Skip to content
Opens in a new window
Listen to this chapter • 8:03

[1] ఆయన యెరికోలో ప్రవేశించి దానిగుండా వెళ్తూ ఉన్నాడు.

[2] అక్కడ జక్కయ్య అనే మనిషి ఉండేవాడు. అతడు ఒక ప్రధాన సుంకంవాడు, ఆస్తిపరుడు.

[3] యేసు ఎవరో అని చూడడానికి ప్రయత్నించాడు గాని జన సమూహం కారణంగా చూడలేకపోయాడు. ఎందుకంటే అతడు పొట్టివాడు.

[4] కనుక ఎలాగైనా ఆయనను చూద్దామని ఆయన ఆ వైపే వస్తున్నాడని తెలిసి ముందుకు పరుగెత్తి మేడి చెట్టెక్కాడు.

[5] యేసు ఆ చోటికి వచ్చినప్పుడు తలెత్తి అతణ్ణి చూచి అతనితో “జక్యయ్యా! త్వరగా దిగిరా! ఈవేళ నేను నీ ఇంట్లో ఉండాలి!” అన్నాడు.

[6] అప్పుడే అతడు త్వరగా చెట్టు దిగి సంతోషంతో ఆయనను స్వీకరించాడు.

[7] ఇది చూచి జనమంతా “పాపి అయిన మనిషి ఇంటికి అతిథిగా వెళ్ళాడేమిటి ఈయన!” అంటూ గొణగసాగారు.

[8] అయితే జక్కయ్య నిలబడి ప్రభువుతో ఇలా అన్నాడు: “ఇదిగో, ప్రభూ, ఇప్పుడే నా ఆస్తిలో సగం బీదలకిచ్చేస్తాను. నేనెవరినైనా వంచించి ఏదైనా తీసుకొన్నానంటే ఆ వ్యక్తికి నాలుగంతలు మళ్ళీ చెల్లిస్తాను.”

[9] అతనితో యేసు “ఈవేళ ఈ ఇంటికి పాపవిముక్తి వచ్చింది. ఎందుకంటే, ఇతడు కూడా అబ్రాహాము సంతతివాడు.

[10] నశించినదానిని వెదకి రక్షించడానికి మానవ పుత్రుడు వచ్చాడు” అన్నాడు.

[11] వారు ఈ మాటలు వింటూ ఉంటే ఆయన ఒక ఉదాహరణ కూడా చెప్పాడు. ఎందుకంటే ఆయన జెరుసలం దరిదాపులలో ఉన్నాడు, దేవుని రాజ్యం వెంటనే కనిపిస్తుందని వారనుకొన్నారు.

[12] అందుచేత ఆయన ఇలా అన్నాడు: “గొప్ప వంశానికి చెందిన మనుషుడొకడు తనకోసం ఒక రాజ్యాన్ని స్వీకరించి తిరిగి రావడానికి దూర దేశానికి ప్రయాణం కట్టాడు.

[13] మొదట తన దాసులను పదిమందిని పిలిచి వారికి పది బంగారు నాణేలు ఇచ్చాడు. ‘నేను తిరిగి వచ్చేంతవరకు దీనితో వ్యాపారం చేయండి’ అని వారితో చెప్పాడు.

[14] “అయితే అతని పౌరులకు అతడంటే ద్వేషం, గనుక ‘ఈ వ్యక్తి మామీద పరిపాలించడం మాకిష్టం లేదు’ అంటూ అతని వెనుక రాయబారం పంపారు.

[15] “అతడైతే ఆ రాజ్యాన్ని స్వీకరించి తిరిగి వచ్చాడు. రాగానే, తాను డబ్బిచ్చిన దాసుల్లో ఒక్కొక్కరు వ్యాపారంవల్ల ఎంతెంత సంపాదించారో తెలుసుకొందామని వారిని తన దగ్గరకు పిలవమని ఆజ్ఞ జారీ చేశారు.

