[1] యెహోవానుంచి నాకు ఇలా వాక్కు వచ్చింది:
[2] “నీవు వెళ్ళి, జెరుసలం నివాసులు వినేలా ఈ సందేశం చాటించు: “యెహోవా చెప్పేదేమిటంటే, యౌవనప్రాయంలో నీ అభిమానం, పెళ్ళికూతురులాగా నీవు చూపిన ప్రేమ నాకు జ్ఞాపకమే. విత్తని ప్రదేశంలో, ఎడారిలో నీవు నన్ను అనుసరించావు.
[3] ఇస్రాయేల్‌ప్రజ యెహోవాకు పవిత్ర జనం. ఆయన పంటకోతలో మొదటిభాగం. వారిని దిగమింగిన వాళ్ళంతా అపరాధుల లెక్కలోకి వచ్చారు. వాళ్ళందరూ విపత్తుకు గురి అయ్యారు. ఇది యెహోవా వాక్కు.”
[4] యాకోబు వంశస్థులారా! ఇస్రాయేల్ వంశానికి చెందిన అన్ని కుటుంబాల వారలారా! యెహోవా వాక్కు వినండి.
[5] యెహోవా చెప్పేదేమిటంటే, “మీ పూర్వీకులు నాలో ఏమి తప్పు చూచి నా దగ్గరనుంచి దూరంగా వైదొలగారు? వారు వ్యర్థమైనదానిని అనుసరించి వ్యర్థులయ్యారు.
[6] అంతే కాకుండా వారు ఇలా అడగనేలేదు – ‘ఈజిప్ట్ దేశం నుంచి, ఎండిపోయిన ప్రాంతాలూ గుంటలూ ఉన్న ఎడారిగుండా, అనావృష్టీ కటిక చీకటీ గల ఆ ప్రదేశంగుండా, ఎవరూ ప్రయాణం చేయని, కాపురం ఉండని ఆ ప్రదేశంగుండా దారి చూపుతూ మనల్ని తీసుకు వచ్చిన యెహోవా ఎక్కడ ఉన్నాడు?’
[7] “తోటలాంటి దేశంలో దాని పంటలను, మంచి పండ్లను అనుభవించడానికి, మీరు ప్రవేశించేలా నేను చేశాను. అయితే మీరు వచ్చి నా దేశాన్ని అశుద్ధం చేశారు. నా సొత్తును అసహ్యంగా మార్చారు.
[8] ‘యెహోవా ఎక్కడున్నాడు?’ అని యాజులు కూడా అడగలేదు. ధర్మశాస్త్రాన్ని ఉపయోగించే వాళ్ళు నన్ను ఎరగరు. పరిపాలకులు నామీద తిరుగుబాటు చేశారు. ప్రవక్తలు బయల్‌దేవుడి పేర సోదె చెప్పారు. వ్యర్థమైనవాటిని అనుసరించారు.
[9] అందుచేత ఇకమీదట నేను మీకూ మీ సంతానానికీ విరోధంగా ఫిర్యాదినవుతాను. ఇది యెహోవా వాక్కు.
[10] “కిత్తీం ద్వీపం ప్రదేశాలకు వెళ్ళి చూడండి. కేదార్ ప్రాంతానికి మనుషులను పంపి అక్కడి సంగతి బాగా తెలుసుకోండి. మీలో జరిగినట్టు ఇంకెక్కడైనా జరిగిందో లేదో చూడండి.
[11] వాళ్ళ దేవుళ్ళలో ఎవడూ దేవుడు కాకపోయినా కూడా ఏ దేశంవాళ్ళైనా ఎప్పుడైనా వాళ్ళను మార్చుకొన్నారా? అయితే నా ప్రజ తమకు ఘనతగా ఉన్నవానిని విడిచి ఎందుకూ పనికిరాని దానిని ఎన్నుకొన్నారు.
[12] ఆకాశాల్లారా! ఇది చూచి ఆశ్చర్యపడి గడగడ వణకండి! నిర్ఘాంతపోండి! ఇది యెహోవా వాక్కు.
