Skip to content
Opens in a new window

[1] నా కుమారా, నా మాటల ప్రకారం ప్రవర్తించు. నా ఆజ్ఞలను నీ దగ్గర పదిలంగా ఉంచుకో.

[2] నా ఆజ్ఞల ప్రకారం ప్రవర్తిస్తే బ్రతుకుతావు. నీ కంటిపాపలాగా నా ఉపదేశాన్ని కాపాడుకో.

[3] నీ వ్రేళ్ళకు వాటిని కట్టుకో. నీ హృదయ పలక మీద వాటిని రాసి పెట్టుకో.

[4] “సోదరీ” అని జ్ఞానాన్ని సంబోధించు. తెలివితో “నీవు నా బంధువు” అని చెప్పు.

[5] వ్యభిచారిణి దగ్గరికి పోకుండా, ముఖస్తుతి చేసే పరాయి స్త్రీ దగ్గర చేరకుండా అవి నిన్ను కాపాడుతాయి.

[6] నా ఇంటి కిటికీలోనుంచి చూశాను. నా గవాక్షంలోనుంచి తొంగి చూశాను.

[7] జ్ఞానం లేని యువకులలో ఒకడు నాకు కనిపించాడు. ఇతడు తెలివితక్కువవాడు.

[8] అతగాడు వేశ్య ఉన్న సందు దగ్గరే వీధిలో తిరుగాడుతున్నాడు. దాని ఇంటి దగ్గర పచారు చేస్తున్నాడు.

[9] అది సంధ్యా సమయం. సాయంకాలం గతిస్తూ ఉంది. చీకటి పడుతూ ఉంది. రాత్రి అవుతూ ఉంది.

[10] అప్పుడు ఒక స్త్రీ వేశ్యలాగా అలంకరించుకొని కపట బుద్ధితో అతడి దగ్గరికి వచ్చింది.

[11] ఆమె వదరుబోతు, బరితెగింది. ఆమె కాళ్ళు ఇంట్లో నిలవవు.

[12] వీధుల్లో, బజారులో మూలమూలనా ఆమె పొంచుకొని ఉంటుంది.

[13] ఆమె ఆ యువకుణ్ణి పట్టుకొంది. ముద్దు పెట్టుకొంది. సిగ్గూ, బిడియమూ లేని ముఖంతో అతడితో అంది:

[14] “నేను శాంతి బలులు అర్పించవలసివుంది. ఈ వేళే నేను మొక్కుబళ్ళు తీర్చాను.

[15] కనుక నీకు ఎదురు వస్తున్నాను నేను. నీకోసం వెదికాను. నువ్వు కనిపించావు.

[16] మంచంపై రత్నకంబళ్ళు పరచాను. ఈజిప్ట్ నుంచి తెప్పించిన చిత్రవిచిత్రమైన దుప్పట్లు కప్పాను.

[17] పడకమీద బోళం, కుంకం పువ్వు, దాల్చినచెక్క చల్లాను.

[18] తెల్లవారేదాకా వలపుదీర అనుభవిద్దాం. రా! అనురాగంతో తృప్తిగా ఆనందిద్దాం.

[19] మా ఆయన ఇంట్లో లేడు. దూర ప్రయాణం మీద వెళ్ళాడు.

[20] అతడు డబ్బుసంచి పట్టుకువెళ్ళాడు. పౌర్ణమిదాకా అతడు తిరిగి రాడు.”

[21] ఆమె ఇలా చెపుతూ చెపుతూ అతణ్ణి ఒప్పించింది. పొగడ్తలతో అతణ్ణి ఈడ్చుకుపోయింది.

[22] గభాలున అతడు ఆమె వెంట వెళ్ళాడు. పశువు వధశాలకు పోయినట్లు, పరాయివాడి చేతిలో సంకెళ్ళపాలైనట్లు,

[23] తనకు ప్రాణహాని వచ్చిందని తెలుసుకోకుండా ఉరిలోకి పక్షి ఉరికినట్లు అతడి గుండెలోకి బాణం దూసుకుపోయేవరకు అతడు వెళ్ళాడు.

[24] నా కుమారులారా, నా మాటలు చెవిని బెట్టండి. నేను చెప్పేది సావధానంగా వినండి.

[25] వ్యభిచారిణి మార్గం నీ హృదయాన్ని ఆకర్షించనియ్యకు. ఆమె నడిచే త్రోవల్లో అడుగు పెట్టకు.

[26] ఆమె అనేకులను గాయపరచి పడద్రోసింది. ఆమె చంపినవాళ్ళు ఎందరో ఉన్నారు!

[27] ఆమె ఇల్లు పాతాళానికి త్రోవ! అది మృత్యుశాలలకు దారి తీస్తుంది!

సామెతలు — Chapters