప్రజలారా, నా విధానం న్యాయసమ్మతం కాదా? అన్యాయ విధానాలు మీవే గదా.
[30] అందుచేత, ఇస్రాయేల్ ప్రజలారా, నేను ప్రతివాడికీ అతడి ప్రవర్తన ప్రకారం తీర్పు తీరుస్తాను. ఇది యెహోవా వాక్కు. “నావైపు తిరగండి! మీ అక్రమాలన్నిటినీ విడిచిపెట్టండి! అప్పుడు వాటివల్ల మీరు పడిపోరు.
[31] మీరు చేసిన అక్రమాలన్నిటినీ విసర్జించి క్రొత్త హృదయాన్నీ క్రొత్త మనసునూ కలిగించుకోండి. ఇస్రాయేల్‌ప్రజలారా! మీరెందుకు చస్తారు?
[32] ఎవడైనా చస్తే అతడి చావు విషయం నాకేమీ సంతోషం కలగదు. గనుక నావైపు తిరిగి, బ్రతకండి! ఇది యెహోవా వాక్కు.