Skip to content
Opens in a new window

[1] ఇవి లెమూయేల్‌రాజు రాసిన మాటలు, అతడికి అతడి తల్లి నేర్పిన దేవోక్తి.

[2] నా కుమారా, నేనేం చెప్పను? నా కన్న కుమారా, నా వ్రత ఫలమైన కుమారా, నేనేమనేది?

[3] నీ బలాన్ని స్త్రీల పాలు చెయ్యకు. రాజులను నాశనం చేసే స్త్రీలతో స్నేహం చెయ్యకు.

[4] ద్రాక్ష మద్యం త్రాగే అలవాటు రాజులకు తగదు. లెమూయేలూ, అది రాజులకు తగనే తగదు. మద్యపానంకోసం ఆశించడం అధికారులకు తగదు.

[5] త్రాగితే వారు న్యాయమైన చట్టాలను మరచిపోతారు. దీనదశలో ఉన్నవారందరికీ అన్యాయం చేస్తారు.

[6] ప్రాణం పోయేవారికి మద్యం త్రాగించు. దుఃఖంలో మునిగినవారికి ద్రాక్షరసం ఇవ్వు.

[7] అలాంటివాళ్ళు త్రాగి తమ దరిద్రాన్ని మరచిపో గలుగుతారు. తమ కష్టాలు జ్ఞాపకం చేసుకోకుండా ఉండగలుగుతారు.

[8] నోట్లో నాలుక లేనివాళ్ళ పక్షాన, దిక్కుమాలిన వారి పక్షాన నీవే మాట్లాడు.

[9] నీ నోరు తెరువు. న్యాయసమ్మతంగా తీర్పు చెప్పు – దీనదశలో ఉన్నవారికి, అక్కరలో ఉన్నవారికి న్యాయం చేకూరేలా చూడు.

[10] సుగుణం, సామర్థ్యం గల భార్య దొరకడం అరుదు. అలాంటి భార్య రత్నాలకంటే అమూల్యం.

[11] ఆమె భర్త ఆమెను నమ్ముతాడు. అతని లాభం ఎప్పుడూ తరగదు.

[12] ఆమె బ్రతికినన్నాళ్ళూ అతడికి చేకూర్చేది మేలే గాని, కీడు కాదు.

[13] ఆమె మంచి ఉన్నినీ నారనూ ఎన్నుకొని చేతులతో కష్టించి పని చేస్తుంది.

[14] వర్తకం చేసే ఓడలలాగా ఆమె దూరంనుంచి ఆహార పదార్థాలను సేకరించి తెస్తుంది.

[15] ఇంకా చీకటిగా ఉన్నప్పుడే ఆమె లేస్తుంది. తన ఇంటివారికి భోజనం సిద్ధం చేస్తుంది. తన పని మనుషులకు బత్తెం కొలిచి ఇస్తుంది.

[16] ఆమె పొలం చూచి బాగా ఆలోచించుకొంటుంది. డబ్బు వెనక వేసి ద్రాక్షతోట నాటిస్తుంది.

[17] ఆమె నడుం కట్టి బలంగా పని చేస్తుంది. తన పనికి తన చేతులు బలమైనవి.

[18] ఆమె స్వానుభవంతో లాభసాటి బేరం చేస్తుంది. రాత్రిపూట ఆమె దీపం ఆరిపోదు.

[19] ఆమె పంటెకోల చేతపట్టుకుంటుంది. తన వేళ్ళతో కదురు పట్టుకొని వడుకుతుంది.

[20] బీదవాళ్ళకు చెయ్యి చాచి ధర్మం చేస్తుంది. అక్కరపడ్డ వారికి కూడా చేయి చాచి ఇస్తుంది.

[21] చలికాలంలో ఇంట్లో వారికి చలివేస్తుందేమో అని ఆమెకేమీ భయం లేదు: వారంతా ఎర్రరంగు బట్టలు వేసుకుంటారు.

[22] ఆమె పడకలకోసం రత్నకంబళ్ళు తయారు చేస్తుంది. ఆమె ఊదారంగు గల శ్రేష్ఠమైన సన్న బట్టలు తొడుక్కుంటుంది.

[23] ఆమె భర్త ప్రాంతీయ పెద్దలతోపాటు గుమ్మందగ్గర కూర్చుంటాడు. అక్కడ అతడికి మంచి పేరు వస్తుంది.

[24] ఆమె నూలు వస్త్రాలు నేయించి అమ్ముతుంది. వర్తకులకు నడికట్లు కూడా అమ్ముతుంది.

[25] బలమూ గౌరవమూ వస్త్రాలుగా ధరిస్తుంది. ఆమె భవిష్యత్తు విషయం ధైర్యంగా ఉంటుంది.

[26] ఆమె నోట జ్ఞానం ఉట్టిపడుతుంది. ఆమె ఇచ్చే ఉపదేశం దయగలది.

[27] ఆమె తన ఇంటి వ్యవహారాలు బాగా చూచుకుంటుంది. ఆమె బద్ధకంగా ఉండదు. పని చేసి భోజనం చేస్తుంది.

[28] ఆమె సంతానం నిలబడి ఆమెను “ధన్య” అంటారు. ఆమె భర్త కూడా ఆమెను ఇలా మెచ్చుకుంటాడు:

[29] “చాలామంది ఆడవాళ్ళు సుగుణం, సామర్థ్యం ప్రదర్శిస్తారు. గాని, నువ్వు వాళ్ళందరినీ మించినదానివి.”

[30] అందం మోసకరం. సౌందర్యం వ్యర్థం. యెహోవా అంటే భయభక్తులున్న స్త్రీ స్తుతులు అందుకొంటుంది.

[31] ఆమె చేసిన క్రియలకు తగిన ప్రతిఫలం ఇవ్వు. ఆమె చేసిన క్రియలను ఊరి గుమ్మం దగ్గర పొగడుతారు గాక!

సామెతలు — Chapters