Skip to content
Opens in a new window
Listen to this chapter • 11:52

[1] ఆయన తన పన్నెండుగురు శిష్యులను పిలుచుకొని వారికి దయ్యాలన్నిటి మీదా అధికారం, బలప్రభావాలు ఇచ్చాడు. రోగాలు కుదిర్చే సామర్థ్యం ఇచ్చాడు.

[2] దేవుని రాజ్యాన్ని ప్రకటించడానికీ రోగులను బాగు చేయడానికీ వారిని పంపుతూ

[3] “ప్రయాణం కోసం ఏమీ తీసుకువెళ్ళకండి – చేతికర్ర గానీ చేతిసంచి గానీ ఆహారం గానీ డబ్బు గానీ తీసుకువెళ్ళకండి. రెండు చొక్కాలు ఉంచుకోకండి.

[4] మీరు ఏ ఇంటిలో ప్రవేశిస్తారో ఆ ఇంటిలోనే బస చేయండి, అక్కడనుంచీ బయలుదేరండి.

[5] ఎవరైతే మిమ్ములను స్వీకరించరో మీరు ఆ గ్రామం విడిచి వెళ్ళేటప్పుడు వారికి వ్యతిరేకమైన సాక్ష్యంగా మీ పాద ధూళి దులిపివేయండి” అని వారితో చెప్పాడు.

[6] అప్పుడు వారు బయలుదేరి గ్రామ గ్రామాలకు వెళ్తూ అంతటా శుభవార్త ప్రకటిస్తూ రోగులను బాగు చేస్తూ ఉన్నారు.

[7] ఆయన చేస్తున్న వాటన్నిటిని గురించి రాష్ట్రాధికారి హేరోదు విన్నప్పుడు కలవరపడ్డాడు. ఎందుకంటే, బాప్తిసమిచ్చే యోహాను చనిపోయినవారిలోనుంచి సజీవంగా లేచాడని కొందరు అన్నారు.

[8] మరి కొందరు ఏలీయా కనిపించాడన్నారు. మరి కొందరు ప్రాచీన ప్రవక్తలలో ఒకడు మళ్ళీ లేచాడన్నారు.

[9] హేరోదు అన్నాడు “యోహాను తల నరికించాను గదా! మరి ఈ మనిషిని గురించి ఈ సంగతులు వింటున్నాను – ఇతడెవరు?” హేరోదు ఆయనను చూడడానికి ప్రయత్నించాడు.

[10] యేసు రాయబారులు తిరిగి వచ్చి తాము చేసినవన్నీ ఆయనతో చెప్పారు. అప్పుడు ఆయన వారిని వెంటబెట్టుకొని ఏకాంతంగా బేత్‌సయిదా అనే ఊరికి చెందిన నిర్జన స్థలానికి వెళ్ళాడు.

[11] అయితే జన సమూహాలు అది తెలుసుకొని ఆయన వెంట వెళ్ళారు. ఆయన వారిని స్వీకరించి దేవుని రాజ్యాన్ని గురించి వారితో మాట్లాడాడు, బాగుపడవలసిన వారిని బాగు చేశాడు.

[12] ప్రొద్దు క్రుంకుతూ ఉన్నప్పుడు తన పన్నెండుగురు శిష్యులు వచ్చి “మనం ఉన్నది నిర్జన స్థలం, ఈ జన సమూహం చుట్టుపట్ల గ్రామాలకూ పల్లెసీమకూ వెళ్ళి బస చేయడానికీ తినుబండారాలు చూచుకోవడానికీ వారిని పంపించండి” అని ఆయనతో అన్నారు.

[13] అయితే ఆయన వారితో “మీరే వారికి ఆహారం పెట్టండి” అన్నాడు. అందుకు వారు “మేము వెళ్ళి ఈ ప్రజలందరికోసం భోజనం కొనకుండా ఉంటే మన దగ్గర ఉన్నది అయిదు రొట్టెలు రెండు చేపలూ. మరేమీ లేదు.” అన్నారు.

[14] అక్కడ సుమారు అయిదు వేలమంది పురుషులు ఉన్నారు. ఆయన తన శిష్యులతో “వారిని గుంపులుగా ఒక్కొక్క గుంపులో యాభైమంది ప్రకారం కూర్చోబెట్టండి” అన్నాడు.

