[1] తన మాటలన్నీ ప్రజలకు వినిపించడం ముగించిన తరువాత ఆయన కపెర్‌నహూంలో ప్రవేశించాడు.
[2] అక్కడ రోమన్ సైన్యంలోని శతాధిపతి దాసుడొకడు జబ్బుపడి చావుబ్రతుకులలో ఉన్నాడు. అతడంటే యజమానికి చాలా ఇష్టం.
[3] యేసును గురించి విని శతాధిపతి యూదుల పెద్దలను కొందరిని ఆయన దగ్గరకు పంపి, ఆయన వచ్చి తన దాసుణ్ణి బాగు చేయమని వారిద్వారా విన్నవించుకొన్నాడు.
[4] వారు యేసు దగ్గరకు వచ్చినప్పుడు ఆయనను మనసారా వేడుకొంటూ “మీరు మేలు చేయవలసింది. ఈ వ్యక్తి యోగ్యుడు.
[5] మన ప్రజలంటే అతనికి ప్రేమ. మా సమాజ కేంద్రం కట్టించినది ఇతడే” అన్నారు.
[6] యేసు వారితోకూడా వెళ్ళి శతాధిపతి ఇంటికి ఎక్కువ దూరం లేనప్పుడు అతడు స్నేహితులను కొందరిని ఆయన దగ్గరకు పంపి వారిచేత ఆయనతో ఇలా చెప్పించాడు: “స్వామీ, శ్రమ తీసుకోకండి. మీరు నా ఇంట్లోకి వచ్చేటంత యోగ్యత నాకు లేదు.
[7] మీ దగ్గరికి రావడానికి కూడా యోగ్యుణ్ణని నేననుకోలేదు. మీరు మాట మాత్రం అనండి. అప్పుడు నా దాసుడికి జబ్బు పూర్తిగా నయమవుతుంది.
[8] నేను కూడా అధికారం క్రింద ఉన్నవాణ్ణి. నా చేతిక్రింద సైనికులున్నారు. నేను ఒకణ్ణి ‘వెళ్ళు’ అంటే వెళ్తాడు. మరొకణ్ణి ‘రా’ అంటే వస్తాడు. నా దాసుణ్ణి ‘ఈ పని చెయ్యి’ అంటే చేస్తాడు.”
[9] ఈ మాటలు విని యేసు ఆ మనిషి విషయం ఆశ్చర్యపడ్డాడు. తన వెంట వస్తున్న జన సమూహం వైపు తిరిగి, “మీతో నేను చెప్పేదేమిటంటే ఇస్రాయేల్ ప్రజల్లో, ఎవరికైనా ఇంత గొప్ప నమ్మకం ఉన్నట్టు నేను చూడలేదు” అన్నాడు.
[10] పంపబడ్డవారు ఇంటికి తిరిగి వచ్చి జబ్బుపడ్డ ఆ దాసుడు ఆరోగ్యంగా ఉండడం చూశారు.
[11] మరుసటి రోజున ఆయన నాయీను అనే ఊరికి వెళ్ళాడు. ఆయనతోకూడా ఆయన శిష్యులలో అనేకులూ పెద్ద జన సమూహమూ వెళ్ళారు.
[12] ఆయన ఊరి ద్వారం దగ్గరకు చేరినప్పుడే కొందరు చనిపోయినవాణ్ణి మోసుకువస్తూ ఉన్నారు. చనిపోయినవాడు తల్లికి ఒక్కగానొక్క కొడుకు. ఆమె విధవరాలు. ఆమెతో కూడా గ్రామస్థులు పెద్దగుంపుగా వస్తూ ఉన్నారు.
[13] ఆమెను చూచి ప్రభువుకు జాలి వేసింది. ఆమెతో “ఏడవకమ్మా!” అన్నాడు.
[14] పాడెదగ్గరకు వెళ్ళి దానిని తాకాడు. దానిని మోస్తున్నవారు ఆగారు. అప్పుడాయన “అబ్బాయీ! నీతో నేనంటున్నాను, లే!” అన్నాడు.
[15] చనిపోయినవాడు కూర్చుని మాట్లాడసాగాడు. యేసు అతణ్ణి తల్లికి అప్పచెప్పాడు.
[16] అందరూ భయాక్రాంతులై “మన మధ్య గొప్ప ప్రవక్త బయలుదేరాడు. దేవుడు తన జనాన్ని సందర్శించాడు” అంటూ దేవుణ్ణి కీర్తించారు.
[17] యేసును గురించిన ఈ కబురు యూదయ అంతటా చుట్టుపట్ల ఉన్న ప్రాంతమంతటా వ్యాపించింది.
[18] యోహాను శిష్యులు ఈ సంగతులన్నీ అతనికి తెలియజేశారు.
