[1] యేసు పవిత్రాత్మతో నిండినవాడై యొర్దానునుంచి తిరిగి వచ్చాడు. అప్పుడా ఆత్మ ఆయనను అరణ్యంలోకి తీసుకువెళ్ళాడు.
[2] అక్కడ నలభై రోజులపాటు అపనింద పిశాచంచేత విషమ పరీక్షలకు గురి అయ్యాడు. ఆ నలభై రోజులూ ఆయన ఏమీ తినలేదు. ఆ తరువాత ఆయనకు ఆకలి వేసింది.
[3] అప్పుడు అపనింద పిశాచం ఆయనతో అన్నాడు “నీవు దేవుని కుమారుడివైతే ఈ రాయిని రొట్టె అయిపొమ్మని ఆజ్ఞాపించు!”
[4] యేసు “మనిషి ఆహారంవల్ల మాత్రమే బ్రతకడు గానీ దేవుని నోట నుంచి వచ్చే ప్రతి వాక్కు వల్లా బ్రతుకుతాడు అని వ్రాసి ఉంది” అని వాడికి జవాబిచ్చాడు.
[5] అపనింద పిశాచం ఆయనను ఎత్తయిన పర్వతం మీదికి తీసుకువెళ్ళి క్షణంలో ఆయనకు భూలోక రాజ్యాలన్నీ చూపించాడు.
[6] “ఈ రాజ్యాధికారమంతా, ఈ రాజ్యాల వైభవమంతా నీకిస్తాను. అదంతా నాకప్పగించబడింది. అది ఎవరికివ్వాలని నేను ఇష్టపడతానో వారికిస్తాను.
[7] అందుచేత నీవు నన్ను పూజిస్తే అదంతా నీదవుతుంది” అని అపనింద పిశాచం ఆయనతో చెప్పాడు.
[8] అందుకు యేసు “సైతానూ! నా వెనక్కు పో! ఇలా వ్రాసి ఉంది: నీ ప్రభువైన దేవుణ్ణే ఆరాధించాలి. ఆయనకు మాత్రమే సేవ చేయాలి” అని వాడికి జవాబిచ్చాడు.
[9] వాడు ఆయనను జెరుసలంకు తీసుకువెళ్ళి దేవాలయ శిఖరం మీద నిలబెట్టాడు. “నీవు దేవుని కుమారుడివైతే ఇక్కడనుంచి క్రిందికి దూకేసెయ్యి!
[10] ఇలా రాసి ఉంది గదా – ఆయన నిన్ను కాపాడాలని నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు.
[11] వాళ్ళు నీ పాదానికి రాయి తగలకుండా నిన్ను తమ చేతులలో ఎత్తి పట్టుకొంటారు” అని ఆయనతో అన్నాడు.
[12] యేసు వాడికిలా జవాబిచ్చాడు: “నీ ప్రభువైన దేవుణ్ణి పరీక్షించకూడదు అని చెప్పబడి ఉన్నది.”
[13] అపనింద పిశాచం ప్రతి విషమ పరీక్ష పెట్టడం ముగించి మరో అవకాశం చిక్కేవరకు ఆయనను విడిచి వెళ్ళిపోయాడు.
[14] అప్పుడు యేసు దేవుని ఆత్మ బలప్రభావాలతో గలలీకి తిరిగి వెళ్ళాడు. ఆయనను గురించిన కబురు ఆ ప్రాంతమంతటా ప్రాకిపోయింది.
[15] ఆయన వారి సమాజ కేంద్రాలలో ఉపదేశమిచ్చాడు. అందరూ ఆయనను కీర్తించారు.
[16] అప్పుడాయన పెరిగిన నజరేతుకు వచ్చాడు. తన అలవాటు ప్రకారం విశ్రాంతి దినాన యూద సమాజ కేంద్రానికి వెళ్ళాడు, లేఖనం చదవడానికి నిలబడ్డాడు.
