Skip to content
Opens in a new window
Listen to this chapter • 11:12

[1] ఆ తరువాత ఆయన ప్రతి పట్టణానికీ గ్రామ గ్రామానికి వెళ్తూ దేవుని రాజ్యాన్ని గురించిన శుభవార్త బోధిస్తూ ప్రకటిస్తూ ఉన్నాడు. ఆయనతోపాటు ఉన్నది తన పన్నెండుగురు శిష్యులూ,

[2] పిశాచాలు పట్టినప్పుడు, లేదా జబ్బు చేసినప్పుడు ఆయనచేత బాగుపడ్డ స్త్రీలు కొందరూ. వీరెవరంటే, మగ్దలేనే అనబడ్డ మరియ (ఆమెలో నుంచి ఏడు దయ్యాలు వెళ్ళిపోయాయి),

[3] హేరోదు గృహ నిర్వాహకుడైన కుజా భార్య యోహన్న, సుసాన్నా మొదలైనవారు అనేకమంది. వీరు తమ ఆస్తిలోనుంచి ఆయనకు సహాయం చేసేవారు.

[4] ఒకప్పుడు పెద్ద జనసమూహం సమకూడితే, ప్రజలు ప్రతి పట్టణంనుంచీ ఆయన దగ్గరకు వస్తూ ఉంటే, ఆయన ఈ ఉదాహరణ చెప్పాడు:

[5] “విత్తనాలు చల్లేవాడు చల్లడానికి బయలుదేరాడు. విత్తనాలు చల్లుతూ ఉంటే, కొన్ని దారిప్రక్కన పడ్డాయి. అవి కాళ్ళక్రింద త్రొక్కబడ్డాయి. గాలిలో ఎగిరే పక్షులు వాటిని మ్రింగివేశాయి.

[6] మరి కొన్ని విత్తనాలు రాతి నేల మీద పడ్డాయి. లోపల తడిలేదు గనుక మొలిచిన వెంటనే అవి ఎండిపోయాయి.

[7] మరి కొన్ని విత్తనాలు ముండ్ల తుప్పల మధ్య పడ్డాయి. ముండ్ల తుప్పలు వీటితోపాటు పెరిగి వాటిని అణిచివేశాయి.

[8] మరి కొన్ని విత్తనాలు మంచి నేలను పడ్డాయి. ఇవి మొలిచి పెరిగి నూరు రెట్లు పంట పండాయి.” ఇలా చెప్పి ఆయన “వినడానికి చెవులున్నవాడు వింటాడు గాక!” అని బిగ్గరగా అన్నాడు.

[9] ఆయన శిష్యులు “ఈ ఉదాహరణకు అర్థం ఏమిటి?” అని ఆయననడిగారు.

[10] అందుకాయన అన్నాడు, “దేవుని రాజ్య రహస్య సత్యాలు తెలుసుకోవడం మీకు ఇవ్వబడినది గాని ఇతరులకు ఉదాహరణలలో ఉపదేశిస్తున్నాను. కారణం ఏమంటే, వారు చూస్తూ ఉన్నా చూడకుండా ఉండాలి. వింటూ ఉన్నా అర్థం చేసుకోకుండా ఉండాలి.

[11] ఈ ఉదాహరణ భావమిది: విత్తనమంటే దేవుని వాక్కు.

[12] దారిప్రక్కన ఉన్నవారంటే వాక్కు వినేవారు గానీ అపనింద పిశాచం వచ్చి వారి హృదయంలోనుంచి వాక్కు తీసివేస్తాడు. వారు నమ్మకుండా పాపవిముక్తి పొందకుండా చేయాలని వాడి ఉద్దేశం.

[13] రాతి నేల మీద ఉన్నవారంటే వాక్కు విని సంతోషంతో అంగీకరించేవారు. కానీ వీరిలో వేరులు లేకపోవడంచేత కొద్ది కాలమే నమ్ముతారు. విషమ పరీక్షల కాలంలో తొలగిపోతారు.

