Skip to content
Opens in a new window
Listen to this chapter • 11:20

[1] పొంగని రొట్టెల పండుగ దగ్గర పడింది. దానిని ‘పస్కా’ అని అంటారు.

[2] అప్పుడు ప్రధాన యాజులూ ధర్మశాస్త్ర పండితులూ ప్రజలకు భయపడి యేసును ఎలా చంపించాలా అని చూస్తున్నారు.

[3] అప్పుడు సైతాను ఇస్కరియోతు అనే ఇంటిపేరున్న యూదాలో చొరబడ్డాడు. అతడు పన్నెండుమంది శిష్యుల లెక్కలో చేరిన ఒకడు.

[4] అతడు ప్రధాన యాజుల దగ్గరికీ దేవాలయం కావలి అధికారుల దగ్గరికీ వెళ్ళి, యేసును వారికెలా పట్టి ఇవ్వాలా అని వారితో మాట్లాడాడు.

[5] వారు సంతోషించి అతనికి కొంత డబ్బు ఇస్తామని సమ్మతించారు.

[6] అతడు మాట ఇచ్చి జనసమూహం లేనప్పుడు ఆయనను వారికి పట్టి ఇవ్వడానికి అనువైన సమయంకోసం చూస్తూ ఉన్నాడు.

[7] పొంగని రొట్టెల పండుగ రోజు, పస్కా గొర్రెపిల్లను వధించవలసిన ఆ రోజు వచ్చింది.

[8] యేసు పేతురునూ యోహానునూ పంపుతూ “మీరు వెళ్ళి మనం తినడానికి పస్కాను సిద్ధం చేయండి” అన్నాడు.

[9] వారు “మేమెక్కడ సిద్ధం చేయమంటారు?” అని ఆయననడిగారు.

[10] ఆయన వారితో అన్నాడు, “చూడండి, మీరు నగరంలో ప్రవేశించినప్పుడు మీకెదురుగా ఒక మనిషి నీళ్ళ కుండ మోసుకువస్తూ ఉంటాడు. అతడు ప్రవేశించే ఇంట్లోకి అతనివెంట వెళ్ళండి. ఆ ఇంటి యజమానిని చూచి ఇలా చెప్పండి:

[11] ‘నేను నా శిష్యులతో కూడా పస్కాను తినడానికి అతిథిశాల ఎక్కడని గురువు మీతో అంటున్నాడు.’

[12] అతడు సామానున్న పెద్ద మేడగది మీకు చూపుతాడు. అక్కడే ఏర్పాట్లు చేయండి.”

[13] వారు వెళ్ళి తమతో ఆయన చెప్పినట్టే అది చూశారు, పస్కాను సిద్ధం చేశారు.

[14] ఆ సమయం వచ్చినప్పుడు ఆయన తన పన్నెండు మంది రాయబారులతోపాటు కూర్చున్నాడు.

[15] అప్పుడు ఆయన వారితో “నా బాధలకు ముందు మీతో కలిసి ఈ పస్కా భోజనం చేయాలని మనఃపూర్వకంగా ఆశించాను.

[16] ఎందుకంటే, అది దేవుని రాజ్యంలో నెరవేరేవరకూ నేను మళ్ళీ దానిని తిననని మీతో చెపుతున్నాను” అన్నాడు.

[17] అప్పుడాయన ఆ పాత్ర తీసుకొని కృతజ్ఞత అర్పించిన తరువాత “దీనిని తీసుకొని దీనిలోది మీలో పంచుకోండి.

[18] దేవుని రాజ్యం వచ్చేంతవరకూ నేను ద్రాక్షరసం త్రాగనని మీతో చెపుతున్నాను” అన్నాడు.

[19] అప్పుడాయన రొట్టె తీసుకొని దేవునికి కృతజ్ఞత అర్పించిన తరువాత దానిని విరిచి వారికిచ్చి “ఇది మీకోసం ధారదత్తమైన నా శరీరం. నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ఇలా చేయండి” అన్నాడు.