[13] నా ప్రజ రెండు నేరాలు చేశారు. జీవప్రదమైన ఊటగా ఉన్న నన్ను వదలిపెట్టారు, తమకోసం నీళ్ళు నిలవని, పగిలిపోయిన తొట్లు తొలిపించుకొన్నారు.
[14] “ఇస్రాయేల్‌ప్రజలు దాసులా? పుట్టుకతోనే బానిసలా? మరి వారు ఎందుకు దోపిడీకి గురి అయ్యారు?
[15] ఈ ప్రజను చూచి సింహాలు బొబ్బలు పెట్టి గర్జించాయి. వారి దేశాన్ని పాడు చేశాయి. వారి పట్టణాలు నాశనమయ్యాయి. వాటిలో కాపురం చేసేవాళ్ళెవ్వరూ లేరు.
[16] నోప్ నగరవాసులూ తహపనేసు పట్టణస్థులూ మీ నెత్తిని బ్రద్దలు చేశారు.
[17] మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని దారిన నడిపిస్తూ ఉంటే మీరు ఆయనను వదలిపెట్టడంవల్ల ఈ ఆపదలు తెచ్చుకొన్నారు గదా.
[18] షీహోరు నది నీళ్ళు త్రాగడానికి ఈజిప్ట్ దారిన మీకేం పని? యూఫ్రటీసు నది నీళ్ళు త్రాగడానికి అష్షూరు దారిన మీకేం పని?
[19] మీ చెడుతనమే మిమ్మల్ని శిక్షిస్తుంది. మీరు చేసిన ద్రోహమే మిమ్మల్ని గద్దిస్తుంది. మీ దేవుడు యెహోవాను మీరు వదలిపెట్టడం, ఆయనపట్ల భయభక్తులు లేకపోవడం ఆపదకూ దుఃఖానికీ కారణమని ఆలోచన చేసి తెలుసుకోండి.” ఇది సేనలప్రభువు యెహోవా వాక్కు.
[20] “చాలా రోజులక్రిందటే మీ కాడిని విరగగొట్టుకొని, కట్లు తెంపివేసుకొన్నారు. కానీ మీరు ‘మేము సేవ చేయమ’ని చెప్పారు. మీరు ఎత్తయిన ప్రతి కొండమీదా, పచ్చని ప్రతి చెట్టుక్రిందా వేశ్యలాగా ప్రవర్తించారు.
[21] నేను మిమ్మల్ని కేవలం సరైన విత్తనంతో, మేలిరకమైన ద్రాక్షతీగెగా నాటాను. మరి చెడిపోయి కారు ద్రాక్షతీగెగా మీరెలా మారిపోయారు?
[22] “మీరు ఎంత సబ్బుతో, క్షారంతో కడిగినా మీ అపరాధం మరకలాగా నాకు కనిపిస్తూనే ఉంది. ఇది యెహోవాప్రభు వాక్కు.
[23] ‘మేము అశుద్ధులం కాలేదు, బయల్‌దేవుణ్ణి అనుసరించలేదు’ అని మీరెలా చెప్పగలరు? లోయలో మీ ప్రవర్తన విషయంలో ఆలోచన చేయండి. మీరేంచేశారో తెలుసుకోండి. అటూ ఇటూ పరుగెత్తే ఒంటెలాంటివారు మీరు.
[24] అరణ్యానికి అలవాటుపడ్డ ఆడ అడవి గాడిదలాంటివారు. అది కామాగ్నితో శ్వాస పీలుస్తూ ఉంటుంది. అలాంటి సమయంలో దానిని ఎవరూ అదుపులో ఉంచగలరు? మగ గాడిదలు దానిని వెదికితే వాటిలో ఏదీ అలసిపోనవసరం లేదు. దాని నెలలో అది వాటికి దొరుకుతుంది.
