Skip to content
Opens in a new window
Listen to this chapter • 6:21

[1] ఒక విశ్రాంతి దినాన ఇలా జరిగింది: ఆయన పరిసయ్యులలో ప్రముఖుడొకడి ఇంటికి భోజనానికి వెళ్ళాడు. వారు ఆయనను బాగా చూస్తూ ఉన్నారు.

[2] అక్కడ ఆయనకు ఎదురుగానే వాపు రోగం ఉన్న మనిషి ఉన్నాడు.

[3] యేసు “విశ్రాంతి దినాన రోగులను బాగు చేయడం న్యాయ సమ్మతమా?” అని ధర్మశాస్త్ర విద్వాంసులనూ పరిసయ్యులనూ చూచి అన్నాడు.

[4] వారు ఊరుకొన్నారు. అప్పుడాయన అతణ్ణి చేరదీసి బాగు చేశాడు, వెళ్ళనిచ్చాడు.

[5] అప్పుడు ఆయన “విశ్రాంతి దినాన మీలో ఎవరు తన గాడిదయినా, ఎద్దయినా గుంటలో పడితే వెంటనే దానిని బయటికి లాగరు?” అని వారినడిగాడు.

[6] ఆయనకు వారు ఆ సంగతుల గురించి ఏమీ జవాబు చెప్పలేకపోయారు.

[7] అక్కడ ఆహ్వానం అందినవారు అగ్ర స్థానాలను ఎన్నుకోవడం గమనించి ఆయన వారికి ఒక ఉదాహరణ చెపుతూ

[8] “పెండ్లి విందుకు నిన్ను ఎవరైనా పిలిస్తే అగ్ర స్థానంలో కూర్చోవద్దు. ఒకవేళ అతడు నీకంటే ఘనుణ్ణి పిలిచి ఉండవచ్చునేమో.

[9] అలాంటప్పుడు నిన్నూ అతణ్ణీ పిలిచినవాడు నీ దగ్గరకు వచ్చి ‘మీరు వీరికి ఈ చోటు ఇవ్వండి’ అంటాడేమో. అప్పుడు నీవు చిన్నబోయి చివరి స్థానంలో కూర్చోవడం ఆరంభిస్తావు.

[10] గనుక నీకు ఆహ్వానం అందినప్పుడు వెళ్ళి చివరి స్థానంలో కూర్చో. అప్పుడు నిన్ను పిలిచినవాడు వచ్చి నీతో ‘స్నేహితుడా! ఆ పై స్థానానికి వెళ్ళండి’ అనవచ్చు. అప్పుడు నీతోకూడా కూర్చుని ఉన్న వారి సమక్షంలో నీకు గౌరవం కలుగుతుంది.

[11] తనను గొప్ప చేసుకొనేవారిని తగ్గించడం, తనను తగ్గించుకొనేవారిని గొప్ప చేయడం జరుగుతుంది” అని వారితో అన్నాడు.

[12] అప్పుడాయన తనను పిలిచిన వ్యక్తితో ఇలా అన్నాడు: “నీవు పగలు గానీ రాత్రి గానీ విందు చేసేటప్పుడు నీ మిత్రులనూ అన్నదమ్ములనూ చుట్టాలనూ ఆస్తిపరులైన పొరుగువారినీ పిలవకు. ఎందుకంటే, వారు నిన్ను బదులుకు బదులు పిలవవచ్చు, దానితో నీకు ప్రతిఫలం కలుగుతుంది.

[13] అయితే నీవు విందు చేసేటప్పుడు బీదలనూ వికలాంగులనూ కుంటివారినీ గుడ్డివారినీ పిలువు.

[14] నీకు ప్రతిఫలమివ్వడానికి వారిచేత కాదు గనుక నీకు దీవెన వస్తుంది. చనిపోయిన న్యాయవంతులు సజీవంగా లేచేటప్పుడు నీకు ప్రతిఫలం కలుగుతుంది.”

[15] ఆయనతోపాటు భోజనానికి కూర్చుని ఉన్నవారిలో ఒకడు ఆ మాటలు విని “దేవుని రాజ్యంలో రొట్టె తినబోయే వ్యక్తి ధన్యజీవి!” అన్నాడు.

[16] అతనితో ఆయన ఇలా చెప్పాడు: “ఒక మనిషి గొప్ప విందు ఏర్పాటు చేసి అనేకులను పిలిచాడు.

[17] విందుకు వేళయినప్పుడు ‘ఇప్పుడు అంతా సిద్ధంగా ఉంది, రండి’ అని ఆహ్వానం అందిన వారితో చెప్పడానికి తన దాసుణ్ణి పంపాడు.

