Skip to content
Opens in a new window
Listen to this chapter • 6:18

[1] ఆయన తలెత్తి ధనవంతులు కానుక పెట్టెలో తమ కానుకలు వేయడం చూశాడు.

[2] ఒక బీద విధవరాలు అందులో రెండు పైసలు వేయడం కూడా చూశాడు.

[3] అప్పుడాయన “మీతో నిజం చెపుతున్నాను, అందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసింది.

[4] ఎలాగంటే వారంతా దేవునికి తమ కలిమిలో నుంచి కానుకలు వేశారు గాని ఈమె తన లేమిలో నుంచి తన బ్రతుకుదెరువంతా వేసింది” అన్నాడు.

[5] దేవాలయం అందమైన రాళ్ళతో, కానుకలతో అలంకరించబడ్డ సంగతిని గురించి కొందరు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన

[6] “మీరు వీటిని చూస్తున్నారే. రాయిమీద మరో రాయి నిలవకుండా అన్నిటినీ పడద్రోసే రోజు వస్తుంది” అన్నాడు.

[7] “ఉపదేశకా, ఈ విషయాలు ఎప్పుడు జరుగుతాయి? ఇవి జరగబోయేముందు ఏ సూచన కలుగుతుంది?” అని వారాయనను అడిగారు.

[8] అందుకాయన “మీరు మోసానికి గురి అయి తప్పుదారి పట్టకుండా చూచుకోండి. ఎందుకంటే, అనేకులు నా పేర వచ్చి ‘నేనే ఆయనను’ అంటారు. ‘ఆ కాలం దగ్గర పడింది’ అంటారు. కాబట్టి మీరు వారిని అనుసరించకండి.

[9] “యుద్ధాలను, విప్లవాలను గురించి విన్నప్పుడు భయపడకండి. మొదట అవి తప్పక జరగాలి గాని అంతం అప్పుడే రాదు” అన్నాడు.

[10] అప్పుడాయన వారితో ఇంకా అన్నాడు: “జనంమీదికి జనం, రాజ్యంమీదికి రాజ్యం లేస్తాయి.

[11] అక్కడక్కడ గొప్ప భూకంపాలూ, కరవులూ ఈతిబాధలూ కలుగుతాయి. ఆకాశంలో భయంకరమైన ఉత్పాతాలూ మహా సూచనలూ కనిపిస్తాయి.

[12] “అయితే ఇవన్నీ జరగకముందే వారు మిమ్ములను పట్టుకొంటారు, హింసిస్తారు. సమాజ కేంద్రాలకూ చెరసాలలకూ అప్పగిస్తారు. నా పేరుకోసం రాజుల ఎదుటికీ ప్రాంతీయాధికారుల ఎదుటికీ మిమ్ములను తీసుకుపోవడం జరుగుతుంది.

[13] దానివల్ల నన్ను గురించి సాక్ష్యం చెప్పే అవకాశం మీకు లభిస్తుంది.

[14] మీరు ‘ఏ ఏ జవాబులు చెప్పాలో’ అని ముందే ఆలోచించుకోకూడదని మీ మనసును దిటవు చేసుకోండి.

[15] ఎందుకంటే, మీ విరోధులంతా ఎదిరించలేని, కాదనలేని జ్ఞానాన్నీ నోట్లో మాటలూ నేను మీకిస్తాను.

[16] తల్లిదండ్రులూ, అన్నదమ్ములూ చుట్టాలూ మిత్రులూ కూడా మిమ్ములను శత్రువులకు పట్టి ఇస్తారు. మీలో కొందరిని చంపివేస్తారు.

[17] నా పేరు కారణంగా అందరు మిమ్ములను ద్వేషిస్తారు.

[18] కానీ నీ తల వెంట్రుకలలో ఒక్కటి కూడా నశించదు.

[19] మీ ఓర్పు చేత మీ ప్రాణాలను స్వాధీనంలో ఉంచుకోండి.

[20] “జెరుసలం చుట్టూరా సైన్యాలు ముట్టడించడం మీరు చూచేటప్పుడు దాని వినాశ కాలం దగ్గరపడిందని తెలుసుకోండి.