[20] అలాగే, భోజనం తరువాత ఆ పాత్రను తీసుకొని ఇలా అన్నాడు: “ఈ పాత్ర మీకోసం చిందే నా రక్తంమూలమైన క్రొత్త ఒడంబడిక.

[21] అయితే ఇదిగో వినండి, నన్ను శత్రువులకు పట్టి ఇచ్చేవాని చేయి నా చేతితో కూడా ఈ బల్లమీద ఉంది.

[22] దేవుని నిర్ణయం ప్రకారమే మానవ పుత్రుడు తప్పక పోతాడు గాని అయ్యో! ఎవడైతే ఆయనను పట్టి ఇస్తాడో ఆ మనిషికి శిక్ష తప్పదు!”

[23] తమలో ఆ పనికి ఒడికట్టేవాడెవడో అని వారు తమలో తాము ప్రశ్నించుకోసాగారు.

[24] తమలో ఎవడు ప్రముఖుడుగా ఎంచబడాలో అని కూడా వారి మధ్య జగడం పుట్టింది.

[25] అప్పుడు ఆయన వారితో ఇలా అన్నాడు: “ఇతర ప్రజల రాజులు వారిమీద ప్రభుత్వం చేస్తారు, వారిమీద అధికారం చెలాయించే వారిని ‘ఉపకారులు’ అంటారు.

[26] మీరు మాత్రం అలా కాదు. మీలో ప్రముఖుడు అందరిలో చిన్నవానిలాగా ఉండాలి, నాయకుడు సేవకునిలాగా ఉండాలి.

[27] ఎవరు ప్రముఖుడు – భోజనానికి కూర్చునేవాడా? ఊడిగం చేసేవాడా? భోజనానికి కూర్చునేవాడే గదా? అయినా మీ మధ్య నేను ఊడిగం చేసేవానిలాగా ఉన్నాను.

[28] నాకు వచ్చిన విషమ పరీక్షలలో నాతో నిలిచి ఉన్నవారు మీరే!

[29] నా తండ్రి నాకు రాజ్యం ప్రసాదించాడు.

[30] అలాగే మీరు నా రాజ్యంలో నా బల్ల దగ్గర అన్నపానాలు పుచ్చుకొంటూ ఉండాలనీ సింహాసనాల మీద కూర్చుని ఇస్రాయేల్ పన్నెండు గోత్రాలకు తీర్పు తీరుస్తూ ఉండాలనీ మీకూ నేను రాజ్యం ప్రసాదిస్తున్నాను.”

[31] ప్రభువు ఇంకా అన్నాడు, “సీమోనూ, సీమోనూ, ఇదిగో విను. సైతాను మిమ్ములను గోధుమలలాగా జల్లించాలని మిమ్ములను కోరాడు.

[32] కానీ నీ నమ్మకం తప్పిపోకుండా నేను నీకోసం ప్రార్థన చేశాను. నీవు మళ్ళీ దేవుని వైపు తిరిగినప్పుడు నీ సోదరులను బలపరచు.”

[33] ఆయనతో పేతురు “ప్రభూ, నీతోకూడా ఖైదుకు గానీ మరణానికి గానీ వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను!” అన్నాడు.

[34] ఆయన “పేతురూ, నీవు నన్నెరగనని ముమ్మారు చెప్పేవరకు నేడు కోడి కూయదని నీతో చెపుతున్నాను” అన్నాడు.

[35] అప్పుడాయన వారితో “నేను మిమ్ములను సంచి, జోలె, చెప్పులు లేకుండా పంపినప్పుడు మీకేమైనా కొరత అయిందా?” అన్నాడు. వారు “కాలేదు” అన్నారు.