[17] యెషయాప్రవక్త గ్రంథం ఆయనకు వారందించారు. ఆయన గ్రంథం భాగాన్ని విప్పి ఈ మాటలు వ్రాసి ఉన్న స్థలాన్ని చూశాడు:
[18] “ప్రభు ఆత్మ నా మీద ఉన్నాడు. పేదలకు శుభవార్త ప్రకటించడానికి ఆయన నన్ను అభిషేకించాడు. గుండె పగిలినవారిని బాగు చేయడానికీ, ఖైదీలకు విడుదల, గుడ్డివారికి చూపు కలుగుతుందని ప్రకటించడానికీ ఆయన నన్ను పంపాడు. బాధితులను విడిపించడానికీ
[19] ప్రభు అనుగ్రహ సంవత్సరం చాటించడానికీ నన్ను పంపాడు.”
[20] ఆయన గ్రంథం మూసి పరిచారకుడికిచ్చి కూర్చున్నాడు. సమాజ కేంద్రంలో ఉన్న వారంతా ఆయనను తేరి చూస్తూ ఉన్నారు.
[21] అప్పుడాయన వారితో “ఈ రోజే మీరు వింటూ ఉండగానే ఈ లేఖనం నెరవేరింది” అన్నాడు.
[22] అప్పుడు అందరూ ఆయనను గురించి సాక్ష్యం చెప్పుకొన్నారు, ఆయన నోటనుంచి వెలువడ్డ దయగల మాటలకు ఆశ్చర్యపడ్డారు. “ఈయన యోసేపు కుమారుడు గదూ?” అని చెప్పుకొన్నారు.
[23] వారితో ఆయన అన్నాడు “మీరు ‘వైద్యుడా, నిన్ను నీవు బాగు చేసుకో!’ అనే సామెత నాకు చెప్పి ‘కపెర్‌నహూంలో ఏ కార్యకలాపాలు చేశావని మేము విన్నామో అవి ఇక్కడ నీ స్వస్థలంలో చెయ్యి!’ అని తప్పకుండా అంటారు.”
[24] ఆయన ఇంకా అన్నాడు, “మీతో ఖచ్చితంగా అంటున్నాను – ఏ ప్రవక్తనూ తన స్వస్థలం స్వీకరించదు.
[25] సత్యమే మీతో చెపుతున్నాను. ఏలీయాప్రవక్త రోజుల్లో ఇస్రాయేల్‌లో అనేక మంది విధవరాండ్రు ఉన్నారు. అయినా, మూడున్నర సంవత్సరాలు ఆకాశం మూయబడి దేశమంతటా గొప్ప కరవు వచ్చినప్పుడు
[26] వారిలో ఎవరి దగ్గరకూ ఏలీయా పంపబడలేదు. అతణ్ణి దేవుడు పంపినది సీదోను ప్రాంతంలోని సారెపతులో ఉన్న విధవరాలి దగ్గరికే.
[27] ఎలీషాప్రవక్త కాలంలో ఇస్రాయేల్‌లో అనేకమంది కుష్ఠురోగులు ఉన్నారు గాని వారిలో ఎవరూ స్వస్థత పొందలేదు. సిరియా దేశస్థుడైన నయమాను ఒక్కడే స్వస్థత పొందాడు.”
[28] ఈ సంగతులు విని సమాజకేంద్రంలో ఉన్న వారంతా ఆగ్రహంతో నిండిపోయారు.
[29] వారు లేచి నిలబడి ఆయనను గ్రామం బయటికి త్రోసుకువెళ్ళారు. వారి గ్రామం కొండపై కట్టబడింది. నిటారుగా ఉన్న స్థలంనుంచి ఆయనను తలక్రిందుగా పడద్రోయాలని దాని అంచుకు తీసుకు పోయారు.
[30] అయితే ఆయన వారి మధ్యనుంచి దాటి తన దారిన వెళ్ళిపోయాడు.
