[1] ఇతరులనుంచి దూరమైనవారు స్వప్రయోజనం వెదికేవారు. సరైన జ్ఞానం అంటే వారికి గిట్టదు.
[2] మూర్ఖులకు వివేకంలో సంతోషం ఉండదు. తమ ఉద్దేశాలను వెలిపుచ్చడం వారికి సరదా.
[3] దుర్మార్గులు వస్తే, వారితోపాటు తిరస్కారం ఉంటుంది. అలాగే అవమానంతోపాటు నింద వస్తుంది.
[4] మనిషి నోటి మాటలు లోతైన నీళ్ళలాంటివి. జ్ఞానం యొక్క ఊట పారే నదిలాంటిది.
[5] చెడ్డవాళ్ళ పట్ల పక్షపాతం చూపడం, నిర్దోషులకు అన్యాయంగా తీర్పు తీర్చడం మంచిది కాదు.
[6] మూర్ఖుల పెదవులు జగడానికి సిద్ధం. తాము దెబ్బలకు గురి కావాలని అడిగినట్టుంటారు.
[7] మూర్ఖుల నోరు వాళ్ళ నాశనానికే! వాళ్ళ పెదవులు వాళ్ళ ప్రాణానికి ఉరి.
[8] చాడీ చెప్పేవారి మాటలు రుచిగల కబళాలలాంటివి. అవి మనిషి అంతరంగంలోకి దిగిపోతాయి.
[9] తన పనిలో బద్దకంగా ఉండేవాడు నాశనగొట్టు మనిషికి సోదరుడు.
[10] యెహోవా పేరు బలమైన కోట. న్యాయవంతులు అందులోకి పరిగెత్తి క్షేమంగా ఉంటారు.
[11] ధనికుడి సంపద అతడికి బలమైన పట్టణంలాంటిది. అది తనకు ఎత్తయిన ప్రాకారం అనుకొంటాడు.
[12] విపత్తు ప్రాప్తించేముందు మనిషి హృదయం మిడిసిపడుతుంది. వినయం గౌరవానికి దారి.
[13] అసలు సంగతి వినకుండా జవాబు చెప్పేవారు తమ తెలివితక్కువతనం తామే బయటపెట్టుకుంటారు. వారు సిగ్గుపడవలసి వస్తుంది.
[14] మనిషికి జబ్బు చేస్తే తన హృదయం సహిస్తుంది గాని, గాయపడిన హృదయాన్ని ఎవరు ఓర్చుకోగలరు?
[15] జ్ఞానుల చెవి జ్ఞానాన్ని అన్వేషిస్తుంది. వివేకవంతమైన మనసుకు జ్ఞానం లభిస్తుంది.
[16] కానుకలు ఇచ్చేవారికి అవకాశాలు ఎక్కువ. కానుక గొప్పవారి ఎదుటికి వెళ్ళేట్టు చేస్తుంది.
[17] ప్రతివాది వచ్చి ప్రశ్నలు అడిగేముందు వ్యాజ్యెం చేసేవాడికి అనుకూలంగా కనిపిస్తుంది.
[18] చీట్లు వేస్తే జగడం చల్లారిపోతుంది, బలాఢ్యుల మధ్య వివాదం పరిష్కారం అవుతుంది.
[19] అక్రమానికి గురి అయి నొచ్చుకొన్న సోదరుణ్ణి చేరదీయడం బలమైన పట్టణాన్ని వశం చేసుకోవడం కంటే కష్టతరం. కలహాలు కోట తలుపుల గడియల్లాంటివి.
[20] నోటి మాటల ఫలంమూలంగా కడుపు నిండుతుంది. పెదవుల ఆదాయం తృప్తి కలిగిస్తుంది.
[21] జీవమూ, మరణమూ నాలుక వశంలో ఉన్నాయి. నాలుకను ప్రేమించేవారికి దాని ఫలం ముడుతుంది.
[22] భార్య లభించినదంటే మేలు దొరికినట్టే. అలాంటివానికి యెహోవా దయ ప్రాప్తించిందన్న మాట.
[23] దరిద్రులు ప్రాధేయపడి అడుగుతారు. ధనవంతుడు పౌరుషంగా జవాబిస్తాడు.
[24] ఎక్కువమంది స్నేహితులు ఉండడంవల్ల నష్టం కలుగవచ్చు. సోదరుడి కంటే సన్నిహితంగా ఉండబోయే స్నేహితుడొకడు ఉన్నాడు.