[1] ఆయన తన శిష్యులతో ఇలా అన్నాడు: “ఆటంకాలు రాకపోవడం అసాధ్యం గాని అవి ఎవరివల్ల వస్తాయో అయ్యో ఆ వ్యక్తికి శిక్ష తప్పదు.
[2] ఈ చిన్న బిడ్డల్లో ఒకరికి ఆ వ్యక్తి ఆటంకం కలిగించి ఉండడంకంటే మెడకు తిరుగటి రాయి కట్టి సముద్రంలో పడవేయబడడమే అతనికి మేలు!
[3] “మీ మటుకు మీరు జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ మీ సోదరుడు మీకు వ్యతిరేకంగా అపరాధం చేస్తే అతణ్ణి మందలించండి. అతడు పశ్చాత్తాపపడితే అతణ్ణి క్షమించండి.
[4] ఒకవేళ అతడు మీకు వ్యతిరేకంగా ఒక్క రోజునే ఏడు సార్లు అపరాధం చేసి ఒక్క రోజునే ఏడు సార్లు మీ దగ్గరకు వచ్చి ‘పశ్చాత్తాపపడుతున్నాను’ అంటే మీరు అతణ్ణి క్షమించాలి.”
[5] ప్రభు రాయబారులు ఆయనతో “మా నమ్మకాన్ని వృద్ధి చెయ్యి” అన్నారు.
[6] అందుకు ప్రభువు అన్నాడు, “మీకు ఆవ గింజంత నమ్మకం ఉంటే, ఈ మారేడు చెట్టును చూచి ‘నీవు వేరులతో కూడా పెళ్ళగించబడి సముద్రంలో నాటుకుపో’ అంటే అది మీకు లోబడుతుంది.
[7] మీలో ఎవరికైనా దాసుడున్నాడు అనుకోండి. అతడు పొలం దున్నుతున్నాడు, లేదా, గొర్రెలు మేపుతున్నాడు. అతడు పొలంనుంచి వచ్చినప్పుడు ఆ యజమాని ‘వెంటనే వచ్చి భోజనానికి కూర్చో!’ అంటాడా?
[8] దానికి బదులుగా ‘నా కోసం భోజనం సిద్ధం చెయ్యి. నడుము కట్టి నాకు అన్నపానాలు వడ్డించిన తరువాత నీవు తిని తాగుదువు గాని’ అంటాడు గదా!
[9] అతడిచ్చిన ఆజ్ఞలు దాసుడు నెరవేర్చినందుచేత దాసునికి కృతజ్ఞత చెప్తాడా? చెప్తాడని అనుకోను.
[10] అలాగే మీకు ఆజ్ఞాపించినదంతా మీరు నెరవేర్చిన తరువాత ‘మేము పనికిమాలిన దాసులం, చేయవలసినదే చేశాం అంతే’ అనాలి.”
[11] ఆయన జెరుసలం ప్రయాణమైపోతూ సమరయ, గలలీ సరిహద్దులో సాగిపోతూ ఉన్నాడు.
[12] ఒక గ్రామంలో ఆయన ప్రవేశిస్తూ ఉంటే కుష్ఠురోగమున్న పదిమంది పురుషులు ఎదురుగా వస్తున్నారు.
[13] వారు దూరాన నిలుస్తూ కంఠమెత్తి ‘యేసూ! నాయకా! మామీద జాలి చూపు!’ అన్నారు.
[14] వారిని చూచి ఆయన వారితో “మీరు వెళ్ళి యాజులకు కనబడండి” అన్నాడు. వారు వెళ్ళిపోతూ ఉండగానే వారు శుద్ధమయ్యారు.
[15] వారిలో ఒకడు తన రోగం పూర్తిగా నయం కావడం చూచి బిగ్గరగా దేవుణ్ణి కీర్తిస్తూ వెనక్కు తిరిగి వచ్చాడు.
[16] యేసు పాదాలదగ్గర సాగిలపడి ఆయనకు కృతజ్ఞత చెప్పాడు. అతడు సమరయ దేశస్థుడు.
[17] అందుకు యేసు అన్నాడు “శుద్ధం అయిన వారు పదిమంది గదా! తక్కిన తొమ్మిదిమంది ఎక్కడ?
[18] తిరిగి వచ్చి దేవుణ్ణి కీర్తించడానికి ఈ విదేశీయుడు తప్ప ఇంకెవ్వరూ కనబడకపోవడమేమిటి?”
