Skip to content
Opens in a new window

[1] ఇవి యాకె కొడుకు ఆగూర్ పలికిన మాటలు. ఇది దేవోక్తి. ఆగూర్ ఈతీయేల్‌కు – ఈతీయేల్‌కూ ఉక్కాల్‌కూ – ఈ మాటలు చెప్పాడు:

[2] నిజం చెప్పాలంటే, మనుషులందరిలో నేను మొద్దువాణ్ణి. మనుషులకు ఉండవలసిన తెలివి నాకు లేదు.

[3] నేను జ్ఞానం అభ్యసించినవాణ్ణి కాను. పవిత్రుడైన దేవుని విషయమైన జ్ఞానం నాకింకా లభించలేదు.

[4] పరలోకానికి పోయి క్రిందికి దిగినవారెవరు? తన పిడికిట గాలిని పట్టుకొన్నవారెవరు? తన ఉత్తరీయంలో జలాలు మూట కట్టినవారెవరు? భూమి దిక్కులను నెలకొల్పినదెవరు? ఆయన పేరేమిటి? ఆయన కుమారుని పేరేమిటి? నీకు తెలుసా?

[5] దేవుని మాటలన్నీ పరీక్షకు నిలిచినవి. ఆయన శరణు జొచ్చినవారికి ఆయన డాలులాంటివాడు.

[6] ఆయన మాటలకేమీ కలపకూడదు. అలా చేస్తే ఆయన నీ మీద కోపపడుతాడు. నీవు అబద్ధికుడివని రుజువు చేస్తాడు.

[7] దేవా, నేను నిన్ను రెండు విషయాలు అడిగాను. నేను చావకముందే వాటిని దయ చెయ్యి.

[8] మోసం, అబద్ధాలు నాకు దూరం చెయ్యి. చాలినంత ఆహారం నాకు దయ చెయ్యి. బీదతనం నాకు వద్దు. ఐశ్వర్యమూ నాకు వద్దు.

[9] మరీ సంపాదన ఎక్కువైతే, నేను సంతుష్టి పొంది, నిన్ను విసర్జించి, “అసలు యెహోవా ఎవడు?” అనేటంతవరకూ వస్తానేమో. మరీ దరిద్రుణ్ణయితే, దొంగతనం చేసి దేవుని పేరు దూషణకు గురి చేస్తానేమో.

[10] దాసుడిమీద అతడి యజమానికి అపనింద మాటలు చెప్పవద్దు. అలా చేస్తే అతడు నిన్ను శపించుకుంటాడు. నీమీదికి శిక్ష వస్తుంది.

[11] మనుషులలో తండ్రిని శపించేవాళ్ళూ తల్లిని దీవించనివాళ్ళూ ఉన్నారు.

[12] తమకు తామే శుద్ధులం అనుకొని, తమ కల్మషంనుంచి శుద్ధికానివాళ్ళు కూడా ఉన్నారు.

[13] కండ్లు నెత్తిమీదికి వచ్చినవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ కండ్లు చిన్న చూపు చూస్తాయి.

[14] వాళ్ళ పళ్ళు ఖడ్గంలాంటివి. వాళ్ళ దవడ పళ్ళు కత్తులలాంటివి. వాటితో దరిద్రులను అమాంతంగా మింగివేసి, వారు దేశంలో లేకుండా చేయాలనీ, మనుషులమధ్య బీదలు లేకుండా వారిని నిర్మూలం చేయాలనీ ప్రయత్నిస్తారు.

[15] జలగకు ఇద్దరు కూతుళ్ళున్నారు. ఇద్దరూ “ఇవ్వు! ఇవ్వు!” అని అరుస్తారు. తృప్తి ఎన్నడూ పొందనివి మూడు. “చాలు” అని ఎప్పటికీ చెప్పనివి నాలుగు.

[16] అవేవంటే, మృత్యులోకం, గొడ్డుబోతు గర్భం, నీళ్ళతో నిండని భూమి, “చాలు” అనని మంట.

[17] తండ్రిని హేళన చేసి, తల్లి మాట తిరస్కరించేవాళ్ళ కండ్లను లోయలోని కాకులు పీకుతాయి. గరుడపక్షి పిల్లలు వాటిని తింటాయి.

[18] నా బుద్ధికి మించినవి మూడు, నాకు అర్థం కానివి నాలుగు.

[19] అవి ఏవంటే, ఆకాశంలో గరుడపక్షి జాడ, బండమీద పాము జాడ, నడి సముద్రంలో నడిచే ఓడ జాడ, కన్య విషయంలో పురుషుడి జాడ.

[20] వ్యభిచారిణి విధానం ఇలా ఉంది: అది తిని నోరు తుడుచుకుంటుంది. “నేనేమీ చెడుగు చేయలేదు” అంటుంది.

[21] భూమిని వణికించేవి మూడు, భూమి మొయ్యలేనివి నాలుగు.

[22] అవి ఏవంటే, సింహాసనమెక్కిన బానిస, కడుపు నిండిన మూర్ఖుడు,

[23] పెళ్ళాడి ద్వేషానికి గురి అయిన స్త్రీ, యజమానురాలి హక్కును కాజేసిన దాసి.

[24] భూమిమీద ఈ నాలుగు ప్రాణులు చిన్నవైనా చాలా తెలివైనవి.

[25] చీమలు బలంగల ప్రాణులు కావు. అయినా అవి ఎండ కాలంలో తమ ఆహారాన్ని కూడబెట్టుకొంటాయి.

[26] చిన్న కుందేళ్ళు కూడా బలం గల ప్రాణులు కావు. కాని, అవి బండల సందుల్లో నివాసం ఏర్పరచుకుంటాయి.

[27] మిడతలకు రాజు ఉండడు. అయినా అవన్నీ బారులు తీరి సాగిపోతాయి.

[28] బల్లిని చేతితో పట్టుకోవచ్చు గాని, అది రాజగృహంలో ఉంటుంది.

[29] గంబీరంగా నడిచేవి మూడున్నాయి. ఠీవిగా నడిచేవి నాలుగు.

[30] అవి ఏవంటే, మృగాలన్నిటిలో పరాక్రమం కలిగి, దేనికీ వెన్ను చూపని సింహం.

[31] యుద్ధాశ్వం, మేకపోతు, తన సైన్యానికి ముందుగా నడిచే రాజు.

[32] నీవు మూర్ఖంగా ప్రవర్తించి, గర్వపడి ఉంటే, దురాలోచన చేసి ఉంటే, చేతితో నోరు మూసుకో.

[33] పాలు చిలికితే వెన్న వస్తుంది. ముక్కు పిండితే నెత్తురు వస్తుంది. కోపం రేపితే జగడం వస్తుంది.

సామెతలు — Chapters