[1] హృదయంలోని ఉద్దేశాలు మనిషికి చెందినవే. నాలుకనుంచి వెలువడే జవాబు యెహోవా నుంచి వస్తుంది.
[2] మనిషి ప్రవర్తన అంతా అతడి దృష్టికి శుద్ధంగా కనిపిస్తుంది. యెహోవా మనసులను పరిశీలిస్తాడు.
[3] యెహోవాకు నీ కార్యకలాపాలన్నీ అప్పగించివెయ్యి. అప్పుడు నీ ఉద్దేశాలు సఫలం అవుతాయి.
[4] యెహోవా ప్రతిదాన్నీ ఏదో ఉద్దేశంతో సృజించాడు. దుర్మార్గులను నాశనం జరిగే రోజుకోసం నియమిస్తాడు.
[5] అహంభావులందరినీ యెహోవా అసహ్యించుకొంటాడు. అలాంటివాళ్ళకు దండన ఏ మాత్రమూ తప్పదు.
[6] కరుణా సత్యమూ ఏకమై, అపరాధాన్ని కప్పివేస్తాయి. యెహోవాపట్ల భయభక్తులవల్ల మనిషి దుర్మార్గం నుంచి వైదొలగుతాడు.
[7] మనిషి ప్రవర్తన యెహోవాకు ప్రీతిపాత్రమైతే అతడి శత్రువులు కూడా అతడితో సఖ్యపడేలా ఆయన చేస్తాడు.
[8] అన్యాయంగా సంపాదించినది ఎంత ఉన్నా, దానికంటే న్యాయ ప్రవర్తనతో కూడిన కొంచెమే మేలు.
[9] మనిషి తన విధానాలను మనసులో ఆలోచించు కుంటాడు. యెహోవా అతడి మార్గాన్ని రూపొందిస్తాడు.
[10] రాజు పెదవుల నుంచి దైవిక తీర్మానం వెలువడుతుంది. అతడి నోటి మాట తీర్పు చెప్పేటప్పుడు న్యాయం తప్పకూడదు.
[11] న్యాయసమ్మతమైన త్రాసు, తూనికరాళ్ళు యెహోవా చేసిన ఏర్పాట్లు, సంచిలో ఉన్న తూనిక గుండ్లన్నీ ఆయన రూపొందించినవే.
[12] రాజులు చెడుగు చేయడం చెడ్డ అసహ్యం. న్యాయం మూలంగా సింహాసనం సుస్థిరం అవుతుంది.
[13] నిజాయితీతో మాట్లాడే పెదవులు రాజులకు ప్రీతిపాత్రమైనవి. యథార్థంగా పలికేవారు ప్రేమపాత్రులు.
[14] రాజు ఆగ్రహం మరణదూత లాంటిది. జ్ఞాని ఆ కోపాగ్నిని శాంతపరుస్తాడు.
[15] రాజు ముఖకాంతిలో జీవం ఉంది. రాజు దయ వసంతకాల వర్షం లాంటిది.
[16] బంగారాన్ని సంపాదించే కంటే జ్ఞానాన్ని సంపాదించడం ఎంతో మంచిది. తెలివిని ఆర్జించుకోవడం వెండి సంపాదనకంటే ఎంతో శ్రేష్ఠం.
[17] నిజాయితీపరులకు చెడుగును తొలగి నడవడం రాజమార్గంలాంటిది. తన దారిని కనిపెట్టి నడిచేవాడు తన ప్రాణం దక్కించుకుంటాడు.
[18] గర్వం ముందుంటే, దాని వెనకాలే నాశనం నడుస్తుంది. అహంభావం వెంట పతనం వస్తుంది.
[19] గర్విష్ఠులతో కొల్లగొట్టిన ధనం పంచుకోవడం కంటే దీనావస్థలో ఉన్నవారితో వినయశీలిగా ఉండిపోవడం మేలు.
[20] ఉపదేశం సావధానంగా వినేవారికి మేలు ప్రాప్తిస్తుంది. యెహోవాను నమ్ముకొనేవారు ధన్యులు.
[21] హృదయంలో జ్ఞానం ఉన్నవారు వివేకి అని పేరు పొందుతారు. మధుర వాక్కులు విద్యాభివృద్ధికి దోహదం.
[22] తెలివి ఉన్న వారికి వారి తెలివి జీవం యొక్క ఊటలాంటిది. మూఢుల క్రమశిక్షణ మూఢత్వమే.
[23] జ్ఞాని హృదయం అతడి నోటికి బోధిస్తుంది, పెదవులకు విద్యాబుద్ధులు వృద్ధిచేస్తుంది.
[24] కమ్మని మాటలు తేనె తెట్టెలాంటివి. అవి ప్రాణానికి మాధుర్యం, ఎముకలకు ఆరోగ్యకరం.
[25] మనిషి దృష్టికి సరైనదిగా కనబడే మార్గం ఉంది. కాని, దాని గమ్యం మరణమే.
[26] పాటుపడేవారి ఆకలి వారి పక్షాన పని చేస్తుంది. నోరు తినమంటుంది.
[27] వట్టిపోకిరీ దురాలోచన చేస్తాడు. అతడి పెదవులమీద కారు చిచ్చు.
[28] మూర్ఖులు కలహం రేపుతారు. చాడీ చెప్పేవారు సన్నిహిత స్నేహితులను విడదీస్తారు.
[29] దౌర్జన్యపరుడు పొరుగువాణ్ణి ఆకర్షించి, అతణ్ణి పెడ దారి పట్టిస్తాడు.
[30] పెదవులు బిగబట్టి, కండ్లు మూస్తూ తెరుస్తూ ఉండేవారు యుక్తులు చేస్తున్నారు, చెడుగు జరిగిస్తారు.
[31] నెరసిన వెండ్రుకలు తలకు అందమైన కిరీటంలాంటివి. అవి న్యాయ పథంలో నడిచేవారికి కలుగుతాయి.
[32] త్వరగా కోపగించుకోనివాడు బలాఢ్యుడికంటే శ్రేష్ఠుడు. పట్టణాన్ని వశం చేసుకొనేవాడికంటే, మనసును అదుపులో ఉంచుకొనేవాడు శ్రేష్ఠుడు.
[33] ఒడిలో చీట్లు వేస్తారు. వాటిమూలంగా కలిగే నిర్ణయం యెహోవా వశం.