Skip to content
Opens in a new window

[1] తండ్రి క్రమశిక్షణకు తెలివిగల కొడుకు లోబడుతాడు. హేళన చేసేవాడు దిద్దుబాట్లు పాటించడు.

[2] తన నోటి మాటల ఫలం మూలంగా మనిషి మేలు అనుభవిస్తాడు. నమ్మక ద్రోహుల ఆశయం దౌర్జన్యమే.

[3] నోరును కాపాడుకొనేవారు ప్రాణం దక్కించుకుంటారు. నోరు భార్లగా తెరిచేవారికి నాశనం తప్పదు.

[4] సోమరిపోతుకు ఆశ ఎక్కువే గాని, ఏమీ లభించదు. కష్టించి పని చేసేవారి అంతరంగంలో తుష్టీ, పుష్టీ.

[5] సన్మార్గులకు అబద్ధాలంటే అసహ్యం. దుర్మార్గులు నింద, అవమానం కలిగిస్తారు.

[6] నిజాయితీపరులకు న్యాయవర్తనమే కాపుదల. దుర్మార్గం పాపిని పడద్రోస్తుంది.

[7] ఏమీ లేకపోయినా ధనం ఉన్నట్టు నటించేవాడొకడు, చాలా ధనం ఉన్నా లేనట్టు నటించేవాడు మరొకడూ!

[8] ఓ మనిషి ధనం అతనికి విడుదల వెల. దరిద్రుడు బెదరింపు మాటలు వినిపించుకోడు.

[9] సన్మార్గుల కాంతి తేజరిల్లుతుంది. దుర్మార్గుల దీపం ఆరిపోతుంది.

[10] గర్వంచేత కలిగేది కలహమే. సలహాలు పాటించేవారికి జ్ఞానం ఉంటుంది.

[11] మోసం చేసి సంపాయించినది తగ్గిపోతూ ఉంటుంది. శ్రమించి సమకూర్చుకొన్నది పెరుగుతుంది.

[12] ఆశ నెరవేర్పు ఆలస్యమైతే హృదయం కృశిస్తుంది. తీరిన కోరిక జీవవృక్షం.

[13] హిత వాక్కును తిరస్కరించేవారు బాధల పాలవుతారు. ఆజ్ఞ అంటే భయభక్తులున్న వ్యక్తికి బహుమతి దొరుకుతుంది.

[14] జ్ఞానుల ఉపదేశం జీవాన్ని కలిగించే ఊట. మనుషులు దానిమూలంగా మరణ బంధకాలు తప్పించుకుంటారు.

[15] మంచి తెలివి వల్ల దయ లభిస్తుంది. నమ్మక ద్రోహుల మార్గం కఠినమైనది.

[16] ప్రతి వివేకి తెలివిగా ప్రవర్తిస్తాడు. తెలివితక్కువవాడు తన మూర్ఖత్వాన్ని బయటపెట్టుకుంటాడు.

[17] దూత దుర్మార్గుడైతే కడగండ్ల పాలవుతాడు. నమ్మకమైన రాయబారి ఆరోగ్యాన్ని చేకూరుస్తాడు.

[18] క్రమశిక్షణను నిర్లక్ష్యం చేసే వాళ్ళకు దరిద్రం, అవమానం కలుగుతాయి. మందలింపును శిరసావహించే వారికి గౌరవం.

[19] కోరిక నెరవేరితే ప్రాణానికి మధురం. చెడుగు మానడం అంటే మూర్ఖులకు ఏవగింపు.

[20] జ్ఞానులతో తిరిగేవారు జ్ఞానులు అవుతారు. మూర్ఖులతో స్నేహం చేసేవారు చెడిపోతారు.

[21] కీడు పాపులను వెంటాడుతుంది. మేలు న్యాయవంతులకు వచ్చే బహుమానం.

[22] సజ్జనుడు తన మనుమలకు ఆస్తి విడిచిపెట్టిపోతాడు. పాపాత్ములు కూడబెట్టిన ధనం న్యాయవంతుల వశం అవుతుంది.

[23] బీదలు దున్నే బీడు భూమి సమృద్ధిగా పండవచ్చు. అన్యాయంవల్ల అది తుడిచిపెట్టుకుపోతుంది.

[24] బెత్తం ప్రయోగించనివాడు తన కొడుకును ద్వేషిస్తున్నాడన్న మాట. కొడుకును ప్రేమించేవాడు వాణ్ణి శ్రద్ధగా క్రమశిక్షణలో పెంచుతాడు.

[25] సన్మార్గులకు ఆకలి తీర్చుకొనేందుకు చాలినంత ఉంటుంది. దుర్మార్గుల కడుపుకు దరిద్రమే మిగిలేది.

సామెతలు — Chapters