Skip to content
Opens in a new window
Listen to this chapter • 10:50

[1] ఒకసారి ఆయన ఒక చోట ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన ముగించిన తరువాత ఆయన శిష్యులలో ఒకడు ఆయనతో “ప్రభూ! ఎలా ప్రార్థన చేయాలో యోహాను తన శిష్యులకు నేర్పాడు. నీవు మాకు నేర్పు” అన్నాడు.

[2] ఆయన వారితో అన్నాడు, “మీరు ప్రార్థన చేసేటప్పుడు ఇలా అనండి: పరలోకంలో ఉన్న మా తండ్రీ, నీ పేరు అందరికీ పవిత్రమై ఉంటుంది గాక! నీ రాజ్యం వస్తుంది గాక! నీ సంకల్పం పరలోకంలోలాగే భూమిమీద కూడా నెరవేరుతుంది గాక!

[3] రోజువారి ఆహారం రోజు రోజు మాకు ప్రసాదించు.

[4] మాకు రుణపడ్డ ప్రతి వ్యక్తినీ మేము కూడా క్షమిస్తున్నాం గనుక మా అపరాధాలను క్షమించు. మమ్ములను దుష్ ప్రేరేపణలోకి నడిపించకు. దుర్మార్గత నుంచి మమ్ములను రక్షించు.”

[5] ఆయన వారితో ఇంకా అన్నాడు “మీలో ఎవరో ఒకడికి ఒక స్నేహితుడు ఉన్నాడు అనుకోండి. అతడు మధ్యరాత్రి అతనిదగ్గరకు వెళ్ళి ‘స్నేహితుడా! నాకు మూడు రొట్టెలు బదులివ్వు.

[6] నా స్నేహితుడు ఒకడు ప్రయాణం మధ్యలో నాదగ్గరికి వచ్చాడు. అతడికి పెట్టడానికి నా దగ్గర ఆహారం ఏమీ లేదు’ అంటాడు అనుకోండి.

[7] లోపల నుంచి అతడు ‘నన్ను తొందరపెట్టకు! తలుపు మూసి ఉంది. నేనూ నా పిల్లలూ మంచం మీద పడుకొన్నాం. నేను లేచి నీకివ్వలేను’ అంటాడు అనుకోండి.

[8] నేను మీతో అంటున్నాను, అతడు తన స్నేహితుడు కావడంచేత ఇతడు లేచి ఇవ్వకపోయినా అతడు సిగ్గులేకుండా అడుగుతూ ఉంటే ఇతడు లేచి అతనికి కావలసినంత ఇస్తాడు.

[9] “అందుచేత మీతో నేనంటున్నాను, దేవుణ్ణి అడగండి, మీకు ఇవ్వబడుతుంది. వెదకండి, మీకు దొరుకుతుంది. తలుపు తట్టండి, మీకు తెరవబడుతుంది.

[10] అడిగే ప్రతి ఒక్కరికీ లభిస్తుంది. వెదికే వ్యక్తికి దొరుకుతుంది. తట్టే వ్యక్తికి తలుపు తెరువబడుతుంది.

[11] మీలో ఏ తండ్రినయినా కొడుకు రొట్టె కావాలని అడిగితే అతనికి రాయినిస్తాడా? చేప కావాలని అడిగితే చేపకు బదులుగా అతనికి పామునిస్తాడా?

[12] గుడ్డు కావాలని అతడు అడిగితే అతనికి తేలునిస్తాడా?

[13] “మీరు చెడ్డవారు అయినా మీ పిల్లలకు మంచివాటిని ఇవ్వాలన్న సంగతి తెలుసునే. అలాంటప్పుడు మీ పరమ తండ్రి తనను అడిగేవారికి మరి నిశ్చయంగా పవిత్రాత్మను ప్రసాదిస్తాడు గదా!”

