[1] ఆ రోజుల్లో లోకమంతటా జనాభాలెక్కలు రాయాలని సీజర్ అగస్టస్ ఆజ్ఞ జారీ చేశాడు.
[2] సిరియా దేశానికి కురేనియన్ అధిపతి అయి ఉన్న కాలంలో జనాభాలెక్కలు రాయడం ఇదే మొదటి సారి.
[3] అందరూ ఆ లెక్కల్లో తమ పేర్లు నమోదు చేయించుకోవడానికి ఎవరి గ్రామాలకు వారు వెళ్ళిపోయారు.
[4] యోసేపు దావీదు వంశానికీ గోత్రానికీ చెందినవాడు గనుక గలలీలోని నజరేతు గ్రామంనుంచి యూదయలో బేత్‌లెహేం అనే దావీదు గ్రామానికి మరియతోపాటు పేర్లు రాయించుకోవడానికి అతడు వెళ్ళాడు.
[5] మరియ అతనికి ప్రధానం చేయబడ్డ భార్య. ఆమె గర్భవతి.
[6] వారక్కడ ఉన్నప్పుడు ఆమెకు నెలలు నిండి కనే సమయం వచ్చింది.
[7] ఆమె తొలిచూలు కుమారుణ్ణి కన్నది. ఆయనను పొత్తి గుడ్డలతో చుట్టి పశువుల తొట్టిలో పడుకోబెట్టింది. ఎందుకంటే సత్రంలో వారికి స్థలం లేదు.
[8] ఆ ప్రాంతంలో గొర్రెల కాపరులు కొందరు పొలాల్లో ఉంటూ రాత్రివేళ తమ మందను కాచుకొంటూ ఉన్నారు.
[9] ఉన్నట్టుండి ప్రభు దేవదూత వారి ఎదుటే నిలిచాడు, ప్రభు మహిమాప్రకాశం వారి చుట్టూ మెరిసింది. వారు అధికంగా హడలిపోయారు.
[10] అయితే దేవదూత అన్నాడు, “భయపడకండి! ఇదిగో వినండి, ప్రజలందరికోసమూ మహానందకరమైన శుభవార్త మీకు తెచ్చాను.
[11] ఈ రోజే దావీదు గ్రామంలో ముక్తిప్రదాత మీకోసం జన్మించాడు. ఈయన ప్రభువు, అభిషిక్తుడు.
[12] మీకు ఇదే ఆనవాలు: ఆ శిశువుకు పొత్తిగుడ్డలు చుట్టి ఉండడం, పశువుల తొట్టిలో ఆయన పడుకొని ఉండడం మీరు కనుగొంటారు.”
[13] హఠాత్తుగా పరలోక సేన సమూహం ఆ దేవదూతతో పాటు కనిపించి దేవుణ్ణి స్తుతిస్తూ
[14] “సర్వోన్నతమైన స్థలాలలో దేవునికి మహిమ! భూమిమీద శాంతి! మనుషులపట్ల మంచి సంకల్పం!” అన్నారు.
[15] దేవదూతలు వారిని విడిచి పరలోకానికి వెళ్ళిపోయిన తరువాత కాపరులు “జరిగినది ప్రభువు మనకు తెలిపాడు గదా. రండ్రా! బేత్‌లెహేం వెళ్ళి చూద్దాం!” అని ఒకరితో ఒకరు చెప్పుకొన్నారు.
[16] వారు త్వరగా వెళ్ళి మరియనూ యోసేపునూ తొట్టిలో పడుకొని ఉన్న శిశువునూ చూశారు.
[17] వారు చూచిన తరువాత ఆ శిశువును గురించి తమతో చెప్పబడినదంతా తెలియజేశారు.
[18] కాపరులు తమతో చెప్పినవి విన్నవారంతా ఎంతో ఆశ్చర్యపడ్డారు.
[19] అయితే మరియ తన హృదయంలో ఈ మాటలన్నీ భద్రం చేసుకొని తలపోసుకొంటూ ఉంది.
