Skip to content
Opens in a new window

[1] దొంగ త్రాసు యెహోవాకు అసహ్యకరం. సరైన తూకం ఆయనకిష్టం.

[2] గర్వం వెంటే అవమానం వస్తుంది. వినయం గలవారి దగ్గర జ్ఞానం ఉంటుంది.

[3] నిజాయితీపరుల న్యాయబుద్ధి వారికి మార్గదర్శి. ద్రోహులు వాళ్ళ కపటంవల్లే నాశనం అవుతారు.

[4] దేవుని ఆగ్రహ దినాన ధనం దేనికీ పనికి రాదు. నిర్దోషత్వం మరణం నుంచి తప్పిస్తుంది.

[5] నిర్దోషుల న్యాయవర్తన వారి మార్గం సరి చేస్తుంది. దుర్మార్గులు తమ దుర్మార్గంవల్లే కూలుతారు.

[6] నిజాయితీపరుల నిర్దోషత్వం వారికి విడుదల కలిగిస్తుంది. ద్రోహులు తమ పేరాశలో చిక్కుపడిపోతారు.

[7] దుర్మార్గులు చస్తే, వారి ఆశాభావం అంతరించిపోతుంది. బలవంతుల ఆశ అడుగంటిపోతుంది.

[8] సన్మార్గులు కష్టాలనుంచి విడుదల అవుతారు. వారి స్థానాన్ని దుర్మార్గులు ఆక్రమించుకొంటారు.

[9] భక్తిలేని వారు తమ నోటి మాటతో పొరుగువారిని నాశనం చేస్తారు. న్యాయవంతులు తెలివివల్ల తప్పించు కుంటారు.

[10] సన్మార్గులు బాగుంటే పట్టణానికి సంతోషం. దుర్మార్గులు నాశనమైపోతే ఆనందధ్వనులు చెలరేగుతాయి.

[11] నిజాయితీపరుల ఆశీస్సులవల్ల పట్టణం ఉన్నత స్థితికి వస్తుంది. దుర్మార్గుల నోరు దాన్ని కూలగొట్టివేస్తుంది.

[12] తన పొరుగువారిని లెక్కచెయ్యనివారు తెలివి తక్కువవారు. వివేకవంతులు మౌనం వహిస్తారు.

[13] చాడికోరులు తిరుగుతూ రహస్యాలు బట్టబయలు చేస్తారు. విశ్వసనీయులు రహస్యాలు దాచిపెట్టేవారు.

[14] దారి చూపేవారు లేకపోతే ప్రజలు పతనం చెందుతారు. సలహాలు చెప్పేవారు చాలామంది ఉంటే, ప్రజలు సురక్షితంగా ఉంటారు.

[15] పరాయివారికి జామీను ఉండేవారు తప్పక కష్టం అనుభవిస్తారు. జామీను ఉండడానికి ఒప్పుకోనివాడు భద్రంగా ఉంటాడు.

[16] మృదు హృదయం గల స్త్రీకి గౌరవం కలుగుతుంది. దౌర్జన్యపరులు సంపద చేజిక్కించుకుంటారు.

[17] దయాపరులు మంచి చేయడం వల్ల తమకు ప్రయోజనం కలుగుతుంది. క్రూరులు కీడు చేయడం వల్ల తమకు హాని కలుగుతుంది.

[18] దుర్మార్గుల సంపాదన మోసకరం. న్యాయమనే విత్తనం వేసేవారికి అసలైన బహుమతి దొరుకుతుంది.

[19] నిజమైన న్యాయవర్తనం జీవదాయకం. పొద్దస్తమానం చెడుగు చేసేవారు తమ చావునే తెచ్చుకుంటారు.

[20] వక్రబుద్ధి గల వాళ్ళంటే యెహోవాకు అసహ్యం. ప్రవర్తనలో నిర్దోషులు ఆయనకు ప్రీతిపాత్రులు.

[21] దుర్మార్గులకు శిక్ష రావడం ఖాయం. సన్మార్గులు విముక్తులవుతారు.

[22] అందం ఉండి, వివేకం లోపించిన స్త్రీ – పందికి ఉన్న బంగారు ముక్కుపుడక లాంటిది.

[23] సన్మార్గులు మంచినే కోరుతారు. దుర్మార్గుల ఆశ దురభిమాన పూరితం.

[24] ధారాళంగా ఇచ్చి అభివృద్ధి పొందినవారు ఉన్నారు. ఇవ్వవలసినదానికంటే తక్కువ ఇచ్చి దరిద్రులైనవారూ ఉన్నారు.

[25] ఔదార్యం గలవారు వర్ధిల్లుతారు. నీళ్ళు పోసేవారికి ఎవరైనా నీళ్ళు పోస్తారు.

[26] ధాన్యం అమ్మకుండా బిగబట్టేవాణ్ణి ప్రజలు దూషిస్తారు. ధాన్యం అమ్మేవాడి శిరస్సుపై ఆశీస్సులు కురుస్తాయి.

[27] మేలు చేయడానికి ప్రయత్నించేవారు దయను కోరుకొనేవారు. కీడు తల పెట్టేవారికి కీడే ముడుతుంది.

[28] సంపదను నమ్ముకొనేవారు పడిపోతారు. న్యాయవంతులు చిగురుటాకులాగా ఉండి వర్ధిల్లుతారు.

[29] తన ఇంటివారిని బాధలపాలు చేసేవాడి వారసత్వం గాలి మాత్రమే. అవివేకి జ్ఞానికి సేవకుడు అవుతాడు.

[30] న్యాయవంతుల ఫలం జీవవృక్షం. జ్ఞానమున్నవాడు ఇతరులను రక్షిస్తాడు.

[31] న్యాయవంతులకు ఇహలోకంలో ప్రతిఫలం కలిగితే, దుర్మార్గులకూ పాపులకూ ప్రతిఫలం రావడం మరీ ఖాయం గదా!

సామెతలు — Chapters