Skip to content
Opens in a new window
Listen to this chapter • 6:44

[1] ఆయన తన శిష్యులతో ఇలా అన్నాడు: “ఆస్తిపరుడు ఒకని కోసం సేవాధికారి ఒకడు పని చేశాడు. అతడు ఆస్తిని దుబారా చేస్తున్నాడని ఫిర్యాదు ఆ ఆస్తిపరుడికి వచ్చింది.

[2] ఆస్తిపరుడు అతణ్ణి పిలిచి అతనితో ‘నిన్ను గురించి నేను వింటున్న విషయం ఏమిటి? ఇకమీదట నీవు సేవాధికారిగా ఉండడానికి వీలులేదు. నీవు సేవాధికారిగా చేసిన పనిని గురించిన లెక్క నాకప్పగించు!’ అన్నాడు.

[3] “సేవాధికారి లోలోపల ఇలా అనుకొన్నాడు: ‘నేను సేవాధికారిగా ఉండకుండా నా యజమాని చేస్తున్నాడు. ఏం చెయ్యను? తవ్వకం పని నాకు చేతకాదు. ముష్టి ఎత్తుకుందా మంటే సిగ్గు.

[4] సేవాధికారిగా ఉండకుండా నన్ను తొలగించడం జరిగాక నలుగురూ నన్ను తమ ఇండ్లలోకి స్వీకరించేలా నేనేం చెయ్యాలో నాకు తెలుసు.’

[5] “అప్పుడతడు తన యజమానికి బాకీ పడి ఉన్న ప్రతి ఒక్కరినీ పిలిచాడు. ‘నువ్వు నా యజమానికి ఎంత బాకీ ఉన్నావు!’ అని మొదటివాణ్ణి అడిగాడు.

[6] ఆ మనిషి ‘మూడు వేల లీటర్ల నూనె’ అన్నాడు. ఇతడు అతడితో ‘త్వరగా నీ చీటి తీసుకొని వెయ్యిన్ని అయిదు వందల లీటర్లు అని రాసుకో!’ అన్నాడు.

[7] మళ్ళీ మరొకణ్ణి చూచి ‘నువ్వెంత బాకీ ఉన్నావు?’ అనడిగాడు. ఆ మనిషి ‘నూరు మానికల గోధుమలు’ అన్నాడు. ఇతడు అతడితో ‘నీ చీటి తీసుకొని ఎనభై అని రాసుకో’ అన్నాడు.

[8] “న్యాయం తప్పిన ఈ సేవాధికారి వివేకంతో వ్యవహరించినందుచేత అతని యజమాని అతణ్ణి ఆమోదించాడు. ఎందుకంటే, ఈ లోకం మనుషులు తమ లాంటివారి విషయాల్లో వెలుగుకు చెందిన మనుషులకంటే వివేకవంతులు.

[9] మీరు అంతమైపోయిన తరువాత వారు మిమ్మల్ని శాశ్వత నివాసాల్లో స్వీకరించేలా అన్యాయమైన ధనంతో స్నేహితులను సంపాదించుకోండని మీతో చెపుతున్నాను.

[10] “చిన్న చిన్న విషయంలో నమ్మకంగా ఉండేవాడు పెద్ద విషయంలో కూడా నమ్మకంగా ఉంటాడు. అత్యల్ప విషయంలో న్యాయం తప్పినవాడు పెద్ద విషయంలో కూడా న్యాయం తప్పినవాడవుతాడు.

[11] అందుచేత అన్యాయమైన ధనం విషయంలోనే మీరు నమ్మకంగా ఉండకపోతే ఇక మీకు నిజమైన సొత్తు ఎవరు అప్పగిస్తారు?

[12] మరొకరి సొత్తు విషయంలోనే మీరు నమ్మకంగా ఉండకపోతే మీ సొంతం అంటూ మీకెవరు ఇస్తారు?

[13] ఇద్దరు యజమానులకు ఏ దాసుడూ సేవ చేయలేడు. అతడు ఒకరిని ద్వేషించి రెండో యజమానిని ప్రేమతో చూస్తాడు. లేదా, ఆ మొదటి యజమానికి పూర్తిగా అంకితమై మరొకరిని చిన్నచూపు చూస్తాడు. మీరు దేవునికీ సిరికీ సేవ చేయలేరు.”

[14] డబ్బంటే మహా ప్రీతి ఉన్న పరిసయ్యులు కూడా ఈ విషయాలన్నీ విని ఆయనను గేలి చేస్తూ ఉన్నారు.

[15] వారితో ఆయన ఇలా అన్నాడు: “మీరు మనుషుల దృష్టిలో న్యాయవంతులని అనిపించుకొనేవారు గానీ మీ హృదయాలు దేవునికి తెలుసు. మనుషులు గొప్పగా ఎంచేది దేవుని దృష్టిలో అసహ్యం.

