Skip to content
Opens in a new window

[1] జ్ఞానం తన భవనం నిర్మించుకొన్నది. దానికి ఏడు స్తంభాలు చెక్కింది.

[2] మాంసం సిద్ధం చేసింది. ద్రాక్ష పానీయాన్ని కలిపింది. బల్లమీద అంతా వడ్డించింది కూడా.

[3] తన చెలికత్తెలను పంపింది. తాను పట్టణంలో ఎత్తయిన స్థలంమీద నిలబడి,

[4] “తెలివితక్కువవారెవరైనా సరే, ఇక్కడికి రండి” అని పిలుస్తూ ఉంది. బుద్ధిలేనివాళ్ళతో జ్ఞానం ఇలా పలుకుతూ ఉంది:

[5] “రండి, నేను సిద్ధం చేసిన ఆహారం పుచ్చుకోండి! నేను కలిపిన ద్రాక్షారస పానీయాన్ని త్రాగండి!

[6] మీ తెలివితక్కువతనాన్ని విడిచి జీవించండి. తెలివైన బాటలో నడవండి.

[7] పరిహాసకులను మందలించేవాడి మీదికే నింద వస్తుంది. దుర్మార్గులను గద్దించేవాడు దూషణకు గురి అవుతాడు.

[8] పరిహాసకుణ్ణి గద్దించకు. గద్దిస్తే, వాడు నిన్ను ద్వేషిస్తాడు. జ్ఞానిని గద్దిస్తే, అతడు నిన్ను ప్రేమిస్తాడు.

[9] జ్ఞానికి బుద్ధి చెపితే, అతడి జ్ఞానం అధికం అవుతుంది. న్యాయవంతులకు ఉపదేశం చేస్తే, వారికి జ్ఞానాభివృద్ధి కలుగుతుంది.

[10] యెహోవా మీది భయభక్తులు జ్ఞానానికి ఆరంభం. వివేకం అంటే పవిత్రుడైన దేవుణ్ణి తెలుసుకోవడమే.

[11] నా మూలంగా నీవు బ్రతికే దినాలు అధికం అవుతాయి. నీ జీవిత కాలాన్ని పొడిగించడం జరుగుతుంది.

[12] నీవు జ్ఞానివైతే నీ జ్ఞానం వల్ల నీకే లాభం. నీవు పరిహాసకుడివైతే నీవే ఆ ఫలితం అనుభవించాలి.”

[13] మందబుద్ధి అనే స్త్రీ వదరుబోతు, వెర్రిది. దానికేమీ తెలియదు.

[14] ఆమె తన ఇంటి వాకిట్లో కూర్చుంటుంది. లేదా, పట్టణంలో ఎత్తయిన స్థలంలో కుర్చీ మీద కూచుంటుంది.

[15] దారిన పొయ్యేవారిని చూచి, తమ త్రోవను తాము తిన్నగా నడిచివెళ్ళే వారిని చూచి, ఇలా పిలుస్తుంది:

[16] “తెలివి తక్కువవాళ్ళెవరైనా సరే ఇక్కడికి రండి.” బుద్ధిలేని వాళ్ళతో,

[17] “దొంగిలించిన నీళ్ళు తియ్యన, దొంగచాటుగా తిన్న తిండి రుచి” అంటుంది.

[18] కాని, వినేవారికి తెలియదు – చచ్చినవాళ్ళే అక్కడ ఉన్నారు. ఆమె అతిథులందరూ మృత్యులోకంలో ఉన్నారు.

సామెతలు — Chapters