Skip to content
Opens in a new window
Listen to this chapter • 8:06

[1] ఆదివారం నాడు తెల్లవారు జామున తాము సిద్ధం చేసిన సుగంధ ద్రవ్యాలు తీసుకొని వారు, మరి కొందరు స్త్రీలు సమాధి దగ్గరకు వచ్చారు.

[2] సమాధిముందు నుంచి ఆ రాయి దొర్లించి ఉండడం వారికి కనిపించింది.

[3] అయితే వారు సమాధిలోకి వెళ్ళి చూచినప్పుడు ప్రభువైన యేసు శరీరం కనబడలేదు.

[4] దీన్ని గురించి వారు అధికంగా కలవరపడుతూ ఉంటే హఠాత్తుగా ధగధగ మెరిసిపోతున్న వస్త్రాలు తొడుక్కొన్న ఇద్దరు మనుషులు వారి దగ్గర నిలబడ్డారు.

[5] ఆ స్త్రీలు భయపడి నేల వైపు తమ ముఖాలు వంచుకొన్నారు. అయితే ఆ వ్యక్తులు “సజీవుణ్ణి చనిపోయినవారిమధ్య ఎందుకు వెదకుతున్నారు?

[6] ఆయన ఇక్కడ లేడు. సజీవంగా లేచాడు. ఆయన ఇంకా గలలీలో ఉన్నప్పుడు ఆయన మీతో చెప్పినది జ్ఞాపకం చేసుకోండి.

[7] ఏమంటే, మానవ పుత్రుణ్ణి పాపిష్టి మనుషుల చేతికి అప్పగించడం, సిలువ వేయడం, ఆయన మూడో రోజున మళ్ళీ సజీవంగా లేవడం తప్పనిసరి” అని వారితో చెప్పారు.

[8] అప్పుడు ఆయన మాటలు వారికి జ్ఞప్తికి వచ్చాయి.

[9] వారు సమాధినుంచి తిరిగి వెళ్ళి పదకొండుమంది శిష్యులకూ తక్కినవారందరికీ ఇదంతా తెలియజేశారు.

[10] ఈ విధంగా క్రీస్తు రాయబారులకు ఈ సంగతులు చెప్పినది ఎవరంటే మగ్దలేనే మరియ, యోహన్న, యాకోబు తల్లి అయిన మరియ, వారితోకూడా ఉన్న ఇతర స్త్రీలు.

[11] అయితే వారి మాటలు వీరికి తెలివితక్కువ కబుర్లలాగా అనిపించాయి గనుక వీరు వారిని నమ్మలేదు.

[12] అయితే పేతురు లేచి సమాధిదగ్గరకు పరుగెత్తి వెళ్ళి వంగి చూశాడు. ఆ సన్నని నారబట్ట మాత్రం విడిగా ఉండడం అతనికి కనబడింది. జరిగినదానికి ఆశ్చర్యపడుతూ అతడు వెళ్ళి పోయాడు.

[13] ఆ రోజే శిష్యులలో ఇద్దరు ఎమ్మాయస్ అనే గ్రామానికి వెళ్తూ ఉన్నారు. అది జెరుసలంకు సుమారు పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉంది.

[14] జరిగిన సంగతులన్నిటిని గురించీ వారు మాట్లాడుకొంటూ ఉన్నారు.

[15] అలా మాట్లాడుకొంటూ, చర్చించుకొంటూ ఉండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచాడు.

[16] అయితే వారి కండ్లు మూతలు పడ్డట్లయింది గనుక వారాయనను గుర్తుపట్టలేదు.

[17] “మీరు దుఃఖంతో నడుస్తూ ఒకరితో ఒకరు చెప్పుకొంటున్న సంగతి ఏమిటి?” అని ఆయన వారినడిగాడు.

[18] వారిలో క్లెయొపా అనే ఒకడు ఆయనతో “జెరుసలంలో కాపురమున్న కొత్త వ్యక్తి మీరు ఒక్కరేనా? ఈ రోజుల్లో అక్కడ జరిగిన సంగతులు మీకు తెలియదా?” అన్నాడు.

[19] ఆయన “ఏమి సంగతులని?” అని వారితో అన్నాడు. వారు ఆయనతో ఇలా అన్నారు: “నజరేతువాడైన యేసు సంగతులే! ఆయన దేవుని దృష్టిలోను ప్రజలందరి దృష్టిలోనూ మాటలలో, పనులలో బలప్రభావాలు ఉన్న ప్రవక్త.

[20] ప్రముఖ యాజులూ మన అధికారులూ ఆయనను మరణశిక్షకు అప్పగించి సిలువ వేయించారు.

[21] ఇస్రాయేల్ ప్రజలకు విముక్తి కలిగించబోయేవాడు ఆయనే అని మేము ఆశతో ఎదురు చూశాం. అంతేకాదు, ఇదంతా జరిగి ఇప్పటికి మూడో రోజు.

[22] ఈవేళ మా గుంపులో కొందరు స్త్రీలు మాకు విస్మయం కలిగించారు. ఉదయాన పెందలకడే వారు సమాధి దగ్గరికి వెళ్లి చూస్తే ఆయన శరీరం వారికి కనిపించలేదు.

[23] వారు వచ్చి దేవదూతలు తమకు కనబడి ఆయన బతికి ఉన్నట్టు తమతో చెప్పారన్నారు.

[24] మా తోటివారిలో కొందరు సమాధికి వెళ్ళి చూచినప్పుడు అంతా ఆ స్త్రీలు చెప్పినట్లే ఉంది. ఆయనను మాత్రం వారు చూడలేదు.”

[25] అందుకాయన వారితో అన్నాడు “మీరు తెలివి తక్కువవారు! ప్రవక్తలు చెప్పినదంతా నమ్మడంలో మంద మతులు!