[14] ఒకప్పుడు ఆయన దయ్యాన్ని వెళ్ళగొట్టాడు. అది మూగది. దయ్యం బయటికి వెళ్ళిపోయిన తరువాత మూగవాడు మాట్లాడాడు. అందుకా జన సమూహాలకు ఎంతో ఆశ్చర్యం వేసింది.

[15] అయితే వారిలో కొందరు “దయ్యాల నాయకుడైన బయల్‌జెబూల్ సహాయంతోనే దయ్యాల్ని వెళ్ళగొట్టేస్తున్నాడు” అన్నారు.

[16] మరి కొందరు ఆయనను పరీక్షిస్తూ పరలోకంనుంచి ఆయన సూచనకోసం అద్భుతం చూపాలని చూశారు.

[17] వారి ఆలోచనలు తెలుసుకొని ఆయన వారితో ఇలా అన్నాడు: “ఏ రాజ్యమైనా సరే తనను తానే వ్యతిరేకించి చీలిపోతే అది నాశనమవుతుంది. ఇల్లు కూడా తనను తానే వ్యతిరేకించి చీలిపోతే కూలుతుంది.

[18] ఒకవేళ సైతాను తననే వ్యతిరేకించి చీలిపోతే వాడి రాజ్యమెలా నిలుస్తుంది? బయల్‌జెబూబ్ సహాయంతో దయ్యాలను వెళ్ళగొట్టివేస్తున్నానని నన్ను గురించి మీరంటున్నారు గదా.

[19] ఒకవేళ నేను దయ్యాలను బయల్‌జెబూల్ సహాయంతో వెళ్ళగొట్టివేస్తున్నానంటే మీ కొడుకులు వాటిని ఎవరి సహాయంతో వెళ్ళగొట్టివేస్తున్నారు? అందుచేత మీ సంతానమే మీకు తీర్పరులవుతారు.

[20] నేను దేవుని వ్రేలితో దయ్యాలను వెళ్ళగొట్టివేస్తూ ఉంటే, దేవుని రాజ్యం నిజంగా మీ మధ్యకు వచ్చిందన్నమాటే!

[21] బలవంతుడు ఆయుధాలు ధరించుకొని తన ఆవరణానికి కావలి ఉంటే అతని సొత్తు భద్రంగా ఉంటుంది.

[22] కానీ అతడికంటే బలాఢ్యుడొకడు అతనిపైబడి జయించినప్పుడు అతడు నమ్ముకొన్న ఆయుధాలన్నిటినీ ఇతడు లాగుకొని అతని సొత్తూ దోచుకొని పంచి ఇస్తాడు.

[23] “నా పక్షాన ఉండనివాడు నాకు విరోధి. నాతో కలిసి సమకూర్చనివాడు చెదరగొట్టేవాడు.

[24] “మలిన పిశాచం మనిషిలో నుంచి బయటికి వచ్చినప్పుడు నీళ్ళు లేని ప్రాంతాలలో తిరుగుతూ విశ్రాంతి కోసం వెదకుతూ ఉంటుంది. విశ్రాంతి ఏమీ దొరకక అది ‘నేను విడిచివచ్చిన నా ఇంటికి మళ్ళీ పోతాను’ అంటుంది.

[25] అది వచ్చినప్పుడు ఆ ఇల్లు శుభ్రంగా ఊడ్చి, సర్దిపెట్టి ఉండడం చూస్తుంది.

[26] అప్పుడది వెళ్ళి తనకంటే చెడ్డ ఆత్మలను ఏడింటిని వెంటబెట్టుకువస్తుంది. అవి ఆ ఇంట్లో దూరి అక్కడే నివాసం చేస్తాయి. అందుచేత ఆ మనిషి చివరి పరిస్థితి మొదటి కంటే అధ్వాన్నంగా ఉంటుంది.”

[27] ఆయన ఈ మాటలు చెపుతూ ఉన్నప్పుడు జన సమూహంలో ఒక స్త్రీ కంఠమెత్తి ఆయనతో “నిన్ను గర్భవాసాన మోసి నీకు స్తన్యం కుడిపిన తల్లి ధన్యజీవి!” అంది.

