Skip to content
Opens in a new window
Listen to this chapter • 8:29

[1] ఆదిలో “వాక్కు” ఉన్నాడు. “వాక్కు” దేవునితో ఉన్నాడు. “వాక్కు” దేవుడే.

[2] ఆయన ఆదిలో దేవునితో కూడా ఉన్నాడు.

[3] సమస్తమూ ఆయన మూలంగా కలిగింది. కలిగిన దానంతటిలో ఆయన లేకుండా కలిగింది ఏదీ లేదు.

[4] ఆయనలో జీవం ఉంది. ఈ జీవం మనుషులకు వెలుగు.

[5] ఈ వెలుగు చీకటిలో ప్రకాశిస్తూ ఉంది గానీ చీకటి దానిని గ్రహించలేదు.

[6] దేవుడు పంపిన మనిషి ఒకడు ఉన్నాడు. అతని పేరు యోహాను.

[7] అతని మూలంగా అందరికీ నమ్మకం కుదరాలని ఆ వెలుగును గురించి సాక్ష్యం చెప్పడానికి అతడు సాక్షిగా వచ్చాడు.

[8] అతడు ఆ వెలుగు కాదు. ఆ వెలుగును గురించి సాక్ష్యం చెప్పడానికి వచ్చాడు.

[9] ఆ వెలుగు లోకంలోకి వస్తూ ప్రతి ఒక్కరినీ వెలిగించే వాస్తవమైన వెలుగు.

[10] ఆ వెలుగుగా ఉన్న ఆయన లోకంలో ఉన్నాడు. లోకం ఆయనమూలంగా కలిగిందే. అయినా లోకం ఆయనను గుర్తించలేదు.

[11] ఆయన తన సొంతదాని దగ్గరికి వచ్చాడు గానీ తన స్వజనం ఆయనను స్వీకరించలేదు.

[12] అయితే ఆయనను స్వీకరించినవారికి – అంటే, ఆయన పేరుమీద నమ్మకం ఉంచినవారికి – దేవుని సంతానం కావడానికి ఆయన అధికారమిచ్చాడు.

[13] వీరు రక్తంవల్ల గానీ శరీరేచ్ఛవల్ల గానీ మానవ సంకల్పంవల్ల గానీ కాక, దేవుని వల్లే పుట్టినవారు.

[14] “వాక్కు” శరీరి అయ్యాడు. ఆయన కృపతో సత్యంతో నిండినవాడై కొంతకాలం మనమధ్య ఉన్నాడు. మేము ఆయన మహాత్యం చూశాం. ఆ మహాత్యం తండ్రి ఒకే ఒక కుమారుని దానిలాంటిది.

[15] యోహాను ఆయనను గురించి సాక్ష్యం చెపుతూ ఇలా బిగ్గరగా అన్నాడు: “నా తరువాత వచ్చేవాడు నాకు మునుపు ఉన్నవాడు గనుక ఆయన నన్ను మించినవాడని నేను చెప్పినవాడు ఈయనే.”

[16] మేమందరమూ ఆయన సంపూర్ణతలో నుంచి కృప వెంబడి కృప పొందాం.

[17] ఎందుకంటే, ధర్మశాస్త్రం మోషేద్వారా ఇవ్వడం జరిగింది; కృప, సత్యం యేసు క్రీస్తు ద్వారా కలిగాయి.

[18] ఎవరూ ఎన్నడూ దేవుణ్ణి చూడలేదు. ఒకే ఒక దేవుని కుమారుడు తండ్రి రొమ్మున ఉన్నాడు. ఆయన దేవుణ్ణి వెల్లడి చేశాడు.

[19] “మీరెవరు?” అని అడగడానికి యూదులు జెరుసలం నుంచి యాజులనూ లేవీగోత్రికులనూ యోహానుదగ్గరికి పంపారు. అప్పుడతడు చెప్పిన సాక్ష్యమిదే:

[20] “అభిషిక్తుణ్ణి కాను” అని ఒప్పుకొన్నాడు. అలా ఒప్పుకోవడానికి నిరాకరించలేదు.

