Skip to content
Opens in a new window

[1] పాలకుడితో భోజనానికి కూర్చున్నప్పుడు నీవు ఎవరి ఎదుట ఉన్నావో బాగా ఆలోచించుకో.

[2] నీవు తిండిపోతువైతే, నీ గొంతుమీద కత్తి పెట్టుకో.

[3] పాలకుడు పెట్టే రుచిగల భోజనంకోసం ఆశపడకు. అది నిన్ను మోసపుచ్చుతుంది.

[4] ధనవంతుడివి కావడానికి కష్టించకు. అలాంటి తలంపే రాకుండా జాగ్రత్తపడు.

[5] ధనంమీద చూపు నిలిపీ నిలపడంతోనే అది మాయమైపోతుంది. దానికి రెక్కలు మొలిచి అది కాస్తా ఎగిరిపోవడం ఖాయం. గరుడపక్షిలాగా గగన వీధికి ఎగిరిపోతుంది.

[6] ఎదుటివాడి అభివృధ్ధిని చూచి, కుళ్ళుకొనే పిసినారి మనిషితో పాటు భోజనం చెయ్యబోకు. వాడు పెట్టే రుచిగల భోజన పదార్థాలను ఆశించకు.

[7] అలాంటివాడు తనలో తానే లెక్కలు గణించుకుంటాడు. పైకి “తిను, త్రాగు” అంటాడు. అంతే! అవి లోపలనుంచి వచ్చిన మాటలు కావు.

[8] నీవు కొంచెం తిన్నా, దాన్ని కక్కుతావు. నీవు చెప్పే మధురమైన మాటలు వృథా!

[9] మూర్ఖులకు నీ మాటలు వినిపించకు. వాటిలోని జ్ఞానాన్ని వారు త్రోసిపుచ్చుతారు.

[10] పూర్వకాలంలో నాటిన సరిహద్దు రాయి తొలగించకు. తండ్రిలేని వారి పొలంలోకి చొరబడవద్దు.

[11] వారి విమోచకుడు బలవంతుడు. నీకు విరోధంగా ఆయన వారి పక్షాన వాదిస్తాడు.

[12] ఉపదేశం మీద మనసు పెట్టు. తెలివైన మాటలు చెవిని బెట్టు.

[13] నీ పిల్లలను శిక్షించకుండా ఉండబోకు. బెత్తం ప్రయోగిస్తే అది వారిని చంపదు.

[14] బెత్తంతో వారిని శిక్షిస్తే మృత్యులోకంలోకి పోకుండా వారిని తప్పించినవాడివవుతావు.

[15] నా కుమారా! నీవు జ్ఞానాన్ని మనసుకు పట్టించుకొంటే, నా మనసుకూ సంతోషం కలుగుతుంది.

[16] నీ పెదవులు యథార్థం ఉచ్చరిస్తే, నా అంతరంగం ఆనందిస్తుంది.

[17] పాపిష్టి మనుషులను చూచి హృదయంలో అసూయ చెందకు. ఎప్పుడూ యెహోవాపట్ల భయభక్తులతో మసులుకో.

[18] అప్పుడు నీకు భవిష్యత్తు తప్పక ఉంటుంది. నీకేమీ ఆశాభంగం కలగదు.

[19] నా కుమారా, నీవు విని జ్ఞానం తెచ్చుకో. హృదయపూర్వకంగా యథార్థమైన మార్గంలో సాగిపో.

[20] తాగుబోతులతో, అతిగా మాంసం మెక్కేవాళ్ళతో స్నేహం చెయ్యకు.

[21] త్రాగుబోతులూ, తిండిబోతులూ దరిద్రులు అవుతారు. నిద్రామత్తు చింపిరి గుడ్డలు వేసుకొనే స్థితికి దిగజారుస్తుంది.

[22] నీ కన్నతండ్రి ఉపదేశం చెవిని బెట్టు. నీ తల్లి వృద్ధాప్యంలో ఆమెను నిర్లక్ష్యం చెయ్యకు.

[23] సత్యాన్ని సంపాదించుకో, దాన్ని అమ్మివేయకు. జ్ఞానం, తర్బీతు, వివేకం సంపాదించుకో.

[24] న్యాయవంతుని తండ్రికి ఎంతో సంతోషం కలుగుతుంది. జ్ఞానం గల కొడుకును కన్నవాడికి పుత్రోత్సాహం కలుగుతుంది.

[25] నిన్నుబట్టి నీ తల్లిదండ్రులు సంతోషించాలి. నిన్ను కన్నతల్లికి ఆనందం చేకూరాలి.

[26] నా కుమారా, నీ హృదయాన్ని నాకు ఇచ్చివెయ్యి! నా విధానాలు నీ కన్నులకు ఆకర్షణీయంగా కనబడాలి.

[27] వేశ్య లోతైన గుంటలాంటిది. వ్యభిచారిణి ఇరుకు గుండంలాంటిది.

[28] ఆమె దోపిడీదొంగలాగా పొంచి ఉంటుంది. చాలామందిని ఆమె ద్రోహులను చేస్తుంది.

[29] ఎవరు విలపించవలసివస్తుంది? ఎవరు దురవస్థలో పడతారు? ఎవరికి జగడాలు? ఎవరికి విచారం? ఊరికే ఎవరికి గాయాలు తగులుతాయి? ఎవరికి మందదృష్టి?

[30] చాలా రాత్రి గడిచేవరకు ద్రాక్షమద్యం త్రాగుతూ ఉండేవాళ్ళకే అవన్నీ, మిశ్రమ ద్రాక్షమద్యం రుచి చూడడానికి వెళ్ళేవారికే.

[31] ద్రాక్షమద్యం ఎర్రగా ఉండి, గిన్నెలో తళతళ మెరుస్తుందనీ, త్రాగడానికి రుచిగా ఉంటుందనీ దానివైపు చూడవద్దు.

[32] త్రాగిన తరువాత అది పాములాగా కరుస్తుంది. కట్లపామై నిన్ను కాటు వేస్తుంది.

[33] అప్పుడు నీ కండ్లకు విపరీతమైనవి కనిపిస్తాయి. నీవు పిచ్చిగా మాట్లాడుతావు.

[34] నడి సముద్రంలో పడుకొన్నవాడి స్థితే అవుతుంది నీ పని. ఓడ కొయ్య అంచున పడుకొన్న వాడిలాగా ఉంటావు.

[35] నీకిలా అనిపిస్తుంది: “నన్ను కొట్టారు, గదా! అయితే నాకు నొప్పి కలగలేదు. నా మీద దెబ్బలు పడ్డాయేమో – నాకు తెలియదు. నేను నిద్రమేల్కొనేదెప్పుడు? ఇంకా తాగడానికి పోతా!”

సామెతలు — Chapters