[1] నా తల బావిగా, నా కండ్లు కన్నీళ్ళ ఊటగా ఉంటే ఎంత బాగుండేది! అలాంటప్పుడు నా ప్రజలో హతమైన వారికోసం రాత్రింబగళ్ళు కన్నీళ్ళు విడుస్తూ ఉంటాను.
[2] ఎడారిలో నాకు సత్రం దొరికితే ఎంత బాగుండేది! అలాంటప్పుడు నా ప్రజను విడిచిపెట్టి వెళ్ళి అక్కడ ఉండేవాణ్ణి. ఎందుకంటే, వాళ్ళంతా వ్యభిచారులు, ద్రోహుల గుంపు.
[3] యెహోవా చెప్పేదేమిటంటే, “అబద్ధాలు ఆడడానికి విల్లులాగా తమ నాలుక వంచుతూ ఉంటారు. సత్యంకోసం వాళ్ళు బలవంతులు కాలేదు. ఒక చెడుగు వెంట ఇంకో చెడుగుకు పరుగెత్తుతూ ఉంటారు. వాళ్ళు నన్ను ఎరగరు.
[4] ప్రతి ఒక్కడూ పొరుగువాడి విషయం జాగ్రత్తగా ఉండాలి. సోదరులలో ఎవ్వరినీ నమ్ముకోవద్దు. ప్రతి సోదరుడూ కుట్ర చేస్తాడు. ప్రతి పొరుగువాడూ చాడీలు చెపుతూ తిరుగులాడుతాడు.
[5] ప్రతివాడూ పొరుగువాణ్ణి మోసం చేస్తున్నాడు. ఎవ్వడూ నిజం పలకడం లేదు. అబద్ధం ఆడడానికి తమ నాలుకలకు నేర్పించారు. చెడుగు చేసీ చేసీ అలసిపోతున్నారు.
[6] మోసంమధ్యనే కాపురముంటున్నావు. వాళ్ళు మోసం చేస్తూ నన్ను గురించిన జ్ఞానాన్ని తిరస్కరిస్తున్నారు. ఇది యెహోవా వాక్కు.”
[7] అందుచేత సేనలప్రభువు యెహోవా చెప్పేది ఏమిటంటే, “విను. నా ప్రజను లోహంలాగా కరిగించి, శుద్ధి చేసి, పరీక్షిస్తాను. వాళ్ళకు ఇంకేమి చెయ్యగలను?
[8] వాళ్ళ నాలుక ప్రాణాంతక బాణంలాంటిది. అది మోసం పలుకుతుంది. ప్రతి ఒక్కరూ పొరుగువాళ్ళతో స్నేహంగా మాట్లాడుతారు గాని, మనసులో మాత్రం వంచన ఉంటుంది.
[9] వీటికారణంగా వాళ్ళను నేను దండించకూడదా? ఇలాంటి ప్రజమీద ప్రతీకారం చేయకూడదా? ఇది యెహోవా వాక్కు.”
[10] కొండలను గురించి నేను ఏడుస్తాను, రోదనం చేస్తాను. అరణ్యంలో ఉన్న పచ్చిక మైదానాలను గురించి విలపిస్తాను. అవి పాడైపొయ్యాయి. వాటిమీదుగా ఎవ్వరూ వెళ్ళడం లేదు. పశువుల అరుపులు వినబడడం లేదు. గాలిలో ఎగిరే పక్షులు అంతర్ధానమయ్యాయి. జంతువులు లేకుండా పొయ్యాయి.
[11] “నేను జెరుసలం పాడుదిబ్బగా చేస్తాను, నక్కలకు ఉనికిపట్టుగా చేస్తాను. యూదా పట్టణాలలో ఎవ్వరూ కాపురముండకుండా వాటిని పాడు చేస్తాను.”
[12] ఈ విషయం గ్రహించడానికి చాలినంత జ్ఞానం ఎవరికి ఉంది? ఈ విషయం అతడు వివరించేలా ఎవడితో యెహోవా నోటి మాట పలికాడు? ఈ దేశం ఎందుకు నాశనమైంది? ఎవ్వరూ ప్రయాణం చేయకుండా అది ఎందుకు పాడుపడి ఎడారిలాగా అయిపోయింది?
