[1] ఆ తరువాత ప్రభువు డెబ్భయిమంది ఇతర శిష్యులను కూడా నియమించి తాను వెళ్ళబోయే ప్రతి గ్రామానికీ స్థలానికీ ఇద్దరిద్దరిని తనకంటే ముందు పంపాడు.
[2] వారితో ఇలా అన్నాడు: “కోత చాలా ఎక్కువ. పనివారే తక్కువ, గనుక కోత యజమానిని కోతకు పనివారిని పంపమని వేడుకోండి.
[3] ఇదిగో వినండి, తోడేళ్ళ మధ్యలోకి గొర్రెపిల్లలను పంపినట్టు నేను మిమ్ములను పంపుతున్నాను. మీరు వెళ్ళండి.
[4] బొక్కసం గానీ సంచి గానీ చెప్పులు గానీ తీసుకువెళ్ళకండి. దారిన ఎవరినీ పలకరించకండి.
[5] “ఏ ఇంట్లో అయినా ప్రవేశించినప్పుడు ‘ఈ ఇంటికి శాంతి ప్రాప్తిస్తుంది గాక!’ అనండి.
[6] శాంతిప్రియుడు ఎవరైనా ఆ ఇంట్లో ఉంటే మీ శాంతి ఆ ఇంటి మీదికి వస్తుంది. లేకపోతే మీ శాంతి మీకే తిరిగి వస్తుంది.
[7] ఆ ఇంట్లోనే ఉండి, వారు మీకు పెట్టే అన్నపానాలేవైనా పుచ్చుకోండి. పనివాడు జీతానికి యోగ్యుడే గదా. ఇంటినుంచి ఇంటికి మారకండి.
[8] “మీరు ఏ ఊరికి వెళ్ళినా సరే వారు మిమ్ములను స్వీకరిస్తే వారేది మీకు వడ్డిస్తే అది తినండి.
[9] అక్కడి రోగులను బాగు చేసి వారితో ‘దేవుని రాజ్యం మీదగ్గరకు వచ్చింది’ అని చెప్పండి.
[10] ఒకవేళ ఏదైనా ఊరికి వెళ్ళిన తరువాత వారు మిమ్ములను స్వీకరించకపోతే ఆ ఊరి వీధులలోకి వెళ్ళి ఇలా అనండి:
[11] ‘మాకు అంటుకొన్న మీ ఊరి దుమ్ము మీకు వ్యతిరేకమైన సాక్ష్యంగా దులిపివేస్తున్నాం. అయితే దేవుని రాజ్యం మీ దగ్గరకు సమీపించిందని తెలుసుకోండి.’
[12] మీతో నేను చెప్పేదేమిటంటే, తీర్పు రోజున ఆ గ్రామానికి పట్టే గతికంటే సొదొమకు పట్టే గతే ఓర్చుకో తగినదవుతుంది.
[13] “అయ్యో కొరజీనూ! నీకు శిక్ష తప్పదు! అయ్యో బేత్‌సెయిదా! నీకు శిక్ష తప్పదు! మీలో జరిగిన అద్భుతాలు తూరు, సీదోను పట్టణాలలో గనుక జరిగివుంటే, అక్కడి వారు చాలా కాలం క్రిందటే పశ్చాత్తాపపడి గోనెపట్టలు చుట్టుకొని నెత్తిన బూడిద పోసుకొని కూర్చునేవారు!
[14] అయితే తీర్పులో మీకు పట్టే గతికంటే తూరు సీదోనుల గతే ఓర్చుకో తగినదవుతుంది!
[15] కపెర్‌నహూం! ఆకాశం వరకూ హెచ్చిపోయిన నీవు మృత్యు లోకంలోకి తగ్గించబడుతావు!
[16] “మీ మాట వినేవారు నా మాట విన్నట్టే. మిమ్ములను నిరాకరించేవారు నన్ను నిరాకరిస్తున్నారు. నన్ను నిరాకరించే వారు నన్ను పంపినవాణ్ణి నిరాకరిస్తున్నారు.”
[17] ఆ డెబ్భయిమంది శిష్యులు ఆనందంతో తిరిగి వచ్చి “ప్రభూ! నీ పేరట దయ్యాలు సహా మాకు లొంగిపోతున్నాయి” అన్నారు.
[18] అందుకాయన “సైతాను మెరుపులాగా ఆకాశంనుంచి పడడం నేను చూశాను.
[19] ఇదిగో వినండి, పాములనూ తేళ్ళనూ మీ పాదాల క్రింద త్రొక్కడానికి శత్రు బలమంతటి మీదా మీకు అధికారం ఇచ్చాను. ఏదీ మీకు హాని చేయదు.
[20] అయినా పిశాచాలు మీకు లొంగిపోయినంత మాత్రాన సంతోషించకండి గాని మీ పేర్లు పరలోకంలో వ్రాసి ఉన్నందుచేత సంతోషించండి” అని వారితో చెప్పాడు.
[21] ఆ ఘడియలోనే పవిత్రాత్మలో ఆనందిస్తూ యేసు ఇలా అన్నాడు: “తండ్రీ! భూమ్యాకాశాల ప్రభూ! నీవు ఈ సంగతులు జ్ఞానులకూ తెలివైనవారికీ చూపకుండా దాచిపెట్టి వాటిని చిన్నపిల్లలకు వెల్లడి చేశావు. అవును, తండ్రీ, అలా చేయడం నీకు ఇష్టమైంది. అందుచేత నిన్ను స్తుతిస్తున్నాను.