[19] అప్పుడు అతనితో “లేచి నీ దారిన వెళ్ళవచ్చు. నీ నమ్మకం నిన్ను బాగు చేసింది” అన్నాడు.
[20] ఒక సారి పరిసయ్యులు “దేవుని రాజ్యమెప్పుడు వస్తుంది?” అని ఆయనను అడిగినప్పుడు ఆయన వారికి జవాబిస్తూ “దేవుని రాజ్యం కండ్లకు కనిపించే విధంగా రాదు.
[21] ‘ఇదిగో, ఇక్కడ’ లేదా, ‘అదిగో, అక్కడ!’ అని మనుషులు అనరు. ఎందుకంటే, ఇదిగో దేవుని రాజ్యం ఇప్పుడే మీ మధ్య ఉంది!” అన్నాడు.
[22] ఆయన తన శిష్యులతో ఇలా అన్నాడు: “మానవ పుత్రుని రోజులలో ఒక దానిని చూడాలని మీరు ఎంతో ఆశించే కాలం వస్తుంది గాని ఆ రోజును చూడరు.
[23] అప్పుడు మనుషులు మీతో ‘అదిగో అక్కడ!’ లేదా, ‘ఇదిగో ఇక్కడ!’ అంటారు. మీరు వెళ్ళకూడదు, వారిని అనుసరించకూడదు.
[24] ఆకాశంలో మెరుపు ఒకవైపు మెరిసి మరో వైపుకు ఎలా ప్రకాశిస్తుందో అలాగే మానవ పుత్రుడు తన రాకడ రోజున ఉంటాడు.
[25] అయితే ముందుగా ఆయన అనేక బాధలు అనుభవించి ఈ తరంవారి నిరాకరణకు గురి కావడం తప్పనిసరి.
[26] “మానవ పుత్రుని రోజులలో నోవహు రోజులలోలాగే ఉంటుంది.
[27] అప్పుడు ప్రజలు తింటూ త్రాగుతూ పెళ్ళిళ్ళకు ఇచ్చి పుచ్చుకొంటూ వచ్చారు. నోవహు ఓడలోకి వెళ్ళేరోజు వరకూ అలా జరుగుతూ ఉంది. అప్పుడు జల ప్రళయం వచ్చి వారందరినీ నాశనం చేసింది.”
[28] “లోత్ రోజులలో ఉన్నట్టు కూడా ఉంటుంది. అప్పుడు వారు తింటూ త్రాగుతూ కొంటూ అమ్ముతూ నాటుతూ కట్టడాలు నిర్మిస్తూ ఉన్నారు.
[29] కానీ సొదొమ నుంచి లోత్ వెళ్ళిపోయిన రోజునే ఆకాశం నుంచి అగ్ని గంధకాలు కురిసి అందరినీ నాశనం చేశాయి.”
[30] “మానవ పుత్రుడు ప్రత్యక్షమయ్యే రోజున కూడా అలాగే ఉంటుంది.
[31] ఆ రోజున ఇంటి డాబామీద ఉన్న వ్యక్తి తన సామానులు ఇంట్లో ఉంటే వాటిని తీసుకువెళ్ళడానికి దిగి రాకూడదు. అలాగే పొలంలో ఉన్న వ్యక్తి తిరిగి రాకూడదు.
[32] లోత్ భార్య సంగతి జ్ఞాపకముంచుకోండి.
[33] తన ప్రాణాన్ని రక్షించుకోవాలనుకొనేవాడు దానిని పోగొట్టు కొంటాడు. కానీ తన ప్రాణాన్ని పోగొట్టుకొనేవాడు దాన్ని కాపాడుకొంటాడు.
[34] మీతో నేను చెప్పేదేమంటే, ఆ రాత్రి ఇద్దరు ఒకే పడకమీద ఉంటారు. ఒకరిని తీసుకువెళ్ళడం, మరొకరిని విడిచిపెట్టడం జరుగుతుంది.
[35] ఇద్దరు స్త్రీలు కలిసి విసురుతూ ఉంటారు ఒకతెను తీసుకువెళ్ళడం, మరొకతెను విడిచిపెట్టడం జరుగుతుంది.
[36] ఇద్దరు ఒకే పొలంలో ఉంటారు. ఒకరిని తీసుకువెళ్ళడం, మరొకరిని విడిచిపెట్టడం జరుగుతుంది.”
[37] అందుకు శిష్యులు ఆయనతో అన్నారు, “ఎక్కడ, ప్రభూ?” ఆయన “ఎక్కడ శవం ఉంటే అక్కడ రాబందులు పోగవుతాయి” అని వారితో చెప్పాడు.