[21] అప్పుడు యూదయ ప్రాంతంలో ఉన్నవారు కొండలకు పారిపోవాలి. నగరంలో ఉన్నవారు బయటికి వెళ్ళిపోవాలి. పల్లెసీమలో ఉన్నవారు దానిలోకి వెళ్లకూడదు.

[22] ఎందుకంటే అవి దేవుని న్యాయ దండన రోజులు. వ్రాసివున్నవన్నీ నెరవేరేలా ఆ రోజులు వస్తాయి.

[23] అయ్యో! ఆ రోజులలో గర్భిణీ స్త్రీలకూ బాలింతలకూ ఎంతో కష్టం కలుగుతుంది! ఎందుకంటే ఈ దేశంలో చాలా దురవస్థ సంభవిస్తుంది, ఈ ప్రజలమీదికి ఆగ్రహం వస్తుంది.

[24] వారు కత్తిపాలై కూలుతారు. చెరపట్టబడి అన్ని జనాలలోకీ వెళ్తారు. యూదేతర ప్రజల కాలాలు పూర్తి అయ్యేవరకు యూదేతర ప్రజలు జెరుసలంను కాళ్ళక్రింద త్రొక్కుతారు.

[25] “సూర్య చంద్ర నక్షత్రాలలో సూచనలు ఉంటాయి. భూమి మీద సముద్రం, దాని అలలు ఘోషిస్తూ ఉంటే ప్రజలకు వేదన, కలవరం కలుగుతాయి.

[26] ఆకాశాలలోని శక్తులు కంపించిపోతాయి. అందువల్ల లోకంమీదికి రాబోతున్న వాటిని గురించి ఎదురు చూస్తూ మనుషులు భయంతో మూర్ఛపోతారు.

[27] అప్పుడు మానవపుత్రుడు మేఘాలలో బలప్రభావాలతోనూ మహా మహిమతోను రావడం వారు చూస్తారు.

[28] అయితే ఈ సంగతులు జరగనారంభించి నప్పుడు మీ తలలెత్తి పైకి చూడండి – మీ విముక్తి సమీపిస్తూ ఉంటుంది.”

[29] అప్పుడాయన వారికి ఈ ఉదాహరణ చెప్పాడు: “అంజూర చెట్టునూ చెట్లన్నిటినీ చూడండి.

[30] అవి చిగురు పెట్టగానే వసంతకాలం దగ్గరపడిందని మీ అంతట మీరే తెలుసుకొంటారు గదా!

[31] అలాగే, ఈ సంగతులు జరుగుతూ ఉండడం మీరు చూచినప్పుడు దేవుని రాజ్యం దగ్గరలో ఉందని తెలుసుకోండి.

[32] మీతో ఖచ్చితంగా అంటున్నాను. ఇవన్నీ జరిగేవరకు ఈ జాతి ఏ మాత్రమూ గతించదు.

[33] ఆకాశం, భూమి గతిస్తాయి గానీ నా మాటలు ఎన్నటికీ గతించవు.

[34] “త్రాగి తందనాలాడడం, మత్తుగా ఉండడంవల్ల, ఇహలోక చింతలవల్ల మీ హృదయాలు బరువెక్కిపోకుండా, ఆ రోజు ఆకస్మికంగా మీమీదికి రాకుండా జాగ్రత్తగా ఉండండి.

[35] అది భూతలమంతటి మీద నివసించేవారందరిమీదికి ఉరిలాగా వస్తుంది.

[36] జరగబోయే వాటన్నిటిలోనుంచి మీరు తప్పించుకొని మానవపుత్రుని ఎదుట నిలబడడానికి తగినవారుగా ఎంచబడేలా ఎప్పుడూ మెళకువగా ఉండి ప్రార్థన చేస్తూ ఉండండి.”

[37] ప్రతి రోజూ పగలు ఆయన దేవాలయంలో ఉపదేశిస్తూ ఉన్నాడు, సాయంత్రమైనప్పుడు ఆలీవ్ కొండమీదికి వెళ్ళి రాత్రి గడిపేవాడు.

[38] ఆయన ఉపదేశం వినడానికి ప్రజలంతా ప్రొద్దున పెందలకడే దేవాలయానికి ఆయన దగ్గరకు వస్తూ ఉన్నారు.

లూకా శుభవార్త — Chapters