[1] యిర్మీయా ప్రజలందరికీ ఇలా చెప్పాడు: “యెహోవా చెప్పేదేమిటంటే, ఈ నగరంలో ఉండిపోయేవారు ఖడ్గానికీ కరవుకూ ఘోరమైన అంటురోగానికి గురి అయి చస్తారు. కాని, కల్దీయవాళ్ళ దగ్గరికి వెళ్ళేవారు బ్రతుకుతారు. దోపిడీసొమ్ములాగా వారి ప్రాణం దక్కించుకొని బ్రతుకుతారు.
[2] యెహోవా చెప్పేదేమిటంటే, ఈ నగరాన్ని తప్పనిసరిగా బబులోను రాజు సైన్యానికి అప్పగించడం జరుగుతుంది. వాళ్ళు దానిని వశం చేసుకొంటారు.”
[3] ఈ మాటలను మత్తాను కొడుకు షెఫట్య, పషూరు కొడుకు గెదల్యా, షెలెమా కొడుకు యూకల్, మల్కీయా కొడుకు పషూరు విన్నారు.
[4] అప్పుడు ఆ అధికారులు రాజుతో ఇలా చెప్పారు: “ఆ మనిషికి మరణశిక్ష వేయండి. అలాంటి మాటలు చెప్పి నగరంలో ఉన్న సైనికులనూ ప్రజలందరినీ నిరుత్సాహపరుస్తున్నాడు. అతడు ఈ ప్రజల క్షేమం కోరడం లేదు గాని, కీడునే కోరుతున్నాడు.”
[5] అందుకు సిద్కియారాజు “ఇదిగో, అతడు మీ వశంలో ఉన్నాడు. మీకు వ్యతిరేకంగా రాజు ఏమీ చేయలేడు” అని జవాబిచ్చాడు.
[6] అప్పుడు వాళ్ళు యిర్మీయాను పట్టుకొని రాజ వంశీకుడైన మల్కీయా బావిలోకి దించారు. ఆ బావి కావలివాళ్ళ ఆవరణంలో ఉంది. వాళ్ళు యిర్మీయాను త్రాళ్ళతో దాని లోపలికి దించారు. దానిలో నీళ్ళు లేవు. బురద మాత్రమే ఉంది. ఆ బురదలో యిర్మీయా కూరుకుపోయాడు.
[7] రాజు నగరులో ఎబెద్‌మెలెకు అనే నపుంసకుడు ఉండేవాడు. అతడు కూషు దేశంవాడు. వాళ్ళు యిర్మీయాను బావిలో ఉంచిన సంగతి అతడికి వినవచ్చింది. అప్పుడు రాజు “బెన్యామీను ద్వారం”లో కూర్చుని ఉన్నాడు.
[8] ఎబెద్‌మెలెకు రాజు నగరు బయటికి వెళ్ళి రాజుతో ఇలా చెప్పాడు:
[9] “నా యజమానీ, రాజా, ఆ మనుషులు యిర్మీయాప్రవక్తను బావిలో వేశారు. వాళ్ళు ఆయనపట్ల చేసినదంతా అన్యాయం. నగరంలో రొట్టెలు మిగలలేదు, గనుక ఆయన అక్కడే చనిపోతాడు.”
[10] అప్పుడు రాజు కూషువాడైన ఎబెద్‌మెలెకుకు “ఇక్కడనుంచి నీతో ముప్ఫయిమంది మనుషులను తీసుకువెళ్ళు. యిర్మీయాప్రవక్త చావకముందే అతణ్ణి బావిలోనుంచి తీయి” అని ఆజ్ఞాపించాడు.
[11] అలాగే ఎబెద్‌మెలెకు ఆ మనుషులను తీసుకొని రాజు నగరులో ఖజానా క్రింద ఉన్న గదికి వెళ్ళాడు. అక్కడనుంచి పాత పేలికలు, చింపిరి గుడ్డలు తీసుకువెళ్ళి వాటిని బావిలో ఉన్న యిర్మీయాదగ్గరికి త్రాళ్ళతో దించాడు.
[12] కూషువాడు ఎబెద్‌మెలెకు యిర్మీయాతో “ఈ పాత పేలికలు, గుడ్డలు నీ చంకలకు త్రాళ్ళకు మధ్య ఉంచుకో” అన్నాడు. యిర్మీయా అలా చేశాక
[13] వారు త్రాళ్ళతో యిర్మీయాను బావినుంచి చేది బయటికి తీశారు. ఆ తరువాత యిర్మీయా ఆ కాపలావాళ్ళ ఆవరణంలో ఉండిపోయాడు.
[14] సిద్కియారాజు యిర్మీయాప్రవక్త కోసం మనిషిని పంపాడు. అతడు యిర్మీయాను యెహోవా ఆలయం మూడో ద్వారందగ్గరికి తీసుకువచ్చాడు. రాజు యిర్మీయాతో “నేను నిన్ను ఒక ప్రశ్న అడుగుతాను. నానుంచి ఏదీ దాచవద్దు” అన్నాడు.