[16] బాప్తిసమిచ్చే యోహాను వచ్చేంతవరకు ధర్మశాస్త్రం, ప్రవక్తల లేఖనాలు ఉన్నాయి. అప్పటినుంచి దేవుని రాజ్యం గురించిన ఉపదేశాల ప్రకటన జరుగుతూ ఉంది. అందరూ ఈ రాజ్యంలో బలవంతంగా చొరబడు తున్నారు.

[17] ధర్మశాస్త్రంలో ఒక్క పొల్లయినా నశించడం కంటే భూమ్యాకాశాలు నశించడమే సులభం.

[18] “తన భార్యకు విడాకులిచ్చి మరో స్త్రీని పెండ్లి చేసుకొనే వాడెవరైనా వ్యభిచరిస్తున్నాడు. విడాకులు తీసుకొన్న ఆమెను పెండ్లి చేసుకొన్న వాడెవడైనా వ్యభిచరిస్తున్నాడు.

[19] “ధనవంతుడొకడు ఉండేవాడు. అతడు ఊదారంగు వస్త్రాలూ శ్రేష్ఠమైన బట్టలూ తొడుక్కొనేవాడు, రోజూ వైభవంగా హాయిగా బ్రతికేవాడు.

[20] లాజరు అనే దరిద్రుడు కూడా ఉండేవాడు. అతనికి ఒళ్ళంతా కురుపులు. ఇతడు ఆ ధనవంతుని ఇంటి గుమ్మందగ్గర పడిగాపులు పడి ఉండేవాడు.

[21] ధనవంతుని బల్లమీది నుంచి పడ్డ ముక్కలు తిందామని ఆశపడేవాడు. అంతే కాక, కుక్కలు వచ్చి అతని కురుపులు నాకుతూ ఉండేవి కూడా.

[22] “ఆ దరిద్రుడు చనిపోయాడు. అతణ్ణి దేవదూతలు అబ్రాహాము ప్రక్కకు తీసుకువెళ్ళారు. ధనవంతుడు కూడా చనిపోయాడు పూడ్చిపెట్టబడ్డాడు.

[23] అతడు పాతాళంలో యాతనపడుతూ తలెత్తి చూస్తే దూరంగా అబ్రాహాము, అబ్రాహాము ప్రక్కన ఉన్న లాజరు కనబడ్డారు.

[24] “అప్పుడు ధనవంతుడు ‘తండ్రి అబ్రాహాము! నా మీద జాలి చూపు! ఈ మంటల్లో అల్లాడిపోతూ ఉన్నాను! గనుక తన వేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చడానికి లాజరును పంపించు!’ అని మొరపెట్టి చెప్పాడు.

[25] “అందుకు అబ్రాహాము ‘కొడుకా, నీవు బ్రతికినన్నాళ్ళూ మంచివాటిని అనుభవించావు. లాజరైతే కష్టాలు అనుభవించాడు. అది జ్ఞాపకం చేసుకో! ఇప్పుడితడు ఓదార్పు పొందుతున్నాడు, నీవేమో అల్లాడిపోతున్నావు.

[26] ఇవన్నీ కాక మరో విషయం – నీకూ మాకూ మధ్య పెద్ద అగాధం ఏర్పాటైంది. కాబట్టి ఇక్కడనుంచి మీ దగ్గరకు దాటిపోవాలనుకొనేవారికి సాధ్యం కాదు, అక్కడివారికి మా దగ్గరకు దాటిరావడం కూడా సాధ్యం కాదు’ అన్నాడు.

[27] “అప్పుడతడు ‘అలాగైతే, తండ్రీ, అతణ్ణి మా నాన్న ఇంటికి పంపించమని నిన్ను వేడుకొంటున్నాను. ఎందుకంటే, నాకు అయిదుగురు సోదరులున్నారు.

[28] వారు కూడా ఈ యాతన స్థలానికి రాకుండా చేయడానికి అతడు వారికి సాక్ష్యమివ్వగలడు’ అన్నాడు.

[29] “గానీ, అబ్రాహాము అతనితో ‘వారికి మోషే, ప్రవక్తలు ఉన్నారు. నీ సోదరులు వారి మాటలు వినాలి’ అన్నాడు.

[30] “అతడు ‘అలా కాదు, తండ్రి అబ్రాహాము! చనిపోయినవారిలో నుంచి ఎవడైనా వారిదగ్గరికి వెళ్ళితే వారు పశ్చాత్తాపపడతారు’ అన్నాడు.

[31] “అందుకు అబ్రాహాము అతనితో ‘మోషే మాట, ప్రవక్తల మాట వారు వినకపోతే చనిపోయినవారిలో నుంచి ఒకడు సజీవంగా లేచినా వారికి నమ్మకం కుదరదు అన్నాడు.’”

లూకా శుభవార్త — Chapters