Skip to content
Opens in a new window

[1] సొలొమోను సామెతలు. కుమారుడికి జ్ఞానం ఉంటే, తండ్రికి సంతోషం. తెలివితక్కువ కుమారుడు తల్లికి శోకం.

[2] అక్రమంగా సంపాదించిన ధనంవల్ల లాభమేమీ ఉండదు. నిర్దోషత్వం చావునుంచి తప్పిస్తుంది.

[3] యెహోవా సన్మార్గులను ఆకలితో విడిచిపెట్టడు. దుర్మార్గులకు ఆశాభంగం కలిగిస్తాడు.

[4] బద్ధకంగా పని చేసే వారికి దరిద్రం వస్తుంది. శ్రద్ధగా పని చేస్తే ఐశ్వర్యం చేకూరుతుంది.

[5] వేసవి కాలంలో సేకరించుకొనే కుమారుడు బుద్ధిమంతుడు. పంట కాలంలో నిద్రపోయే కొడుకు సిగ్గు తెచ్చిపెట్టేవాడు.

[6] సన్మార్గుల తలపై ఆశీస్సులు! దుర్మార్గుల నోట్లో దౌర్జన్యం దాగి ఉంటుంది.

[7] సన్మార్గుల విషయమైన జ్ఞాపకం ధన్యం. దుర్మార్గుల పేరు అసహ్యమై నాశనం అవుతుంది.

[8] హృదయంలో జ్ఞానం ఉన్నవారు ఆజ్ఞలు పాటిస్తారు. వదరుబోతులైన మూర్ఖులను కూల్చడం జరుగుతుంది.

[9] నిజాయితీతో ప్రవర్తించే వారికి క్షేమం! వక్రబుద్ధితో ప్రవర్తించేవాడి గుట్టు బయటపడుతుంది.

[10] యుక్తితో కన్ను గీటేవారు కడగండ్లు తెచ్చిపెట్టేవారు. వదరుబోతులైన మూర్ఖులు పతనమవుతారు.

[11] సన్మార్గుల నోరు జీవజలం ఊట. దుర్మార్గుల నోట్లో దౌర్జన్యం దాగి ఉంటుంది.

[12] ద్వేషం కలహం రేపుతుంది. ప్రేమ దోషాలన్నిటినీ కప్పివేస్తుంది.

[13] వివేకం ఉన్నవారి పెదవులపై జ్ఞానం దొరుకుతుంది. బుద్ధిలేనివారి వీపుకు తగినది బెత్తమే!

[14] జ్ఞానులు జ్ఞానాన్ని సమకూర్చుకుంటారు. మూర్ఖులు మాట్లాడితే నాశనం దగ్గర పడుతుంది.

[15] ధనికుల ఆస్తి వారికి కోటలాంటిది. పేదవారి దరిద్రం వారికి నాశనకారణం.

[16] సన్మార్గుల జీతం వారికి జీవం కలిగిస్తుంది. దుర్మార్గుల రాబడి వారికి శిక్ష తెచ్చిపెట్టేస్తుంది.

[17] ఉపదేశం వినేవారు జీవ మార్గంలో ఉన్నారు. దిద్దుబాటు నిర్లక్ష్యం చేసేవారు దారి తప్పుతారు.

[18] లోలోపల ద్వేషం ఉంచుకొనేవారు అబద్ధికులు. అపనిందలు ప్రచారం చేసేవారు మూర్ఖులు.

[19] మాటలు మరీ ఎక్కువయితే, దోషం తప్పదు. పెదవులను అదుపులో ఉంచుకొన్నవాడే జ్ఞాని.

[20] సన్మార్గుల మాటలు నాణ్యమైన వెండిలాంటివి. దుర్మార్గుల మనసు పనికిమాలినది.

[21] సన్మార్గుల పెదవులు అనేకులను పోషిస్తాయి. బుద్ధి లేకపోవడంచేత మూర్ఖులు చనిపోతారు.

[22] ఐశ్వర్యాన్ని కలిగించేది యెహోవా దీవెన. ఆయన దానికేమీ దుఃఖం చేర్చడు.

[23] మూర్ఖులకు తన చెడ్డ ప్రవర్తనలో సంతోషం కలుగుతుంది. వివేకులకు జ్ఞానంలో సంతోషం కలుగుతుంది.

[24] దుర్మార్గులు భయపడినదే వారి మీదికి వస్తుంది. సన్మార్గులు కోరుకొన్నదే వారికి లభిస్తుంది.

[25] సుడిగాలి పోయిన తరువాత దుర్మార్గులు ఉండరు. కాని, సన్మార్గులు శాశ్వతమైన పునాదిమీద నిలిచి ఉంటారు.

[26] పండ్లకు పులుపు, కండ్లకు పొగ ఎలా ఉంటాయో, సోమరిపోతును పనికి పంపేవారికి అతడు అలాగే ఉంటాడు.

[27] యెహోవాపట్ల భయభక్తులు ఆయుష్షుకు వృద్ధి. దుర్మార్గులకు ఆయువు క్షీణం.

[28] సన్మార్గులకు సంతోషకరమైన ఆశాభావం ఉంది. దుర్మార్గుల ఆశలు లయమైపోతాయి.

[29] నిజాయితీపరులకు యెహోవా మార్గం బలమైనకోట. కాని, చెడుగు చేసేవాళ్ళకు అది నాశనకరం.

[30] సన్మార్గులకు కంపనం ఎన్నడూ జరగదు. దుర్మార్గులకు దేశంలో తావు లేదు.

[31] సన్మార్గుల నోట జ్ఞానధారలు ఒలుకుతాయి. కుటిల మాటలు పలికే నాలుకను పీకివేయడం జరుగుతుంది.

[32] సన్మార్గుల పెదవులు అనుకూల విషయాలు చెపుతాయి. దుర్మార్గుల నోట మొండి మాటలు వెలువడుతాయి.

సామెతలు — Chapters