[26] ఆ బాధలు అనుభవించి తన మహిమలో ప్రవేశించడం క్రీస్తుకు తప్పనిసరే గదా!”

[27] అప్పుడు మోషే, ప్రవక్తలందరూ వ్రాసినవాటితో మొదలుపెట్టి లేఖనాలన్నిటిలో తనను గురించిన విషయాలు ఆయన వారికి వివరించాడు.

[28] వారు వెళ్తున్న గ్రామం దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంకా ముందుకు వెళ్ళబోయాడు.

[29] అయితే వారు “సాయంకాలం కావచ్చింది. పొద్దు కుంకుతూ ఉంది. మాతో ఉండిపోండి” అంటూ ఆయనను బలవంతం చేశారు. అందుచేత వారితో ఉండడానికి లోపలికి వెళ్ళాడు.

[30] వారితో కూడా ఆయన భోజనానికి కూర్చున్నప్పుడు రొట్టె తీసుకొని దాన్ని దీవించి విరిచి వారికి అందించాడు.

[31] వెంటనే వారి కండ్లు తెరుచుకొన్నాయి. వారాయనను గుర్తుపట్టారు. అయితే ఆయన వారికి కనబడకుండా అంతర్ధానమయ్యాడు.

[32] అప్పుడు “తోవలో ఆయన మనతో మాట్లాడుతూ లేఖనాలు తేటపరుస్తూ ఉంటే మన గుండెలు దహించుకు పోతున్నట్లు అనిపించలేదా!” అని ఒకరితో ఒకరు చెప్పుకొన్నారు.

[33] ఆ ఘడియలోనే వారు లేచి జెరుసలం తిరిగి వెళ్ళారు. అక్కడ వారికి కనిపించినదేమంటే, ఆ పదకొండు మంది శిష్యులూ వారితో ఉన్నవారూ గుమికూడి

[34] “ప్రభువు వాస్తవంగా లేచాడు, సీమోనుకు కనబడ్డాడు!” అని చెప్పుకొంటున్నారు.

[35] అది విని వారు దారిన జరిగిన సంగతులూ ఆయన రొట్టె విరిచినప్పుడు ఆయన తమకు తెలిసిపోయిన సంగతి కూడా తెలిపారు.

[36] వారీ సంగతులు చెపుతూ ఉండగానే యేసే వారిమధ్య నిలబడి “మీకు శాంతి!” అని వారితో అన్నాడు.

[37] ఏదో ఆత్మ తమకు కనబడిందనుకొంటూ వారు హడలిపోయి భయాక్రాంతులయ్యారు.

[38] అప్పుడాయన వారితో “మీకెందుకు ఈ కంగారు? మీ హృదయాలలో సందేహాలు ఎందుకు పుట్టాయి?

[39] నేనే గదా. నా చేతులూ పాదాలూ చూడండి. నన్ను తాకి చూడండి. నాకున్నట్టుగా మీరు చూస్తున్న ఎముకలూ మాంసమూ ఒక ఆత్మకు ఉండవు” అన్నాడు.

[40] ఈ మాటలు చెప్పి తన చేతులూ పాదాలూ వారికి చూపెట్టాడు.

[41] ఆనందం కారణంగా వారింకా నమ్మలేక ఆశ్చర్యపడుతూ ఉంటే ఆయన “తినడానికి ఇక్కడ ఏమైనా ఉందా?” అని వారినడిగాడు.

[42] కాల్చిన చేప ముక్కనూ కొంత తేనెపట్టునూ వారాయనకు అందించారు.

[43] ఆయన వాటిని తీసుకొని వారి కండ్లెదుటే తిన్నాడు.

[44] అప్పుడాయన వారితో “మీ దగ్గర ఇంకా ఉన్నప్పుడు నేను ఈ మాటలు మీతో చెప్పాను: మోషే ధర్మశాస్త్రంలో, ప్రవక్తల గ్రంథంలో, కీర్తనలలో నన్ను గురించి వ్రాసి ఉన్న విషయాలన్నీ నెరవేరడం తప్పనిసరి” అన్నాడు.

[45] వారు లేఖనాలు గ్రహించగలిగేలా వారి మనసులను తెరిచాడు.

[46] అప్పుడాయన “ఇలా రాసి ఉంది – ఇలా జరగడం తప్పనిసరి: అభిషిక్తుడు బాధలు అనుభవించి చనిపోయినవారిలో నుంచి మూడో రోజున సజీవంగా లేవవలసిందే.

[47] జెరుసలం మొదలుకొని జనాలన్నిటికి ఆయన పేర పశ్చాత్తాపం, పాపక్షమాపణ ప్రకటించడం జరగాలి.

[48] మీరు ఈ విషయాలకు సాక్షులు.

[49] ఇదిగో వినండి, నా తండ్రి వాగ్దానం మీమీదికి పంపబోతున్నాను. పైనుంచి బలప్రభావాలు మిమ్ములను ఆవరించేంతవరకు జెరుసలం నగరంలోనే ఉండిపోండి” అని వారితో అన్నాడు.

[50] అప్పుడాయన బేతనీ వరకు వారిని తీసుకువెళ్ళి తన చేతులెత్తి వారిని దీవించాడు.

[51] వారిని దీవిస్తూ ఉండగానే వారిలోనుంచి ఆయనను పరలోకానికి తీసుకు వెళ్ళడం జరిగింది.

[52] వారాయనను ఆరాధించి మహానందంతో జెరుసలం తిరిగి వెళ్ళారు.

[53] దేవాలయంలో ఎప్పుడూ ఉండిపోయి దేవుణ్ణి కీర్తిస్తూ స్తుతిస్తూ వచ్చారు. తథాస్తు.

లూకా శుభవార్త — Chapters