Skip to content
Opens in a new window

[1] జ్ఞానం ఉన్న స్త్రీ గృహసీమను నిర్మిస్తుంది. మూర్ఖురాలు చేజేతుల గృహాన్ని పడగొట్టివేస్తుంది.

[2] నిజాయితీగా నడుచుకొనేవారు యెహోవాపట్ల భయభక్తులు గలవారు. కుటిల వర్తనులకు యెహోవా అంటే తిరస్కారం.

[3] మూర్ఖుల నోట గర్వమనే బెత్తం ఉంది. జ్ఞానుల పెదవులు తమకు కాపుదల.

[4] ఎద్దులు లేకపోతే ధాన్యం కొట్టు ఖాళీగా ఉంటుంది. ఎద్దులు బలంగా ఉంటే పంటలో అభివృద్ధి.

[5] నమ్మకమైన సాక్షి అబద్ధం చెప్పడు. అబద్ధ సాక్షి నోరు తెరిస్తే అబద్ధమే.

[6] పరిహాసకులు జ్ఞానాన్ని వెదికినా ఏమీ లభించదు. తెలివితేటలు ఉన్నవారికి జ్ఞానం సులభంగా ప్రాప్తిస్తుంది.

[7] మూర్ఖుడి ఎదుటనుంచి వెళ్ళిపో. అతడి దగ్గర జ్ఞాన వాక్కులు దొరకవు గదా.

[8] వివేకుల జ్ఞానం అంటే తమ పోకడలను గమనించుకోవడమే. తెలివితక్కువవారి మూర్ఖత్వం వాళ్ళ మోసంలోనే బయట పడిపోతుంది.

[9] మూఢులు అపరాధం గురించి పరిహాసంగా మాట్లాడుతారు. యథార్థపరుల మధ్య దయ ఉంది.

[10] హృదయ శోకం ఎలాంటిదో దానికి తెలుసు. దాని సంతోషం కూడా పరాయివాడు పంచుకోలేడు.

[11] దుర్మార్గుడి ఇల్లు నాశనమైపోతుంది. నిజాయితీపరుడి డేరా క్షేమంగా ఉంటుంది.

[12] మనిషి దృష్టికి సరైనదిగా కనబడే మార్గం ఉంది. కాని, తుదకు అది మరణానికి దారితీస్తుంది.

[13] పైకి నవ్వుతూ ఉన్నా, లోలోపల శోకం ఉండవచ్చు. సంతోషం తుదకు శోకంగా మారిపోవచ్చు.

[14] హృదయంలో భక్తి విడిచినవారు తమ మార్గాల ఫలంతో నిండిపోతారు. మంచి మనిషికి ఆత్మ తృప్తి కలుగుతుంది.

[15] తెలివితక్కువ వారు ప్రతిదీ నమ్ముతారు. వివేకి తాను వేసే ప్రతి అడుగును ఆలోచించి మరీ వేస్తాడు.

[16] జ్ఞానులు భయపడి కీడునుంచి వైదొలగుతారు. మూర్ఖులు అహంకారంతో అజాగ్రత్తగా మసులుకుంటారు.

[17] త్వరగా కోపగించుకొనేవారు మూర్ఖంగా ప్రవర్తిస్తారు. దురాలోచన చేసేవాడు ద్వేషానికి గురి అవుతాడు.

[18] తెలివితక్కువ వాళ్ళకు కలగబోయేది మూర్ఖత్వమే. జ్ఞానం వివేకులను ఆవరించి ఉంటుంది.

[19] చెడ్డవాళ్ళు మంచివాళ్ళ ఎదుట వంగుతారు. దుర్మార్గులు సన్మార్గుల ఇంటి వాకిట తల ఒగ్గుతారు.

[20] దరిద్రులంటే వారి పొరుగువారే అసహ్యించుకుంటారు. ధనవంతులకు స్నేహితులు అనేకులు.

[21] సాటి మానవుణ్ణి తిరస్కరించేవారు పాపులు. బీదలపట్ల దయ చూపేవారు ధన్యజీవులు.

[22] కీడు తలపెట్టేవాళ్ళు తప్పిపోకుండా ఉంటారా? మేలును ఉద్దేశించినవారికి అనుగ్రహం, సత్యం ప్రాప్తిస్తాయి.

[23] అన్ని రకాల కృషిలో లాభం ఉంది. ఊరికే మాట్లాడడం దరిద్రానికి కారణం.

[24] ఐశ్వర్యం జ్ఞానులకు కిరీటంలాంటిది. తెలివితక్కువ వారి మూర్ఖత్వం మూర్ఖత్వమే.

[25] నిజం చెప్పే సాక్షి మనుషుల ప్రాణాలను రక్షిస్తాడు. అబద్ధ సాక్షి వట్టి మోసగాడు.

[26] యెహోవామీది భయభక్తుల వల్ల చాలా ధైర్యం కలుగుతుంది. అలాంటివారి పిల్లలకు ఆశ్రయం ఉంది.

[27] యెహోవామీది భయభక్తులు జీవాన్ని కలిగించే ఊటలాంటివి. మనుషులు దానిమూలంగా మరణ బంధకాలు తప్పించుకొంటారు.

[28] జనాభా వృద్ధి రాజుకు మహిమ. జన క్షయం రాజుకు నాశనం.

[29] త్వరగా కోపగించుకోనివారికి చాలా తెలివితేటలు ఉన్నాయి. ముక్కోపి మూర్ఖతను ప్రదర్శించేవాడు.

[30] ప్రశాంత హృదయం శరీరానికి జీవం కలిగిస్తుంది. అసూయ ఎముకల్లో కుళ్ళులాంటిది.

[31] దరిద్రులను అణగద్రొక్కేవారు వారి సృష్టికర్తకే నింద తెస్తున్నారు. అక్కరలో ఉన్నవారికి దయ చూపేవారు దేవుణ్ణి ఘనపరుస్తున్నారు.

[32] తమ చెడుగులో దుర్మార్గులు నాశనం అవుతారు. మరణ సమయంలో కూడా సన్మార్గులకు ఆశ్రయం ఉంది.

[33] వివేకి హృదయంలో జ్ఞానం నివాసముంటుంది. మూర్ఖులకు లోపలిదంతా బయటపడుతుంది.

[34] న్యాయం జనాన్ని గొప్ప చేస్తుంది. అపరాధం ప్రజలకు అవమాన కారణం.

[35] సేవకుడు బుద్ధిమంతుడైతే, రాజుకు ప్రీతిపాత్రుడు అవుతాడు. సిగ్గుమాలినవాడు రాజు కోపానికి గురి అవుతాడు.

సామెతలు — Chapters