[36] అప్పుడాయన వారితో ఇలా అన్నాడు: “ఇప్పుడైతే సంచి, జోలె ఉన్నవాడు వాటిని తీసుకువెళ్ళాలి. కత్తి లేనివాడు తన పైబట్ట అమ్మి కత్తి కొనుక్కోవాలి.

[37] ఎందుకంటే, నేను మీతో చెప్పేదేమంటే, వ్రాసి ఉన్న ఈ లేఖనం ఇంకా నా విషయంలో నెరవేరడం తప్పనిసరి – ‘ఆయనను అక్రమకారులలో ఒకడని ఎంచడం జరిగింది.’ అవును, నన్ను గురించిన విషయాలు పూర్తి అవుతాయి.”

[38] వారు “ప్రభూ, చూడు, ఇక్కడ రెండు కత్తులు ఉన్నాయి” అన్నారు. ఆయన వారితో “చాలు” అన్నాడు.

[39] అప్పుడాయన బయటికి వచ్చి ఎప్పటిలాగా ఆలీవ్ కొండకు వెళ్ళాడు. ఆయనవెంట శిష్యులు వెళ్ళారు.

[40] ఆ స్థలం చేరుకొన్నప్పుడు ఆయన వారితో “మీరు విషమ పరీక్షలో పడకుండా ప్రార్థన చేయండి” అన్నాడు.

[41] అప్పుడు వారి దగ్గరనుంచి రాతివేత దూరం వెళ్ళి మోకరిల్లి ప్రార్థన చేశాడు,

[42] “తండ్రి, నీ ఇష్టమైతే ఈ గిన్నె నానుంచి తొలగించు. అయినా నా ఇష్టం కాదు, నీ ఇష్టమే నెరవేరనియ్యి” అన్నాడు.

[43] అప్పుడు పరలోకంనుంచి వచ్చిన దేవదూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచాడు.

[44] ఆయన యాతనపడుతూ మరీ తీవ్రంగా ప్రార్థించాడు. ఆయన చెమట పెద్ద రక్త బిందువులలాగా అయి నేలమీద పడింది.

[45] ఆయన ప్రార్థన చేసి లేచి శిష్యుల దగ్గరకు వెళ్ళాడు. వారు దుఃఖంచేత నిద్రపోవడం చూచి

[46] ఆయన వారితో “మీరెందుకు నిద్రపోతున్నారు? విషమ పరీక్షలో పడకుండా లేచి ప్రార్థన చేయండి” అన్నాడు.

[47] ఆయన ఇంకా మాట్లాడుతూ ఉండగానే జనసమూహం, వారిముందు పన్నెండుమంది శిష్యులలో ఒకడైన యూదా నడిచి రావడం కనిపించింది. అతడు యేసును ముద్దు పెట్టుకోవడానికి ఆయన దగ్గరకు వచ్చాడు.

[48] “యూదా, ముద్దు పెట్టుకోవడం మూలంగా మానవ పుత్రుణ్ణి శత్రువులకు పట్టి ఇస్తున్నావా?” అని యేసు అతనితో అన్నాడు.

[49] జరగబోతున్నది గ్రహించి ఆయన చుట్టూ ఉన్నవారు “ప్రభూ! వీరిని కత్తితో కొట్టుదామంటావా?” అనడిగారు.

[50] వారిలో ఒకడు ప్రముఖయాజి దాసుణ్ణి కొట్టి అతని కుడి చెవి నరికివేశాడు.

[51] అయితే యేసు “ఆగండి, ఇది కూడా జరగనియ్యి!” అని చెప్పి అతని చెవిని తాకి అతణ్ణి బాగు చేశాడు.

[52] అప్పుడు యేసు తన దగ్గరకు వచ్చిన ప్రధాన యాజులతో, దేవాలయం కావలి అధికారులతో, పెద్దలతో “నేను దోపిడీ దొంగ అయినట్టు మీరు కత్తులూ కటారులతో వచ్చారేమిటి?