[19] యోహాను తన శిష్యులలో ఇద్దరిని పిలిచి యేసుదగ్గరకు పంపుతూ ఇలా అడగమని ఆదేశించాడు: “రావలసినవాడివి నీవేనా? మేము వేరొకరికోసం ఎదురు చూడాలా?”
[20] ఆ మనుషులు ఆయనదగ్గరికి వచ్చి ఇలా అన్నారు: “బాప్తిసమిచ్చే యోహాను మీ దగ్గరికి మమ్మల్ని పంపి ‘రావలసినవాడివి నీవేనా? మేము వేరొకరికోసం ఎదురు చూడాలా?’ అని అడగమన్నాడు.”
[21] ఆ ఘడియలోనే ఆయన రోగులనూ బాధితులనూ పిశాచాలు పట్టినవారినీ అనేకమందిని బాగు చేస్తూ ఉన్నాడు. గుడ్డివారనేకులకు చూపు ప్రసాదిస్తూ ఉన్నాడు.
[22] యేసు యోహాను దగ్గరనుంచి వచ్చిన వారికిలా సమాధానం చెప్పాడు: “తిరిగి వెళ్ళి, మీరు చూచిందీ విన్నదీ యోహానుకు తెలియజేయండి. గుడ్డివారికి చూపు వస్తూ ఉంది. కుంటివారు నడుస్తూ ఉన్నారు. కుష్ఠురోగులు శుద్ధమవుతూ ఉన్నారు. చెవిటివారు వింటూ ఉన్నారు. చనిపోయినవారు సజీవంగా లేపబడుతున్నారు. బీదలకు శుభవార్త ప్రకటన జరుగుతూ ఉంది.
[23] నా విషయంలో అభ్యంతరం లేనివాడు ధన్యజీవి.”
[24] యోహాను పంపినవారు వెళ్ళిపోయిన తరువాత యేసు యోహాను విషయం జన సమూహంతో ఇలా మాట్లాడసాగాడు: “ఏమి చూద్దామని మీరు అరణ్యంలోకి వెళ్ళారు? గాలికి ఊగే రెల్లునా?
[25] అది కాకపోతే ఏమి చూద్దామని వెళ్ళారు? సన్నని వస్త్రాలు తొడుక్కున్న మనిషినా? సుఖభోగాలలో బ్రతుకుతూ శ్రేష్ఠ వస్త్రాలు తొడుక్కొనేవారు రాజ భవనాలలో ఉంటారు గదా.
[26] అయితే ఏమి చూద్దామని మీరు వెళ్ళారు? ప్రవక్తనా? అవును. అతడు ప్రవక్తే! ఆ మాటకు వస్తే ప్రవక్తకంటే కూడా గొప్పవాడని మీతో చెపుతున్నాను.
[27] ఇతణ్ణి గురించే ఈ మాటలు వ్రాసి ఉన్నాయి. ‘ఇదిగో, నేను నా దూతను నీకు ముందుగా పంపుతున్నాను. అతడు నీ ముందర నీ దారిని సిద్ధం చేస్తాడు.’
[28] “మీతో నేను చెప్పేదేమంటే, స్త్రీలు కన్నవారిలో బాప్తిసమిచ్చే యోహానుకంటే మహనీయుడైన ప్రవక్త లేడు. అయినా, దేవుని రాజ్యంలో అందరిలో అల్పుడు అతనికంటే గొప్పవాడే!”
[29] అది విని ప్రజలంతా – సుంకంవారు కూడా – దేవుడు న్యాయవంతుడని అంగీకరించారు. ఎందుకంటే అంతకు ముందు యోహాను ఇచ్చిన బాప్తిసం వారు పొందారు.
[30] కానీ పరిసయ్యులూ ధర్మశాస్త్రవేత్తలూ యోహానుచేత బాప్తిసం పొందలేదు, గనుక తమను గురించిన దేవుని సంకల్పం నిరాకరించారు.
[31] ప్రభువు అన్నాడు “నేనీ తరం మనుషులను ఎలాంటివారితో పోల్చాలి? వారు ఎవరిని పోలి ఉన్నారు?
[32] వారు ఇలా ఉన్నారు: చిన్న పిల్లలు సంతవీధిలో కూర్చుని ఒకడితో ఒకడు కేకలు వేసి ఇలా చెప్పుకొంటారు: ‘మీకు పిల్లనగ్రోవి ఊదాం గాని మీరు నాట్యం చేయలేదు. ఏడ్పు పాట పాడాం గాని మీరు ఏడ్వలేదు.’
[33] ఎందుకంటే, యోహాను వచ్చి రొట్టె తినలేదు. ద్రాక్షరసం త్రాగలేదు. అతనికి దయ్యం పట్టిందని మీరంటున్నారు.
