[1] ఇది ఫిలిష్తీయప్రజలను గురించి యిర్మీయా ప్రవక్తకు వచ్చిన యెహోవా వాక్కు, ఇది ఫరో గాజా పట్టణాన్ని గెలవక ముందే వచ్చింది.
[2] “యెహోవా చెప్పేదేమిటంటే, ఉత్తరదిక్కున నీళ్ళు పెల్లుబికి వస్తున్నాయి. అవి వరదలై పొర్లి పారుతాయి. అవి ఈ దేశంనిండా పారుతాయి. దేశంలో ఉన్న వాటన్నిటిమీదా పారుతాయి. పట్టణాల మీద, వాటిలో కాపురముంటున్న వాళ్ళమీద పారుతాయి. ప్రజలు సహాయంకోసం కేకలు వేస్తారు. దేశంలో ఉంటున్న వాళ్ళంతా రోదనం చేస్తారు.
[3] శత్రువుల బలమైన గుర్రాల గిట్టలు నేలకు తగులుతూ ఉంటే, రథాలు వేగంగా వస్తూ ఉంటే, వాటి చక్రాలు ఉరుముతూ ఉంటే, ఆ చప్పుడుకు తండ్రుల చేతులు బలహీనమవుతాయి. వాళ్ళు తమ పిల్లలకోసం వెనక్కు చూడరు.
[4] ఫిలిష్తీయవాళ్ళందరినీ నాశనం చేసే రోజు రాబోతున్నది. తూరు, సీదోనులకు సహాయం చేయగల మిగతా వాళ్ళందరినీ నిర్మూలించే రోజు రాబోతున్నది. కఫ్తోర్ ద్వీపం నుంచి వచ్చిన మిగతా ఫిలిష్తీయవాళ్ళను యెహోవా నాశనం చేస్తాడు.
[5] గాజా నగరం బోడిగా మారింది. అష్కెలోను నగరం పాడైపోయింది. ఆ మైదానంలో మిగిలినవారలారా! ఎన్నాళ్ళు మిమ్ములను మీరే గాయపరచుకొంటారు?
[6] యెహోవా ఖడ్గమా! ఇంకా ఎన్నాళ్ళు నీవు విశ్రాంతి తీసుకోకుండా ఉంటావు? నీ ఒరలోకి దూరి విశ్రాంతి తీసుకో, ఊరుకో! అంటారా?
[7] కాని, యెహోవా దానికి ఆజ్ఞ జారీ చేశాడు, అష్కెలోనుమీద, సముద్రతీర ప్రదేశాలమీద పడమని ఆదేశించాడు. గనుక అది ఎలా నిమ్మళంగా ఉంటుంది?”