Skip to content
Opens in a new window

[1] ఇవి కూడా సొలొమోను సామెతలు. యూదా రాజు హిజ్కియాకు చెందిన మనుషులు వీటిని ఎత్తి రాశారు.

[2] సంగతి దాచిపెట్టడం దేవునికి ఘనత. సంగతి పరిశోధించడం రాజులకు ఘనత.

[3] ఆకాశం ఎంతో ఎత్తయినది. భూమి ఎంతో లోతు. రాజుల హృదయాన్ని పరిశోధించడం అసాధ్యం.

[4] వెండిలోని కల్మషం తీసివేసి వెండిపని చేసేవాడు ఓ పాత్ర తయారు చేస్తాడు.

[5] రాజు దగ్గరనుంచి దుర్మార్గులను తొలగించివేస్తే, అతడి సింహాసనం న్యాయంవల్ల సుస్థిరం అవుతుంది.

[6] రాజు సమక్షంలో నిన్ను నీవే హెచ్చించుకోకు. గొప్పవారున్న చోటికి వెళ్ళి నిలవకు.

[7] నీవు చూచిన ప్రధాని ఎదుట వారు నిన్ను చిన్నబుచ్చడంకంటే ఆ ప్రధాని “ఇక్కడికి రా” అని నీతో చెప్పడం మంచిది గదా.

[8] తొందరపడి పొరుగువాడితో వ్యాజ్యెమాడడానికి వెళ్ళకు. చివరికి అతడి మూలంగా నీకు తలవంపులు కలిగితే నీవు ఇంకేం చేస్తావు?

[9] పొరుగువాడితో వివాదం పెట్టుకొంటే పెట్టుకొన్నావు, గాని మరొకడి గుట్టు బయట పెట్టబోకు.

[10] బయట పెట్టావూ అంటే అది విన్నవాడు నిన్ను అవమానించవచ్చు. వచ్చిన చెడ్డ పేరు మళ్ళీ పోదు.

[11] సమయానికి తగినట్టు పలికిన మాటలు వెండి పళ్ళెంలో పెట్టిన బంగారు ఆపిలుపండ్లలాంటివి.

[12] జ్ఞానంతో మందలించేవాడు వినేవాడి చెవికి బంగారు కుండలాంటివాడు, బంగారు హారంలాంటివాడు.

[13] కోతకాలం మంచు ఎంత చల్లగా ఉంటుందో నమ్మకమైన దూత తనను పంపినవాడికి అంత చల్లన. యజమాని ప్రాణాన్ని అతడు సేద తీర్చినవాడవుతాడు.

[14] కానుకలు ఇవ్వకుండా, ఇచ్చినట్టు గొప్పలు చెప్పుకొనేవారు మబ్బు పట్టి, గాలి వీచి, వర్షం రాని వాతావరణం లాంటివారు.

[15] సహనంతో పాలకుణ్ణి ఒప్పించవచ్చు. సాత్వికమైన మాట ఎముకలు విరుస్తుంది.

[16] తేనె దొరికితే తృప్తిగా తాగు. గాని, అతిగా తాగావూ అంటే వాంతి చేసుకుంటావు.

[17] పొరుగువాడి ఇంటిలో తరచుగా అడుగు పెట్టబోకు. అతడు నీవంటే మొహం మొత్తి, నిన్ను ద్వేషిస్తాడేమో!

[18] తన పొరుగువాడి మీద తప్పుడు సాక్ష్యం పలికేవాడు దుడ్డుకర్ర, ఖడ్గం, పదునైన బాణంలాంటివాడు.

[19] కష్టకాలంలో ద్రోహిని నమ్ముకోవడం కదులుతున్న పంటిని, బెణికిన పాదాన్ని నమ్మడం లాంటిదే.

[20] శోకంతో క్రుంగిపోయినవాడికి పాటలు పాడేవాడు చలికాలంలో పైవస్త్రం తీసివేసేవాడితో సమానం. సురేకారం మీద పులిసిన ద్రాక్షరసం పోసేవాడితో సమానం.

[21] నీ శత్రువుకు ఆకలి వేస్తే, భోజనం పెట్టు. దాహం వేస్తే నీళ్ళియ్యి.

[22] అలా చేస్తే అతడి తలపైన నిప్పుకణికెలు పోసినట్టుంటుంది. నీవు చేసిన దానికి యెహోవా ప్రతిఫలం ఇస్తాడు.

[23] ఉత్తరం గాలి వర్షం తెస్తుంది. చాడీ చెప్పే నాలుక కోపం రప్పిస్తుంది.

[24] గయ్యాళి పెళ్ళాంతో భవనంలో ఉండడం కంటే మిద్దెమీద ఏదో ఒక మూల పడి ఉండడం మేలు.

[25] దప్పిగొన్నవాడికి చల్లని నీళ్ళు ఎలాంటివో దూర దేశం నుంచి వచ్చిన శుభవార్త అలాంటిది.

[26] దుర్మార్గుడికి లొంగిపోయిన న్యాయవంతుని అడుగు బురద లేచిన నీటి ఊట లాంటివాడు, పాడైపోయిన బావిలాంటివాడు.

[27] అతిగా తేనె త్రాగడం మంచిది కాదు. సొంత గౌరవాన్ని పరిశోధించడం గౌరవనీయం కాదు.

[28] మనసును అదుపులో పెట్టుకోలేనివారు గోడలు కూలిపోయి, పాడైపోయిన పట్టణంలాగా ఉంటారు.

సామెతలు — Chapters