[16] “మొదటివాడు వచ్చి ‘యజమానీ, మీ నాణెం పది నాణేలు సంపాదించింది’ అన్నాడు.

[17] “అందుకతడు ‘భళా, మంచి దాసుడా! చాలా చిన్న విషయంలో నీవు నమ్మకంగా ఉన్నావు గనుక పది నగరాలమీద అధికారిగా ఉండు’ అని అతనితో చెప్పాడు.

[18] “రెండో దాసుడు వచ్చి ‘యజమానీ, మీ నాణెం అయిదు నాణేలు సంపాదించింది’ అన్నాడు.

[19] “అతడు ‘నీవు అయిదు నగరాలమీద అధికారిగా ఉండు’ అని అతనితో కూడా చెప్పాడు.

[20] “అప్పుడు మరో దాసుడు వచ్చి ఇలా అన్నాడు: ‘యజమానీ, ఇదిగో మీ నాణెం. దీనిని గుడ్డలో కట్టి ఉంచాను.

[21] ఎందుకంటే, మీరంటే నాకు భయం – మీరు కఠినులు, మీరు పెట్టనిది తీసుకొంటారు, వెదజల్లనిది కోస్తారు.’

[22] “అందుకతడు అతనితో ‘చెడ్డ దాసుడా! నీ సొంత నోటనుంచి వచ్చినదాని ప్రకారమే నీకు తీర్పు తీరుస్తాను. నేను కఠినుణ్ణనీ పెట్టనిది తీసుకుంటాను, వెదజల్లనిది కోస్తాను అనీ నీకు తెలుసు అంటున్నావు గదా?

[23] అలాంటప్పుడు నీవు నా డబ్బు సాహుకారుల దగ్గర ఎందుకు పెట్టలేదు? అలా పెట్టి ఉంటే నేను వచ్చి నా డబ్బు వడ్డీతో కూడా తీసుకొని ఉండేవాణ్ణే.’

[24] “అప్పుడతడు దగ్గర నిలుచున్న వారితో ‘ఈ బంగారు నాణెం వీడిదగ్గర నుంచి తీసివేసి పది నాణేలు ఉన్నవాని చేతికివ్వండి’ అన్నాడు.

[25] “అతనితో వారు ‘యజమానీ, అతనికి పది నాణేలు ఉన్నాయే!’ అన్నారు.

[26] “అందుకతడు ‘మీతో నేనంటున్నాను, కలిగి ఉన్న ప్రతి వ్యక్తికీ ఇంకా ఇవ్వడం, లేని వ్యక్తినుంచి అతనికి ఉన్నది కూడా తీసివేయడం జరుగుతుంది.

[27] మరో మాట – నేను తమమీద పరిపాలించడం ఇష్టం లేని నా పగవారిని ఇక్కడికి తీసుకువచ్చి నా ఎదుటే చంపండి.’”

[28] ఈ మాటలు చెప్పిన తరువాత యేసు జెరుసలం ప్రయాణం సాగిస్తూ ముందుకు వెళ్ళాడు.

[29] ఆయన ఆలీవ్ కొండమీద ఉన్న బేత్‌ఫగే, బేతనీ సమీపించినప్పుడు తన శిష్యులలో ఇద్దరిని పంపుతూ

[30] “మీకు ఎదురుగా ఉన్న ఆ గ్రామానికి వెళ్ళండి. దానిలో ప్రవేశించగానే కట్టి ఉన్న గాడిదపిల్ల ఒకటి మీకు కనబడుతుంది. దానిమీద ఎవరూ ఎన్నడూ కూర్చోలేదు. దానిని విప్పి తోలుకురండి.

[31] ‘మీరెందుకు దాన్ని విప్పుతున్నారు?’ అని ఎవరైనా మిమ్ములను అడిగితే, అతనితో ‘ఇది ప్రభువుకు అవసరం గనుక’ అనండి” అన్నాడు.

