Skip to content
Opens in a new window
Listen to this chapter • 13:20

[1] అప్పుడు వారి గుంపంతా లేచి ఆయనను పిలాతు దగ్గరకు తీసుకువెళ్ళారు.

[2] “ఈ మనిషి ప్రజలను తప్పు త్రోవ పట్టిస్తున్నాడు. సీజర్‌కు పన్ను చెల్లించకూడదని అంటున్నాడు, తానే క్రీస్తును ఒక రాజును అంటున్నాడు. ఇదంతా మేము కనిపెట్టాం” అంటూ వారు ఆయనమీద నేరాలు మోపసాగారు.

[3] పిలాతు “నీవు యూదుల రాజువా?” అని ఆయనను అడిగాడు. “నీవన్నట్టే” అని ఆయన అతనికి జవాబిచ్చాడు.

[4] పిలాతు ప్రధాన యాజులతో, ఆ సమూహంతో “ఈ మనిషిలో నాకెలాంటి దోషమూ కనిపించడం లేదు” అన్నాడు.

[5] అయితే వారు మరీ తీవ్రతరంగా నొక్కి చెపుతూ “ఇతడు గలలీ మొదలుకొని ఈ స్థలం వరకు, యూదయ అంతటా ఉపదేశిస్తూ ప్రజలను రెచ్చగొడుతున్నాడు!” అన్నారు.

[6] గలలీ అనే మాట విని పిలాతు “ఈ మనిషి గలలీవాడా?” అని అడిగాడు.

[7] హేరోదు అధికార పరిధికి యేసు చెందినవాడని తెలుసుకొన్న వెంటనే పిలాతు ఆయనను హేరోదు దగ్గరకు పంపాడు. ఆ రోజుల్లో హేరోదు జెరుసలంలోనే ఉన్నాడు.

[8] హేరోదు యేసును చూచి ఎంతో సంతోషించాడు. ఎందుకంటే చాలా కాలంనుంచి ఆయనను గురించి అనేక సంగతులు వింటూ ఆయనను చూడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన ఏదైనా అద్భుతం చేస్తే చూడాలని ఆశిస్తూ ఉన్నాడు కూడా.

[9] అతడు ఆయనను అనేక మాటలతో ప్రశ్నించాడు గాని ఆయన అతనికేమీ జవాబు చెప్పలేదు.

[10] ప్రధాన యాజులూ ధర్మశాస్త్ర పండితులూ అక్కడ నిలుచుండి ఆయనమీద తీవ్రంగా నేరాలు మోపుతూ ఉన్నారు.

[11] తరువాత హేరోదు, అతని సైనికులు ఆయనను ధిక్కరించి వెక్కిరించి ఆయనకు శోభాయమాన వస్త్రాన్ని తొడిగించి మళ్ళీ పిలాతు దగ్గరకు పంపారు.

[12] ఆ రోజే హేరోదు, పిలాతు ఒకనికొకడు స్నేహితులయ్యారు. అంతకు ముందు వారి మధ్య వైరం ఉంది.

[13] అప్పుడు పిలాతు ప్రధాన యాజులనూ అధికారులనూ ప్రజలనూ పిలిపించి వారితో ఇలా అన్నాడు:

[14] “ప్రజలను తప్పుదారి పట్టించే వాడంటూ మీరీ మనిషిని నా దగ్గరికి తీసుకువచ్చారు. ఇదిగో వినండి, మీ ఎదుటే నేను అతణ్ణి విమర్శించాను గాని అతనిమీద మీరు మోపిన నేరాల విషయంలో ఏ దోషమూ ఈ మనిషిలో నాకు కనబడలేదు.

[15] హేరోదుకు కూడా కనబడలేదు. నేను మిమ్మల్ని మళ్ళీ అతడి దగ్గరకు పంపాను గదా! చూడండి, ఇతడు మరణానికి తగిన పని ఏదీ చేయలేదు.

[16] అందుచేత నేనితణ్ణి శిక్షించి విడుదల చేస్తాను.”

[17] ఆ పండుగ సమయంలో అతడు వారికి ఎవరైనా ఒకడిని విడుదల చేయడం తప్పనిసరి.

[18] అయితే వారంతా ఏకగ్రీవంగా “ఈ మనిషి ప్రాణాన్ని తీసెయ్యండి. మాకు బరబ్బను విడుదల చేయండి!” అని అరిచారు.

