Skip to content
Opens in a new window

[1] క్రమశిక్షణ అంటే ఇష్టమున్న వ్యక్తి జ్ఞానమంటే ఇష్టమున్న వ్యక్తి అన్నమాట. దిద్దుబాటును ఏవగించుకొనేవాడు మూర్ఖుడు.

[2] మంచివారిని యెహోవా దయ చూస్తాడు. యుక్తిపరులకు శిక్ష విధిస్తాడు.

[3] దుర్మార్గం మూలంగా ఎవరూ స్థిరపడరు. న్యాయవంతుల వేరును పెళ్ళగించడం జరగదు.

[4] మంచి ఇల్లాలు తన భర్తకు కిరీటం. భర్తకు సిగ్గు కలిగించే భార్య అతడి ఎముకల్లో కుళ్ళు.

[5] సన్మార్గుల తలంపులు న్యాయసమ్మతమైనవి. దుర్మార్గుల సలహాలు పచ్చి మోసం.

[6] దుర్మార్గుల మాటలు రక్తపాతం కోసం పొంచి ఉంటాయి. యథార్థపరుల నోరు రక్షణ చేకూరుస్తుంది.

[7] దుర్మార్గులు పాడైపోతారు. వాళ్ళు లోకంలో లేకుండా పోతారు. సన్మార్గుల ఇల్లు నిలిచి ఉంటుంది.

[8] మనిషి తన సుబుద్ధి కారణంగా పొగడ్తలు పొందుతాడు. వక్ర బుద్ధి గలవారు తిరస్కారానికి గురి అవుతారు.

[9] తినడానికి లేకపోయినా, గొప్పలు చెప్పుకొనే వాడికంటే తమ దగ్గర సేవకుడున్న అల్పుడు మంచి స్థితిలో ఉన్నారు.

[10] తమ పశువులపట్ల సన్మార్గులు భూత దయ చూపుతారు. దుర్మార్గులు చూపే జాలి కూడా క్రూరత్వమే.

[11] భూమి దున్నుకొనేవారికి భోజనం సమృద్ధి. వ్యర్థమైనవాటిని వెంటాడేవారు తెలివితక్కువవారు.

[12] దుర్మార్గులు చెడ్డవాళ్ళ దోపిడీసొమ్ము ఆశిస్తారు. సన్మార్గుల వేరు వర్ధిల్లుతుంది.

[13] చెడ్డవాడు తన పెదవుల దోషంలో చిక్కుబడుతాడు. న్యాయవంతుడు ఆపదనుంచి తప్పించుకుంటాడు.

[14] తన నోటి మాటల ఫలం మూలంగా మంచితనంతో మనిషి తృప్తిపడుతాడు. మనిషి చేసుకొన్నది అతడి మీదికి వస్తుంది.

[15] మూర్ఖుల మార్గం తమకు బాగా ఉన్నట్టే అనిపిస్తుంది. జ్ఞానులు ఇతరుల సలహాలు వింటారు.

[16] మూర్ఖులకు విసుగు కలిగితే, అప్పుడే తెలిసిపోతుంది. వివేకవంతులు అవమానాన్ని వెల్లడి కానివ్వరు.

[17] యథార్థవాది సరైనదే పలుకుతాడు. అబద్ధ సాక్షి వంచన మాటలు చెపుతాడు.

[18] ఆలోచించకుండా కొందరు మాట్లాడితే, కత్తితో పొడిచినట్టే ఉంటుంది. జ్ఞాని మాటలు ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి.

[19] యథార్థం పలికే పెదవులు ఎప్పటికీ స్థిరంగా ఉంటాయి. అబద్ధాల నాలుకకు ఉనికి క్షణికం.

[20] కీడు తలపెట్టేవారి హృదయంలో మోసం ఉంటుంది. శాంతిని చేకూర్చడానికి సలహా ఇచ్చే వారికి సంతోషం కలుగుతుంది.

[21] సన్మార్గులకు ఏ హానీ రాదు. దుర్మార్గులకు నిలువెల్లా కష్టాలే.

[22] అబద్ధాల పెదవులంటే యెహోవాకు చెడ్డ అసహ్యం. యథార్థవంతులంటే ఆయనకెంతో ఇష్టం.

[23] వివేకి తన జ్ఞానాన్ని దాచిపెట్టుకొంటాడు. తెలివితక్కువ వారు తమ హృదయంలోని మూర్ఖత్వాన్ని వెల్లడి చేసుకుంటారు.

[24] శ్రద్ధగా పని చేసే చెయ్యి ప్రభుత్వం చేస్తుంది. సోమరి బలవంతంమీద ఊడిగం చేయవలసివస్తుంది.

[25] విచారంచేత హృదయం క్రుంగిపోతుంది. మంచి మాట ఒకటి హృదయానికి సంతోషం కలిగిస్తుంది.

[26] సన్మార్గులు తమ పొరుగువారికి మార్గదర్శులు. దుర్మార్గుల ప్రవర్తన మూలంగా వారు దారి తప్పిపోతారు.

[27] సోమరి వేటాడవచ్చు కాని, ఏమి చిక్కదు. చురుకుదనం గొప్ప ఆస్తిలాంటిది.

[28] న్యాయమార్గంలో జీవం ఉంది. ఆ త్రోవలో మరణం అంటూ ఉండదు.

సామెతలు — Chapters