[20] గొర్రెల కాపరులు చూచిందీ విన్నదంతా తమతో చెప్పబడినట్టే ఉంది గనుక ఆ సంగతులన్నిటిని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ మహిమపరుస్తూ తిరిగి వెళ్ళిపోయారు.
[21] శిశువును సున్నతి చేయడానికి ఎనిమిది రోజులు పూర్తి అయినప్పుడు ఆయనకు యేసు అని నామకరణం చేశారు. గర్భంలో ఆయన పడకముందే దేవదూత పెట్టిన పేరు ఇదే.
[22] మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఆమెకు శుద్ధీకరణ దినాలు గడిచిన తరువాత యోసేపు, మరియ బలి అర్పించడానికీ ఆయనను ప్రభు సన్నిధానంలోకి తేవడానికీ జెరుసలం తీసుకువెళ్ళారు.
[23] ఇది ప్రభు ధర్మశాస్త్రంలో రాసి ఉన్న ప్రకారమే. ఏమంటే, ప్రతి తొలిచూలు మగపిల్లవాణ్ణి ప్రభువుకు పవిత్రుడు అనాలి.
[24] వారి బలి ప్రభు ధర్మశాస్త్రంలో చెప్పిన ఈ మాట ప్రకారం “రెండు గువ్వలు గానీ రెండు పావురం పిల్లలు గానీ”.
[25] జెరుసలంలో సుమెయోను అనే మనిషి ఉండేవాడు. ఈ మనిషి న్యాయవంతుడు, భక్తిపరుడు, ఇస్రాయేల్‌కు ఆదరణ కలిగేదెప్పుడా అని చూస్తూ ఉండేవాడు. పవిత్రాత్మ అతనిమీద ఉన్నాడు.
[26] అతడు ప్రభు అభిషిక్తుణ్ణి చూచేంతవరకు చనిపోడని పవిత్రాత్మ అతనికి వెల్లడి చేశాడు.
[27] ఆ ఆత్మ మూలంగా అతడు దేవాలయంలో ప్రవేశించాడు. ధర్మశాస్త్రం పద్ధతి ప్రకారం ఆయనకు జరిగించాలని అప్పుడే తల్లిదండ్రులు శిశువైన యేసును లోపలికి తీసుకువచ్చారు.
[28] సుమెయోను ఆయనను చేతులలోకి తీసుకొని దేవుణ్ణి కీర్తిస్తూ ఇలా అన్నాడు:
[29] “ప్రభూ! నీ మాట ప్రకారం నీ దాసుడైన నన్ను ఇప్పుడు శాంతితో పోనివ్వు.
[30] ఎందుకంటే, అన్ని జనాల ఎదుట నీవు సిద్ధం చేసిన ముక్తిని కండ్లారా చూశాను.
[32] అది ఇతర ప్రజలకు సత్యాన్ని వెల్లడి చేసే వెలుగు, నీ ప్రజలైన ఇస్రాయేల్‌కు మహిమ.”
[33] ఆయనను గురించి చెప్పిన సంగతులు విని ఆయన తల్లీ, యోసేపూ ఆశ్చర్యపడ్డారు.
[34] సుమెయోను వారిని దీవించి ఆయన తల్లి మరియతో అన్నాడు “ఇదిగో విను, ఈ శిశువు ఇశ్రాయేల్‌లో అనేకులు పడడం, లేవడంకోసం నియామకమైనవాడు. కొందరు వ్యతిరేకంగా మాట్లాడబోయే సూచనగా ఉంటాడు.
[35] (అంతేగాక, నీ అంతరంగంలోకి ఖడ్గం ఒకటి దూసుకు పోతుంది!) ఉద్దేశమేమంటే అనేకుల హృదయాలోచనలు బయట పడాలని.”
