Skip to content
Opens in a new window
Listen to this chapter • 7:38

[1] ఒక సారి ఆయన గెన్నేసరెతు సరస్సు తీరాన నిలబడి ఉన్నాడు, జన సమూహం దేవుని వాక్కు వినడానికి ఆయన మీద పడుతూ ఉన్నారు.

[2] అప్పుడు సరస్సు దరిన రెండు పడవలు ఆయనకు కనిపించాయి. చేపలు పట్టేవారు పడవలలోనుంచి దిగి వలలు కడుగుతూ ఉన్నారు.

[3] ఆయన ఆ పడవలలో ఒకదానినెక్కాడు. ఆ పడవ సీమోనుది. ఒడ్డునుంచి కొద్ది దూరం త్రోయమని ఆయన అతణ్ణి అడిగాడు. అప్పుడాయన పడవలో కూర్చుని జన సమూహానికి ఉపదేశమిచ్చాడు.

[4] మాట్లాడడం ముగించినప్పుడు ఆయన సీమోనును చూచి “పడవను లోతుకు నడిపి చేపలు పట్టడానికి వలలు వెయ్యి” అన్నాడు.

[5] సీమోను జవాబిస్తూ “నాయకా, రాత్రంతా మేము శ్రమించాం గాని, చేపలు ఏమీ పడలేదు. అయినా నీ మాటనుబట్టి వల వేస్తాను” అని ఆయనతో అన్నాడు.

[6] వారు అలా చేసినప్పుడు ఎన్నో చేపలు పడ్డాయి, వారి వల తెగిపోబోయింది.

[7] అందుచేత మరో పడవలో ఉన్న వారి పాలివారు వచ్చి సహాయం చేయాలని వారికి సైగలు చేశారు. వారు వచ్చి రెండు పడవల నిండా నింపారు. పడవలు మునిగిపోసాగాయి.

[8] అది చూచి సీమోను పేతురు యేసు మోకాళ్ళముందు పడి “ప్రభూ! నన్ను విడిచివెళ్ళు! నేను పాపాత్ముణ్ణి” అన్నాడు.

[9] ఎందుకంటే అతడూ అతనితో ఉన్నవారంతా తాము పట్టిన చేపల మొత్తం చూచి ఎంతో ఆశ్చర్య పడిపోయారు.

[10] సీమోనుతో పాలివారైన యాకోబు, యోహాను (జెబెదయి కొడుకులు) కూడా అలాగే ఆశ్చర్యచకితులయ్యారు. అప్పుడు యేసు సీమోనుతో “భయపడకు! ఇప్పటినుంచి నీవు మనుషులను పట్టే వాడివవుతావు” అన్నాడు.

[11] వారు పడవలు ఒడ్డుకు చేర్చి అంతా విడిచిపెట్టి ఆయనను అనుసరించారు.

[12] ఆయన ఒకానొక గ్రామంలో ఉన్నప్పుడు హఠాత్తుగా ఒక మనిషి వచ్చాడు. అతనికి ఒళ్ళంతా కుష్ఠు. యేసును చూడగానే అతడు సాష్టాంగపడి “ప్రభూ! మీకిష్టం ఉంటే నన్ను శుద్ధంగా చేయగలరు” అంటూ ఆయనను బ్రతిమాలు కొన్నాడు.

[13] ఆయన చేయి చాపి అతనిమీద ఉంచి “నాకిష్టమే. శుద్ధంగా ఉండు!” అన్నాడు. వెంటనే అతని కుష్ఠు పోయింది.

[14] ఆయన “ఈ విషయం ఎవరికీ చెప్పకు. అయితే వెళ్ళి యాజికి కనబడు. వారికి సాక్ష్యంగా ఉండేందుకు నీ శుద్ధికోసం మోషే విధించినదాన్ని అర్పించు” అని అతనికి ఆదేశించాడు.

[15] కానీ దానినిబట్టి ఆయనను గురించిన కబురు ఇంకా ఎక్కువగా వ్యాపించింది. అందుచేత ఆయన ఉపదేశం వినడానికీ రోగాలు బాగు చేయించుకోవడానికీ పెద్ద జన సమూహాలు సమకూడాయి.

[16] అయితే ఆయన తరచుగా నిర్జన స్థలాలకు ఏకాంతంగా వెళ్ళి ప్రార్థన చేసేవాడు.

[17] ఒక రోజున ఆయన ఉపదేశమిస్తూ ఉన్నాడు. రోగాలు బాగు చేసే ప్రభు శక్తి అక్కడ ఉంది. గలలీలోని ప్రతి గ్రామం నుంచీ యూదయ, జెరుసలంనుంచీ వచ్చిన పరిసయ్యులూ ధర్మశాస్త్ర బోధకులూ అక్కడ కూర్చుని ఉన్నారు.

[18] హఠాత్తుగా కొందరు మనుషులు పక్షవాత రోగిని పడకమీద తీసుకు వచ్చారు. అతణ్ణి ఇంటి లోపలికి తెచ్చి యేసు ముందు ఉంచాలని చూశారు.