[19] ఈ బరబ్బ ఆ నగరంలో తిరుగుబాటు జరిగించినందుచేత, హత్య చేసినందుచేత ఖైదుపాలయిన వాడు.

[20] యేసును విడుదల చేద్దామని ఆశించి పిలాతు వారితో మరో సారి మాట్లాడాడు.

[21] వారైతే “ఇతణ్ణి సిలువ వేయండి! సిలువ వేయండి!” అని కేకలు వేశారు.

[22] అతడు మూడో సారి వారితో “ఎందుకు? ఇతడు ఏం కీడు చేశాడు? మరణశిక్షకు కారణమేమీ ఇతడిలో నాకు కనబడలేదు. అందుచేత ఇతణ్ణి శిక్షించి విడుదల చేస్తాను” అన్నాడు.

[23] వారైతే పట్టుబట్టి బిగ్గరగా కంఠమెత్తి ఆయనను సిలువ వేయాలని కోరారు. చివరికి ఈ మనుష్యుల, ప్రధాన యాజుల కంఠధ్వనులే నెగ్గాయి.

[24] వారు అడిగినట్టే జరగాలని పిలాతు తీర్పు చెప్పాడు.

[25] వారు కోరినవాణ్ణి – తిరుగుబాటు, హత్య కారణంగా ఖైదుపాలయిన ఆ మనిషిని – వారికి విడుదల చేశాడు, యేసును వారికిష్టం వచ్చినట్టే చేయడానికి వారికప్పగించాడు.

[26] వారాయనను తీసుకువెళ్ళిపోతూ ఉన్నప్పుడు పల్లెసీమనుంచి వస్తున్న కురేనే ప్రాంతీయుడైన సీమోనును పట్టుకొన్నారు. యేసువెంట సిలువను మోయడానికి దానిని అతనిమీద పెట్టారు.

[27] పెద్ద జనసమూహం ఆయన వెంట వచ్చారు. వారిలో కొందరు స్త్రీలు ఉన్నారు. వీరు ఆయన విషయం గుండెలు బాదుకొంటూ రోదనం చేస్తూ ఉన్నారు కూడా.

[28] యేసు వారివైపు తిరిగి “జెరుసలం కూతుళ్ళారా! నా కోసం ఏడవకండి – మీకోసం, మీ పిల్లలకోసం ఏడ్వండి!

[29] ఎందుకంటే, ‘గొడ్రాళ్ళు ధన్యులు! ఎన్నడూ కనని గర్భాలూ పాలియ్యని స్తనాలూ ధన్యం!’ అని జనం చెప్పుకొనే రోజులు వస్తాయి.

[30] అప్పుడు వారు పర్వతాలతో ‘మా మీద పడండి!’ కొండలతో ‘మమ్మల్ని మరుగు చేయండి!’ అని చెప్పనారంభిస్తారు.

[31] వారు పచ్చని చెట్టు ఉన్న సమయంలో ఇలా చేస్తే ఎండిన దాని సమయంలో ఏమి జరుగుతుందో?” అన్నాడు.

[32] నేరస్థులను ఇద్దరిని కూడా ఆయనతోపాటు చంపడానికి తెచ్చారు.

[33] వారు కల్వరి అనే స్థలానికి వచ్చినప్పుడు వారాయనను అక్కడ సిలువ వేశారు. ఆ నేరస్థులను కూడా ఒకణ్ణి ఆయన కుడివైపున, మరొకణ్ణి ఎడమ వైపున సిలువ వేశారు.

[34] అప్పుడు యేసు “తండ్రీ! వీరు చేస్తున్నదేమిటో వీరికి తెలియదు గనుక వీరిని క్షమించు” అన్నాడు. వారు ఆయన బట్టలకోసం చీట్లు వేసి పంచుకొన్నారు.

[35] ప్రజలు అక్కడ నిలుచుండి చూస్తూ ఉన్నారు. వారి మధ్య ఉన్న అధికారులైతే ఆయనను అపహాస్యం చేస్తూ “ఇతడు ఇతరుల్ని రక్షించాడు. దేవుడు ఎన్నుకొన్న అభిషిక్తుడు ఇతడే అయితే తనను తాను రక్షించుకోవాలి!” అన్నారు.

[36] సైనికులు కూడా ఆయనను వెక్కిరించారు. ఆయన దగ్గరకు వచ్చి పులిసిపోయిన ద్రాక్షరసం ఆయనకు ఇవ్వబోతూ

[37] “నీవు యూదుల రాజువైతే నిన్ను నీవు రక్షించుకో!” అన్నారు.