[25] ‘మీరు వట్టి కాళ్ళతో వెళ్ళకుండా జాగ్రత్తపడండి! దప్పినుంచి మీ గొంతును కాపాడుకోండి! అని నేను చెప్పినా, మీకు ‘ప్రయోజనం లేదు. ఇతరులను మేము ప్రేమిస్తున్నాం, వాళ్ళ వెంటే వెళ్తాం’ అన్నారు.
[26] “దొంగ దొరికితే వాడు ఎలా సిగ్గుపాలవుతాడో అలాగే ఇస్రాయేల్ వంశీయులు – వారు, వారి రాజులు, అధిపతులు, యాజులు, ప్రవక్తలు సిగ్గుపాలయ్యారు.
[27] వారు చెట్టుతో ‘మా తండ్రివి నీవే’ అని చెప్పేవారు. రాతితో ‘మమ్మల్ని పుట్టించినది నీవే’ అనేవారు. నావైపు ముఖం త్రిప్పుకోకుండా వీపు త్రిప్పుకొన్నారు. అయినా ఆపద సమయంలో వారు ‘లేచి మమ్మల్ని రక్షించు’ అని నన్ను ప్రాధేయపడుతారు.
[28] మీకోసం చేసుకొన్న దేవుళ్ళు ఎక్కడ? యూదావారలారా, మీకు ఎన్ని ఊళ్ళుంటే అంతమంది దేవుళ్ళు! వాళ్ళు మీ ఆపద సమయంలో మిమ్మల్ని రక్షించగలిగితే లేచి రక్షించమనండి.
[29] “మీరు నాతో ఎందుకు వాదిస్తారు? మీరందరూ నామీద తిరుగుబాటు చేశారు. ఇది యెహోవా వాక్కు.
[30] నేను మీ సంతానాన్ని మొత్తాను గాని, ప్రయోజనం లేదు. వారు సరి దిద్దుకోలేదు. మీ ఖడ్గమే మీ ప్రవక్తలను నాశనం చేసే సింహంలాగా చంపివేసింది.
[31] ఈ తరంవారలారా! యెహోవా వాక్కును తలంచండి. ఇస్రాయేల్ ప్రజకు నేను ఎడారిగా ఉన్నానా? కటిక చీకటి ఉన్న ప్రదేశంలాగా ఉన్నానా? మరి నా ప్రజ ‘తిరుగులాడడానికి మాకు స్వేచ్ఛ ఉంది. ఇక నీదగ్గరికి రామ’ని ఎందుకు చెపుతున్నారు?
[32] “కన్య తన ఆభరణాలు మరచిపోతుందా? పెండ్లికూతురు తన ఒడ్డాణం మరచిపోతుందా? కాని, నా ప్రజ లెక్కలేనన్ని రోజులు నన్ను మరచారు.
[33] విటుకాండ్ర వెంటపడడం మీకు బాగా తెలుసు. మీ ప్రవర్తన చూచి చెడ్డ స్త్రీలు కూడా నేర్చుకోగలరు.
[34] అమాయకులైన బీదవారి రక్తం మీ బట్టలమీద కనిపిస్తూ ఉంది– వారు కన్నం వేసినందుకు కాదు. ఇదంతా జరిగినా మీరు ఏం అంటున్నారంటే,
[35] ‘మేము నిర్దోషులం. యెహోవాకు మామీద ఏమీ కోపం లేదు.’ వినండి, మీరు ‘పాపం చేయలేద’ని చెప్పినందుచేత మీకు తీర్పు తీరుస్తాను.
[36] “మీ విధానాన్ని మార్చుకోవడానికి అటు ఇటూ ఇంతగా తిరుగులాడుతూ ఉన్నారేం? అష్షూరువల్ల మీకు ఆశాభంగం కలిగినట్లు ఈజిప్ట్‌వల్ల ఆశాభంగం కలుగుతుంది.
[37] నెత్తిన చేతులు ఉంచుకొని ఆ దేశంనుంచి బయలుదేరుతారు. మీరు ఎవరిమీద నమ్మకం పెట్టుకొన్నారో వాళ్ళను యెహోవా తిరస్కరించాడు. వాళ్ళవల్ల మీ విషయం సఫలం కాబోదు.