[18] “అయితే వారంతా ఏకమనస్సుతో సాకులు చెప్పడం మొదలు పెట్టారు. మొదటివాడు అతనితో ‘నేనొక పొలం కొన్నాను. వెళ్ళి దాన్ని చూచుకోవాలి. నన్ను క్షమించాలని నీకు మనవి చేస్తున్నాను’ అన్నాడు.

[19] “మరొకడు ‘నేను అయిదు జతల ఎద్దుల్ని కొన్నాను, వెళ్ళి వాటిని పరీక్ష చేస్తాను. నన్ను క్షమించాలని నీకు మనవి చేస్తున్నాను’ అన్నాడు.

[20] “మరొకడు ‘నేను పెళ్ళి చేసుకొన్నాను గనుక రాలేను’ అన్నాడు.

[21] “అప్పుడా దాసుడు తిరిగి వచ్చి ఈ విషయాలు తన యజమానితో చెప్పాడు. ఆ ఇంటి యజమానికి కోపం వచ్చింది. తన దాసునితో ఇలా అన్నాడు: ‘నీవు త్వరగా నగర వీధుల్లోకీ సందుల్లోకీ వెళ్ళి బీదలనూ వికలాంగులనూ కుంటివారినీ గుడ్డివారినీ ఇక్కడికి తీసుకురా!’

[22] “తరువాత ఆ దాసుడు ‘యజమానీ, తమరు ఆజ్ఞాపించినట్టే అయింది గాని ఇంకా స్థలం ఉందండి’ అన్నాడు.

[23] “అప్పుడు దాసునితో యజమాని ‘నా ఇల్లు నిండాలి గనుక రహదారుల్లోకీ కంచెల పొడుగునా వెళ్ళి అక్కడివారిని బలవంతాన తీసుకురా!

[24] నీతో అంటున్నాను, ముందు పిలుపు అందుకొన్నవారిలో ఎవరూ నా విందు భోజనం రుచిచూడరు!’ అన్నాడు.”

[25] పెద్ద జన సమూహాలు ఆయనతోకూడా వస్తూ ఉన్నారు. ఆయన వారివైపు తిరిగి, ఇలా అన్నాడు:

[26] “నా దగ్గరకు వచ్చేవాడెవడైనా సరే, తన తండ్రినీ తల్లినీ భార్యనూ పిల్లలనూ అన్నదమ్ములనూ అక్కచెల్లెళ్ళనూ తన ప్రాణాన్ని కూడా ద్వేషించకపోతే నా శిష్యుడు కాలేడు.

[27] తన సిలువ మోసుకొంటూ నా వెంట రానివాడెవడూ నా శిష్యుడు కాలేడు.

[28] “మీలో ఎవడైనా ఒక గోపురం కట్టాలని ఉంటే దాన్ని ముగించడానికి తన దగ్గర కావలసినది ఉందో లేదో ముందుగానే కూర్చుని లెక్కలు చూచుకోడా?

[29] ఒకవేళ అలా చేయకపోతే పునాది వేసిన తరువాత గోపురం పూర్తి చేయలేకపోతాడేమో. అలాంటప్పుడు అదిచూచినవారంతా అతణ్ణి వేళాకోళం చేస్తూ

[30] ‘ఈ మనిషికట్టడం మొదలు పెట్టాడు గానీ దాన్ని ముగించలేకపొయ్యాడు’ అంటారు.

[31] “ఒక రాజు మరో రాజు మీదికి యుద్ధానికి వెళ్ళబోతూ ఉంటే, ఇరవై వేల సైన్యంతో తనమీదికి వస్తున్న ఆ రాజును ఎదిరించడానికి తనకున్న పది వేల సైన్యం సరిపోతుందో లేదో ముందుగానే కూర్చుని ఆలోచన చేయడా?

[32] సరిపోదూ అంటే ఆ రాజు ఇంకా చాలా దూరంగా ఉండగానే ఇతడు సంధి రాయబారం పంపి శాంతి కావాలని వినతి చేస్తాడు గదా.

[33] ఆ విధంగానే మీలో తనకున్నదంతా వదులుకోని వాడెవడైనా సరే నా శిష్యుడు కాలేడు.

[34] “ఉప్పు మంచిదే గాని ఒకవేళ ఉప్పు దాని రుచి కోల్పోతే దానికి రుచి మళ్ళీ దేనివల్ల కలుగుతుంది?

[35] అది పొలానికి గానీ ఎరువుకు గానీ పనికి రాదు. మనుషులు దాన్ని అవతల పారవేస్తారు. వినడానికి చెవులున్న వాడు వింటాడు గాక!”

లూకా శుభవార్త — Chapters