Skip to content
Opens in a new window
Listen to this chapter • 5:36

[1] ఆయన ఉపదేశం వినడానికి సుంకంవారూ పాపులూ అంతా ఆయనకు దగ్గరగా వచ్చారు.

[2] అందుకు పరిసయ్యులూ ధర్మశాస్త్ర పండితులూ సణుగుతూ “ఈ మనిషి పాపులను దగ్గరకు చేర్చుకొంటాడు. వారితో కలిసి భోజనం చేస్తాడు” అన్నారు.

[3] అందుచేత ఆయన వారికి ఈ ఉదాహరణ చెప్పాడు:

[4] “మీలో ఎవరికైనా వంద గొర్రెలు ఉండి వాటిలో ఒకటి తప్పిపోతే అతడు ఆ తొంభై తొమ్మిది గొర్రెలను నిర్జన ప్రదేశంలో విడిచిపెట్టి, తప్పిపోయిన గొర్రె దొరికేంతవరకూ వెదకడా?

[5] అది కనబడ్డప్పుడు భుజాలమీద దానిని పెట్టుకొని సంతోషిస్తాడు.

[6] అతడు ఇంటికి వచ్చినప్పుడు మిత్రులనూ ఇరుగుపొరుగువారినీ పిలిచి ‘తప్పిపోయిన నా గొర్రె నాకు దొరికింది గనుక నాతో కలిసి సంతోషించండి!’ అంటాడు.

[7] “అలాగే పశ్చాత్తాప పడనక్కరలేని తొంభై తొమ్మిది మంది న్యాయవంతులకంటే పశ్చాత్తాపపడే ఒక్క పాపిని గురించి పరలోకంలో ఎక్కువ ఆనందం కలుగుతుందని మీతో చెపుతున్నాను.

[8] “ఒకామెకు పది వెండి నాణేలు ఉండి, వాటిలో ఒక నాణెం పోతే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరికేంతవరకూ జాగ్రత్తగా వెదకదా?

[9] అది కనబడ్డప్పుడు స్నేహితురాండ్రనూ ఇరుగుపొరుగువారినీ పిలిచి ‘నేను పోగొట్టుకొన్న నాణెం నాకు దొరికింది గనుక నాతో కలిసి సంతోషించండి!’ అంటుంది.

[10] అలాగే పశ్చాత్తాపపడే ఒక్క పాపిని గురించి దేవుని దూతల సముఖంలో ఆనందం కలుగుతుందని మీతో చెపుతున్నాను.”

[11] ఆయన ఇంకా అన్నాడు “ఒక మనిషికి ఇద్దరు కొడుకులు ఉండేవారు.

[12] చిన్నవాడు తండ్రితో ‘నాన్నా, ఆస్తిలో నాకు వచ్చే భాగమివ్వు’ అన్నాడు. తండ్రి తన జీవనాధారం వారికి పంచి ఇచ్చాడు.

[13] “కొన్నాళ్ళకు చిన్నవాడు తనకు ఉన్నదంతా కూడగట్టుకొని దూర దేశానికి ప్రయాణమైపోయాడు. అక్కడ విచ్చలవిడిగా తన ఆస్తిని దుబారా చేశాడు.

[14] అదంతా ఖర్చు చేసిన తరువాత ఆ దేశంలో తీవ్రమైన కరువు వచ్చింది. అతడు అక్కరలో పడసాగాడు.

[15] అప్పుడు ఆ దేశ పౌరుడొకని దగ్గర చేరాడు. ఆ మనిషి పందులు మేపడానికి అతణ్ణి తన పొలాల్లోకి పంపాడు.

[16] పందులు మేపే పొట్టుతో అతడు కడుపు నింపుకోవాలని ఆశించాడు, కాని అతనికి ఎవరూ ఏమీ పెట్టలేదు.

[17] “అతనికి బుద్ధి వచ్చినప్పుడు అతడు ఇలా అనుకొన్నాడు: ‘మా తండ్రి దగ్గర ఎంతోమంది కూలి మనుషులకు బోలెడంత ఆహారం ఉంటుందే. నేనైతే ఆకలికి చచ్చిపోతూ ఉన్నాను.

