[1] రాజు హృదయం యెహోవా చేతిలో ఉంది. ఆయనకు ఇష్టం వచ్చినట్లు నీటి కాలువల్లాగా దాన్ని తిప్పుతాడు.
[2] మనిషికి తన విధానాలన్నీ సరైనవే అనిపిస్తాయి. యెహోవా హృదయాలను తులనాత్మకంగా పరిశీలిస్తాడు.
[3] నీతి న్యాయాల ప్రకారం ప్రవర్తించడం బలికంటే యెహోవాకు ఎక్కువ ఇష్టం.
[4] గర్వంతో కూడిన చూపులు, అహంభావ హృదయం దుర్మార్గులకు దీపం. ఇవన్నీ పాపాలే!
[5] శ్రద్ధతో పనిచేసేవారి ప్రణాళికలు సమృద్ధి కలిగిస్తాయి. తొందరపడి పని చేసే ప్రతి ఒక్కరూ అక్కరపడతారు.
[6] అబద్ధాలాడే నాలుకతో డబ్బు సంపాయించుకొన్న ధనం ఎగిరిపోయే ఆవిరిలాంటిది. అది కావాలనేవాడు మరణం వెదుకుతున్నాడన్నమాట.
[7] దుర్మార్గులు చేసే దౌర్జన్యం వాళ్ళను తుడిచివేస్తుంది. ఎందుకంటే వాళ్ళు న్యాయంగా ప్రవర్తించడానికి ఒప్పుకోరు.
[8] అపరాధి విధానాలు వంకరటింకర. శుద్ధుల ప్రవర్తన యథార్థమైనది.
[9] గయ్యాళి పెళ్ళాంతో భవనంలో ఉండడం కంటే మిద్దెమీద ఏదో ఒక మూల పడి ఉండడం మేలు.
[10] దుర్మార్గుల మనసు కీడువైపే మొగ్గుతుంది. తమ పొరుగువారి మీద కూడా వారికి దయ కలగదు.
[11] హేళన చేసేవారు శిక్షకు గురి అయితే, అమాయకులు చూచి తెలివి తెచ్చుకుంటారు. జ్ఞానికి ఉపదేశం వల్ల జ్ఞానాభివృద్ధి కలుగుతుంది.
[12] న్యాయవంతుడైన దేవుడు దుర్మార్గుల ఇంటి సంగతి కనిపెట్టి చూస్తాడు. దుర్మార్గులను ధ్వంసంలోకి తిప్పుతాడు.
[13] ఒకవ్యక్తి దరిద్రుల మొర వినకుండా చెవి మూసుకొంటే, అతడు కూడా మొర పెట్టవలసివస్తుంది గాని, జవాబు మాత్రం రాదు.
[14] గుప్తంగా ఇచ్చిన బహుమానం కోపాగ్నిని చల్లారుస్తుంది. రహస్యంగా ఇచ్చిన కానుక తీవ్రమైన ఆగ్రహాన్ని శాంతపరుస్తుంది.
[15] న్యాయాన్ని జరిగించడం న్యాయవంతులకు సంతోషం. చెడుగు చేసేవారికి అది భయంకరం.
[16] వివేకవంతమైన మార్గంనుంచి వైదొలగి తిరిగేవారు చచ్చినవాళ్ళ గుంపులో చేరుతారు.
[17] సుఖం మరిగినవారు దరిద్రులవుతారు. ద్రాక్షమద్యం, నూనె కావాలని పేరాశగలవారు ధనికులు కాలేరు.
[18] దుర్మార్గులు సన్మార్గులకు విడుదల కలిగించే వెలగా ఉంటారు. యథార్థపరులకు బదులు విద్రోహులు నశిస్తారు.
[19] విసికించే గయ్యాళి పెళ్ళాంతో ఉండేకంటే అరణ్యవాసం చేయడం మేలు.
[20] జ్ఞానుల ఇంట్లో శ్రేష్ఠ భోజన పదార్థాలు, నూనె నిలువ ఉంటాయి. మూర్ఖులు తనకున్నదంతా దిగమింగివేస్తారు.
[21] న్యాయాన్ని, దయను అనుసరించేవారు జీవం, న్యాయం, గౌరవం పొందుతారు.
[22] జ్ఞానమున్న మనిషి బలాఢ్యుల నగర ప్రాకారమెక్కి వాళ్ళకు ఆశ్రయ స్థానమైన కోటను పడగొట్టివేస్తాడు.
[23] మాటల విషయం జాగ్రత్తగా ఉండేవారు బాధలనుంచి తమను కాపాడుకొంటారు.
[24] హేళన చేసేవాణ్ణి అహంకారి అనీ, గర్విష్ఠి అనీ వ్యవహరిస్తారు. అతడు అతి గర్వంతో ప్రవర్తిస్తాడు.
[25] సోమరిపోతుల చేతులు పని చేయవు, గనుక వారి ఆశలే వారికి చావు తెస్తాయి.
[26] వారికి పొద్దస్తమానమూ గొంతెమ్మ కోరికలే. న్యాయవంతులు వెనక్కు తీయకుండా ఇతరులకు ఇస్తారు.
[27] దుర్మార్గుల బలి అసహ్యకరం. అలాంటప్పుడు వాళ్ళు దురుద్దేశంతో బలి అర్పిస్తే, మరింకెంత అసహ్యం!
[28] అబద్ధ సాక్షి నాశనమవుతాడు. సత్యానికి లోబడేవాడు నిజాయితీతో మాట్లాడుతాడు.
[29] దుర్మార్గులు ముఖంమీద సిగ్గు, బిడియం లేకుండా చేస్తారు. యథార్థపరులు తమ ప్రవర్తనను చక్కపరచుకొంటారు.
[30] యెహోవాకు వ్యతిరేకంగా ఏ జ్ఞానమూ, వివేకమూ, ఆలోచనా నిలవలేవు.
[31] యుద్ధ దినంకోసం గుర్రాలను సిద్ధం చేస్తారు. కానీ రక్షణ యెహోవా అధీనంలో ఉంది.