[38] “ఇతడు యూదుల రాజు” అని వ్రాసి ఆయనకు పైగా ఉంచారు. ఈ వ్రాత గ్రీక్, లాటిన్, హీబ్రూ అక్షరాలలో ఉంది.

[39] వ్రేలాడుతున్న నేరస్థులలో ఒకడు ఆయనను దూషిస్తూ “నువ్వు అభిషిక్తుడివైతే నిన్ను నీవే రక్షించుకో! మమ్మల్ని కూడా రక్షించు!” అన్నాడు.

[40] అయితే రెండో నేరస్థుడు అతణ్ణి చీవాట్లు పెట్టి ఇలా జవాబిస్తూ అన్నాడు: “నువ్వూ ఇదే శిక్షావిధికింద ఉన్నావుగా. దేవుడంటే నీకేం భయం లేదా?

[41] మనకు ఈ శిక్ష న్యాయమే. మనం చేసినవాటికి తగిన ప్రతిఫలం పొందుతూ ఉన్నాం. కానీ ఈ మనిషి ఏ తప్పిదమూ చేయలేదు.”

[42] అప్పుడతడు యేసుతో “ప్రభూ, మీరు మీ రాజ్యంలో ప్రవేశించేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి” అన్నాడు.

[43] అతనితో యేసు “నీతో ఖచ్చితంగా చెపుతున్నాను, ఈ రోజే నీవు నాతో కూడా పరమానంద నివాసంలో ఉంటావు” అన్నాడు.

[44] సుమారు మధ్యాహ్నం కావచ్చినప్పుడు మూడు గంటల వరకు దేశమంతటా చీకటి కమ్మింది.

[45] సూర్యమండలం అంధకారమయం అయింది, దేవాలయం తెర రెండుగా చింపబడింది.

[46] అప్పుడు యేసు బిగ్గరగా కేక వేసి “తండ్రీ! నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొంటున్నాను” అన్నాడు. అలా చెప్పి ప్రాణం విడిచాడు.

[47] జరిగినది చూచి శతాధిపతి “ఈ మనిషి నిజంగా న్యాయవంతుడు” అంటూ దేవుణ్ణి కీర్తించాడు.

[48] చూడడానికి పోగైన జనసమూహమంతా జరిగినది చూచి గుండెలు బాదుకొంటూ తిరిగి వెళ్ళిపోయారు.

[49] ఆయనతో పరిచయమున్న వారంతా, గలలీనుంచి ఆయనవెంట వచ్చిన స్త్రీలు కూడా, దూరంగా నిలుచుండి జరిగినవి చూస్తూ ఉన్నారు.

[50] యూద సమాలోచన సభలో యోసేపు అనే వ్యక్తి ఉండేవాడు. అతడు మంచివాడు, న్యాయవంతుడు.

[51] అతడు ఆ సభ వారు చేసిన నిర్ణయానికీ క్రియకూ ఒప్పుకోలేదు. అతడు యూదుల గ్రామాలలో ఒకటైన అరిమతయి నివాసి, దేవుని రాజ్యంకోసం ఎదురు చూస్తున్నవాడు.

[52] ఈ మనిషి పిలాతుదగ్గరకు వెళ్ళి యేసు దేహాన్ని తనకిప్పించమని అడిగాడు.

[53] సిలువమీద నుంచి దానిని క్రిందకు దింపి సన్నని నారబట్టతో చుట్టాడు, తొలిచిన రాతి సమాధిలో ఉంచాడు. దానిలో అంతకు ముందు ఎవరూ ఉంచబడలేదు.

[54] అది పండుగకు సిద్ధపడే దినం. విశ్రాంతి దినం మొదలు కాబోతూ వుంది.

[55] గలలీనుంచి ఆయనతోకూడా వచ్చిన స్త్రీలు యోసేపు వెంట వెళ్ళి సమాధిని చూశారు, ఆయన దేహాన్ని దానిలో ఎలా ఉంచాడో గమనించారు.

[56] అప్పుడు తిరిగి వెళ్ళి సుగంధ ద్రవ్యాలూ పరిమళ తైలాలూ సిద్ధం చేసి దేవుని ఆజ్ఞ ప్రకారం విశ్రాంతి దినాన విశ్రమించారు.

లూకా శుభవార్త — Chapters