[15] అలాగే వారు వారందరినీ కూర్చోబెట్టారు.

[16] ఆయన ఆ అయిదు రొట్టెలూ రెండు చేపలూ చేతపట్టుకొని ఆకాశం వైపు తలెత్తి చూస్తూ వాటిని దీవించి విరిచి జన సమూహానికి వడ్డించడానికి శిష్యులకందించాడు.

[17] అందరూ తిని సంతృప్తి చెందారు. తరువాత వారు మిగిలిన ముక్కలను ఎత్తితే పన్నెండు గంపలు నిండాయి.

[18] ఒక సారి ఆయన ఏకాంతంగా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయన శిష్యులు ఆయనతో కూడా ఉన్నారు. వారిని చూచి ఆయన “జన సమూహాలు నేనెవరినని చెప్పుకొంటున్నారు?” అనడిగాడు.

[19] “బాప్తిసమిచ్చే యోహాను. ఏలీయావని అంటారు మరి కొందరు. మరి కొందరేమో ప్రాచీన ప్రవక్తలలో ఒకరు మళ్ళీ లేచారు అంటున్నారు” అని వారు జవాబిచ్చారు.

[20] “మీరైతే నేనెవరినని చెప్పుకొంటున్నారు?” అని ఆయన వారినడిగాడు. “దేవుని అభిషిక్తుడివే!” అని పేతురు ఆయనకు సమాధానం చెప్పాడు.

[21] ఈ సంగతి ఎవరికీ చెప్పకూడదని ఆయన వారిని ఖండితంగా హెచ్చరించి ఆదేశించాడు.

[22] “మానవ పుత్రుడు అనేక బాధలు అనుభవించి పెద్దల, ప్రధాన యాజుల, ధర్మశాస్త్రపండితుల నిరాకరణకు గురి అయి చంపబడి మూడో రోజున సజీవంగా లేపబడడం తప్పనిసరి” అన్నాడు.

[23] ఆయన అందరితో ఇలా అన్నాడు: “ఎవరైనా సరే నా వెంట రావాలనుకొంటే తనను నిరాకరించుకొని ప్రతి రోజూ తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరించాలి.

[24] తన కోసం తన జీవాన్ని దక్కించుకోవాలనుకొనేవాడు దానిని పోగొట్టు కొంటాడు. కానీ నా కోసం తన జీవాన్ని పోగొట్టుకొనేవాడు దానిని దక్కించుకొంటాడు.

[25] ఒక మనిషి లోకమంతా సంపాదించుకొని తననే పోగొట్టుకొంటే, లేదా నష్టపరచుకొంటే అతనికి లాభమేమిటి?

[26] ఎవరైనా సరే నన్ను గురించీ నా మాటల గురించీ సిగ్గుపడుతూ ఉంటే, మానవపుత్రుడు తన మహిమతోనూ తన తండ్రి మహిమతోనూ పవిత్ర దేవదూతల మహిమతోనూ వచ్చేటప్పుడు ఆ వ్యక్తిని గురించి సిగ్గుపడుతాడు.

[27] మీతో నిజం చెపుతున్నాను, ఇక్కడ నిలుచున్నవారిలో కొంతమంది దేవుని రాజ్యాన్ని చూచేవరకు చనిపోరు.”

[28] ఈ మాటలు చెప్పినది మొదలుకొని సుమారు ఎనిమిది రోజుల తరువాత ఆయన పేతురునూ యోహానునూ యాకోబునూ వెంటబెట్టుకొని ప్రార్థన చేయడానికి ఒక పర్వతం మీదికి వెళ్ళాడు.

[29] ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయన ముఖ కవళికలు మారాయి. ఆయన బట్టలు తెల్లనివై ధగధగ మెరిశాయి.

[30] ఉన్నట్టుండి ఇద్దరు మనుషులు కనబడి ఆయనతో మాట్లాడారు. వారు మోషే, ఏలీయా.

[31] వారు మహిమతో కనబడి జెరుసలంలో యేసు నెరవేర్చబోయే ఆయన మరణం విషయం మాట్లాడారు.