[21] “అలాగైతే మీరు ఎవరు? ఏలీయా?” అని వారు అతణ్ణి అడిగారు. అతడు “కాను” అన్నాడు. “మీరు ఆ ప్రవక్తా?” అని వారు అడిగారు. “కాను” అని జవాబిచ్చాడు.

[22] “మీరు ఎవరైనట్టు? మమ్మల్ని పంపినవారికి మేము జవాబివ్వాలి. మీ గురించి ఏమని చెప్పుకొంటున్నారు?” అని వారు అతనితో అన్నారు.

[23] అతడు “యెషయాప్రవక్త చెప్పినట్టు, ప్రభువుకోసం మార్గం తిన్ననిది చేయండి అంటూ అరణ్యంలో ఘోషిస్తూ ఉన్న ఒకని స్వరాన్ని నేను” అన్నాడు.

[24] వారిని పంపినది పరిసయ్యులు.

[25] వారతణ్ణి ఇలా అడిగారు: “మీరు అభిషిక్తుడు గానీ ఏలీయా గానీ ఆ ప్రవక్త గానీ కాకపోతే ఎందుకు బాప్తిసం ఇస్తున్నారు?”

[26] యోహాను “నేను నీళ్ళలో బాప్తిసం ఇస్తున్నాను గాని మీరెరుగనివాడొకడు మీ మధ్య నిలుచున్నాడు.

[27] నా తరువాత వచ్చేవాడు ఆయనే. ఆయన నన్ను మించినవాడు. ఆయన చెప్పుల వారును విప్పడానికి కూడా నేను తగను” అని వారితో బదులు చెప్పాడు.

[28] ఇది యొర్దాను నదికి అవతల ఉన్న బేతబరలో జరిగింది. యోహాను అక్కడ బాప్తిసం ఇస్తూ ఉన్నాడు.

[29] మరుసటి రోజున యేసు తనవైపు రావడం చూచి యోహాను “ఇడుగో, లోక పాపాన్ని మోసి తీసివేసే దేవుని గొర్రెపిల్ల!

[30] ఈయనను ఉద్దేశించే నేను ఈ మాట చెప్పాను: నా తరువాత ఒక మనిషి వస్తాడు. ఆయన నాకు మునుపు ఉన్నవాడు గనుక నన్ను మించినవాడు.

[31] నేను ఆయనను గుర్తుపట్టలేదు గానీ ఆయన ఇస్రాయేల్ ప్రజలకు ప్రత్యక్షం కావాలని నీళ్ళలో బాప్తిసం ఇస్తూ వచ్చాను” అన్నాడు.

[32] యోహాను ఇలా సాక్ష్యం చెప్పాడు: “పరలోకంలో నుంచి దేవుని ఆత్మ పావురంలాగా దిగిరావడం, ఆయన మీద నిలిచి ఉండడం నేను చూశాను.

[33] నేనాయనను గుర్తుపట్టలేదు గాని నీళ్ళలో బాప్తిసం ఇమ్మని నన్ను పంపినవాడు నాతో ఇలా అన్నాడు: ఎవరిమీద ఆత్మ దిగివచ్చి నిలిచి ఉండడం నీవు చూస్తావో ఆయనే పవిత్రాత్మలో బాప్తిసం ఇస్తాడు.

[34] దానిని నేను చూశాను. ఆయన దేవుని కుమారుడని సాక్ష్యం చెప్పాను.”

[35] మరుసటి రోజు యోహాను, అతని శిష్యులలో ఇద్దరు మళ్ళీ అక్కడ నిలుచున్నారు.

[36] ఆ దారిన నడుస్తూ ఉన్న యేసును చూచి అతడు “ఇడుగో, దేవుని గొర్రెపిల్ల!” అన్నాడు.

[37] అతడు చెప్పినది ఆ ఇద్దరు శిష్యులు విని యేసును అనుసరించారు.