[31] అప్పుడాయన కపెర్‌నహూం వెళ్ళాడు. అది గలలీలో ఒక పట్టణం. విశ్రాంతి దినాల్లో ఆయన ప్రజలకు ఉపదేశమిచ్చాడు.
[32] ఆయన ఉపదేశానికి వారెంతో ఆశ్చర్యపడ్డారు. ఎందుకంటే, ఆయన ఉపదేశం అధికారంతో ఉంది.
[33] అప్పుడా సమాజ కేంద్రంలో మలిన దయ్యం ఆత్మ పట్టినవాడొకడు ఉన్నాడు. అతడు గొంతెత్తి ఇలా అరిచాడు:
[34] “మమ్మల్ని విడిచిపెట్టు నజరేతువాడైన యేసూ! మాతో నీకేం పని? మమ్మల్ని నాశనం చేయడానికి వచ్చావా? నీవెవరో నాకు తెలుసు. నీవు దేవుని పవిత్రుడివే!”
[35] యేసు ఆ దయ్యాన్ని మందలిస్తూ “ఊరుకో! అతనిలోనుంచి బయటికి రా!” అన్నాడు. అప్పుడు దయ్యం ఆ మనిషిని వారిమధ్య పడద్రోసినా అతడికి హాని ఏమీ చేయకుండా అతడిలోనుంచి బయటికి వచ్చింది.
[36] అందరూ ఆశ్చర్యచకితులయ్యారు. “ఏమిటీ ఉపదేశం! ఇతడు మలిన పిశాచాలకు అధికారంతో బలప్రభావాలతో ఆజ్ఞ జారీ చేస్తున్నాడు. అవేమో బయటికి వస్తున్నాయి!” అంటూ ఒకరితో ఒకరు చెప్పుకొన్నారు.
[37] అప్పుడు ఆయనను గురించి కబుర్లు ఆ ప్రాంతం చుట్టుప్రక్కల అంతటా వ్యాపించాయి.
[38] ఆయన లేచి నిలబడి సమాజకేంద్రంనుంచి వెళ్ళి సీమోను ఇంట్లో ప్రవేశించాడు. సీమోను అత్త తీవ్రమైన జ్వరంతో పడుకొని ఉంది. ఆమె విషయం వారాయనను వేడుకొన్నారు.
[39] ఆయన ఆమె దగ్గర నిలిచి జ్వరాన్ని మందలించగా అది ఆమె నుంచి పోయింది. వెంటనే ఆమె లేచి వారికి పరిచర్య చేయసాగింది.
[40] ప్రొద్దు క్రుంకుతూ ఉన్నప్పుడు అందరు ఆయా రకాల రోగాలతో ఉన్న తమ వారిని ఆయన దగ్గరకు తీసుకువచ్చారు. వారిలో ప్రతి ఒక్కరిమీదా ఆయన చేతులుంచి వారిని బాగు చేశాడు.
[41] అనేకులలోనుంచి దయ్యాలు బయటికి వస్తూ “నీవు అభిషిక్తుడివి! దేవుని కుమారుడివి!” అని కేక పెట్టాయి. ఆయన అభిషిక్తుడు అని దయ్యాలకు తెలుసు గనుక ఆయన వాటిని గద్దించి మాట్లాడనివ్వలేదు.
[42] ఉదయమైనప్పుడు ఆయన బయలుదేరి నిర్జన స్థలానికి వెళ్ళాడు. జన సమూహం ఆయనను వెదకుతూ ఆయన దగ్గరకు చేరి తమను విడిచివెళ్ళకుండా ఆయనను ఆపివేయబోయారు.
[43] కానీ ఆయన వారితో ఇలా అన్నాడు: “ఇతర గ్రామాలలో కూడా నేను దేవుని రాజ్యాన్ని ప్రకటించాలి. ఎందుకంటే దేవుడు నన్ను పంపినది దీని కోసం.”
[44] ఆయన గలలీ సమాజ కేంద్రాలలో ప్రకటిస్తూ వచ్చాడు.