[1] దుర్మార్గులను చూచి, అసూయపడకు. వాళ్ళతో స్నేహాన్ని ఆశించకు.
[2] వాళ్ళ హృదయం దౌర్జన్యం చేయాలని చూస్తుంది. వాళ్ళ పెదవులు కీడును గురించి మాట్లాడుతాయి.
[3] జ్ఞానం ఉంటే గృహసీమ నిర్మాణం అవుతుంది. వివేకం వల్ల అది సుస్థిరం అవుతుంది.
[4] తెలివిమూలంగా ఇంటి గదుల నిండా అన్ని రకాల విలువైన, అందమైన వస్తువులు నిండి ఉంటాయి.
[5] జ్ఞానం లభించిన మనిషికి ప్రభావం ఉంది. తెలివైనవాడు బలాభివృద్ధి చెందుతాడు.
[6] యుద్ధం చేస్తే మంచి సంప్రతింపులు అవసరం. విజయంకోసం చాలామంది సలహాదారులు అవసరం.
[7] మూఢులకు జ్ఞానం అందుబాటులో ఉండదు. గుమ్మందగ్గర పంచాయితీలో అలాంటివారు నోరు తెరవలేరు.
[8] కీడు చేయడానికి దురాలోచన చేసేవాణ్ణి టక్కరి మనిషి అంటారు.
[9] అవివేకాన్ని పన్నడం పాపం. మనుషులు హేళన చేసేవాళ్ళను ఏవగించుకొంటారు.
[10] కష్టకాలంలో నీకు ధైర్యం చెడితే నీ బలం ఎంత అల్పం!
[11] ప్రాణాపాయంలో చిక్కుబడి పోయినవాళ్ళను విడిపించు. హతమైపోయేందుకు మొగ్గేవాళ్ళను రక్షించు.
[12] “ఈ విషయం మాకేమీ తెలియదు” అంటే లాభం లేదు. హృదయాన్ని పరిశోధించేవానికి గ్రహింపుశక్తి లేదా? నిన్ను కనిపెట్టి చూచేవానికి నీ విషయం తెలియదా? మనుషులందరికీ వారి వారి పనుల ప్రకారం ఆయన ప్రతిఫలం ఇస్తాడు గదా.
[13] నా కుమారా, తేనె త్రాగు. అది మధురం. తేనె తుట్టె నుంచి కారే తేనె బిందువులను గ్రోలు. అవి నాలుకకు తియ్యగా ఉంటాయి.
[14] నీ ఆత్మకు జ్ఞానం కూడా అలాంటిదే అని తెలుసుకో. అది నీకు లభిస్తే నీకు మంచి భవిష్యత్తు ఉంది. నీకు ఆశాభంగం కలగదు.
[15] దుర్మార్గుడిలాగా న్యాయవంతుని ఇంటి దగ్గర పొంచి ఉండకు. అతని విశ్రాంతి స్థలాన్ని పాడు చేయకు.
[16] న్యాయవంతుడు ఏడు సార్లు పడినా, తిరిగి లేస్తాడు. విపత్తు వస్తే, దుర్మార్గులు కుప్పకూలిపోతారు.
[17] నీ శత్రువు పతనమయ్యాడని సంతోషించకు. వాడు తొట్రుపడినప్పుడు నీ మనసులో ఆనందించకు.
[18] ఆనందిస్తే యెహోవా అది చూచి బాగా లేదని నీ శత్రువు మీద కోపగించుకోవడం మానుకొంటాడేమో!
[19] చెడుగు చేసేవాళ్ళను చూచి అసూయ చెందకు. దుర్మార్గులను చూచి కుళ్ళుకోకు.
[20] చెడ్డవాళ్ళకు మంచి భవిష్యత్తు లేదు. దుర్మార్గుల దీపం కాస్తా ఆరిపోతుంది.
[21] నా కుమారా, యెహోవాపట్ల భయభక్తులతో ఉండు. రాజును గౌరవించు. అలా ప్రవర్తించని వాళ్ళతో సహవాసం చేయకు.
[22] అలాంటివాళ్ళకు హఠాత్తుగా నాశనం ముంచుకు వస్తుంది. వాళ్ళ కాలం ఎప్పుడు తీరుతుందో ఎవరికి తెలుసు?
[23] ఇవి కూడా జ్ఞానులు పలికిన సామెతలు: తీర్పు చెప్పేటప్పుడు పక్షపాతానికి చోటు పెట్టడం మంచిది కాదు.
[24] దుర్మార్గులకు “నీవు నిర్దోషివి” అని చెప్పే వారిని ప్రజలు శపిస్తారు. జనాలకు వారంటే అసహ్యం.
[25] న్యాయసమ్మతంగా తీర్పు చెప్పేవారికి శ్రేయస్సు కలుగుతుంది. వారిమీద మంచి ఆశీస్సులు ఉంటాయి.
[26] నిష్కపటమైన జవాబు చెప్పడం పెదవులమీద ముద్దు పెట్టుకున్నట్టే ఉంటుంది.
[27] ముందుగా బయట చేయవలసిన పని సరి చేసుకో. నేల సిద్ధం చేసుకో. తరువాత ఇల్లు కట్టుకోవచ్చు.
[28] నిష్కారణంగా నీ పొరుగువాడికి వ్యతిరేక సాక్ష్యం పలకవద్దు. నీ పెదవులతో మోసంగా మాట్లాడవద్దు.
[29] “అతడు నాకు చేసినదే, వాడికి నేనూ చేస్తాను. వాడి క్రియకు ప్రతిక్రియ చేసితీరుతాను” అనుకోవద్దు.
[30] సోమరిపోతు పొలం దాటి వచ్చాను. తెలివితక్కువవాడి ద్రాక్షతోట మీదుగా వచ్చాను.
[31] అంతటా ముండ్లతుప్పలు నేలను నిండి ఉన్నాయి. దురదగొండి మొక్కలు నేలను కప్పి ఉన్నాయి. రాతి గోడ కూలిపోయిన స్థితిలో ఉంది.
[32] వాటిని చూచి ఆలోచించాను. వాటిని చూచి బుద్ధి తెచ్చుకొన్నాను:
[33] “ఇంకా కాసేపు కునుకడం, ఇంకా కొంచెం నిద్ర కావాలి. కాసేపు చేతులు ముడుచుకొని పడుకోవాలి” –
[34] ఇలా నీ మీద దోపిడీదొంగలాగా దరిద్రం వచ్చి పడుతుంది. ఖడ్గం ధరించిన భటుడిలాగా లేమి నీ మీదికి ఎగబడుతుంది.