[38] యేసు వెనక్కు తిరిగి, వారు తనను అనుసరించడం చూచి “మీరు దేనిని వెతుకుతున్నారు?” అని వారినడిగాడు. వారు “రబ్బీ! మీరు ఎక్కడ నివాసం చేస్తున్నారు?” అని ఆయనను అడిగారు. (రబ్బీ అంటే బోధకుడని తర్జుమా).

[39] “వచ్చి చూడండి” అని ఆయన వారితో అన్నాడు గనుక వారు వెళ్ళి ఆయన ఉన్న స్థలం చూశారు. అప్పటికి సుమారు నాలుగు గంటలైంది గనుక వారు ఆ రోజు ఆయనతో ఉండిపోయారు.

[40] యోహాను చెప్పినది విని యేసువెంట వెళ్ళిన ఆ ఇద్దరిలో ఒకడు అంద్రెయ. అతడు సీమోను పేతురుకు తోబుట్టువు.

[41] అతడు మొట్టమొదట తన తోబుట్టువు సీమోనును కనుక్కొని అతనితో “మేము అభిషిక్తుణ్ణి చూశాం!” అన్నాడు. (అభిషిక్తుడు అంటే క్రీస్తు అని తర్జుమా.)

[42] అతణ్ణి యేసు దగ్గరికి తీసుకువచ్చాడు. యేసు అతణ్ణి చూచి “నీవు యోనా కుమారుడైన సీమోనువు. నిన్ను ‘కేఫా’ అంటారు” అన్నాడు (కేఫా అంటే రాయి అని తర్జుమా).

[43] మరుసటి రోజు యేసు గలలీకి వెళ్ళాలని ఉండి ఫిలిప్పును చూచి “నా వెంట రా” అన్నాడు.

[44] ఫిలిప్పు బేత్‌సయిదా వాడు. అది అంద్రెయ, పేతురుల గ్రామం.

[45] ఫిలిప్పు నతనియేలును కనుక్కొని “ధర్మ శాస్త్రంలో మోషే, ప్రవక్తలు కూడా ఎవరిని గురించి రాశారో ఆయనను చూశాం. ఆయన యోసేపు కుమారుడైన యేసు. ఆయన నజరేతు గ్రామంవాడు” అన్నాడు.

[46] అందుకు నతనియేలు “నజరేతునుంచి మంచిది ఏదైనా రాగలదా?” అని అతనితో అన్నాడు. ఫిలిప్పు అతనితో “వచ్చి చూడు” అన్నాడు.

[47] తన దగ్గరకు నతనియేలు రావడం చూచి యేసు అతణ్ణి గురించి “ఇడుగో, అసలైన ఇస్రాయేల్‌వాడు! అతనిలో కపటమేమీ లేదు” అన్నాడు.

[48] “నేను మీకు ఎలా తెలుసు?” అని నతనియేలు ఆయనను అడిగాడు. యేసు అతనితో జవాబిస్తూ “ఫిలిప్పు నిన్ను పిలవకముందే నీవు అంజూరచెట్టు క్రింద ఉన్నప్పుడు నిన్ను చూశాను” అన్నాడు.

[49] “గురువర్యా! మీరు దేవుని కుమారులే! ఇస్రాయేల్ రాజే!” అని నతనియేలు ఆయనకు బదులు చెప్పాడు.

[50] “నిన్ను అంజూరచెట్టు క్రింద చూశానని నేను నీతో చెప్పినందుచేత నమ్ముతున్నావా? వీటికి మించిన వాటిని చూస్తావు” అని యేసు అతనికి జవాబు చెప్పాడు.

[51] ఆయన ఇంకా అన్నాడు, “మీతో ఖచ్చితంగా చెపుతున్నాను, ఇకమీదట ఆకాశం తెరుచుకోవడమూ దేవదూతలు మానవ పుత్రుని మీదుగా ఎక్కిపోవడమూ దిగిరావడమూ మీరు చూస్తారు.”

యోహాను శుభవార్త — Chapters