[14] ముళ్ళ తుప్పలలో పడ్డ విత్తనాలు అంటే వాక్కు వినేవారు గాని తమ దారిన సాగుతూ ఉంటే జీవితంలో చీకుచింతలతో, సంపదలతో, సుఖభోగాలతో అణగారిపోయేవారు. వీరి ఫలం ఏదీ పరిపక్వం చెందదు.

[15] మంచి నేలలో పడ్డ విత్తనాలంటే హితమైన మంచి హృదయం కలిగి వాక్కు విని నిలుపుకొని ఓర్పు కలిగి ఫలించేవారు.

[16] “ఎవడూ దీపం వెలిగించి దానిమీద పాత్రతో కప్పడు లేదా, దానిని మంచం క్రింద పెట్టడు. లోపలికి వచ్చేవారికి వెలుగు కనిపించేలా దానిని దీప స్తంభంమీద ఉంచుతాడు.

[17] దాచి ఉంచినది ఏదీ తేటతెల్లంకాకుండా ఉండదు. రహస్యంగా ఉంచినది ఏదీ తెలిసిపోకుండా ఉండదు.

[18] గనుక మీరెలా వింటున్నారో బాగా చూచుకోండి. ఎందుకంటే, కలిగిన వ్యక్తికి ఇంకా ఇవ్వడమూ, లేని వ్యక్తి నుంచి ఉన్నదని కనిపించేది కూడా తీసివేయడమూ జరుగుతుంది.”

[19] ఆయనను చూడడానికి ఆయన తల్లి, తమ్ముళ్ళు వచ్చారు. జనసమూహాన్ని బట్టి ఆయన దగ్గరకు రాలేక ఉన్నారు.

[20] “మిమ్ములను చూడాలని మీ తల్లి, మీ తమ్ముళ్ళు బయట నిలుచున్నారు” అని ఎవరో ఆయనతో అన్నారు.

[21] అందుకాయన జవాబిస్తూ వారితో “దేవుని వాక్కు విని దాని ప్రకారం చేసేవారే నా తల్లి, నా తమ్ముళ్ళు” అన్నాడు.

[22] ఒకానొక రోజున ఆయన తన శిష్యులతోపాటు పడవ ఎక్కి వారితో “సరస్సు అవతలి ఒడ్డుకు వెళ్దాం పదండి” అన్నాడు. వారు పడవ సరస్సులోకి త్రోసి బయలుదేరారు.

[23] వారు పడవ నడుపుతూ ఉన్నప్పుడు ఆయన నిద్రపోయాడు. ఇంతలో సరస్సుమీదికి తుఫాను వచ్చింది. వారు ఉన్న పడవ నీళ్ళతో నిండిపోతూ ఉంది. వారు అపాయంలో చిక్కుకొన్నారు.

[24] కనుక ఆయనదగ్గరకు వచ్చి ఆయనను మేల్కొలిపి “నాయకా! నాయకా! నశించిపోతున్నాం!” అన్నారు. ఆయన లేచి గాలినీ ఉప్పెననూ మందలించాడు. అవి నిమ్మళమయ్యాయి. అంతా ప్రశాంతమైపోయింది.

[25] అప్పుడాయన వారితో “మీ విశ్వాసం ఎక్కడ?” అన్నాడు. వారు భయపడుతూ ఎంతో ఆశ్చర్యపోతూ “ఈయన గాలికీ నీళ్ళకూ ఆజ్ఞ జారీ చేస్తే అవి లోబడుతున్నాయే! ఈయన ఎవరో!” అని ఒకనితో ఒకడు చెప్పుకొన్నారు.

[26] వారు పడవ నడుపుతూ గలలీకి ఎదురుగా ఉన్న గడారీన్‌వారి ప్రాంతం చేరారు.

[27] ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ గ్రామానికి చెందినవాడొకడు ఆయనకు ఎదురుగా వచ్చాడు. అతడు చాలా కాలంపాటు దయ్యాలు పట్టినవాడు. అతడు బట్టలు తొడుక్కోకుండా, ఏ ఇంటిపట్టున ఉండకుండా సమాధులలోనే నివసించేవాడు.

