Skip to content
Opens in a new window

[1] ఇది యెహోవా నుంచి యిర్మీయాకు వచ్చిన వాక్కు:

[2] “యెహోవా ఆలయం ద్వారంలో నిలబడి ఇలా ప్రకటన చెయ్యి: యెహోవాను ఆరాధించడానికి ఈ ద్వారాలగుండా వచ్చే యూదావారలారా, మీరందరూ యెహోవా సందేశం వినండి.

[3] ఇస్రాయేల్ యొక్క దేవుడూ సేనల ప్రభువూ అయిన యెహోవా చెప్పేదేమిటంటే, మీరు మీ జీవిత విధానాలను, చర్యలను సరిదిద్దుకొంటే, నేను మిమ్మల్ని ఈ స్థలంలో ఉండనిస్తాను.

[4] మోసపు మాటలను నమ్ముకొని, ‘యెహోవా మందిరం, యెహోవా మందిరం, యెహోవా మందిరం’ అనవద్దు.

[5] మీరు నిజంగా మీ జీవిత విధానాలను, చర్యలను సరిదిద్దుకొంటే – ఒకరిపట్ల ఒకరు న్యాయంతో వ్యవహరిస్తే,

[6] విదేశీయులను గానీ తండ్రిలేనివారిని గానీ వితంతువులను గానీ అణగద్రొక్కకుండా ఉంటే, నిరపరాధుల రక్తం ఒలికించకుండా ఉంటే, మీకు హాని కలిగించే ఇతర దేవుళ్ళను అనుసరించకుండా ఉంటే,

[7] అప్పుడు నేను మిమ్మల్ని ఈ స్థలంలో ఉండనిస్తాను, నేను మీ పూర్వీకులకు శాశ్వతమైన సొత్తుగా వచ్చిన ఈ దేశంలో కాపురముండనిస్తాను.

[8] “అయితే మీరు పనికిమాలిన మోసపు మాటలు నమ్ముతున్నారు.

[9] మీరు దొంగతనం, హత్య, వ్యభిచారం చేస్తూ, ప్రమాణం చేసి అబద్ధం చెపుతూ, బయల్‌దేవుడికి ధూపం వేస్తూ, మీకు తెలియని ఇతర దేవుళ్ళను అనుసరిస్తూ ఉండగానే,

[10] నా పేరున్న ఈ ఆలయానికి వచ్చి, నా ఎదుట నిలబడి, అపాయంనుంచి తప్పించుకొన్నాం అంటారేం? మీరు విడుదల పొందినది ఈ అసహ్య కార్యాలను చేయడానికేనా?

[11] నా పేరున్న ఈ ఆలయం మీ దృష్టికి దొంగల గుహగా అయిందా? మీ పనులను చూశాను సుమా! అని యెహోవా చెపుతున్నాడు.

[12] “మొట్టమొదట షిలోహులో నా పేరుకోసం కట్టడాన్ని కట్టించుకొన్నాను. ఆ స్థలానికి వెళ్ళి, నా ప్రజ ఇస్రాయేల్ వాళ్ళ చెడ్డతనానికి నేను ఏం చేశానో చూడండి.

[13] ఇది యెహోవా వాక్కు – మీరు ఆ కార్యాలన్నీ చేస్తూ ఉంటే, నేను ప్రొద్దున్నే లేచి మాట్లాడాను గాని, మీరు చెవిని పెట్టలేదు. మిమ్మల్ని పిలిచాను గాని, మీరు జవాబివ్వలేదు.

[14] అందుచేత మీరు నమ్ముకొన్న, నా పేరున్న ఈ ఆలయానికీ, నేను మీ పూర్వీకులకూ మీకూ ఇచ్చిన ఈ స్థలానికీ, షిలోహుకు చేసినట్టు చేస్తాను.

[15] మీ బంధువులైన ఎఫ్రాయిం సంతతివాళ్ళందరినీ నా ఎదుటనుంచి వెళ్ళగొట్టినట్టే మిమ్మల్ని వెళ్ళగొట్టివేస్తాను.

[16] “ఈ ప్రజకోసం ప్రార్థించకు. విన్నపం, ప్రార్థన చేయకు. వాళ్ళ పక్షాన నాతో వాదించకు. నేను వినను.

[17] వాళ్ళు యూదా పట్టణాలలో జెరుసలం వీధుల్లో ఏం చేస్తూ ఉన్నారో నీవు చూడడం లేదా?

[18] పిల్లవాళ్ళు కట్టెలు ఏరుతారు, వాళ్ళ తండ్రులు నిప్పు రాజబెడతారు, స్త్రీలు పిండి పిసికి, ‘ఆకాశరాణి’ అనే దేవతకు పిండివంటలు చేస్తారు. నన్ను దుఃఖ పెట్టాలని ఇతర దేవుళ్ళకు పానార్పణలు అర్పిస్తారు.

[19] నన్నే వాళ్ళు దుఃఖ పెడతారా? తమకే హాని చేసుకొని అవమానం చెందడం లేదా? అని యెహోవా అంటున్నాడు.