[36] దేవుని మూలంగా పలికే స్త్రీ ఒకతె ఉండేది. ఆమె పేరు అన్నా. ఆమె ఆషేరు గోత్రికురాలు, ఫనూయేలు కూతురు. ఆమె చాలా వృద్ధురాలు. ఆమె కన్య అయి పెళ్ళయి ఏడేళ్ళు భర్తతో కాపురం చేసిన తరువాత,
[37] ఈ స్త్రీ ఎనభై నాలుగు సంవత్సరాల వయస్సు వరకు విధవరాలుగా ఉండిపోయింది. ఆమె దేవాలయాన్ని విడిచిపెట్టకుండా ఉపవాసముంటూ ప్రార్థనలు చేస్తూ రాత్రింబగళ్ళూ సేవ చేస్తూ ఉంది.
[38] ఆ సమయంలోనే ఆమె వారి దగ్గరకు వచ్చి ప్రభువుకు కృతజ్ఞత అర్పించింది. తరువాత, జెరుసలం విముక్తి కోసం ఎదురు చూస్తున్న వారందరితో ఆ శిశువును గురించి మాట్లాడుతూ వచ్చింది.
[39] యోసేపు, మరియ ప్రభు ధర్మశాస్త్రం ప్రకారం సమస్తం తీర్చిన తరువాత గలలీలోని స్వగ్రామమైన నజరేతుకు తిరిగి వెళ్ళారు.
[40] ఆ శిశువు పెరుగుతూ ఆత్మలో బలం పొందుతూ ఉన్నాడు. జ్ఞానంతో నిండిపోయాడు. దేవుని దయ ఆయన మీద ఉంది.
[41] ప్రతి ఏటా పస్కాపండుగసమయంలో ఆయన తల్లిదండ్రులు జెరుసలంకు వెళ్ళేవారు.
[42] ఆయనకు పన్నెండేళ్ళయినప్పుడు పండుగ అలవాటు ప్రకారం జెరుసలంకు వెళ్ళారు.
[43] ఆ రోజులు గడిపిన తరువాత వారు తిరిగి ఇంటికి వెళ్ళిపోతూ ఉంటే బాలుడైన యేసు జెరుసలంలోనే ఉండిపోయాడు. ఈ సంగతి యోసేపుకు, ఆయన తల్లికి తెలియదు.
[44] ప్రయాణికుల గుంపులో ఉన్నాడని అనుకొన్నారు. అయితే రోజంతా ప్రయాణం చేసిన తరువాత వారు ఆయనకోసం చుట్టాలలో, మిత్రులలో వెదికారు.
[45] ఆయన కనబడకపోవడంతో వారు వెదకుతూ తిరిగి జెరుసలం వచ్చారు.
[46] మూడు రోజుల తరువాత దేవాలయంలో ఆయనను కనుక్కొన్నారు. ఆయన ఉపదేశకుల మధ్య కూర్చుని ఉండి వారు చెప్పేది వింటూ వారిని ప్రశ్నిస్తూ ఉన్నాడు.
[47] ఆయన చెపుతున్నది విన్నవారంతా ఆయన వివేకానికి ఆయన ఇచ్చే జవాబులకూ విస్మయం చెందారు.
[48] ఆయనను చూచి తల్లిదండ్రులు ఎంతో ఆశ్చర్యపడ్డారు. “కుమారా! మా పట్ల నువ్వెందుకిలా వ్యవహరించావు? ఇదిగో, నీ తండ్రీ, నేనూ ఆతురతతో నీ కోసం గాలిస్తూ ఉన్నాం” అని ఆయన తల్లి ఆయనతో అంది.
[49] వారితో ఆయన “నా కోసం మీరెందుకు వెదకుతూ ఉన్నారు? నేను నా తండ్రి పని మీద ఉండాలని మీకు తెలియదా?” అన్నాడు.
[50] అయితే ఆయన తమతో చెపుతున్నదేమిటో వారికి అర్థం కాలేదు.
[51] అప్పుడు ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతు వెళ్ళాడు. అక్కడ వారికి లోబడి ఉన్నాడు. ఆయన తల్లి ఈ సంగతులన్నీ హృదయంలో భద్రం చేసుకొంది.
[52] యేసు జ్ఞానంలోను శారీరకంగాను వృద్ధి చెందుతూ ఉన్నాడు. దేవుని దయలో, మనుషుల దయలో వర్ధిల్లుతూ ఉన్నాడు.