[28] అందుకాయన “అవును, గానీ దేవుని వాక్కు విని దాని ఆచరించేవారే మరీ ధన్యులు” అన్నాడు.

[29] జనులు గుంపులు గుంపులుగా సమకూడుతూ ఉంటే ఆయన ఇలా అన్నాడు: “ఈ తరం చెడ్డది. సూచక అద్భుతం కోసం చూస్తున్నది. కానీ యోనాప్రవక్త సూచన తప్ప ఇంకా ఏ సూచనా ఈ తరంవారికి చూపడం జరగదు.

[30] యోనా నీనెవె నగరవాసులకు సూచనగా ఉన్నాడు. అలాగే మానవపుత్రుడు ఈ తరంవారికి సూచనగా ఉంటాడు.

[31] “దక్షిణదేశం రాణి తీర్పు రోజున ఈ తరంవారితో నిలిచి వీరిమీద నేరం మోపుతుంది. ఎందుకంటే ఆమె సొలొమోను జ్ఞానవాక్కులు విందామని భూమి కొనలనుంచి వచ్చింది. అయితే సొలొమోను కంటే ఘనుడు ఇక్కడే ఉన్నాడు సుమా!

[32] నీనెవె మనుషులు తీర్పురోజున ఈ తరంవారితో నిలిచి వీరిమీద నేరం మోపుతారు. ఎందుకంటే యోనా ప్రకటన చేసినప్పుడు వారు పశ్చాత్తాపపడ్డారు. అయితే యోనాకంటే ఘనుడు ఇక్కడే ఉన్నాడు సుమా!

[33] “దీపం వెలిగించి ఎవరూ దానిని మరుగున పెట్టరు, బుట్టక్రింద పెట్టరు. లోపలికి వచ్చేవారికి వెలుగు కనిపించేలా దీపస్తంభం మీద ఉంచుతారు గదా.

[34] శరీరానికి దీపం కన్ను. గనుక మీ కన్ను మంచిదైతే మీ శరీరంనిండా వెలుగు ఉంటుంది. కన్ను చెడ్డదైతే మీ శరీరమంతా చీకటే.

[35] కాబట్టి మీ లోపల ఉన్న వెలుగు చీకటిగా ఉండకుండా జాగ్రత్తగా చూచుకోండి!

[36] మీ శరీరం నిండా వెలుగు ఉంటే, ఏ భాగంలోనూ చీకటి లేకపోతే, దీపం తన కాంతివల్ల మీకు వెలుగిచ్చినట్టే మీ శరీరమంతా వెలుగుతో నిండి ఉంటుంది.”

[37] ఆయన మాట్లాడిన సమయంలో పరిసయ్యుడు ఒకడు తన ఇంటికి భోజనానికి రమ్మంటూ ఆయనను పిలిచాడు. ఆయన లోపలికి వెళ్ళి భోజనానికి కూర్చున్నాడు.

[38] భోజనానికి ముందు ఆయన కడుక్కోకపోవడం చూచి పరిసయ్యుడు ఆశ్చర్యపడ్డాడు.

[39] ప్రభువు అతనితో ఈ విధంగా అన్నాడు: “పరిసయ్యులైన మీరు గిన్నె, పళ్ళెం బయటవైపు శుభ్రం చేస్తారు గాని మీ అంతరంగంనిండా దోపిడీ, దుర్మార్గం ఉన్నాయి.

[40] తెలివితక్కువ వారలారా! బయటిది చేసినవాడు లోపలిది కూడా చేయలేదా!

[41] మీకు ఉన్నవాటిని దానధర్మాలు చేయండి. అప్పుడు అన్నీ మీకు శుభ్రంగా ఉంటాయి.