[20] అందుచేత యెహోవాప్రభువు చెప్పేదేమిటంటే, ఈ స్థలంమీద – మనుషులమీద, పశువులమీద, మైదానంలో చెట్లమీద, భూఫలంమీద – నా ఆగ్రహాన్ని, కోపాగ్నిని కుమ్మరిస్తాను. ఆర్పడానికి వీలు కాకుండా అది మండుతూ ఉంటుంది.

[21] “ఇస్రాయేల్ ప్రజల దేవుడూ సేనలప్రభువూ అయిన యెహోవా ఇలా చెపుతున్నాడు: మీ హోమాలనూ ఇతర బలులనూ కలగలుపు చేసి ఆ మాంసమంతా మీరే తినండి!

[22] మీ పూర్వీకులను నేను ఈజిప్ట్‌నుంచి బయటికి తీసుకువచ్చిన రోజున హోమాలను, బలులను గురించి వారితో చెప్పలేదు, ఆజ్ఞ ఇవ్వలేదు.

[23] నేను వారికిచ్చిన ఆజ్ఞ ఇది: నా వాక్కుకు లోబడి ఉండండి. అప్పుడు నేను మీకు దేవుడై ఉంటాను. మీరు నా ప్రజలై ఉంటారు. మీకు క్షేమం కలిగేలా నేను మీకు ఆజ్ఞాపించే మార్గంలో మీరు సంపూర్ణంగా నడవాలి.”

[24] “అయితే వారు నా మాట వినలేదు. పెడచెవిని పెట్టి, తమకు మంచిదని తోచినట్టు వారి చెడ్డ హృదయంవచనంలో ఉన్న మూర్ఖత్వాన్ని అనుసరించారు. ముందుకు సాగక వెనక్కే వెళ్ళారు.

[25] మీ పూర్వీకులు ఈజిప్ట్‌నుంచి బయటికి వచ్చినప్పటినుంచి ఇప్పటివరకూ నేను నా సేవకులైన ప్రవక్తలను అందరినీ పంపిస్తూ వచ్చాను. ప్రొద్దున్నే లేచి వారిని పంపాను.

[26] వారు పెడచెవిని పెట్టి నా మాట వినలేదు. వారు తలబిరుసుగా ఉన్నారు. వాళ్ళు తమ పూర్వీకులకంటే ఎక్కువగా చెడుగు చేశారు.

[27] “నీవు ఈ మాటలన్నీ వాళ్ళతో చెప్పాలి గాని, వాళ్ళు వినరు. నీవు వాళ్ళను పిలవాలి గాని, వాళ్ళు నీకు బదులు చెప్పరు.

[28] అప్పుడు నీవు వాళ్ళతో ఇలా అనాలి: ఈ జనం తమ దేవుడైన యెహోవా వాక్కుకు లోబడలేదు. క్రమశిక్షణ అంగీకరించలేదు. సత్యం వాళ్ళ నోట లేకుండా నాశనమైపోయింది.

[29] ఈ తరంవాళ్ళు యెహోవా కోపానికి గురి అయ్యారు. ఆయన వాళ్ళను విసర్జించి విడిచిపెట్టాడు. కనుక నీ తలవెండ్రుకలు కత్తిరించుకొని వాటిని పారవెయ్యి. చెట్లులేని ఎత్తు స్థలాల్లో రోదనం చెయ్యి.”

[30] యెహోవా చెప్పేదేమిటంటే, “యూదాప్రజలు నా దృష్టిలో చెడుగు చేశారు. నా పేరున్న ఆలయంలో తాము ఎన్నుకొన్న అసహ్యమైన విగ్రహాలను నిలబెట్టి దానిని అశుద్ధం చేశారు.

[31] తమ కూతుళ్ళనూ కొడుకులనూ మంటల్లో కాల్చివేయడానికి వాళ్ళు బెన్‌హిన్నోం లోయలో ఉన్న తోఫెతులో ఎత్తు స్థలాలు కట్టారు. ఈ విషయం నేను ఆజ్ఞాపించలేదు. అది నా మనసుకు కూడా రాలేదు.

[32] అందుచేత యెహోవా చెప్పేదేమిటంటే, ఒక కాలం రాబోతున్నది. ఆ కాలంలో ఆ లోయను ‘తోఫెతు’ గానీ ‘బెన్‌హిన్నోం’ గానీ అనరు. దానిని ‘వధలోయ’ అంటారు. ఎందుకంటే, తోఫెతులోనే ఇంకా చోటు లేకపోయేంతవరకూ శవాలు పాతిపెడతారు.

[33] అప్పుడు ఈ ప్రజల శవాలు గాలిలో ఎగిరే పక్షులకూ, భూమిమీద తిరిగే జంతువులకూ ఆహారమవుతాయి. వాటిని బెదరించి వెళ్ళగొట్టడానికి ఎవరూ ఉండరు.

[34] ఈ దేశం పాడైపోతుంది. యూదా పట్టణాలలో, జెరుసలం వీధుల్లో ఆనంద ధ్వనులు, ఉత్సాహ ధ్వనులు, పెండ్లికొడుకు పెండ్లికూతురుల స్వరాలు లేకుండా చేస్తాను.”

యిర్మీయా — Chapters