[1] మూర్ఖంగా మాట్లాడే మూఢుడికంటే నిజాయితీతో ప్రవర్తించే దరిద్రుడే మేలు.
[2] తెలివిమాలి ఉండడం మంచిది కాదు. తొందరపాటులో మనిషి పాదాలు తప్పుదారి పడతాయి.
[3] మనిషి మూర్ఖత్వం అతడి నడతను తారుమారు చేస్తుంది. అప్పుడతడి హృదయం యెహోవాకు వ్యతిరేకంగా రెచ్చిపోతుంది.
[4] ధనంమూలంగా స్నేహితులు ఎక్కువవుతారు. దరిద్రంలో పడ్డవారికి స్నేహితులు దూరమవుతారు.
[5] అబద్ధ సాక్షికి శిక్ష రాకమానదు. కల్లలు చెప్పేవారు తప్పించుకోలేరు.
[6] చాలామంది ఘనబుద్ధి గలవారినుంచి దయను అభ్యర్థిస్తారు. ఇచ్చేవాడికి అంతా స్నేహితులే!
[7] అక్కరలో ఉన్నవారిని చుట్టాలంతా ద్వేషిస్తారు. అలాంటి వారికి స్నేహితులు కూడా దూరమవుతారు. వాళ్ళను మాటలతో వెంటాడాలని చూస్తారు గాని, ప్రయోజనం శూన్యం.
[8] తమ ప్రాణాన్ని ప్రేమతో చూచుకొనేవారు జ్ఞానం సంపాదించుకొంటారు. వివేకాన్ని పాటించేవారికి మేలు కలుగుతుంది.
[9] అబద్ధసాక్షికి శిక్ష రాకమానదు. కల్లలు చెప్పేవారు నాశనం అవుతారు.
[10] మూర్ఖులు విశేష భోగం అనుభవించడం తగని విషయం. దాసుడు నాయకులమీద పెత్తనం చేయడం మరీ అనుచితం.
[11] మనిషి వివేకం అతడికి సహనం చేకూరుస్తుంది. అపరాధాలు క్షమించడం అతడి ఘనత.
[12] రాజు ఆగ్రహం సింహ గర్జనలాంటిది. అతడి దయ గడ్డిమీద కురిసే మంచులాంటిది.
[13] తెలివిమాలిన కొడుకు తండ్రికి నాశనం తెచ్చిపెడతాడు. జగడగొండి అయిన భార్య ఎడతెరిపి లేకుండా పడే నీటి బిందువుల్లాంటిది.
[14] ఇల్లు, సంపద పిత్రార్జితం. వివేకవతి అయిన భార్య దేవుడు ఇచ్చినది.
[15] సోమరితనం గాఢ నిద్రామత్తులను చేస్తుంది. పని చేయనివారికి చాలినంత ఆహారం దొరకదు.
[16] ఆజ్ఞను శిరసావహించేవాడు తన ప్రాణాన్ని కాపాడుకొంటున్నాడన్నమాట. తన ప్రవర్తనలో అజాగ్రత్తచేత మనిషి చస్తాడు.
[17] బీదలకు దయ చూపేవాడు యెహోవాకు బాకీ ఇచ్చాడన్నమాట. అతడి ఉపకారానికి యెహోవా ప్రతిఫలం ఇస్తాడు.
[18] ఆశాభావం గతించకముందే నీ కొడుకును క్రమశిక్షణలో పెట్టు. కొడుకు మరణాన్ని కోరవద్దు.
[19] అతికోపి శిక్షను భరించవలసిందే. అతణ్ణి తప్పించినా, మళ్ళీ అలాంటిదే చేస్తూ ఉంటాడు.
[20] సలహా విను. క్రమశిక్షణ పాటించు. నీ జీవితంలో మిగిలిన కాలం జ్ఞానివి అవుతావు.
[21] మనిషి హృదయంలో అనేక ఆలోచనలు రూపొందుతాయి. కాని, యెహోవా ఉద్దేశం నెరవేరుతుంది.
[22] మనిషిలో దయ అనేది ఆకర్షణీయం. అబద్ధాలు చెప్పడం కంటే అక్కరలో ఉండడమే మంచిది.
[23] యెహోవామీది భయభక్తులు జీవానికి దారి. భయభక్తులున్న వారికి తృప్తి కలుగుతుంది. వారిమీదికి కీడు రాదు.
[24] సోమరివాడు కంచంలో చెయ్యి పెడతాడు. కాని, చెయ్యి నోటిదాకా ఎత్తడానికి బద్ధకం!
[25] హేళన చేసేవాళ్ళకు శిక్ష గనుక వస్తే అమాయకులు చూచి, తెలివి తెచ్చుకుంటారు. వివేకులను మందలిస్తే వాళ్ళకు జ్ఞానాభివృద్ధి.
[26] తండ్రిని దౌర్జన్యం చేసి, తల్లిని వెళ్ళగొట్టేవాడు అవమానం, అపకీర్తి కలిగించే కొడుకు.
[27] నా కుమారా! నీవు ఉపదేశం వినడం మానుకొంటే, జ్ఞాన వాక్కులనుంచి వైదొలగిపోయినవాడివి అవుతావు.
[28] పనికిమాలిన సాక్షి న్యాయాన్ని వేళాకోళం చేస్తాడు. దుర్మార్గుల నోరు చెడుగును మ్రింగివేస్తుంది.
[29] హేళన చేసేవాళ్ళకు తీర్పులు, మూర్ఖుల వీపుకు దెబ్బలు.