Skip to content
Opens in a new window

[1] నా కుమారా, నా జ్ఞానవాక్కులు విను. నా తెలివి గల ఉపదేశం చెవిని బెట్టు.

[2] అప్పుడు నీవు బుద్ధిమంతుడివి అవుతావు. నీ పెదవులు తెలివిగా మాట్లాడుతాయి.

[3] వ్యభిచారిణి పెదవులు తేనె ఒలికిస్తాయి. దాని నోట నూనెకంటే ఎక్కువ మెత్తని మాటలు వెలువడుతాయి.

[4] తీరా, విషాముష్ఠి పండంత చేదు ఆమెమూలంగా వస్తుంది. ఆమె కత్తిలాంటిది. రెండు వైపులా పదును!

[5] ఆమె పాదాలు మృత్యువుకు పోతాయి. ఆమె అడుగులు పాతాళానికి దారి తీస్తాయి.

[6] జీవ మార్గాన్ని గురించి వ్యభిచారిణి ఆలోచించదు. దాని కాళ్ళు అటూ ఇటూ తిరుగాడుతాయి. అవి ఎటు పోయేదీ దానికే తెలియదు.

[7] నా కుమారులారా, నేను చెప్పేది వినండి. నా నోటి మాటలు జవదాటకండి.

[8] వ్యభిచారిణి దగ్గర నుంచి దూరంగా నీ జీవిత మార్గం ఏర్పరచుకో. ఆమె కొంప వాకిలి దగ్గరికి కూడా వెళ్ళకు.

[9] ఒకవేళ వెళ్ళావు అంటే, నీ గౌరవం పరుల పాలవుతుంది. నీ జీవితకాలం క్రూరులు వశం అవుతుంది.

[10] పరాయివాళ్ళు నీ ఆస్తిపాస్తులను కడుపార తినివేస్తారు. నీ కష్టార్జితం ఇతరుల పంచ చేరుతుంది.

[11] నీ శరీరం, నీ మాంసం హరించుకుపోయినప్పుడు నీ చరమ దశలో ఇలా అఘోరిస్తావు:

[12] “అయ్యో! ఉపదేశాన్ని ఎందుకిలా త్రోసిపుచ్చాను? నా హృదయం దిద్దుబాటును ఎందుకిలా ఏవగించుకున్నట్టు?

[13] “నా గురువుల మాటలు వినిపించుకొన్నాను కాను. నా ఉపదేశకులు చెప్పేది పెడచెవిని బెట్టాను.

[14] “సంఘంలో, సమాజం మధ్య నేను దాదాపుగా అన్ని కీడుల పాలయ్యాను.”

[15] నీ సొంత తొట్టిలోని నీళ్ళు త్రాగు. నీ బావిలో ఊరే జలం పానం చెయ్యి.

[16] నీ నీటి ఊటలు బయట చెదురుమదురుగా పారవచ్చా? వీధుల్లో అవి కాలువలై పారవచ్చా?

[17] ఇతరులు నీతోపాటు వాటిని అనుభవించకూడదు. అవి నీ వినియోగానికే ఉండాలి.

[18] నీ జలాశయం మీద ఆశీస్సులు ఉంటాయి గాక! యువదశలో వివాహమాడిన నీ భార్యతో సంతోషించు.

[19] ఆమె నీకు సుందరమైన లేడివంటిది. అందమైన దుప్పిలాంటిది. ఆమె రొమ్ము ఎప్పటికీ నీకు తృప్తి కలిగిస్తుంది గాక! ఆమె ప్రేమలో ఎల్లప్పుడూ పరవశిస్తావు గాక!

[20] నా కుమారా, నీవు ఎందుకు వ్యభిచారిణి వశం అవుతావు? పరాయి ఆడదాని రొమ్ము ఎందుకు కౌగలించుకుంటావు?

[21] మనిషి పోకడలు యెహోవాకు తేటతెల్లమే. మనిషి ప్రవర్తన అంతా ఆయన తూచినట్లు అంచనా వేస్తాడు.

[22] దుర్మార్గుడు తన అపరాధాల వలలో తానే చిక్కుకుంటాడు. అతడి పాపపాశాలు అతణ్ణే బంధిస్తాయి.

[23] క్రమశిక్షణ లేకపోవడం చేత అతడు నశిస్తాడు. బరితెగి మూర్ఖుడై దారి తప్పిపోతాడు.

సామెతలు — Chapters