[32] పేతురు, అతనితో ఉన్నవారు నిద్ర భారంతో ఉన్నారు. కానీ పూర్తిగా మేల్కొని ఆయన మహిమనూ ఆయన దగ్గర నిలుచున్న ఆ ఇద్దరు మనుషులనూ చూశారు.

[33] ఆ ఇద్దరు యేసును విడిచి వెళ్లిపోతూ ఉంటే, పేతురు ఆయనతో ఇలా అన్నాడు: “నాయకా! మనం ఇక్కడ ఉండడం మంచిది. మూడు పర్ణశాలలను వేయనియ్యి – ఒకటి నీకు, ఒకటి మోషేకు, ఒకటి ఏలీయాకు.” అతడు ఏమి చెపుతున్నాడో అతనికే తెలియదు.

[34] అతడు ఈ మాటలు పలుకుతుండగానే ఒక మేఘం వచ్చి వారిని కమ్ముకొంది. మేఘం అలా కమ్ముకొంటూ ఉంటే శిష్యులు భయపడ్డారు.

[35] అప్పుడు మేఘంలో నుంచి ఒక స్వరం ఇలా వినిపించింది: “ఈయన నా ప్రియ కుమారుడు. ఈయన మాట వినండి.”

[36] ఆ స్వరం మాట్లాడిన తరువాత యేసు ఒక్కడే కనబడ్డాడు. వారు చూచినవాటిని గురించి మౌనం వహించి ఆ రోజుల్లో వాటిలో ఏది కూడా ఎవరికీ చెప్పలేదు.

[37] మర్నాడు వారు పర్వతం దిగి వచ్చినప్పుడు పెద్ద జన సమూహం ఆయనకెదురుగా వచ్చారు.

[38] ఆకస్మికంగా జన సమూహంలో ఒక మనిషి కంఠమెత్తి “ఉపదేశకా! వచ్చి నా కొడుకును కటాక్షించండని తమరిని వేడుకొంటున్నాను. నాకు అతడొక్కడే కొడుకు.

[39] అతణ్ణి ఒక ఆత్మ పూనుతుంది. ఉన్నట్టుండి అతడు పెడ బొబ్బలు పెడతాడు. అతడి నోటి వెంట నురుగు కారుతుంది. ఎందుకంటే అది అతణ్ణి విలవిలలాడిస్తుంది. అది అతణ్ణి నలగగొడుతూ చాలా కష్టంతో విడిచిపోతుంది.

[40] దానిని వెళ్ళగొట్టండని తమరి శిష్యులను వేడుకొన్నాను గాని వారిచేత కాలేదు” అన్నాడు.

[41] యేసు ఇలా బదులు చెప్పాడు: “విశ్వాసం లేని వక్ర తరమా! నేనెంతకాలం మీతో ఉండి మిమ్ములను సహించాలి! నీ కొడుకును ఇక్కడికి తీసుకురా.”

[42] ఆ అబ్బాయి వస్తూ ఉండగానే ఆ పిశాచం అతణ్ణి క్రింద పడవేసి విలవిలలాడించింది. అయితే యేసు ఆ మలిన ఆత్మను మందలించి అబ్బాయిని బాగు చేసి తండ్రికి అప్పచెప్పాడు.

[43] అందరూ దేవుని మహత్యానికి ఎంతో విస్మయమొందారు. యేసు చేస్తున్నదానంతటి విషయం ప్రజలంతా ఆశ్చర్యపడుతూ ఉన్నప్పుడు ఆయన తన శిష్యులను చూచి

[44] “ఈ మాటలు మీ చెవులలో దూరనివ్వండి – మానవ పుత్రుణ్ణి మనుషుల చేతులకు పట్టి ఇవ్వడం జరగబోతున్నది” అన్నాడు.

[45] వారైతే ఆ మాట గ్రహించలేదు. అది వారికి అర్థం కాకుండా దాచబడి ఉంది. ఆ మాట గురించి ఆయనను అడగడానికి వారికి భయంగా ఉంది కూడా.

[46] తమలో ఎవరు ప్రముఖుడో అని శిష్యుల మధ్య వివాదం పుట్టింది.