[42] “అయ్యో పరిసయ్యులారా! మీకు శిక్ష తప్పదు! పుదీనా, సదాప, అన్ని రకాల ఆకు కూరలలో పదో భాగం దేవునికి చెల్లిస్తారు గానీ న్యాయం, దేవుని ప్రేమ వదలివేస్తూ ఉన్నారు. మీరు వాటిని చేసి ఉండాలి, వీటిని కూడా జరిగిస్తూ ఉండాలి.

[43] “అయ్యో పరిసయ్యులారా! మీకు శిక్ష తప్పదు! సమాజకేంద్రాలలో అగ్రస్థానాలూ, సంతవీధుల్లో వందనాలు అందుకోవడమూ మీకు చాలా ఇష్టం.

[44] అయ్యో, ధర్మశాస్త్రపండితులూ, పరిసయ్యులూ! మీరు కపట భక్తులు. మీకు శిక్ష తప్పదు! మీరు పైకి కనబడని సమాధుల్లాగా ఉన్నారు. తెలియక మనుషులు వాటిమీద నడుస్తున్నారు.”

[45] అప్పుడు ధర్మశాస్త్ర విద్వాంసులలో ఒకడు ఆయనకు జవాబిస్తూ “ఉపదేశకా, ఈ సంగతులు అనడంలో మమ్మల్ని కూడా నిందిస్తున్నావు!” అన్నాడు.

[46] అందుకాయన అన్నాడు “అయ్యో, ధర్మశాస్త్ర విద్వాంసులారా! మీకు కూడా శిక్ష తప్పదు! మీరు మనుషుల మీద మోయడానికి కష్టతరమైన బరువులు మోపుతారు. మీరైతే ఒక్క వ్రేలితోనైనా ఆ బరువులు తాకరు.

[47] “అయ్యో, మీకు శిక్ష తప్పదు! మీ పూర్వీకులు ప్రవక్తలను చంపారు. వారి సమాధులు మీరు కట్టిస్తున్నారు.

[48] నిజంగా మీరు మీ పూర్వీకులు చేసినదానికి సమ్మతిస్తున్నారని ఇలా సాక్ష్యమిస్తున్నారు. వారిని చంపినదేమో వారు, వారి సమాధులు కట్టించేదేమో మీరు.

[49] అందుచేత దేవుని జ్ఞానం చెప్పినదేమంటే, నేను వారి దగ్గరకు ప్రవక్తలనూ రాయబారులనూ పంపుతాను. వారిలో కొందరిని చంపుతారు. కొందరిని హింసిస్తారు.

[50] ఈ విధంగా, లోకానికి పునాది వేయబడ్డప్పటినుంచీ ప్రవక్తలందరి రక్తపాతం విషయం ఈ తరంవారు జవాబుదారులవుతారు.

[51] అంటే, హేబెలు రక్తం మొదలుకొని, బలిపీఠానికీ దేవాలయానికీ మధ్య హతమైపోయిన జెకర్యా రక్తం వరకు, వారందరి రక్తపాతం విషయం ఈ తరంవారు జవాబుదారులవుతారని మీతో రూఢిగా చెపుతున్నాను.

[52] అయ్యో, ధర్మశాస్త్ర విద్వాంసులారా! మీకు శిక్ష తప్పదు! జ్ఞానానికి తాళం చెవి మీరు కొట్టేశారు. మీరు లోపల ప్రవేశించలేదు, ప్రవేశిస్తున్న వారిని ఆటంకపరిచారు!”

[53] ఆయన వారితో ఈ విషయాలు చెప్పినప్పుడు ధర్మశాస్త్రవిద్వాంసులూ పరిసయ్యులూ ఆయనను ఎంతో తీవ్రంగా పీడిస్తూ ఆయనను రెచ్చగొట్టాలని అనేక సంగతులను గురించి ఆయనను ప్రశ్నించడం ఆరంభించారు.

[54] ఆయనమీద నేరం మోపాలని కుట్ర పన్ని ఆయన చెప్పిన మాటల్లో ఆయనను చిక్కించడానికి చూస్తూ ఉన్నారు.

లూకా శుభవార్త — Chapters