[28] యేసును చూచి అతడు కేక పెట్టి ఆయన ముందు సాగిలపడి “యేసూ! సర్వాతీతుడైన దేవుని కుమారా! నా జోలి నీకెందుకు? నన్ను వేధించకని నిన్ను వేడుకొంటున్నాను!” అని అరిచాడు.

[29] ఎందుకంటే ఆయన “ఈ మనిషిలోనుంచి బయటికి రా!” అని ఆ మలిన పిశాచానికి ఆజ్ఞ జారీ చేశాడు. ఆ పిశాచం అతణ్ణి తరచుగా పట్టేది. అక్కడివారు అతణ్ణి గొలుసులతో, కాలి సంకెళ్ళతో కట్టి కాపలా కాచినా అతడు బంధకాలు తెంపి ఆ దయ్యంచేత నిర్జన ప్రదేశాలకు తీసుకుపోబడ్డాడు.

[30] యేసు “నీ పేరేమిటి?” అని అతణ్ణి అడిగాడు. అతడు “సేన” అన్నాడు. ఎందుకంటే అతనిలో చొరబడినది అనేక పిశాచాలు.

[31] అవి తమను అగాధంలోకి పోవడానికి ఆజ్ఞాపించవద్దని ఆయనను ప్రాధేయపడ్డాయి.

[32] అక్కడ కొండమీద ఒక పెద్ద పందుల మంద మేస్తూ ఉంది. వాటిలో ప్రవేశించడానికి తమకు సెలవిమ్మని పిశాచాలు ఆయనను ప్రాధేయపడ్డాయి. ఆయన వాటికి సెలవిచ్చాడు.

[33] ఆ దయ్యాలు ఆ మనిషిలోనుంచి బయటికి వచ్చి ఆ పందులలో చొరబడ్డాయి. అప్పుడా పందుల మంద నిటారమైన ఆ స్థలంమీదనుంచి వేగంగా పరుగెత్తుతూ సరసులో పడి మునిగి చచ్చాయి.

[34] పందులు మేపేవారు జరిగినది చూచి పారిపోయి ఆ సంగతి ఊరిలో, ఆ పల్లెసీమలో చెప్పారు.

[35] జరిగినది ఏమిటో చూద్దామని అక్కడివారు వచ్చారు. యేసు దగ్గరకు చేరినప్పుడు, దయ్యాలు వదలిపోయిన ఆ మనిషి బట్టలు తొడుక్కొని మనఃస్థిమితంతో యేసు పాదాలదగ్గర కూర్చుని ఉండడం చూశారు. వారికి భయం వేసింది.

[36] జరిగినది చూచినవారు దయ్యాలు పట్టినవాడు ఎలా ఆరోగ్యం పొందాడో వారికి తెలియజేశారు.

[37] అప్పుడు తమ దగ్గరనుంచి వెళ్ళిపొమ్మని గడారీన్‌వారి ప్రాంతీయులంతా ఆయనను కోరారు. ఎందుకంటే వారినెంతో భయం ఆవరించింది. ఆయన పడవ ఎక్కి బయలుదేరాడు.

[38] ఆయనతో ఉండనిమ్మని దయ్యాలు వదలిపోయినవాడు ఆయనను వేడుకొన్నాడు గాని యేసు అతణ్ణి పంపివేస్తూ

[39] “నీవు నీ సొంత ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నీకెంత గొప్ప క్రియలు చేశాడో తెలియజెయ్యి” అన్నాడు. అతడు వెళ్ళి యేసు తనకెంత గొప్ప క్రియలు చేశాడో ఊరంతటా చెప్పాడు.

[40] అవతలి ఒడ్డున జనసమూహం యేసు కోసం చూస్తూ ఉన్నారు గనుక ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయనను సంతోషంతో స్వీకరించారు.

[41] అప్పుడు యూద సమాజ కేంద్రం అధికారి ఒకడు వచ్చాడు. అతని పేరు యాయీరు. అతడు యేసు పాదాల దగ్గర సాగిలపడి తన ఇంటికి రమ్మని ఆయనను ప్రాధేయపడ్డాడు.