[32] ఆయన పంపినవారు వెళ్ళి చూచినప్పుడు ఆయన తమతో చెప్పినట్టే అది కనిపించింది.

[33] వారు ఆ గాడిద పిల్లను విప్పుతూ ఉంటే దాని స్వంతదారులు “మీరెందుకు గాడిద పిల్లను విప్పుతున్నారు?” అని వారినడిగారు.

[34] అందుకు వారు “ఇది ప్రభువుకు అవసరం” అన్నారు.

[35] అప్పుడా గాడిద పిల్లను యేసుదగ్గరకు తోలుకువచ్చి దానిమీద తమ పైబట్టలు వేసి దాని మీద యేసును కూర్చోబెట్టారు.

[36] ఆయన వెళ్తూ ఉంటే కొందరు తమ పైబట్టలు దారి వెంట పరిచారు.

[37] ఆలీవ్ కొండమీదనుంచి దారి దిగే స్థలం దగ్గరకు ఆయన చేరినప్పుడు, శిష్యుల గుంపంతా తాము చూచిన అద్భుతాలన్నిటిని గురించీ కంఠమెత్తి సంతోషంతో దేవుణ్ణి స్తుతించసాగారు,

[38] “ప్రభువు పేరట వస్తున్న రాజు ధన్యజీవి! పరలోకంలో శాంతి! ఉన్నత స్థలంలో మహిమ!” అన్నారు.

[39] జన సమూహంలో పరిసయ్యులు కొందరు యేసుతో “ఉపదేశకా! నీ శిష్యులను చీవాట్లు పెట్టు!” అన్నారు.

[40] అందుకాయన “నేను మీతో చెప్పేదేమంటే, ఒక వేళ వీరు ఊరుకొంటే ఈ రాళ్ళు వెంటనే కేకలు వేస్తాయి!” అని వారికి జవాబిచ్చాడు.

[41] ఆయన జెరుసలం నగరానికి దగ్గరగా వచ్చినప్పుడు దాన్ని చూస్తూ దాని గురించి ఏడ్చాడు,

[42] “నీవు – నీవు సైతం – ఈ నీ రోజైనా నీ శాంతి కోసం కావలసినవి తెలుసుకొని ఉంటే ఎంత బాగుండేది! కానీ ఇప్పుడు నీ కండ్లకు అవి మరుగై ఉన్నాయి.

[43] నీ పగవారు నీ చుట్టూ మట్టిదిబ్బ వేసి ముట్టడించి అన్ని ప్రక్కలా నిన్ను మూసివేసే రోజులు వస్తాయి.

[44] వారు నిన్నూ నీ లోపల ఉన్న నీ పిల్లలనూ నేల మట్టం చేస్తారు. నీలో ఏ ఒక్క రాయిమీద మరో రాయి ఉండకుండా చేస్తారు. ఎందుకంటే ప్రభువు నిన్ను సందర్శించిన కాలం నీవు తెలుసుకోలేదు” అన్నాడు.

[45] అప్పుడాయన దేవాలయానికి వెళ్ళి అక్కడ అమ్మే వారితో కొనేవారితో

[46] “నా ఆలయం ప్రార్థన ఆలయమని రాసి ఉంది. మీరైతే దానిని దోపిడీ దొంగల గుహగా చేశారు” అంటూ వారిని బయటికి వెళ్ళగొట్టసాగాడు.

[47] ప్రతి రోజూ ఆయన దేవాలయంలో ఉపదేశిస్తూ ఉన్నాడు గాని ప్రధాన యాజులూ ధర్మశాస్త్ర పండితులూ ప్రజల నాయకులూ ఆయనను రూపుమాపడానికి చూశారు.

[48] అయితే ఏమి చేయాలో వారికి పాలుపోలేదు. ఎందుకంటే, జనమంతా ఆయనను విడవకుండా సావధానంగా ఆయన ఉపదేశం వింటూ ఉన్నారు.

లూకా శుభవార్త — Chapters