Skip to content
Opens in a new window

[1] ద్రాక్షమద్యం నగుబాట్లపాలు చేస్తుంది. మద్యపానం వల్ల మనిషి రెచ్చిపోతాడు. వాటి వశం అయిన వాళ్ళంతా తెలివితక్కువవాళ్ళు.

[2] రాజు బెదిరింపు సింహ గర్జనలాంటిది. రాజుకు కోపం తెప్పించే వాళ్ళు ప్రాణాపాయానికి గురి అయ్యేవాళ్ళు.

[3] కలహాలకు దూరం కావడం మనిషికి గౌరవం. ప్రతి మూర్ఖుడూ జగడాలు పెట్టుకుంటాడు.

[4] విత్తనాలు వేసేకాలంలో సోమరి పొలం దున్నడు. కోతకాలంలో ప్రాధేయపడుతాడు గాని, అతడికేమీ లభించదు.

[5] మనిషి హృదయంలోని ఉద్దేశాలు లోతైన నీళ్ళలాంటివి. తెలివైనవారు వాటిని బయటికి తీస్తారు.

[6] చాలామంది తాము దయగలవాళ్ళమని చాటుతారు. అయితే నమ్మకమైన వ్యక్తిని ఎవరు కనుక్కోగలరు?

[7] న్యాయవంతులు నిజాయితీగా ప్రవర్తిస్తారు. వారి తదనంతరం వారి పిల్లలు ధన్యజీవులవుతారు.

[8] రాజు న్యాయపీఠాన్ని అధిష్టించి, తన కంటిచూపుతోనే చెడుగంతా చెదరగొట్టివేస్తాడు.

[9] “నా హృదయం శుద్ధి చేసుకొన్నాను. నా పాపాలన్నీ పోయాయి. నేను పవిత్రుణ్ణి” అని చెప్పగల వ్యక్తి ఎవరు?

[10] తూకం రాళ్ళు, కొలతలు భిన్నమైనవైతే ఈ రెండూ యెహోవాకు అసహ్యకరం.

[11] పిల్లవాడు ఏలాంటివాడో అతడి క్రియలను బట్టి తెలుసు. అవి శుద్ధమైనవో, సరైనవో, కాదో, చూచి ఆ విషయం తెలుసుకోవచ్చు.

[12] వినే చెవి, చూచే కన్ను ఈ రెండూ యెహోవా కలుగజేసినవే.

[13] దరిద్రుడివి కాకుండేలా నిద్రను ప్రేమించక మేల్కొని ఉండు. ఆహారం పుచ్చుకొని, తృప్తిపడు.

[14] వస్తువు కొనేవారు “ఇదేమి మంచిది కాదు” అంటారు. తమ దారిని తాము వెళ్ళి వస్తువులను మెచ్చుకుంటారు.

[15] బంగారం ఉంది. రత్నాలు ఎన్నో ఉన్నాయి. వీటన్నిటికంటే తెలివిగా మాట్లాడే పెదవులు ప్రశస్తమైనవి.

[16] పరాయివాడికి జామీను ఉండేవాడి వస్త్రం తీసుకో. పరాయివాళ్ళకు అతణ్ణే జామీను ఉండనియ్యి.

[17] మోసంతో సంపాదించిన ఆహారం మనిషికి ఎంతో రుచి అనిపిస్తుంది. ఆ తరువాత వాడి నోటినిండా మన్నే.

[18] సలహాలు విని నీ ఏర్పాట్లు చేసుకో. యుద్ధం చేయకముందు మంచి సంప్రతింపులు పాటించు.

[19] చాడీకోరులు తిరుగుతూ రహస్యాలను బట్టబయలు చేస్తారు. వదరుబోతుల జోలికి పోవద్దు.

[20] తండ్రిని గానీ, తల్లిని గానీ దూషించేవాడి దీపం కాస్తా కటిక చీకట్లో ఆరిపోతుంది.

[21] మొదట్లో పేరాశతో దక్కించుకొన్న ఆస్తికి చిట్టచివరకు దీవెనలు కలగవు.

[22] కీడుకు బదులు కీడు చేస్తాననవద్దు. యెహోవా కోసం నమ్మకంతో ఎదురు చూడు. ఆయన నిన్ను కాపాడుతాడు.

[23] తూనికెరాళ్ళు భిన్నమైనవైతే, అది యెహోవాకు అసహ్యకరం. దొంగ త్రాసు ఆయనకు ఇష్టమేమీ లేదు.

[24] మనిషి పోకడలు యెహోవా వశంలో ఉన్నాయి. తన జీవిత మార్గాన్ని ఎవరైనా ఎలా గ్రహించగలరు?

[25] మనిషి ఆలోచించకుండా ఏదైనా దేవునికి ప్రతిష్ఠ చేస్తానని చెప్పి, తరువాత ఆ మొక్కుబడిని గురించి మళ్ళీ విచారిస్తే, అతడు వలలో చిక్కుపడ్డాడన్నమాటే.

[26] రాజు జ్ఞాని అయితే, దుర్మార్గులను చెదరగొట్టివేస్తాడు. వాళ్ళమీదిగా రాజ్యచక్రం దొర్లిస్తాడు.

[27] మనిషి ఆత్మ యెహోవా దీపం. అది అతని అంతర్యాన్ని అంతా పరిశోధిస్తుంది.

[28] అనుగ్రహం, సత్యం రాజుకు భద్రత కలిగిస్తాయి. అనుగ్రహం చేత అతడి సింహాసనం సుస్థిరంగా ఉంటుంది.

[29] యువకుల బలమే వారికి ఘనత. నెరసిన తల వృద్ధులకు అందం.

[30] గాయపరిచే దెబ్బలు మనిషి చెడుగును తుడిచివేస్తాయి. దెబ్బలు అంతరంగానికి శుద్ధి కలిగిస్తాయి.

సామెతలు — Chapters