[19] అయితే ఆ జనసమూహం ఉండడంవల్ల అతణ్ణి లోపలికి తేవడానికి మరో మార్గం చూడలేక వారు ఇంటి కప్పుమీదికెక్కారు. పెంకులు తీసి అతణ్ణి పడకతోపాటు వారి మధ్యకు యేసు ముందే దింపారు.

[20] యేసు వారి విశ్వాసం చూచి అతనితో “అయ్యా, నీ పాపాలకు క్షమాపణ దొరికింది” అన్నాడు.

[21] ధర్మశాస్త్ర పండితులూ పరిసయ్యులూ ఇలా తలపోయడం మొదలుపెట్టారు: “దేవదూషణ చేస్తున్న ఇతడు ఎవడు? దేవుడు తప్ప పాపాలు క్షమించగల వారెవరు?”

[22] వారి తలంపులు తెలిసి యేసు వారితో “మీ హృదయాలలో ఇలా ఆలోచించడం ఎందుకు?

[23] ఏది సులభం? – ‘నీ పాపాలకు క్షమాపణ దొరికింది’ అనడమా? ‘లేచి నడువు’ అనడమా?

[24] అయితే మానవ పుత్రునికి భూలోకంలో పాపాలు క్షమించే అధికారం ఉందని మీరు తెలుసుకోవాలి” అన్నాడు. అప్పుడు ఆయన పక్షవాత రోగితో “నీతో నేనంటున్నాను, లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి వెళ్ళు” అన్నాడు.

[25] వెంటనే అతడు వారి ఎదుటే లేచి నిలబడ్డాడు. తాను పడుకొన్న పరుపెత్తుకొని దేవుణ్ణి కీర్తిస్తూ తన సొంత ఇంటికి వెళ్ళాడు.

[26] అందరూ విస్మయమొంది “ఈవేళ వింత విషయాలు చూశాం” అంటూ దేవుణ్ణి కీర్తించి భయంతో నిండిపోయారు.

[27] ఆ తరువాత ఆయన బయటికి వెళ్ళి సుంకం వసూలు స్థానంలో కూర్చుని ఉన్న సుంకం వాడొకణ్ణి చూశాడు. అతని పేరు లేవీ. ఆయన అతనితో “నా వెంట రా!” అన్నాడు.

[28] అతడు అంతా విడిచిపెట్టి లేచి ఆయనను అనుసరించాడు.

[29] లేవీ తన సొంత ఇంట్లో ఆయనకు గొప్ప విందు చేశాడు. అనేకమంది సుంకంవారూ వేరేవారూ వారితో కూడా భోజనానికి కూర్చుని ఉన్నారు.

[30] అది చూచి పరిసయ్యులూ వారి ధర్మశాస్త్ర పండితులూ “మీరు సుంకంవారితోను పాపులతోను కలిసి తింటున్నారేమిటి?” అని ఆయన శిష్యులమీద సణుక్కొన్నారు.

[31] వారికి జవాబిస్తూ యేసు “ఆరోగ్యవంతులకు వైద్యుడు అవసరం లేదు గాని జబ్బు చేసినవారికే.

[32] పశ్చాత్తాప పడేందుకు పాపులనే పిలవడానికి నేను వచ్చాను గాని న్యాయవంతులను కాదు” అన్నాడు.

[33] వారాయనతో “యోహాను శిష్యులు ఎందుకు తరచుగా ఉపవాసముంటారు? ప్రార్థనలు చేస్తూ ఉంటారు. పరిసయ్యుల శిష్యులు కూడా అలా చేస్తారు. మీ శిష్యులైతే అన్నపానాలు పుచ్చుకొంటూ ఉన్నారు” అన్నాడు.

[34] వారికి యేసు ఇలా చెప్పాడు: “పెళ్ళికుమారుడు తమతో ఉన్నంతకాలం మీరు అతని ఇంటివారిచేత ఉపవాసం చేయించగలరా?

[35] అయితే పెళ్ళికుమారుణ్ణి వారి దగ్గరనుంచి తీసుకుపోయే రోజులు వస్తాయి. ఆ రోజులలో వారు ఉపవాసముంటారు.”

[36] ఆయన వారికి ఉదాహరణ కూడా చెప్పాడు – “ఎవరూ కొత్త బట్ట పాత బట్టకు మాసిక వేయరు. ఒకవేళ అలా చేస్తే కొత్త బట్ట చింపవలసివస్తుంది, మాసిక పాత బట్టకు కలవదు కూడా.

[37] ఎవరూ కొత్త ద్రాక్షరసం పాత తిత్తులలో పోయరు. పోస్తే కొత్త ద్రాక్షరసంవల్ల ఆ తిత్తులు చినిగిపోతాయి. ద్రాక్షరసం కారిపోతుంది. తిత్తులు పాడవుతాయి.

[38] కొత్త ద్రాక్షరసం కొత్త తిత్తులలోనే పోయాలి. అప్పుడు రెండూ పాడు కాకుండా ఉంటాయి.

[39] మరో విషయం – పాత ద్రాక్షరసం త్రాగిన వెంటనే కొత్త ద్రాక్షరసం ఎవరూ కోరరు. పాతదే బాగుంది అంటారు.”

లూకా శుభవార్త — Chapters