[22] “నా తండ్రి సమస్తమూ నాకు అప్ప చెప్పాడు. తండ్రికి తప్ప కుమారుడెవరో ఎవరికీ తెలియదు. కుమారునికి తప్ప తండ్రి ఎవరో ఎవరికీ తెలియదు. కుమారుడు తండ్రిని ఎవరికి వెల్లడి చేయాలని ఇష్టపడుతాడో వారికి కూడా తెలుసు.”
[23] అప్పుడాయన శిష్యులవైపు తిరిగి, ఏకాంతంగా వారితో “మీరు చూస్తున్నవాటిని చూచే కండ్లు ధన్యమైనవి.
[24] మీతో నేను చెప్పేదేమంటే, మీరు చూస్తున్నవాటిని చూడాలనీ, వింటున్నవాటిని వినాలనీ అనేకమంది ప్రవక్తలూ, రాజులూ ఆశించారు గాని చూడలేకపోయారు, వినలేక పోయారు” అన్నాడు.
[25] ఒకప్పుడు ధర్మశాస్త్ర విద్వాంసుడొకడు లేచి ఆయనను పరీక్షిస్తూ “ఉపదేశకా! శాశ్వత జీవానికి వారసుణ్ణి కావడానికి నేనేం చేయాలి?” అని అడిగాడు.
[26] ఆయన అతనితో “ధర్మశాస్త్రంలో ఏమి వ్రాసి ఉంది? నీవు దాన్ని చదవడం వల్ల నీకు తోచేది ఏమిటి?” అన్నాడు.
[27] అందుకు అతడు ఇలా జవాబిచ్చాడు: “హృదయ పూర్వకంగా, సంపూర్ణ ఆత్మతో, బలమంతటితో, మనస్ఫూర్తిగా మీ దేవుడైన ప్రభువును ప్రేమిస్తూ ఉండాలి; మిమ్ములను ప్రేమించుకొన్నట్టే మీ పొరుగువాణ్ణి ప్రేమించాలి.”
[28] ఆయన అతనితో “సరిగ్గా చెప్పావు. అలాగే చేస్తూ ఉండు. అప్పుడు జీవిస్తావు” అన్నాడు.
[29] తాను న్యాయవంతుడై ఉన్నట్టు చూపుకోవాలని అతడు “అయితే నా పొరుగువాడు ఎవరు?” అని యేసును అడిగాడు.
[30] యేసు జవాబిస్తూ ఇలా అన్నాడు: “ఒక మనిషి జెరుసలంనుంచి యెరికోకు ప్రయాణమైపోతూ దోపిడీదొంగల చేతికి చిక్కాడు. వారు అతని ఒంటిమీద బట్టలు ఒలుచుకొని అతణ్ణి గాయపరచి కొనప్రాణంతో అతణ్ణి విడిచి వెళ్ళిపోయారు.
[31] అదృష్టవశాత్తుగా ఒక యాజి ఆ దారిన వచ్చాడు. అతడు ఆ మనిషిని చూచి ప్రక్కగా తొలగి దాటిపోయాడు.
[32] అలాగే లేవీగోత్రికుడొకడు కూడా ఆ చోటికి వచ్చి అతణ్ణి చూచి ప్రక్కగా తొలగి దాటిపోయాడు.
[33] అయితే సమరయ దేశస్థుడొకడు ప్రయాణంమీద ఉండి ఆ మనిషి ఉన్న చోటికి వచ్చాడు. అతణ్ణి చూచి జాలిపడ్డాడు,
[34] దగ్గరకు వచ్చి అతని గాయాలకు నూనె, ద్రాక్షరసం పోసి కట్లు కట్టాడు, అతణ్ణి తన సొంత గాడిద మీద ఎక్కించుకొని సత్రానికి తీసుకువెళ్ళి బాగోగులు చూశాడు.
[35] మరుసటి రోజు అతడు బయలు దేరబోతుండగా రెండు వెండి నాణేలు తీసి సత్రం మనిషికిచ్చి ‘ఇతడి బాగోగులు చూడండి. ఇంకేమైనా ఖర్చు చేస్తే నేను తిరిగి వచ్చేటప్పుడు మీకు చెల్లిస్తాను’ అన్నాడు.
[36] “నీకేమి తోస్తున్నది? – దోపిడీదొంగల చేతికి చిక్కిన మనిషికి ఆ ముగ్గురిలో ఎవరు పొరుగువాడుగా ఉన్నారు?”
[37] అతడు “అతనిపట్ల జాలి చూపినవాడే” అన్నాడు. అతనితో యేసు “నీవు వెళ్ళి అలాగే చేస్తూ ఉండు” అన్నాడు.
[38] వారు ప్రయాణమైపోతూ ఉంటే ఆయన ఒక గ్రామంలో ప్రవేశించాడు. అక్కడ మార్త అనే ఆమె ఆయనను తన ఇంట్లోకి సత్కరించింది.
[39] ఆమెకు మరియ అనే సోదరి ఉంది. మరియ యేసు పాదాలదగ్గర కూర్చుని ఉండి ఆయన వాక్కులు వింటూ ఉంది.
[40] మార్త అయితే చాలా సేవను బట్టి తొందరపడుతూ ఆయన దగ్గరకు వచ్చి “ప్రభూ! నేను ఒక్కదాన్నే పని చేయడానికి నా సోదరి నన్ను విడిచిపెట్టి నందుకు మీకేం పట్టదా? నాకు సహాయం చేయమని ఆమెకు చెప్పండి!” అంది.
[41] అయితే యేసు ఆమెకు ఇలా జవాబిచ్చాడు: “మార్తా! మార్తా! నీవు అనేక సంగతులను గురించి బెంగపెట్టుకొని కంగారుపడుతున్నావు.
[42] అయితే అవసరమైనది ఒక్కటే! మరియ ఎన్నుకొన్నది ఆ ఉత్తమమైనది. అది ఆమెనుంచి తీసివేయబడదు.”