[42] ఎందుకంటే అతని ఒకే ఒక కూతురు సుమారు పన్నెండేళ్ళ బాలిక చావు బ్రతుకులలో ఉంది. ఆయన వెళ్తూ ఉంటే జనసమూహాలు ఆయనమీద విరగబడుతూ ఉన్నారు.

[43] పన్నెండేళ్ళనుంచి రక్తస్రావంతో ఉన్న ఒక స్త్రీ అక్కడ ఉంది. ఆమె తన బ్రతుకుదెరువంతా వైద్యుల దగ్గర ఖర్చు చేసింది గాని వారిలో ఎవరిచేత స్వస్థత పొందలేకపోయింది.

[44] ఆమె ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రం అంచు తాకింది. వెంటనే ఆమెకు రుతుస్రావం ఆగిపోయింది.

[45] “నన్ను తాకినదెవరు?” అని యేసు అడిగాడు. అందరూ తాము కాదు అన్నారు. పేతురు, అతనితో ఉన్నవారు “నాయకా! ఈ జనసమూహాలు కిక్కిరిసి నీమీద పడుతూ ఉన్నారు గదా! అయినా నీవు ‘నన్ను తాకినదెవరు?’ అంటున్నావు.”

[46] అయితే యేసు అన్నాడు “ఎవరో నన్ను తాకారు. నాలో నుంచి ప్రభావం బయలుదేరిందని నాకు తెలిసింది.”

[47] తాను దాగి ఉండలేనని గ్రహించి ఆ స్త్రీ వణకుతూ వచ్చి ఆయన ముందు సాగిల పడింది. తానెందుకు యేసును తాకినదీ, తన వ్యాధి ఎలా వెంటనే పూర్తిగా నయమైనదీ ప్రజలందరి ఎదుట ఆయనకు చెప్పింది.

[48] అప్పుడాయన ఆమెతో “కుమారీ, ధైర్యంగా ఉండు. నీ నమ్మకం నిన్ను బాగు చేసింది. శాంతితో వెళ్ళు” అన్నాడు.

[49] ఆయన ఇంకా మాట్లాడుతూ ఉండగానే ఆ సమాజ కేంద్రం అధికారి ఇంటినుంచి ఒకడు వచ్చి “మీ కూతురు చనిపోయింది. ఉపదేశకుణ్ణి తొందర పెట్టకండి” అన్నాడు.

[50] అది విని యేసు అతనితో “భయపడకు! నమ్మకం మాత్రం ఉంచు. అప్పుడామె బాగుపడుతుంది” అని జవాబిచ్చాడు.

[51] ఆ ఇంటికి వచ్చినప్పుడు ఆయన పేతురునూ యాకోబునూ యోహానునూ ఆ అమ్మాయి తల్లిదండ్రులనూ తప్ప ఎవరినీ లోపలికి రానివ్వలేదు.

[52] అమ్మాయిని గురించి అక్కడివారంతా ఏడుస్తూ రోదనం చేస్తూ ఉన్నారు. ఆయన “ఏడవకండి. ఆమె చనిపోలేదు. నిద్రపోతూ ఉంది” అన్నాడు.

[53] ఆమె చనిపోయిందని తెలిసి వారు నవ్వి ఆయనను వేళాకోళం చేశారు.

[54] అయితే ఆయన వారందరినీ బయటికి పంపివేసి ఆమె చేయి తన చేతిలోకి తీసుకొని “చిన్నపిల్లా! లే!” అన్నాడు.

[55] ఆమెకు తన ఆత్మ తిరిగి వచ్చి ఆమె వెంటనే లేచింది. ఆమెకు తినడానికి ఏదైనా పెట్టాలని చెప్పాడు.

[56] ఆమె తల్లిదండ్రులకు ఎంతో విస్మయం కలిగింది. కానీ జరిగినది ఎవరికీ చెప్పకండని ఆయన వారిని ఆదేశించాడు.

లూకా శుభవార్త — Chapters