[47] వారి హృదయాలోచన గ్రహించి యేసు ఒక చిన్న బిడ్డను తీసుకొని తన ప్రక్కన నిలబెట్టి వారితో ఇలా అన్నాడు:

[48] “ఈ చిన్న బిడ్డను నా పేర ఎవరైనా స్వీకరిస్తే అతడు నన్ను స్వీకరిస్తున్నాడు. నన్ను స్వీకరించేవాడు ఎవడైనా నన్ను పంపినవాణ్ణి స్వీకరిస్తున్నాడు. మీ అందరిలో అల్పుడెవడో అతడే ప్రముఖుడు!”

[49] అందుకు యోహాను “నాయకా, నీ పేర ఎవరో ఒకడు దయ్యాలను వెళ్ళగొట్టడం చూశాం. అతడు మనల్ని అనుసరించేవాడు కాడు గనుక అతణ్ణి ఆటంకపరిచాం” అన్నాడు.

[50] అయితే యేసు అతనితో “అతణ్ణి ఆటంకపరచకండి. ఎందుకంటే మనకు వ్యతిరేకంగా లేనివాడు మన పక్షంవాడే” అన్నాడు.

[51] యేసును పరలోకానికి తీసుకువెళ్ళే సమయం దగ్గరపడింది. అప్పుడాయన జెరుసలం వెళ్ళడానికి మనసు దిటవు చేసుకొని తనకు ముందుగా దూతలను పంపాడు.

[52] వారు బయలుదేరి ఆయన కోసం అంతా సిద్ధం చేయడానికి సమరయవారి గ్రామాలలో ఒకదానికి వెళ్ళారు.

[53] కానీ ఆ గ్రామస్థులు ఆయనను స్వీకరించలేదు. ఎందుకంటే ఆయనకు జెరుసలం వెళ్ళాలని మనసు ఉంది.

[54] అది చూచి ఆయన శిష్యులైన యాకోబు యోహానులు అన్నారు “ప్రభూ! ఏలీయా చేసినట్టు వీళ్ళను భస్మం చేసేలా మేము ఆజ్ఞ ఇచ్చి ఆకాశం నుంచి మంటలు రప్పించాలని నీ ఇష్టమా?”

[55] ఆయన వారివైపు తిరిగి, వారిని మందలించాడు. “మీకు ఎలాంటి ఆత్మతో సంబంధం ఉన్నదో మీకు తెలియదు.

[56] ఎందుకంటే, మానవ పుత్రుడు వచ్చినది మనుషుల ప్రాణాలను నాశనం చేయడానికి కాదుగాని వాటిని రక్షించడానికే” అన్నాడు. అప్పుడు వారు వేరే గ్రామానికి తరలి వెళ్ళారు.

[57] వారు దారిన సాగిపోతూ ఉంటే ఎవరో ఒక మనిషి “ప్రభూ! మీరెక్కడికి వెళ్ళినా సరే నేను మీ వెంటే వస్తాను” అన్నాడు.

[58] అందుకు యేసు అతనితో “నక్కలకు గుంటలు ఉన్నాయి, గాలిలో ఎగిరే పక్షులకు గూళ్ళు ఉన్నాయి గానీ మానవపుత్రునికి తలవాల్చుకొనే స్థలం ఏదీ లేదు” అన్నాడు.

[59] మరో మనిషితో “నా వెంట రా!” అన్నాడు. అతడైతే “ప్రభూ, మొట్టమొదట నేను వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టేంత వరకూ సెలవియ్యండి” అన్నాడు.

[60] యేసు అతణ్ణి చూచి “చనిపోయినవారే చనిపోయిన తమ వారిని పాతిపెట్టనియ్యి. నీవైతే వెళ్ళి దేవుని రాజ్యాన్ని ప్రకటించు” అన్నాడు.

[61] మరొకడు ఇలా అన్నాడు: “ప్రభూ, నేను నీ వెంట వస్తాను గాని మొట్టమొదట వెళ్ళి నా ఇంట్లో వారికి వీడ్కోలు చెప్పనివ్వండి.”

[62] అయితే యేసు అతనితో “నాగలి మీద చేయి పెట్టి వెనక్కు చూచేవాడెవడూ దేవుని రాజ్యానికి తగడు” అన్నాడు.

లూకా శుభవార్త — Chapters