[34] మానవ పుత్రుడు వచ్చి అన్నపానాలు పుచ్చుకొంటూ ఉన్నాడు. మీరు నన్ను ‘ఇడుగో, తిండిబోతూ, త్రాగుబోతూ, సుంకంవారికీ పాపులకూ మిత్రుడూ!’ అంటున్నారు.
[35] అయితే జ్ఞానం దాని పిల్లలందరినిబట్టే జ్ఞానమని లెక్కలోకి వస్తుంది.”
[36] పరిసయ్యులలో ఒకడు ఆయనను తన ఇంట్లో భోజనానికి ఆహ్వానించాడు. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజనానికి కూర్చున్నాడు.
[37] ఆయన ఆ పరిసయ్యుని ఇంట్లో భోజనానికి కూర్చుని ఉన్న సంగతి తెలిసి ఆ ఊరిలో పాపంలో బ్రతికిన స్త్రీ ఒకతె చలువరాతి బుడ్డితో అత్తరు అక్కడికి తీసుకువచ్చింది.
[38] వెనుకవైపు యేసు పాదాలదగ్గర నిలుచుండి ఆమె ఏడుస్తూ ఉంది. ఆమె కన్నీళ్ళు ఆయన పాదాలు తడపసాగాయి. ఆమె తన తలవెంట్రుకలతో ఆయన పాదాలను తుడిచి ముద్దు పెట్టుకొని వాటికి ఆ అత్తరు పూసింది.
[39] ఆయనను ఆహ్వానించిన పరిసయ్యుడు అదంతా చూచి లోలోపల ఇలా అనుకొన్నాడు: “ఒకవేళ ఈ మనిషి ప్రవక్త అయితే తనను ముట్టుకొన్నది ఎవరో, ఎలాంటిదో తెలుసుకొని ఉండేవాడే. ఈమె పాపంలో బ్రతికేది.”
[40] అతని తలంపుకు జవాబిస్తూ యేసు అతనితో “సీమోనూ! నీతో ఒక మాట చెప్పాలి” అన్నాడు. అతడు “ఉపదేశకా, చెప్పండి!” అన్నాడు.
[41] యేసు అన్నాడు “అప్పిచ్చేవాడొకడు ఇద్దరికి అప్పు పెట్టాడు. వారిలో ఒకడు అయిదు వందల వెండి నాణేలు బాకీ ఉన్నాడు, మరొకడు యాభై వెండి నాణేలు బాకీ ఉన్నాడు.
[42] అప్పు తీర్చడానికి వారిదగ్గర ఏమీ లేకపోయింది గనుక అతడు వారిద్దరినీ క్షమించాడు. అందుచేత అతడంటే ఆ ఇద్దరిలో ఎవరికి ఎక్కువ అభిమానం?”
[43] “అతడు ఎవడిని ఎక్కువ క్షమించాడో అతడే అని నాకు తోస్తున్నది” అని సీమోను జవాబిచ్చాడు. ఆయన అతనితో “నీ నిర్ణయం సరిగానే ఉంది” అన్నాడు.
[44] అప్పుడా స్త్రీవైపు తిరిగి, సీమోనుతో ఇలా అన్నాడు: “ఈ స్త్రీని చూస్తున్నావా? నేను నీ ఇంటికి వచ్చాను గానీ కాళ్ళు కడుక్కోవడానికి నీవు నీళ్ళివ్వలేదు. ఈమె అయితే తన కన్నీళ్ళతో నా పాదాలు తడిపి తన తల వెంట్రుకలతో తుడిచింది.
[45] నీవు నన్ను ముద్దుపెట్టుకోలేదు గానీ నేను లోపలికి వచ్చినప్పటినుంచి ఈమె నా పాదాలను ముద్దుపెట్టుకోవడం మానలేదు.
[46] నీవు నూనెతో నా తల అంటలేదు గానీ ఈమె నా పాదాలను అత్తరుతో అంటింది.
[47] “అందుచేత నీతో నేను చెప్పేదేమంటే, ఈమె అనేక పాపాలకు క్షమాపణ దొరికింది. ఎందుకంటే, ఈమె ప్రేమ అధికమే. కానీ కొద్ది విషయంలో క్షమాపణ పొందిన వ్యక్తికి కొద్ది ప్రేమ మాత్రమే ఉంటుంది.”
[48] అప్పుడు యేసు ఆమెతో “నీ పాపాలకు క్షమాపణ దొరికింది” అన్నాడు.
[49] అయితే ఆయనతో భోజనానికి కూర్చుని ఉన్నవారు “పాపాలు క్షమించే ఈయన ఎవరు?” అని లోలోపల అనుకోసాగారు.
[50] ఆయన ఆ స్త్రీతో “నీ నమ్మకం నీకు పాపవిముక్తి కలిగించింది. శాంతితో వెళ్ళు” అన్నాడు.