[18] లేచి నా తండ్రి దగ్గరకు వెళ్ళిపోతాను; నాన్నా, నేను పరలోకానికి వ్యతిరేకంగా, నీ దృష్టిలో పాపం చేశాను.

[19] ఇకనుంచి నీ కొడుకును అనిపించుకోవడానికి తగను. నన్ను నీ కూలి మనుషులలో ఒకడిగా పెట్టుకో! అంటాను.’

[20] “అప్పుడతడు లేచి తండ్రి దగ్గరకు వచ్చాడు. అయితే అతడింకా చాలా దూరంగా ఉండగానే అతని తండ్రి అతణ్ణి చూశాడు. జాలిపడి పరుగెత్తుకొంటూ వెళ్ళి అతని మెడను కౌగలించుకొన్నాడు, అతణ్ణి ముద్దు పెట్టుకొన్నాడు.

[21] “అప్పుడా కొడుకు ‘నాన్నా, నేను పరలోకానికి వ్యతిరేకంగా, నీ దృష్టిలో పాపం చేశాను. ఇకనుంచి నీ కొడుకుననిపించుకోవడానికి తగను’ అని అతనితో అన్నాడు.

[22] “అయితే తండ్రి తన దాసులను చూచి ‘అన్నిట్లో మంచి వస్త్రం తెచ్చి ఇతనికి తొడగండి. ఇతని వ్రేలికి ఉంగరం పెట్టి కాళ్ళకు చెప్పులు తొడగండి.

[23] కొవ్విన దూడను తెచ్చి వధించండి. తిందాం! సంబరపడదాం!

[24] ఈ నా కొడుకు చనిపోయి మళ్ళీ బతికాడు! తప్పిపోయి దొరికాడు!’ అన్నాడు. అప్పుడు వారు సంబరపడసాగారు.

[25] “ఇంతలో పెద్ద కొడుకు పొలంలో ఉన్నాడు. అతడు వచ్చి ఇంటికి దగ్గరగా చేరినప్పుడు సంగీత నాదం, నాట్య ధ్వని అతనికి వినిపించాయి.

[26] అతడొక దాసుణ్ణి పిలిచి ‘వాటి అర్థమేమిటో!’ అని అడిగాడు.

[27] “ఆ దాసుడు అతనితో ‘మీ తమ్ముడు వచ్చాడండి. తన దగ్గరకు క్షేమంగా చేరినందుచేత మీ తండ్రి కొవ్విన దూడను వధించాడండి’ అన్నాడు.

[28] “పెద్ద కొడుక్కు కోపం వచ్చి లోపలికి వెళ్ళడానికి ఇష్టం లేకపోయింది. కాబట్టి అతని తండ్రి బయటికి వచ్చి రమ్మని వేడుకొన్నాడు.

[29] కానీ తండ్రికి అతడు ‘చూడు, ఇన్ని ఏళ్ళపాటు నీకు చాకిరి చేస్తూ వచ్చాను. నీ ఆజ్ఞ నేనెన్నడూ మీరలేదు. అయినా నేను నా స్నేహితులతో సంబరపడేట్టు నీవు విందుకోసం మేకపిల్లనైనా ఎన్నడూ నాకివ్వలేదు.

[30] అయితే నీ జీవనాధారం వేశ్యలతో తినేసిన ఈ నీ కొడుకు రాగానే వాడికి కొవ్విన దూడను వధించావే!’ అని జవాబిచ్చాడు.

[31] “అందుకు తండ్రి అతనితో ‘అబ్బాయి! నువ్వెప్పుడూ నా దగ్గరే ఉన్నావు. నావన్నీ నీవే.

[32] అయితే ఈ నీ తమ్ముడు చనిపోయి మళ్ళీ బతికాడు. తప్పిపోయి దొరికాడు. అందుచేత మనం సంబరపడి సంతోషించడం న్యాయమే!’” అన్నాడు.

లూకా శుభవార్త — Chapters