[13] యెహోవా ఇలా అంటున్నాడు: “దానికి కారణం ఏమిటంటే, నేను వారికిచ్చిన ధర్మశాస్త్రాన్ని వారు విసర్జించారు, నా మాట వినలేదు, దానిని అనుసరించనే లేదు.
[14] తమ హృదయంలో ఉన్న మూర్ఖత్వాన్నే అనుసరించారు, తమ పూర్వీకులు నేర్పించినట్టు బయల్ దేవుళ్ళను అనుసరించారు.
[15] గనుకనే ఇస్రాయేల్‌ప్రజల దేవుడూ సేనలప్రభువూ అయిన యెహోవా చెప్పేదేమిటంటే, నేను ఈ ప్రజకు చేదు కూరను తినిపించి విష జలం త్రాగిస్తాను.
[16] వారికి గానీ, వారి పూర్వీకులకు గానీ తెలియని జనాలమధ్య వారిని చెదరగొట్టివేస్తాను, వారు నాశనమయ్యేవరకు వారిమీదికి ఖడ్గం పంపుతాను.”
[17] సేనలప్రభువు యెహోవా ఇలా చెపుతున్నాడు: “ఆలోచించండి! రోదనం చేసే స్త్రీలను పిలవనంపించండి!
[18] మన కండ్లు కన్నీళ్ళు విడిచేలా, మన కంటి రెప్పల నుంచి నీళ్ళు పారేలా వారు త్వరగా వచ్చి మనకోసం రోదనం చేస్తారు గాక!
[19] సీయోనులోనుంచి రోదన ధ్వని వినబడుతూ ఉంది: ‘మనం నాశనమయ్యాం! చాలా అవమానానికి గురి అయ్యాం! వాళ్ళు మన ఇండ్లను పడగొట్టారు. మనం దేశం విడిచిపెట్టాలి.”
[20] స్త్రీలారా! యెహోవా చెప్పేది వినండి. ఆయన నోటి మాట ఆలకించండి. మీ కూతుళ్ళకు రోదనం చేయడం నేర్పండి. దుఃఖ సూచకమైన పాటను ఒకరికొకరు నేర్పండి.
[21] ఎందుకంటే, చావు మన కిటికీలగుండా చొరబడింది, మన నగరులలో అడుగు పెట్టింది. వీధులలో పసిపిల్లలు లేకుండా, రాజమార్గాలలో యువకులు లేకుండా అది చేస్తూ ఉంది.
[22] ఇలా చెప్పు – “యెహోవా చెప్పేదేమిటంటే, పొలాలలో పెంటలాగా మనుషుల మృతదేహాలు కూలుతాయి. కోత కోసేవారి వెనుక పనలు పడ్డట్టు అవి పడుతాయి. వాటిని పోగు చేయడానికి ఎవ్వరూ ఉండరు.”
[23] యెహోవా చెప్పేదేమిటంటే, “తెలివైనవాడు తెలివి ఉందని అతిశయపడకూడదు. బలవంతుడు బలం ఉందని అతిశయపడకూడదు. ధనవంతుడు ధనం ఉందని అతిశయ పడకూడదు.
[24] ఎవరైనా అతిశయించాలంటే నేనే యెహోవాననీ, భూమిమీద దయ చూపుతూ న్యాయాన్నీ ధర్మాన్నీ జరిగిస్తూ ఉండేవాణ్ణి అనీ గ్రహించి, నన్ను తెలుసుకొని అతిశయించాలి. అలాంటి విషయాలంటే నాకు ఎంతో ఇష్టం. ఇది యెహోవా వాక్కు.”
[25] యెహోవా చెప్పేదేమిటంటే: “ఇతర జనాలు సున్నతి పొందలేదు. ఇస్రాయేల్‌ప్రజ హృదయంలో సున్నతి పొందలేదు.
[26] సున్నతి పొందని వాళ్ళతోపాటు సున్నతి పొందిన వాళ్ళను రాబోయే కాలంలో దండిస్తాను. ఈజిప్ట్‌వాళ్ళనూ, యూదావాళ్ళనూ, ఎదోందేశస్తులనూ, అమ్మోనువాళ్ళనూ, మోయాబుదేశస్తులనూ ఎడారిలో ఉంటూ తమ తలప్రక్కలను కత్తిరించుకొన్న వాళ్ళనూ శిక్షిస్తాను.”