[1] ఆ సమయంలో అక్కడున్న కొందరు ఆయనతో ఒక సంగతి చెప్పారు. ఏమిటంటే, పిలాతు గలలీ ప్రజలలో కొందరి రక్తాన్ని వారి బలులతో కలిపాడు.
[2] యేసు వారికిలా జవాబిచ్చాడు: “ఈ గలలీవారికి ఇలాంటివి పట్టినందుచేత గలలీ ప్రజలందరిలో వారే ఎక్కువ ఘోరమైన పాపిష్టివారని మీరనుకొంటున్నారా?
[3] కారని మీతో చెపుతున్నాను. పశ్చాత్తాపపడకపొయ్యారా, మీరూ ఇలాగే నాశనమైపోతారు.
[4] సిలోయం గోపురం వారిమీద కూలినప్పుడు చనిపోయిన ఆ పద్ధెనిమిదిమంది జెరుసలం నివాసులందరిలో ఎక్కువ ఘోరమైన పాపిష్టివారని మీరను కొంటున్నారా?
[5] కారని మీతో చెపుతున్నాను. పశ్చాత్తాప పడకపొయ్యారా, మీరూ అలాగే నాశనమైపోతారు.”
[6] అప్పుడాయన ఈ ఉదాహరణ చెప్పాడు: “ఒక మనిషికి తన ద్రాక్షతోటలో నాటి ఉన్న అంజూర చెట్టు ఒకటి ఉంది. అతడు దాని పండ్లు వెదకడానికి వచ్చాడు. అయితే ఒక్క పండు కూడా కనబడలేదు.
[7] అప్పుడు ద్రాక్షతోటమాలితో ‘ఇదిగో, ఈ అంజూర చెట్టుపండ్లు వెదకడానికి మూడేళ్ళ నుంచి వస్తున్నాను గాని ఒక్కటి కూడా కనబడలేదు. ఈ చెట్టువల్ల ఈ భూమికి దుర్వినియోగం ఎందుకు? దీనిని నరికివెయ్యి!’ అన్నాడు.
[8] అయితే తోటమాలి అతనితో ‘ఈ సంవత్సరం కూడా దీనిని ఉండనివ్వండయ్యా! దీని పాదు తవ్వి ఎరువు వేస్తాను.
[9] అది కాయలు కాస్తే సరే. లేదా, ఆ తరువాత మీరు దీనిని నరికేసెయ్యవచ్చు’ అన్నాడు.”
[10] ఒక విశ్రాంతి దినాన ఆయన ఒక సమాజ కేంద్రంలో ఉపదేశిస్తూ ఉన్నాడు.
[11] పద్ధెనిమిది ఏళ్ళనుంచి ఒక పిశాచం వల్ల కలిగిన జబ్బుతో ఉన్న స్త్రీ ఒకతె అక్కడ ఉంది. నడుము వంగిపోయి ఆమె ఎంతమాత్రం చక్కగా నిలబడలేని స్థితిలో ఉంది.
[12] యేసు ఆమెను చూచి దగ్గరకు పిలిచాడు, ఆమెతో “అమ్మా, నీ రోగంనుంచి నీకు విడుదల కలిగింది!” అన్నాడు.
[13] ఆమెమీద చేతులుంచగానే ఆమె తిన్నని వెన్నెముక గలిగి, దేవుణ్ణి స్తుతించసాగింది.
[14] విశ్రాంతి దినాన యేసు రోగిని బాగు చేసినందుచేత సమాజ కేంద్రం అధికారి కోపంతో మండిపడి జన సమూహంతో “పని చేయడానికి వారంలో ఆరు రోజులున్నాయి గదా! ఆ రోజుల్లో వచ్చి మీ రోగాలు బాగు చేయించుకోండి గాని విశ్రాంతి దినాన కాదు” అన్నాడు.
[15] అందుకు జవాబిస్తూ ప్రభువు అతనితో ఇలా అన్నాడు: “కపట భక్తుడా! విశ్రాంతి దినాన మీలో ప్రతి ఒక్కడూ ఎద్దును గానీ గాడిదను గానీ విప్పి కొట్టంనుంచి నీళ్ళకు తోలుకు పోతారు గదా!
[16] పద్ధెనిమిది ఏళ్ళపాటు సైతాను బంధించిన ఈ స్త్రీ, అబ్రాహాము వంశికురాలైన ఈ స్త్రీ ఆ బంధకం నుంచి విశ్రాంతి దినాన విడిపించబడకూడదా ఏమిటి?”
[17] ఆయన అలా అన్నప్పుడు ఆయన వ్యతిరేకులు అవమానం పాలయ్యారు గాని జనమంతా ఆయన చేస్తున్న ఘన కార్యాలన్నిటికీ సంతోషించారు.
[18] అప్పుడాయన “దేవుని రాజ్యం ఎలా ఉంటుంది? దేనితో దానిని పోలుస్తాను?