[53] ప్రతి రోజూ నేను మీతో కూడా దేవాలయంలో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకోలేదు. అయితే ఇది మీ సమయం, అంధకార ప్రభావం.”

[54] వారాయనను పట్టుకొని ప్రముఖ యాజి ఇంట్లోకి తీసుకువెళ్ళారు. పేతురు ఎడంగా ఆయన వెంట వెళ్ళాడు.

[55] కొందరు నడి ముంగిట చలి మంట వేసుకొని కూర్చుని ఉన్నారు. పేతురు కూడా వారిలో కూర్చున్నాడు.

[56] అతడు ఆ మంటలదగ్గర కూర్చుని ఉంటే ఒక పనిపిల్లకు కనబడ్డాడు. అతణ్ణి తేరిచూస్తూ ఆమె “ఆ మనిషి కూడా ఆయనతో ఉన్నాడు!” అంది.

[57] అతడు ఆయనను కాదన్నాడు. “అమ్మాయి, ఆయననెరగను!” అన్నాడు.

[58] కాసేపటికి మరొకడు అతణ్ణి చూచి “నువ్వు కూడా వారిలో ఒకడివి!” అన్నాడు. అందుకు పేతురు “నేను కానయ్యా!” అన్నాడు.

[59] సుమారు గంటసేపయిన తరువాత మరొకడు “నిజంగా ఈ మనిషి అతనితో కూడా ఉన్నాడు. వీడూ గలలీ మనిషే గదా!” అని గట్టిగా చెప్పాడు.

[60] అందుకు పేతురు “నువ్వు చెప్పేదేమిటో నాకేం తెలియదయ్యా!” అన్నాడు. అతడింకా మాట్లాడుతూ ఉండగానే కోడి కూసింది.

[61] అప్పుడు ప్రభువు అటు తిరిగి పేతురువైపు సూటిగా చూశాడు. కోడి కూసేవరకు నీవు నన్నెరగనని ముమ్మారు చెపుతావని ప్రభువు తనతో చెప్పిన మాట పేతురు జ్ఞాపకం చేసుకొన్నాడు.

[62] అప్పుడతడు బయటికి వెళ్ళి ఎంతో దుఃఖంతో భోరున ఏడ్చాడు.

[63] యేసును నిర్భందించినవారు ఆయనను వెక్కిరించారు, కొట్టారు.

[64] ఆయన ముఖం కప్పి దానిమీద దెబ్బకొట్టి “నిన్ను కొట్టినదెవరు? ప్రవక్తగా చెప్పు” అని ఆయన నడిగారు.

[65] ఆయనకు వ్యతిరేకంగా ఇంకా అనేక దూషణ మాటలు పలికారు.

[66] ఉదయం కాగానే ప్రజల పెద్దలు – అంటే ప్రధాన యాజులూ ధర్మశాస్త్ర పండితులూ కలిసి ఆయనను తమ సభ కూడిన చోటికి తీసుకువెళ్ళారు.

[67] అక్కడ “నీవు అభిషిక్తుడివైతే అది మాతో చెప్పు!” అన్నారు. వారితో ఆయన ఇలా అన్నాడు: “ఒకవేళ నేను మీకు అలా చెప్పినా మీరు నమ్మరు.

[68] నేను మిమ్ములను ఏదైనా అడిగితే నాకు మీరేమీ జవాబు చెప్పరు, నన్ను విడుదల చేయరు.

[69] అయితే ఇకమీదట మానవపుత్రుడు బలప్రభావాలున్న దేవుని కుడివైపు కూర్చుని ఉంటాడు.”

[70] అందుకు వారంతా “అలాగైతే నీవు దేవుని కుమారుడివా!” అన్నారు. వారితో ఆయన “మీరన్నట్టే నేనే ఆయనను” అన్నాడు.

[71] అందుకు వారు “మనకిక సాక్ష్యంతో ఏం పని? ఇతడి నోటి మాట మనమే విన్నాం గదా!”

లూకా శుభవార్త — Chapters