[1] గొప్పసంపదకంటే మంచి పేరు కోరతగ్గది. వెండి బంగారాలకంటే దయ శ్రేష్ఠం.
[2] ధనికులకూ పేదలకూ ఈ విషయంలో భేదం లేదు – వారందరి సృష్టికర్త యెహోవాయే.
[3] వివేకవంతులు అపాయాన్ని ముందుగా చూచి, దాగుకొంటారు. తెలివితక్కువవారు ముందుకు సాగిపోయి బాధలపాలవుతారు.
[4] వినయానికీ, యెహోవామీది భయభక్తులకూ ప్రతిఫలంగా ఐశ్వర్యమూ గౌరవమూ జీవమూ చేకూరుతాయి.
[5] ముండ్లు, ఉరులు కుటిలాత్ముల దారిలో ఉన్నాయి. తనను కాపాడుకొనేవాడు వాటికి దూరంగా తొలగి నడుస్తాడు.
[6] చిన్నవారు నడవవలసిన మార్గం వారికి నేర్పు. వారు పెరిగి పెద్దవారై అందులోనుంచి వైదొలగరు.
[7] భాగ్యవంతులు బీదలమీద పెత్తనం చెలాయిస్తారు. అప్పు తీసుకొనేవారు ఇచ్చేవారికి దాసులు.
[8] దౌర్జన్యాన్ని నాటేవారు కీడు అనే పంట కోయవలసి వస్తుంది. వారి దుడ్డుకర్రలాంటి కోపం అంతరిస్తుంది.
[9] ఇతరులను దయ చూచేవారికి ఆశీస్సులు కలుగుతాయి. ఎందుకంటే, తమకున్న ఆహారంలో కొంత బీదలతో పంచుకుంటారు.
[10] హేళన చేసేవాణ్ణి వెళ్ళగొడితే, వాడితోపాటు కలహాలు పోతాయి. పోరూ ఉండదు, అవమానమూ కలగదు.
[11] హృదయ శుద్ధి అంటే ఇష్టం కలిగి దయగా మాట్లాడేవానికి రాజు కూడా మిత్రుడవుతాడు.
[12] యెహోవా దృక్కులు జ్ఞానాన్ని కాపాడుతాయి. వంచకుల మాటలను ఆయన తుడిచివేస్తాడు.
[13] సోమరిపోతు ఇలా సాకు చెప్తాడు: “బయట సింహం ఉంది”; లేదా, “వీధిలోకి వెళ్ళితే నన్ను చంపేస్తారు.”
[14] వ్యభిచారిణి నోరు లోతైన గుంట. యెహోవా శాపానికి గురి అయినవాడు దానిలో పడిపోతాడు.
[15] పిల్లవాడి హృదయంలో మంకుతనం స్వాభావికమే. దండంతో శిక్షించడం దాన్ని అతడిలోనుంచి తొలగిస్తుంది.
[16] లాభంకోసం పేదసాదలకు అన్యాయం తలపెట్టినవారూ, ధనం ఉన్నవారికి ఇంకా ఇచ్చేవారూ అక్కరపడుతారు.
[17] జ్ఞానుల ఉపదేశం చెవిని బెట్టు, సావధానంగా విను. నా తెలివైన మాటలు మనసుకు పట్టించుకో.
[18] నీ అంతరంగంలో వాటిని నిలుపుకొంటే సంతోషకరం. నీ పెదవులమీద అవి నిలిచేలా చూచుకో.
[19] ఈ వేళ ఈ ఉపదేశం నిన్ను ఉద్దేశించి చేస్తున్నాను. దీనిమూలంగా నీవు యెహోవామీద నమ్మకం ఉంచాలని నా ఆశయం.
[20] నేను నీకోసం శ్రేష్ఠమైన సామెతలు రాశాను, గదా. ఈ సామెతలు ఆలోచన చెపుతాయి. ఇవి జ్ఞానపూరితమైనవి.
[21] సత్యవాక్కుల గురించిన నిశ్చయం నీకు కలిగిస్తాయి. నిన్ను పంపినవారికి సరైన జవాబులు ఇవ్వడానికి సమర్థుడివి కావాలని నా ఆశయం.
[22] నిస్సహాయులని దిక్కులేనివారిని దోచుకోవద్దు. పంచాయితీ సభలో బీదలను బాధించకు.
[23] బీదల పక్షాన యెహోవా వాదిస్తాడు. బీదలను దోచుకొనే వాళ్ళ ప్రాణాన్ని యెహోవా దోచుకుంటాడు.
[24] కోపం రెచ్చిపొయ్యే మనిషితో స్నేహం చెయ్యకు. ముక్కోపితో పరిచయం చేసుకోబోకు.
[25] చేసుకొంటే నీవు అతడి విధానాలు నేర్చుకొని నీ ప్రాణానికి ఉరి కొనితెచ్చుకొంటావు జాగ్రత్త!
[26] చేతిలో చెయ్యి వేసి ఒట్టు అనేవాళ్ళలో, అప్పులు ఇప్పించడానికి జామీను నిలబడే వాళ్ళలో ఒకడివి కాకు.
[27] తీరా చెల్లించేందుకు నీ దగ్గర ఏమీ ఉండదనుకో – అతడు నీవు పడుకొన్న పరుపు కాస్తా తీసుకుపోవడం ఏం బావుంటుంది?
[28] నీ పూర్వీకులు నాటిన పురాతనమైన సరిహద్దు రాళ్ళను తొలగించకు.
[29] నేర్పుతో పని చేసుకొనే మనిషిని చూశావా? అలాంటివాడు ఊరూ పేరులేని వాళ్ళకు సేవ చేయడు. రాజుల ఎదుటే నిలుస్తాడు.