[19] ఒక మనిషి ఆవ గింజను తీసుకొని తన తోటలో నాటాడు. అది పెరిగి పెద్ద చెట్టయింది. గాలిలో ఎగిరే పక్షులు దాని కొమ్మలమీద గూళ్ళు కట్టుకొన్నాయి. దేవుని రాజ్యం ఆ విధంగా ఉంది” అన్నాడు.
[20] ఆయన ఇంకా అన్నాడు “నేను దేనితో దేవుని రాజ్యాన్ని పోల్చాలి?
[21] ఒక స్త్రీ మూడు మానికల పిండిలో పొంగజేసే పదార్థం దాచి పెట్టింది. దానిలో అంతటా పొంగజేసే పదార్థం వ్యాపించింది. దేవుని రాజ్యం ఆ విధంగా ఉంది.”
[22] ఆయన జెరుసలం ప్రయాణం చేస్తూ గ్రామాల గుండా పట్టణాల గుండా సాగిపోతూ ఉపదేశిస్తూ ఉన్నాడు.
[23] ఎవరో ఒకడు ఆయనను చూచి “ప్రభూ, పాపవిముక్తి పొందేవారు కొద్దిమందేనా?” అని అడిగాడు.
[24] ఆయన వారితో ఇలా అన్నాడు: “ఇరుకు ద్వారంలో ప్రవేశించడానికి తీవ్ర ప్రయత్నం చేయండి. అనేకులు ప్రవేశించజూస్తారు గాని అది వారిచేత కాబోదని మీతో చెపుతున్నాను.
[25] ఇంటి యజమాని లేచి ఒక్కసారిగా తలుపు మూసివేసిన తరువాత మీరు బయట నిలుచుండి తలుపు తట్టడం ఆరంభిస్తూ ‘ప్రభూ! ప్రభూ! మాకు తలుపు తెరవండి’ అంటారు. అప్పుడాయన మీకు జవాబిస్తూ ‘మీరెక్కడివారో మిమ్ములను నేనెరుగను’ అంటాడు.
[26] అప్పుడు మీరు ‘మేము మీ సముఖంలోనే అన్నపానాలు పుచ్చుకొన్నాం గదా! మీరు మా వీధుల్లో ఉపదేశించారు గదా!’ అనడం ఆరంభిస్తారు.
[27] అయితే ఆయన ‘నేను మీతో అంటున్నాను గదా, మీరెక్కడివారో మిమ్ములను నేనెరుగను. అన్యాయమైన కార్యాలు చేసేవారలారా మీరంతా నా దగ్గరనుంచి వెళ్ళిపోండి!’ అంటాడు.
[28] “అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు, ప్రవక్తలంతా దేవుని రాజ్యంలో ఉండడం, మిమ్ములను బయటికి త్రోసివేయడం మీరు చూచినప్పుడు అక్కడ ఏడ్పూ పళ్ళు కొరుక్కోవడమూ ఉంటాయి.
[29] తూర్పు పడమరల నుంచీ ఉత్తర దక్షిణాలనుంచీ మనుషులు వచ్చి దేవుని రాజ్యంలో కూర్చుంటారు.
[30] ఇదిగో వినండి, చివరి వారిలో కొందరు మొదటివారవుతారు. మొదటివారిలో కొందరు చివరి వారవుతారు.”
[31] ఆ రోజునే పరిసయ్యులు కొందరు వచ్చి ఆయనతో “హేరోదు నిన్ను చంపాలని కోరుతున్నాడు. ఇక్కడ నుంచి వెళ్ళిపో!” అన్నారు.
[32] అయితే ఆయన వారితో అన్నాడు “వెళ్ళి ఆ గుంటనక్కతో ఈ విధంగా చెప్పండి – ఈరోజు, రేపు నేను దయ్యాలను వెళ్ళగొట్టివేస్తాను, రోగులను బాగు చేస్తాను. మూడో రోజున నా గమ్యం సంపూర్తిగా చేరుతాను.
[33] అయినా ఈరోజు, రేపు, ఎల్లుండి నేను ప్రయాణం కొనసాగించాలి, ఎందుకంటే, జెరుసలం బయట ప్రవక్త హతం కావడం కుదరదు!”
[34] “ఓ జెరుసలం! జెరుసలం! ప్రవక్తలను వధిస్తూ నీ దగ్గరకు పంపినవారిని రాళ్ళతో కొట్టి చంపుతూ ఉన్న నగరమా! కోడి తన పిల్లలను రెక్కల క్రింద చేర్చుకొన్నట్టే నేను నీ పిల్లలను చేర్చుకోవాలని ఎన్నో సార్లు ఇష్టపడ్డాను. నీవైతే ఇష్టపడలేదు.
[35] ఇదిగో విను! ఇప్పుడు నీ పాడు ఇంటిని నీకే విడిచిపెట్టడం జరుగుతూ ఉంది. నీతో నేను ఖచ్చితంగా చెప్పేదేమంటే, నీవు ‘ప్రభువు పేరట వచ్చేవాడు ధన్యజీవి!’ అని చెప్పేంతవరకూ నన్ను మళ్ళీ చూడవు!”