[15] అందుకు యిర్మీయా “నేను నీకు జవాబిస్తే ఆ సంగతి చెపితే మీరు నన్ను తప్పకుండా చంపిస్తారు గదా, నేను మీకు ఆలోచన చెప్పినా వినరు” అని సిద్కియాతో చెప్పాడు.
[16] అయితే సిద్కియారాజు “మనకు ప్రాణం పోసిన యెహోవామీద ఒట్టుపెట్టి చెపుతున్నాను – నేను నిన్ను చంపను, నీ ప్రాణం తీయాలని చూచేవాళ్ళ చేతికి అప్పగించను” అని యిర్మీయాతో శపథం చేశాడు.
[17] అప్పుడు యిర్మీయా సిద్కియాతో ఇలా అన్నాడు: “ఇస్రాయేల్ ప్రజల దేవుడూ, సేనల ప్రభువూ అయిన యెహోవా చెప్పేదేమిటంటే, మీరు బబులోను రాజు అధిపతులదగ్గరికి వెళ్ళి వాళ్ళకు లోబడితే మీ ప్రాణం దక్కుతుంది. వాళ్ళు ఈ నగరాన్ని మంటలతో తగలబెట్టరు. మీరు, మీవారు బ్రతుకుతారు.
[18] ఒకవేళ మీరు వెళ్ళి బబులోను రాజు అధిపతులకు లోబడకపోతే, ఈ నగరం వాళ్ళ వశం అవుతుంది. వాళ్ళు దానిని మంటలతో తగలబెడతారు. మీరు కూడా వాళ్ళ చేతినుంచి తప్పించుకోలేకపోతారు.”
[19] యిర్మీయాతో సిద్కియారాజు “వెళ్ళి కల్దీయవాళ్ళతో చేరిన యూదులంటే నాకు భయం. ఒకవేళ కల్దీయవాళ్ళు నన్ను వాళ్ళ చేతికి అప్పగిస్తే వాళ్ళు నన్ను బాధిస్తారు” అన్నాడు.
[20] “వాళ్ళు అలా అప్పగించర”ని యిర్మీయా జవాబిచ్చాడు, “నేను మీకు చెప్పేది విని, యెహోవా వాక్కుకు లోబడండి. అప్పుడు మీకు మేలు జరుగుతుంది. మీ ప్రాణం దక్కుతుంది.
[21] ఒకవేళ మీరు వాళ్ళదగ్గరికి వెళ్ళడానికి తిరస్కరిస్తే, యెహోవా నాకు తెలియజేసిన సంగతి జరుగుతుంది.
[22] అదేమిటంటే, యూదా రాజు నగరులో మిగిలి ఉండే స్త్రీలందరినీ బబులోను రాజు అధిపతుల దగ్గరికి తీసుకుపోతారు. ఆ స్త్రీలు మీతో ఇలా అంటారు: ‘మీరు నమ్ముకొన్న మిత్రులు నిన్ను మోసపుచ్చి గెలిచారు. మీ కాళ్ళు బురదలో దిగబడ్డాయి. వాళ్ళు మీదగ్గరనుంచి మళ్ళుకొని వెళ్ళారు.’
[23] మీ భార్యలందరినీ, సంతతివాళ్ళందరినీ కల్దీయవాళ్ళ దగ్గరికి తీసుకుపోవడం జరుగుతుంది. మీరు కూడా వాళ్ళ చేతినుంచి తప్పించుకోరు. బబులోను రాజు మిమ్ములను పట్టుకొంటాడు, ఈ నగరాన్ని మంటలు అంటించి కాల్చివేస్తాడు.”
[24] అప్పుడు సిద్కియా యిర్మీయాతో ఇలా అన్నాడు: “నీవు చావకుండా ఉండాలంటే ఈ సంభాషణ గురించి ఎవరికీ తెలియజేయకు సుమా.
[25] ఒకవేళ నేను నీతో మాట్లాడిన సంగతి విని అధికారులు నీదగ్గరికి రావచ్చు. నీతో ఇలా అనవచ్చు: ‘రాజుతో నీవు చెప్పినదీ, రాజు నీతో చెప్పినదీ మాకు తెలియజేయి. మానుంచి ఏదీ దాచవద్దు. లేకపోతే మేము నిన్ను చంపివేస్తాం.’
[26] అలాంటప్పుడు నీవు వాళ్ళతో ‘నేను చావకుండా మళ్ళీ నన్ను యోనాతాను ఇంటికి పంపవద్దని రాజును ప్రాధేయపడ్డాను’ అని చెప్పాలి.”
[27] తరువాత అధికారులంతా యిర్మీయా దగ్గరికి వచ్చి అతణ్ణి ప్రశ్నించారు. ఇలా చెప్పాలని రాజు ఆదేశించినదంతా అతడు వాళ్ళతో చెప్పాడు. వాళ్ళకు ఆ సంభాషణ తెలియనందుకు వాళ్ళు అతనితో ఇంకేమీ చెప్పలేదు.
[28] జెరుసలంను పట్టుకోవడం జరిగే రోజువరకు యిర్మీయా కాపలావాళ్ళ ఆవరణంలో ఉండిపోయాడు.